సాక్షి, విజయనగరం : శ్రీరామతీర్థ సాగర్ ద్వారా విజయనగరానికి నీళ్లు తీసుకొస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే పేదలందరికీ ఇళ్లు పట్టాలు ఇచ్చామని, మిగిలిన వాళ్లకి కూడా ఇస్తామని భరోసానిచ్చారు. అందరికి తమ దగ్గర ప్రాంతంలోనే ఇళ్ల పట్టాలు ఇస్తామని, ఆర్థికంగా సాయం అందిస్తామని తెలిపారు. జిల్లాలో మంత్రి శుక్రవారం మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం విజయనగరం జిల్లా అభివృద్ధి చెందాలని పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ని సార్లు మంత్రి పదవి చేశామని కాదని, ప్రజలకు కావల్సిన పనులు చేయడం ముఖ్యమన్నారు. నగరంలో ఎమ్మెల్యే పూర్తిగా ఆ దిశగా పని చేస్తున్నారని తెలిపారు. శ్రీరామతీర్ధ సాగర్ నుంచి నీరు తీసుకురావాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడే ప్రయత్నించామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం కక్షతో ఆ ప్రాజెక్టుని నిలిపి వేసిందని విమర్శించారు. చదవండి: ‘అబద్ధాలు తప్ప.. ఆయన చేసిందేమీలేదు’
ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోమన్న మంత్రి.. ప్రజల నుంచి రావడం వల్ల వాళ్ల కష్టాలు తమకు తెలుసని అన్నారు. వృద్దులకు వాలంటీర్లు ద్వారా ఉదయాన్నే పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. మోసం, దగా లేకుండా పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి ద్వారా పండగకు ముందే వారి ఖాతాలో డబ్బులు జమచేశారని పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచన చంద్రబాబుకి ఎప్పుడూ రాదని ఎద్దేవా చేశారు. పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో, గత అయిదేళ్ళలో ఎలాంటి ఇబ్బంది పడ్డారో ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు. కరోనా సమయంలో అధికారులతో సంప్రదించి ప్రజలు ఇబ్బంది పడకూడదని చెబుతూ వచ్చారన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, దేవుడిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డ బొత్స.. అధికారంలో లేనప్పుడే టీడీపీకి దేవుళ్లు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment