సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌పీసీ ప్రభుత్వ లక్ష్యం.. అభివృద్ధి, సంక్షేమమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాలో నిర్వహించిన ద్విశత శంకుస్థాపనల మహోత్సవంలో మంత్రి బోత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత అక్టోబర్‌లో వంద పనులకు రూ. 11 కోట్లతో శంఖుస్థాపనలు చేశామని ఆయన తెలిపారు. ఇప్పుడు రూ. 22 కోట్లతో రెండు వందల పనులకు శంఖుస్థాపనలు చేయడం ఆనందించదగ్గ విషయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలో రూ. 25 కోట్లతో అభివృద్ధి పనులు జరగుతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తామని ఆయన అన్నారు.
గతప్రభుత్వంలో పదవులు, నిధులు ఉన్నా అభివృద్ధి ఆలోచన వారికి లేదని బొత్స మండిపడ్డారు. గత పాలకులకు దోచుకోడమే తప్ప మరో లక్ష్యం లేదని ఆయన ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపించారని ఆయన ఎద్దేవా చేశారు. ఉగాదికి పట్టణంలో ఇళ్ళు లేని వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సలహాలతో ముందుకు వెళ్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు, అశోక్ గజపతి రాజు లాంటివారు ఓర్వలేకపోతున్నారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు, అశోక్ గజపతిరాజు వంటివారు అభివృద్ధి చేయలేక పోగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా మాకు ఇబ్బంది లేదు కానీ రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. లక్ష తొమ్మిది వేల కోట్లతో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదన్నారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని.. వాటిని అభివృద్ధి చేయలన్నది ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికైనా టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రజలు ఎందుకు టీడీపీని పక్కన పెట్టారో ఆలోచించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం సమసమాన అభివృద్ధి అని.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది తమ బాధ్యతని ఆయన తెలిపారు. టీడీపీ నేతలు అభివృద్ధికి వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. 2014కి ముందు విజయనగరంలో కర్ఫ్యూ రావడానికి ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు. రోశయ్య సీఎంగా అఖిలపక్షం సమావేశంలో టీడీపీ విభజనకి మద్దతు తెలిపిందా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment