‘పవిత్ర దేవాలయమన్నారు.. దోచుకున్నారు’ | Minister Botsa Satyanarayana Slams On Chandrababu Naidu In Vizanagaram | Sakshi
Sakshi News home page

రాజధానిలో ఏ సంపద సృష్టించారు?: మంత్రి బొత్స

Published Tue, Nov 26 2019 6:35 PM | Last Updated on Tue, Nov 26 2019 7:20 PM

Minister Botsa Satyanarayana Slams On Chandrababu Naidu In Vizanagaram - Sakshi

సాక్షి, విజయనగరం: రాజధానిని పవిత్ర దేవాలయంగా ప్రచారం చేసిన  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లు ఏం చేశారని పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధానిని నిర్మించుకోవాలనే ధ్యాస టీడీపీ నేతలకు లేదంటూ మండిపడ్డారు. మంగళవారం జిల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని తీరని లోటులోకి నెట్టేశారని విమర్శించారు. 20 ఏళ్లు అయినా ఈ లోటు తీర్చలేమని అన్నారు. 4శాతం నిధులు మాత్రమే రాజధాని నిర్మాణానికి ఖర్చు చేశారని, తన స్వలాభం కోసం మాత్రమే చంద్రబాబు పాటుపడ్డారు తప్ప రాష్ట్రం కోసం ఏం చేయలేదని ఆయన మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించమని ధర్నా చేస్తే రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు.

టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని అడ్రస్‌ లేకుండా చేశారని మంత్రి అన్నారు. చంద్రబాబు, లోకేష్‌, యనమల రామకృష్ణుడు  మీడియా ముందుకు రాకుండా కొత్తరకంగా ట్విటర్‌లో  ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తానేమి యనమలలా దోచుకోలేదని.. తనను ఎందుకు బర్తరఫ్‌ చేయాలని ప్రశ్నించారు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకంమంతా పచ్చగా కనిపిస్తుందని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు ఐదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో వాటిని ఆధారాలతో సహ చూపిస్తామని అన్నారు. అలాగే తమపై కొన్ని పత్రికలు ఇస్టానుసారంగా కథనాలు రాస్తున్నాయని, ప్రజలు ఆ రాతలను నమ్మరని అన్నారు. అలాగే చంద్రబాబు రాజధాని పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని, కోట్లు అప్పు చేసి రాజధానిలో ఏ సంపద సృష్టించారని నిలదీశారు.

గత ప్రభుత్వంలా నిధులను దుబారా చేయద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు,  అధికారులకు సూచించారని తెలిపారు. తమ ప్రభుత్వం తాలుకా ఆలోచనలు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని, హామీలన్నింటిని పూర్తి చేయడమే అని పేర్కొన్నారు. సింగపూర్‌ కన్సార్టియం వల్లన సంపద సృష్టించే అవకాశం లేకపోవడంతో కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని, కొన్ని కంపెనీలతో చేసిన ఒప్పందాలు పూర్తిగా అస్పష్టమని మంత్రి వెల్లడించారు. నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా నేడు(నవంబర్‌ 26) జిల్లాలో మార్కెటింగ్‌ కమిటీలో అమలు చేశామని మంత్రి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement