కవిత్వానికి సామాజిక ప్రయోజనం ముఖ్యం
విజయవాడ కల్చరల్ :
కవిత్వానికి సామాజిక ప్రయోజనం ముఖ్యమని ప్రజాసాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు పేర్కొన్నారు. మల్లెతీగ, ఆం్ర«ధ ఆర్ట్స్ అకాడమీ సంస్థల సంయుక్తాధ్వర్యంలో స్థానిక శిఖామణి సెంటర్‌లోని చండ్రరాజేశ్వరరావు గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం ఎరుకలపూడి గోపీనాధరావు రచించిన వచన కవిత జాగృతి, పద్యసంపుటి, నానీల పుస్తకం నానీల వాణి పుస్తకాలను ఆవిష్కరించారు. రవిబాబు మాట్లాడుతూ గోపీనాధరావు కవిత్వం సామాజిక సృహకలిగివుంటుందని అన్నారు. తెలుగు అధ్యాపకుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ, కవిగా గోపీనాథ రావు పూర్తిగా సఫలం అయ్యారని, ఎంచుకున్న అంశాలలో ఏమాత్రం రాజీపడలేదని వివరించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్. స.శ్రీ, సీహెచ్ బృందావనరావు, డాక్టర్ కె.ఎస్.రామారావు, కోటజ్యోతి ప్రసంగించారు. మల్లెతీగ సాహిత్యవేదిక అధ్యక్షుడు కలిమిశ్రీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.