ఒకటా రెండా?
ఎన్ని యుగాలు నడిచిపోలేదు
సూర్యుడి చిటికెనవేలు పట్టుకొని
రాత్రైతే చంద్రదీపం వెలిగించుకొని
వర్తమానం నుంచి చరిత్ర గుమ్మం వరకు.
ఒకరా, ఇద్దరా?
ఎందరెందరు విడిచిపోలేదు
పంచభూతాలల్లిన మాంసపంజరాన్ని
మానవతా వాదాన్ని తలకెత్తుకున్న వాళ్లు.
మనం మానవులం అని నిరూపించుకున్నవాళ్లు
మంచిని పెంచి, వంచించిన వాళ్లని కాలరాసి
తడిలేని హృదయాల తలుపులు తడుతూ
తమని తాము దీపాలుగా వెలింగిచుకున్న వాళ్లంతా
చివరికి చీకటిపాలైన ఉదంతాలన్నీ
చరిత్ర పుటల్లో మురిగిపోతున్నాయి.
ఇప్పుడు మనుషులు మనుషుల్లా లేరు
పడగల్ని తలపుట్టల్లో దాచుకొని
పెదవులపై వెన్నెల పండగలు జరుపుకుంటూ
లోలోపల అగ్ని పర్వతాలై
బద్దలై పోతున్నారు.
వాతావరణంతో పాటు కలుషితమై పోతూ
జనారోగ్యంపై రోగాలదోమలై వాలిపోతున్నారు.
రేపటి వసంతానికి పట్టిన చీడపురుగులై
కులాల సంతల్లో పాయలై ప్రవహిస్తున్నారు.
ప్రతి వొక్కడు తన అజెండాతో ఓ జెండా మోస్తూ
ఐకమత్యానికి పురిటిరోగమై ప్రవభవిస్తున్నాడు.
రేపటి సూర్యుడి కోసం నిరీక్షించే నేత్రాలు మాత్రం
ఆకాశం చిట్టచివ్వరి తెర వరకూ చూపులుసారిస్తూ
విశ్వనరుడి ఆవిర్భావం కోసం రాత్రి రెప్పవేయటం లేదు.
- ఈత కోట సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment