సందర్భం
‘‘సంప్రదాయం, వైయక్తిక ప్రతిభ’’ అనేది ఎలా కాల ప్రవాహంలో కవులు నడిచే దారో, అది ఎలా 20వ శతాబ్దంలో 1940–50ల నాటికే, ఎప్పటికన్నా ప్రజల పక్షాన ఉన్నదో చెప్పిన రొమాంటిక్ ఉద్యమ పారంగతుడు కృష్ణశాస్త్రి.
కళింగ కడలి యాన గాలి పాటగా, ‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోయిల పలకవలెనోయి’’ అని గురజాడ రాసిన పుష్కర కాలానికే, ‘‘ఆకులో ఆకునై, పూవులో పూవునై, ఈ అడవి దాగి పోనా, ఎటులైన ఇచట నేనాగి పోనా’’ అంటూ, అడవులను అనుమతులు అడుగుతూ, తన తృష్ణానంత కృష్ణ పక్షపు ఒక్క రెక్క తోనే పిట్టగా ఎగిరి వస్తానని కబుర్లు పంపుతూ, గురజాడకు గురువందనం చేసి, ఈ కవిత్వ మంత్ర దండం అందుకున్న ‘‘అనంతాంబరపు నీలి నీడ’’ పేరు కృష్ణశాస్త్రి. ఉద్యోగం భావకవి. ఊహాలోకంలో ఊరు దేవులపల్లి అనే దేవతల పల్లె. పుట్టింది పిఠాపురం దరి సంస్థాన ఏలుబడిలోని చంద్రం పాలెం. తాను రాసిన వంద కవితల లోపున 3 సంపుటాల అక్షర రమ్యతా, అభివ్యక్తి సంపన్న లలితత్వం, ప్రతి రచనలో పొదిగిన తన ముద్రా, ఇవీ ఒక వ్యక్తిని ఒక కవి చేసిన సామగ్రి.
‘‘నా నివాసమ్ము తొలుత మధుర సుషమా సుధాగాన మంజు వాటి, ఏనొక వియోగ గీతిక’’ అంటూ, వెర్రెత్తిన ప్రేమ గంగలా చిందులేసి, గండ భేరుండంలా ఎదిగే లక్షణాలున్న శ్రీరంగం శ్రీని వాసరావు అనే కుర్రవాడిని, తన ప్రభావంలోకి లాక్కున్న కవిత్వ కృష్ణ బిలం కృష్ణశాస్త్రి. కవి అజేయత్వాన్ని విశ్వసించిన కాలాత్మ కృష్ణశాస్త్రి. కవిత్వ చిరాయుష్షు రహస్యం మనకు ఈ మూడు సంపుటాల కవితల్లో స్పష్టం కాదు. తన కవితల్లో ఆకు పచ్చ గుబురులు, పొగమంచులు, పూల తివాచీలూ, మబ్బు జలతారుల మధ్య ఉండే ఒక కవి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, బైరన్ వలె గిరజాలు పెంచుకు తిరిగే యువ కవిత్వోల్లాసి, 1925కు ముందరే ఈయన ‘‘కృష్ణపక్షము’’ రచన పూర్తయింది. 1924లో రాసినది, (అప్పట్లో ‘‘సఖి’’ పత్రిక రుధోరోద్గారి సంచిక 1923–24 లో ప్రచురితం అన్న వివరణతో ఉన్న వ్యాసం) ‘‘మా ప్రణయ లేఖల కథ’’ ఏ యువకవి కూడా తన తొలి సంపుటికి ఇవ్వని విశేష వివరణ. ఇక ముందర రాబోయే రచనలు ప్రవాసమూ, ఊర్వశి, వీటి ప్రస్తావనలు కూడా ఈ వ్యాసంలో ఉన్నాయి. 1956లో కృష్ణశాస్త్రి మదరాసు రేడియోలో ప్రొడ్యూసర్‌గా ఉద్యోగంలో చేరారు. చేసిన ప్రసంగ వ్యాసాల్లో ఒకచోట, ఊహాశక్తి కవిత్వ పింఛంగా విప్పారాలి, వర్ధిల్లాలి అంటే సాంస్కృతికత, కాల్పనికత, వాస్తవికత, పోటాపోటీగా సమతూకంలో రాణించాలని సూత్రీకరించారు.
1922 సేక్రెడ్ వుడ్ వ్యాసాల్లో టి.ఎస్. ఇలియట్ ‘‘ట్రెడిషన్ అండ్ ఇండివిడ్యుయల్ టాలెంట్’’ అని రాసింది ఒక కవిపై పూర్వ కవుల ప్రభావాల గురించిన ఒక ప్రామాణిక పరిశీలన. ఇరవయ్యో శతాబ్దపు పాశ్చాత్య సాహిత్య రచనల్లో చాలా ముఖ్యమైనదితను రాసిన వంద లోపు కవితలు రాయడానికి కృష్ణశాస్త్రి ఎంత చదువుకుని ఉండాలో, అటుపై తాను ఎలా తన దృష్టి దృఢత్వాన్ని పెంపొందించుకుంటూ వెళ్లారో చెప్పేదే, ‘‘కవి– ప్రజ’’ అన్న వ్యాసం. ప్రజలదే ఉమ్మడి బహుళ వారసత్వం, ఇది కవుల ద్వారా దఖలు పడుతుంది, అన్న అవగాహన ఏర్పడ్డ శాస్త్రి గారు ఆధునికతకు గుండె చప్పుడు అని తెలుపుతుంది. ఆంగ్లంలో దీన్ని అందిస్తే, ఇలియట్ కన్నా ఒక కోణం ముందుకు వెళ్ళి, ‘‘సంప్రదాయం, వైయక్తిక ప్రతిభ’’ అనేది ఎలా కాల ప్రవాహంలో కవులు నడిచే దారో, అది ఎలా ఈ ఇరవయ్యో శతాబ్దంలో 1940–50ల నాటికే, ఎప్పటికన్నా ప్రజల పక్షాన ఉన్నదో చెప్పిన రొమాంటిక్ ఉద్యమ పారంగతుడు కృష్ణశాస్త్రి. ‘‘ఏ అసంఖ్యాక ప్రజలతో ఈ రోజుల్లో మనకి మరీ సన్నిహిత సంబంధం ఏర్పడుతుందో, ఆ ప్రజలలో నిలిచి ఉన్న సంప్రదాయాలతో కవికి పరిచయం లేకపోతే, అతని కంఠ స్వరం ప్రజలు ఆప్తమైనదిగా పోల్చుకోలేరు. అతని మాటలు పరాయి భాష లాగా ఉంటాయి. కనుక ప్రజలతో సన్నిహిత సంబంధం కవికి ఉండాలంటే, వాళ్ళ కలిమి లేములూ, కష్టనిష్టూ రాలే కాక వాళ్ళు నిలబడి ఉన్న జాతి సంప్రదాయాలు కూడా అతగాడు వివేచనతో, చనువుతో, గౌరవంతో ఎరిగి ఉండాలి’’ అన్నారు 1948లో కృష్ణశాస్త్రి. అప్పటికి ఇంకా మహాప్రస్థానం అచ్చు కాలేదు. (అచ్చయింది 1950లో).
ఆయన స్థిర పడలేదు, స్థిమిత పడలేదు., పైపెచ్చు ఆ రెండూ అంటే తనకు వెగటు అని చెప్పిన కాలుండబట్టని, మనసు ఊరుకోని కళ , జీవి తాల అద్వైతి కృష్ణశాస్త్రి. వీరేశలింగం గురించి రాసినా, రావి చెట్టు గురించి రాసినా, ఒక ప్రాచీన ప్రసంగావేశం వారి మాటల్లో, రాతల్లో.. తూరుపు, పడమర తేడా లేకుండా సమస్త కవిగణాల విషయమై, వారు కీర్తించిన ప్రకృతి, ప్రజల విషయంలో, మంచి మాటలే చెప్పిన కవి శిరోమణి, మానవేతిహాసంలో, అన్వేషణలో దుఃఖాలు మీదు కట్టి , ఒక అమూర్త ఊర్వశిని అవతరింపచేసుకున్న అరుదైన కవి. కవి అన్న మాటకు పర్యాయపదం లేదని చెప్పిన ద్రష్ట, సత్యం జ్ఞానులది కాగా, శివం కార్యోత్సాహులది కాగా, సుందరం మాత్రం కవుల కరతలామలక కళ అని ఉద్ఘోషించిన కాలాత్మ కృష్ణశాస్త్రి గారిని ఇంకా మనం పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టలేదు. వారి రచనల అయిదో సంపుటి, కృష్ణశాస్త్రి వ్యాసాలకు ముందు మాటలో ‘‘ఇది ఇక్షుసముద్రం, ఆస్వాదిద్దాము రండి’’ అని ఆహ్వానించారు శ్రీ శ్రీ. ఈ నూట ఇరవయ్యో జయంతి నుంచి ఆ పని చేద్దాము.
రామతీర్థ
వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత
మొబైల్ : 98492 00385
Comments
Please login to add a commentAdd a comment