Rama Tirtha
-
‘ఎన్నిసార్లు మంత్రిగా ఉన్నామనేది ముఖ్యం కాదు’
సాక్షి, విజయనగరం : శ్రీరామతీర్థ సాగర్ ద్వారా విజయనగరానికి నీళ్లు తీసుకొస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే పేదలందరికీ ఇళ్లు పట్టాలు ఇచ్చామని, మిగిలిన వాళ్లకి కూడా ఇస్తామని భరోసానిచ్చారు. అందరికి తమ దగ్గర ప్రాంతంలోనే ఇళ్ల పట్టాలు ఇస్తామని, ఆర్థికంగా సాయం అందిస్తామని తెలిపారు. జిల్లాలో మంత్రి శుక్రవారం మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం విజయనగరం జిల్లా అభివృద్ధి చెందాలని పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ని సార్లు మంత్రి పదవి చేశామని కాదని, ప్రజలకు కావల్సిన పనులు చేయడం ముఖ్యమన్నారు. నగరంలో ఎమ్మెల్యే పూర్తిగా ఆ దిశగా పని చేస్తున్నారని తెలిపారు. శ్రీరామతీర్ధ సాగర్ నుంచి నీరు తీసుకురావాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడే ప్రయత్నించామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం కక్షతో ఆ ప్రాజెక్టుని నిలిపి వేసిందని విమర్శించారు. చదవండి: ‘అబద్ధాలు తప్ప.. ఆయన చేసిందేమీలేదు’ ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోమన్న మంత్రి.. ప్రజల నుంచి రావడం వల్ల వాళ్ల కష్టాలు తమకు తెలుసని అన్నారు. వృద్దులకు వాలంటీర్లు ద్వారా ఉదయాన్నే పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. మోసం, దగా లేకుండా పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి ద్వారా పండగకు ముందే వారి ఖాతాలో డబ్బులు జమచేశారని పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచన చంద్రబాబుకి ఎప్పుడూ రాదని ఎద్దేవా చేశారు. పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో, గత అయిదేళ్ళలో ఎలాంటి ఇబ్బంది పడ్డారో ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు. కరోనా సమయంలో అధికారులతో సంప్రదించి ప్రజలు ఇబ్బంది పడకూడదని చెబుతూ వచ్చారన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, దేవుడిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డ బొత్స.. అధికారంలో లేనప్పుడే టీడీపీకి దేవుళ్లు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సహృదయ విమర్శకుడు
వక్తగా, అనువాదకుడిగా, కవిగా, వ్యాసకర్తగా, మీదుమిక్కిలి విమర్శకుడిగా గుర్తింపు పొందినవాడు రామతీర్థ. అసలు పేరు యాబలూరు సుందర రాంబాబు. 1960లో నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో జన్మించారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడం వల్ల నెల్లూరు, ఒడిశాలలో విద్యాభ్యాసం సాగింది. బి.ఎ. తర్వాత 1981లో పారదీప్ పోర్టులో కార్మికుల రక్షణ విభాగంలో ఉద్యోగంలో చేరారు. 1985లో బదిలీపై విశాఖపట్నం వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఐదేళ్ళ క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పూర్తి కాలం సాహితీసేవలో నిమగ్నమయ్యారు. విశాఖపట్నంలో నిత్యం సాహిత్య వాతావరణం ఉండేలా కృషిచేశారు రామతీర్థ. ప్రగతిశీల సాహిత్యానికి పెద్దపీట వేశారు. ఉత్తరాంధ్రకు చెందిన గోగులపాటి కూర్మనాథకవి, అడిదం సూరకవి, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, చాసో వంటి వారి గురించి కొత్త ప్రతిపాదనలు చేశారు. శ్రీశ్రీ చెప్పిన కవితాత్మక వ్యాఖ్య ‘ఎవరు బతికేరు మూడు ఏభైలు’ అనేది అంతకుముందెప్పుడో అడిదం సూరకవి తన కందపద్యంలో ‘‘మూడేబదులెవరుండరు మూఢులది గానలేరు ముల్లోకములన్ర వాడుక పడవలె మనుజుడు వేడుకతో బత్తులయ్య వినగదవయ్య’’ చెప్పినట్లుగా రామతీర్థ ఒక వ్యాసంలో రాశారు. అలాగే మృచ్ఛకటికంలో ఉన్న సంభాషణలు, సంఘటనలకు కన్యాశుల్కంతో ఉన్న సామ్యాన్ని వివరించారు. రామతీర్థ ప్రాచీనాంధ్రాంగ్ల సాహిత్యాన్ని ఔపోసన పట్టడమే గాక ధారణ, జ్ఞాపకశక్తి పుష్కలంగా ఉన్నవారు. ఒకప్పుడు రచనను కఠినమైన తూకపు రాళ్లతో తూచేవారు. అయితే సృజనాత్మక రంగంలో రచయితలు అల్ప సంఖ్యాకులు. కటువుగా ఉంటే సాహిత్యానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. దాంతో బాణీ మార్చారు. సాత్వికంగా నచ్చచెప్పే రీతిలో స్పందించడం, సహృదయతతో అర్థం చేసుకుని మెలగడం, నమ్మిన విశ్వాసాల్లోంచి కాకుండా భావావిష్కరణలోంచి గుణ నిర్ణయం చేయడం ద్వారా తన విమర్శనా విధానాన్ని మార్చుకున్నారు. ఆయన తన గమ్యం ఇంకా చేరవలసే ఉంది. ఇంతలోనే అకాల మృత్యువు తన వెంట తీసుకెళ్ళి పోయింది. ఆయనకు నా నివాళి. -దాట్ల దేవదానం రాజు -
కవిత్వాన్ని శ్వాసించిన కాలాత్మ
సందర్భం ‘‘సంప్రదాయం, వైయక్తిక ప్రతిభ’’ అనేది ఎలా కాల ప్రవాహంలో కవులు నడిచే దారో, అది ఎలా 20వ శతాబ్దంలో 1940–50ల నాటికే, ఎప్పటికన్నా ప్రజల పక్షాన ఉన్నదో చెప్పిన రొమాంటిక్ ఉద్యమ పారంగతుడు కృష్ణశాస్త్రి. కళింగ కడలి యాన గాలి పాటగా, ‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోయిల పలకవలెనోయి’’ అని గురజాడ రాసిన పుష్కర కాలానికే, ‘‘ఆకులో ఆకునై, పూవులో పూవునై, ఈ అడవి దాగి పోనా, ఎటులైన ఇచట నేనాగి పోనా’’ అంటూ, అడవులను అనుమతులు అడుగుతూ, తన తృష్ణానంత కృష్ణ పక్షపు ఒక్క రెక్క తోనే పిట్టగా ఎగిరి వస్తానని కబుర్లు పంపుతూ, గురజాడకు గురువందనం చేసి, ఈ కవిత్వ మంత్ర దండం అందుకున్న ‘‘అనంతాంబరపు నీలి నీడ’’ పేరు కృష్ణశాస్త్రి. ఉద్యోగం భావకవి. ఊహాలోకంలో ఊరు దేవులపల్లి అనే దేవతల పల్లె. పుట్టింది పిఠాపురం దరి సంస్థాన ఏలుబడిలోని చంద్రం పాలెం. తాను రాసిన వంద కవితల లోపున 3 సంపుటాల అక్షర రమ్యతా, అభివ్యక్తి సంపన్న లలితత్వం, ప్రతి రచనలో పొదిగిన తన ముద్రా, ఇవీ ఒక వ్యక్తిని ఒక కవి చేసిన సామగ్రి. ‘‘నా నివాసమ్ము తొలుత మధుర సుషమా సుధాగాన మంజు వాటి, ఏనొక వియోగ గీతిక’’ అంటూ, వెర్రెత్తిన ప్రేమ గంగలా చిందులేసి, గండ భేరుండంలా ఎదిగే లక్షణాలున్న శ్రీరంగం శ్రీని వాసరావు అనే కుర్రవాడిని, తన ప్రభావంలోకి లాక్కున్న కవిత్వ కృష్ణ బిలం కృష్ణశాస్త్రి. కవి అజేయత్వాన్ని విశ్వసించిన కాలాత్మ కృష్ణశాస్త్రి. కవిత్వ చిరాయుష్షు రహస్యం మనకు ఈ మూడు సంపుటాల కవితల్లో స్పష్టం కాదు. తన కవితల్లో ఆకు పచ్చ గుబురులు, పొగమంచులు, పూల తివాచీలూ, మబ్బు జలతారుల మధ్య ఉండే ఒక కవి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, బైరన్ వలె గిరజాలు పెంచుకు తిరిగే యువ కవిత్వోల్లాసి, 1925కు ముందరే ఈయన ‘‘కృష్ణపక్షము’’ రచన పూర్తయింది. 1924లో రాసినది, (అప్పట్లో ‘‘సఖి’’ పత్రిక రుధోరోద్గారి సంచిక 1923–24 లో ప్రచురితం అన్న వివరణతో ఉన్న వ్యాసం) ‘‘మా ప్రణయ లేఖల కథ’’ ఏ యువకవి కూడా తన తొలి సంపుటికి ఇవ్వని విశేష వివరణ. ఇక ముందర రాబోయే రచనలు ప్రవాసమూ, ఊర్వశి, వీటి ప్రస్తావనలు కూడా ఈ వ్యాసంలో ఉన్నాయి. 1956లో కృష్ణశాస్త్రి మదరాసు రేడియోలో ప్రొడ్యూసర్గా ఉద్యోగంలో చేరారు. చేసిన ప్రసంగ వ్యాసాల్లో ఒకచోట, ఊహాశక్తి కవిత్వ పింఛంగా విప్పారాలి, వర్ధిల్లాలి అంటే సాంస్కృతికత, కాల్పనికత, వాస్తవికత, పోటాపోటీగా సమతూకంలో రాణించాలని సూత్రీకరించారు. 1922 సేక్రెడ్ వుడ్ వ్యాసాల్లో టి.ఎస్. ఇలియట్ ‘‘ట్రెడిషన్ అండ్ ఇండివిడ్యుయల్ టాలెంట్’’ అని రాసింది ఒక కవిపై పూర్వ కవుల ప్రభావాల గురించిన ఒక ప్రామాణిక పరిశీలన. ఇరవయ్యో శతాబ్దపు పాశ్చాత్య సాహిత్య రచనల్లో చాలా ముఖ్యమైనదితను రాసిన వంద లోపు కవితలు రాయడానికి కృష్ణశాస్త్రి ఎంత చదువుకుని ఉండాలో, అటుపై తాను ఎలా తన దృష్టి దృఢత్వాన్ని పెంపొందించుకుంటూ వెళ్లారో చెప్పేదే, ‘‘కవి– ప్రజ’’ అన్న వ్యాసం. ప్రజలదే ఉమ్మడి బహుళ వారసత్వం, ఇది కవుల ద్వారా దఖలు పడుతుంది, అన్న అవగాహన ఏర్పడ్డ శాస్త్రి గారు ఆధునికతకు గుండె చప్పుడు అని తెలుపుతుంది. ఆంగ్లంలో దీన్ని అందిస్తే, ఇలియట్ కన్నా ఒక కోణం ముందుకు వెళ్ళి, ‘‘సంప్రదాయం, వైయక్తిక ప్రతిభ’’ అనేది ఎలా కాల ప్రవాహంలో కవులు నడిచే దారో, అది ఎలా ఈ ఇరవయ్యో శతాబ్దంలో 1940–50ల నాటికే, ఎప్పటికన్నా ప్రజల పక్షాన ఉన్నదో చెప్పిన రొమాంటిక్ ఉద్యమ పారంగతుడు కృష్ణశాస్త్రి. ‘‘ఏ అసంఖ్యాక ప్రజలతో ఈ రోజుల్లో మనకి మరీ సన్నిహిత సంబంధం ఏర్పడుతుందో, ఆ ప్రజలలో నిలిచి ఉన్న సంప్రదాయాలతో కవికి పరిచయం లేకపోతే, అతని కంఠ స్వరం ప్రజలు ఆప్తమైనదిగా పోల్చుకోలేరు. అతని మాటలు పరాయి భాష లాగా ఉంటాయి. కనుక ప్రజలతో సన్నిహిత సంబంధం కవికి ఉండాలంటే, వాళ్ళ కలిమి లేములూ, కష్టనిష్టూ రాలే కాక వాళ్ళు నిలబడి ఉన్న జాతి సంప్రదాయాలు కూడా అతగాడు వివేచనతో, చనువుతో, గౌరవంతో ఎరిగి ఉండాలి’’ అన్నారు 1948లో కృష్ణశాస్త్రి. అప్పటికి ఇంకా మహాప్రస్థానం అచ్చు కాలేదు. (అచ్చయింది 1950లో). ఆయన స్థిర పడలేదు, స్థిమిత పడలేదు., పైపెచ్చు ఆ రెండూ అంటే తనకు వెగటు అని చెప్పిన కాలుండబట్టని, మనసు ఊరుకోని కళ , జీవి తాల అద్వైతి కృష్ణశాస్త్రి. వీరేశలింగం గురించి రాసినా, రావి చెట్టు గురించి రాసినా, ఒక ప్రాచీన ప్రసంగావేశం వారి మాటల్లో, రాతల్లో.. తూరుపు, పడమర తేడా లేకుండా సమస్త కవిగణాల విషయమై, వారు కీర్తించిన ప్రకృతి, ప్రజల విషయంలో, మంచి మాటలే చెప్పిన కవి శిరోమణి, మానవేతిహాసంలో, అన్వేషణలో దుఃఖాలు మీదు కట్టి , ఒక అమూర్త ఊర్వశిని అవతరింపచేసుకున్న అరుదైన కవి. కవి అన్న మాటకు పర్యాయపదం లేదని చెప్పిన ద్రష్ట, సత్యం జ్ఞానులది కాగా, శివం కార్యోత్సాహులది కాగా, సుందరం మాత్రం కవుల కరతలామలక కళ అని ఉద్ఘోషించిన కాలాత్మ కృష్ణశాస్త్రి గారిని ఇంకా మనం పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టలేదు. వారి రచనల అయిదో సంపుటి, కృష్ణశాస్త్రి వ్యాసాలకు ముందు మాటలో ‘‘ఇది ఇక్షుసముద్రం, ఆస్వాదిద్దాము రండి’’ అని ఆహ్వానించారు శ్రీ శ్రీ. ఈ నూట ఇరవయ్యో జయంతి నుంచి ఆ పని చేద్దాము. రామతీర్థ వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత మొబైల్ : 98492 00385 -
మంచి నవలలో పంటి కింద రాళ్లు
విమర్శ ‘గమనమే గమ్యం’ మార్చ్ 2016లో ఓల్గా వెలువరించిన నాలుగు వందల పేజీల నవల. అట్ట మీద సముద్రమూ, ఇసుకా! సముద్రం మెత్తగా ఉండి, ఇసుక నిజంగా గరుగ్గానే ఉంది. ఈ స్పర్శానుభవం పాఠకుడి అనుభూతికి కొత్త సంగతిగా పరిచయం అవుతుంది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు కుమార్తె, డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ(నవలలో పేరు శారదాంబ) (6.9.1906 జననం-మరణం నవల ప్రకారం 1965 భారత -చైనా యుద్ధం తర్వాత కాలంలో) జీవితంపై ఆధారపడ్డ రచన ఈ నవల. రాయడానికి ముఖ్య కారణం ఆమె ఆధునిక స్త్రీ, తెలుగు నాట తొలి లేడి డాక్టర్-సర్జన్, సాంఘిక రంగలో రాజకీయ కార్యాచరణ కలిగిన వ్యక్తి. 1957 ఎన్నికల్లో రెండవ లోక్సభకు విజయవాడ నుంచి ఎన్నికయిన సభ్యురాలు. ఇటువంటి ఎన్నో కారణాలు ఓల్గాను ఈ రచనకు పురికొల్పి ఉండవచ్చు. నవలలో 1910-1965 మధ్య గల కాలం చిత్రితమయ్యింది. బ్రాహ్మణ యువతి శారదాంబ, కమ్మ వనిత అన్నపూర్ణ, దేవదాసీల కుటుంబపు మహిళ విశాలాక్షి, ముగ్గురు స్త్రీలు స్వాతంత్య్ర పూర్వపు భారతదేశపు తెలుగు సమాజ భిన్న జీవన నేపథ్యాల వారు. తమ జీవితాలకు అభివృద్ధి అనుకున్నది వారు ఎలా సాధించారో, ఈ సాధించే క్రమాన్ని, ఈ కాలపు చరిత్రతో కలగలిపి చెప్పే క్లిష్ట ప్రయత్నం ఈ రచన. కొమర్రాజు అచ్చమాంబ నిజ జీవిత పాత్రలు కథలోకి వచ్చినప్పుడు, కాల్పనిక స్వేచ్ఛ తగ్గిపోతుంది. అచ్చమాంబ పేరు శారదాంబగా మార్చినా, ఆమె చుట్టుప్రక్కల గల సజీవ సమాజంలోని వారు, కందుకూరి వీరేశలింగం, ఆయన శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ, ఉన్నవ, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, కాశీనాథుని నాగేశ్వర రావు, టంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గాబాయి దేశ్ముఖ్, ముఖ్యంగా కొమర్రాజు లక్ష్మణరావు, చలసాని శ్రీనివాసరావు, ఇలా నిజమైన వ్యక్తులను కథనంలో పాత్రలు చేసేటప్పుడు నాలుగింతలు శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. సరి చూసుకోవలసిన తేదీలు, ఆయా తేదీలకు ఒదగ వలసిన చిత్రణలు, వ్యక్తుల జననాలు, మరణాలు, వీటికి చెందిన ప్రదేశాలు, అచ్చమాంబ జీవితంపై ప్రభావం చూపిన ఘట్టాలపై సమగ్ర చిత్రణ జరిగిందా అని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాల్సి వుంటుంది. కాని అలా జరిగినట్టు లేదు. ఇంత మంచి నవలలో, చరిత్రకు సంబంధించి పంటి కింద రాళ్లు తగలడం దురదృష్టకరం. కందుకూరి వీరేశలింగం ఇంటికి, కొమర్రాజు రామారావు (కథలో కొమర్రాజు లక్ష్మణరావు పేరు), అప్పటికి కొద్ది కాలం కిందటే గతించిన తన అక్క పేరే పెట్టుకున్న తన అయిదేళ్ళ కూతురు శారదాంబను తీసుకువెళ్లడంతో కథ మొదలవుతుంది. రాజ్యలక్ష్మమ్మ, రాత్రి పాప నిద్రపోయే ముందు కథ చెప్పమంటే, పాత కథలు కాదు, కొత్త కథ, పాటలాంటిది చెప్తానని, ‘పూర్ణమ్మ’ వినిిపిస్తారు. రెండు రోజులు అక్కడ ఉన్నాక, ఈ తండ్రీకూతుళ్లు ఉన్నవ వారింటికి, గుంటూరు వెళ్తారు. రెండవ రోజునే, రాజ్యలక్ష్మమ్మ చనిపోయారన్న వార్త వస్తుంది కథలో. రాజ్యలక్ష్మమ్మ మరణం 11-8-1910న జరిగింది. అంటే ఓల్గా ఈ కథను ఆగస్టు మొదటి వారం, 1910లో ఆరంభించారన్న మాట. ఎక్కడైనా మొదలుపెట్టే స్వేచ్ఛ రచయితకు ఉన్నది. కాని గురజాడ ‘పూర్ణమ్మ’ గేయాన్ని 1912 వరకూ రాయలేదు. గేయం అచ్చులోకి 1929 వరకూ రాలేదు. 1910లో చనిపోయిన రాజ్యలక్ష్మమ్మ ఆ పాట పాడే అవకాశం లేదు. వీరేశలింగం మృతి మద్రాసులో జరిగింది. అక్కడ మరి తక్కువ విషయాన్ని పొందు పరిచారు ఓల్గా. ఆయన ఎప్పుడు మద్రాసు వెళ్లినా ఉండేది కొమర్రాజు ఇంట్లోనే. వ్యావహారిక భాషను సమర్థిస్తూ తాను కూడా పని చేస్తానని గిడుగు రామమూర్తి పంతులుతో రాజమండ్రి సభల్లో అన్న మూడు నెలల్లోనే వీరేశలింగం, 27-5-1919న, మద్రాసులో కొమర్రాజు లక్ష్మణరావు ఇంట్లో కన్నుమూశారు. ముందురోజు కూడా ‘కవుల చరిత్రలు’ ప్రూఫులు దిద్దుతూ గడిపారన్నది వారి చివరి దినాలను చూసిన వారు రాసిన, చెప్పిన భోగట్టా. అప్పటికి కుమార్తె పై తరగతి చదువులకై, మద్రాసుకు చేరుకున్న కొమర్రాజు కుటుంబం ఉండేది ఎగ్మూరులో. ఆ ఇంటి పేరు వేదవిలాస్, అని మద్రాసు ఆర్కైవ్స్ చెప్తున్నాయి. ఇవేవి ఓల్గా రచనలో కనిపించవు, పెపైచ్చు, వీరేశలింగం మృతి గురించి, ఒక్క ప్రభావశీలమైన వివరణ కూడా చేయరు. పంతులుగారు ఉన్నది మద్రాసులోనే అని స్పష్టపరచరు. ఇలా రాశారు: ‘‘ఇంకా రెండు రోజులకు మరణిస్తాడు అనగా కూడా ఆ మాటలే చెప్పి వాగ్దానం తీసుకున్నాడాయన. శారదకు ఆ వాగ్దానంతో బాధలేదు. కాని వీరేశలింగం గారి మరణం బాగా బాధించింది’’. ఎక్కడ జరిగింది మృత్యువు? పేపర్లు ఏమని రాశాయి? ఇవేవీ లేకుండానే నవలకు మూల ఘట్టం వంటిది రాయవచ్చునా? ఇక ఇంతకు మించినది ఏమిటంటే, కొమర్రాజు మరణస్థలాన్ని ఆయన స్వగ్రామానికి మార్చడం. ఆయన కూడా తన అనారోగ్యం వల్ల 12-7-1923న, ఏ గదిలో వీరేశలింగం మరణించారో, అదే గదిలో కన్నుమూశారు. దీన్ని సాహిత్య అకాడెమీ ప్రచురణలో కె.కె రంగనాథాచార్యులు తెలిపారు. కొమర్రాజు మరణం సంభవించింది తన స్వగ్రామం పెనుగంచిప్రోలులో కాదు. మరి నవలలో ఏ ప్రయోజనం ఆశించి ఓల్గా ఇలా చిత్రణ చేశారో స్పష్టం కాలేదు. సైమన్ కమిషన్ విషయం, అచ్చమాంబ జీవితంలో 1928 నాటి ప్రధానమైన రాజకీయ ఘట్టం, తగు చిత్రణ కాలేదు. నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కారణంగానే, ఆమెను, మదరాసు యూనివర్సిటీ డాక్టరీ పరీక్షకు కూచోనివ్వదు. అప్పుడు ఆమె తన పరీక్ష ఉత్తీర్ణత కోసం ఇంగ్లాండు వెళ్ళి వచ్చారని ఆమె మేనల్లుడు, విశాఖలో ఫ్రొఫెసర్ డాక్టర్ కొమర్రాజు రవి తెలిపారు. స్త్రీని తక్కువచేసి చూడటంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు తమ భావజాలంలోని ఛాందసత్వంలోంచి బయటకు రావాలని, మనుష్యుల మధ్య, స్త్రీ, పురుషుల మధ్య, వర్గాల మధ్య, నెలకొని ఉన్న ఆధిపత్య భావన నిర్మూలన జరిగే సమాజమే, మంచి సమాజమని తలపోస్తూ, 1965 ప్రాంతాల్లో కన్ను మూస్తుంది శారదాంబ. మంచి ఒడుపుతో రాసిన ఈ రచనలో, కల్పనగా అయితే, పేజీలు తిరిగి పోతాయి గబగబా. ఈ కథనం వెనకాల చరిత్ర, సమీప శతాబ్దపు నిజమైన వ్యక్తులు ఉన్నారు అని చూశామా, ఈ పంటి కింది రాళ్లు ఒక మంచి పాఠకానుభవానికి అడ్డం పడతాయి. ఏది ఏమైనా చర్చకు మిగిలే ఎన్నో అంశాలను కళారూపంలో ప్రస్తావించిన ఓల్గాను అభినందించకుండా ఉండలేము. ఆ అభినందనలో భాగమే ఈ ప్రశ్నలు కూడా. రామతీర్థ 9849200385