‘కవిరత్న’ కత్తుల భద్రయ్య ఎవరి కవిత్వమూ చదవడు. తనది కవిత్వం కాదంటే ఒప్పుకోడు. ‘నన్ను కవి కాదన్నవాడిని కత్తితో పొడుస్తా’ టైపన్నమాట. ఇలాంటి భద్రయ్యకు ఒక ఆదివారం పూట పుస్తకం వేయాలనే ఆలోచన వచ్చింది.తన మిత్రుడు నూకేశ్వర్రావును ఇంటికి పిలిచి, వేడి వేడి చాయ్ పోసి తన మనసులో మాట చెప్పాడు.‘‘భద్రయ్యగారూ...ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. తక్షణం పుస్తకం వేయాల్సిందే’’ అని చాలా గట్టిగా చెప్పాడు నూకేశ్వర్రావు.‘‘అంతేనంటావా!’’ అన్నాడు ఆనందంగా భద్రయ్య.‘‘ముమ్మాటికీ అంతే...’’ అన్నాడు నూకేశ్వర్రావు అంతకంటే ఆనందంగా.వారం తిరిగేలోపే కత్తుల భద్రయ్య కవిత్వం 172 పేజీల పుస్తకంగా వచ్చింది.(గమనిక: ఈ పుస్తకంలో 20 పేజీలు మాత్రమే కవిత్వం....మిగిలిన పేజీలన్నీ ముందుమాటలే) నూకేశ్వర్రావుని ఇంటికి పిలిచి చాయ్ పోసి...‘‘పుస్తకం ఎలా ఉంది?’’ అని అడిగాడు భద్రయ్య.‘‘ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కొన్ని వందల పుస్తకాలు చూసుంటాను. కానీ ఇంత అందమైన పుస్తకాన్ని చూడలేదంటే నమ్మండి. పుస్తకం వేయడం కూడా ఒక కళ...’’ అంటూ సైకిల్ పంపుతో గ్యాస్ కొట్టడం మొదలుపెట్టాడు నూకేశ్వర్రావు.
పొగడ్తలతో భద్రయ్య పొట్ట ఉబ్బిపోయింది.∙∙ రెండో రోజు కూడా టీ టైమ్‌కు వచ్చాడు నూకేశ్వర్రావు.టీ చప్పరిస్తూ...‘‘పుస్తకాన్ని సైలెంట్‌గా రిలీజ్ చేయవద్దండి. భారీ ఎత్తున ప్లాన్ చేయాలి’’ సలహా ఇచ్చాడు నూకేశ్వర్రావు.‘‘అలాగే చేద్దాం’’ అన్నాడు భద్రయ్య.సిటీలో పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశారు.‘‘ఏమయ్యా హాలు చూస్తే ఇంతపెద్దగా ఉంది. అంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తారు?’’ అడిగాడు భద్రయ్య.‘‘మామూలుగానైతే పుస్తకావిష్కరణ సభల్లో స్టేజీ మీద కంటే స్టేజీ కిందే తక్కువ జనాలు ఉంటారు’’ అన్నాడు నూకేశ్వర్రావు.‘‘మరి ఎలా?’’ అడిగాడు భద్రయ్య.‘‘నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది...’’ అన్నాడు నూకేశ్వర్రావు.‘‘ఏమిటోయ్ అది?’’ ఆసక్తిగా అడిగాడు భద్రయ్య.‘‘ఏమిలేదండి...పుస్తక ఆవిష్కరణ సభకు ఆహ్వానించే కార్డులో ‘ముఖ్యగమనిక: సభ అనంతరం లక్కీడ్రా ఉంటుంది. మొదటి ముగ్గురు విజేతలకు మిక్సీ, రాకెన్‌కేక్ జీన్‌ప్యాంట్, ఎనిమిది వందల రూపాయల విలువైన జియో ఫోన్ ప్రదానం చేయబడుతుంది’ అని ప్రచురిస్తే సరిపోతుంది’’ విలువైన సలహా ఇచ్చాడు నూకేశ్వర్రావు.
‘‘అలాగే’’ అన్నాడు భద్రయ్య.∙∙ ఆరోజు కత్తులవారి పుస్తకావిష్కరణ సభ. ఖైరతాబాద్‌లోని ‘కర్మ’ ఫంక్షన్‌హాల్ కిక్కిరిసిపోయిఉంది. హాల్‌లో ఎంతమంది ఉన్నారో, బయట అంతమంది ఉన్నారు.మేఘాలయ నుంచి భద్రయ్య ఫేస్‌బుక్ ఫ్రెండ్ జేమ్స్ పాంగ్‌సాంగ్ కొంగల్ వక్తల్లో ఒకడిగా వచ్చాడు. అతడు మాట్లాడుతూ ఇలా అన్నాడు...‘‘న భూతో న భవిష్యతీ...అంటారు కదా, అలా ఉంది సభ. మా స్టేట్‌లో ఎంతపెద్ద సాహిత్యసభకైనా పాతికమంది వస్తే మహాగొప్ప. అలాంటిది ఇక్కడ వందలాది మందిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందో చెప్పలేను. ప్రజలకు సాహిత్యం అంటే ఇంత అభిమానం ఉందని ఇప్పుడే తెలిసింది. ప్రజల అభిరుచికి పాదాభివందనం చేస్తున్నాను’’ అని మాట్లాడి కూర్చున్నాడు పాంగ్‌సాంగ్ కొంగల్.ఆతరువాత...‘‘మా గల్లీ కార్పొరేటర్ మల్లేశంగారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం’’ అని పిలిచాడు సభానిర్వాహకుడు నూకేశ్వర్రావు.అంతే...పెద్దగా నినాదాలు!‘మల్లేశన్న నాయకత్వం వర్థిల్లాలి’‘మల్లెపువ్వు తెలుపు...మల్లేశన్న గెలుపు’కార్పొరెటర్ మల్లేశం పెళ్లికి వెళ్లినా, చావుకు వెళ్లినా....ఎక్కడికి వెళ్లినా చుట్టూ పదిమంది ఉండాల్సిందే.
ఆ పదిమంది...ఛాన్స్ దొరికితే చాలు....ఇలా నినాదాలు ఇస్తుంటారు.మల్లేశం స్టేజీ ఎక్కి మైక్ అందుకున్నాడు.‘‘ఎంత కార్పొరెటర్ అయితే మాత్రం వీడికి కవిత్వం గురించి ఏంతెలుసు!’’ తమలో తాము నిశ్శబ్దంగా గొణుక్కున్నారు. తనకు తెలియని సబ్జెక్ట్ గురించి ఈ కార్పొరేటర్ ఏంమాట్లాడతాడో అనే ఆసక్తి సభికుల్లో నిండిపోయింది.ఆయన ఇలా మాట్లాడారు...‘‘ఈ పుస్తకం రాసినాయిన మనకు జిగ్రీదోస్తు. జాన్‌జబ్బ. వీళ్ల నాయిన, మా నాయిన ఒకటే బడిల సదువుకున్నరు. కార్పొరేషన్ ఎలక్షన్ల టైమ్‌లో ‘పెదనాయినా...నీ ఓటు నాకే’ అని అడిగితే...‘నువ్వు అడగాల్నార బద్మాష్...నీకు దప్ప ఎవరకు ఏస్తా!’ అన్నడు.
ఆ మంచిమనిషి తమ్ముని కొడుకే ఈ కవి.భద్రన్నకు భరోసా ఇస్తున్న...కంపల్‌సరిగా మన గవర్నమెంట్ వస్తది. అందరికి న్యాయం జరుగుతది.జరగకపోతే ఊరుకునేది లేదు.నడి బజార్లకొస్తం.న్యాయం జరిగే వరకు ఫైట్ చేస్తాం.ఇవ్వాళ అన్న బుక్కు ఎందుకు రాసిండు? అని నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను.తన కోసమా!తన పిల్లల కోసమా!కానే కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.మన భద్రన్న ప్రజలు భద్రంగా ఉండాలని ఈ పుస్తకం రాసిండు. అంతేగానీ...తన స్వార్థం కోసం ఈ పుస్తకం రాయలేదని మరోసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను’’స్పీచ్ పూర్తయ్యిందో లేదో మళ్లీ నినాదాలు...‘మల్లెపువ్వు తెలుపు...మల్లేశన్న గెలుపు’బాటమ్ లైన్: విమానాలే కాదు సభలు కూడా హైజాక్ అవుతాయి.
యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment