
కళను గుండెకు హత్తుకున్న సినిమాలోని దృశ్యాలు ఇవి.కవిత్వం పైరగాలితో కలిసి గజ్జెకట్టిన ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం..
పచ్చని పొలాల దగ్గర కూర్చొని రాసుకుంటున్నాడు కాశీ.అక్కడికి కీర్తన వచ్చింది.‘‘నేను కొన్ని స్వరాలు రాశాను. నువ్వు నాట్యం చేయాలి’’ అన్నాడు కీర్తనను చూస్తూ.‘‘ఏ రాగం?’’ అని అడిగింది ఆమెచిలిపిగా.‘‘అనురాగం’’ అన్నాడు అంతకంటే చిలిపిగా.‘‘తెలిసో తెలియకో ఏదో రాసుకుంటే రాగం అడుగుతావా?’’ అంటూనే స్వరాలవీణ మీటాడు కాశీ.పచ్చని పంటపొలాలు ప్రేక్షకులయ్యాయి. గాలికి తలలు ఊపుతూ బ్రహ్మాండం అంటున్నాయి.‘‘వండర్‌ఫుల్. బ్యూటిఫుల్. ఈ ఏకాంత ప్రదేశంలో మీ నాట్యం చాలా బాగుంది. గోదావరి ప్రవాహంలాస్పాంటేనియస్ ఉంది’’ అన్నాడు అతడు.అతడు కాశీ కాదు...శ్రావణ్!శ్రావణ్ గొప్ప చిత్రకారుడు.కళ ఉన్న వాళ్లను నెత్తిన మోసే మంచివాడు.‘‘ఈవిడ కీర్తన. పరమేశ్వరశాస్త్రిగారి అమ్మాయి’’ అని ఒకవైపు కీర్తనను పరిచయం చేస్తూనే ‘‘నా పేరు కాశీ’’ అని పరిచయం చేసుకున్నాడు.కొన్ని మాటలైన తరువాత ‘‘కమాన్ లెట్స్ గో. రండి’’ అని తన ఇంటికి ఆ ఇద్దరిని తీసుకెళ్లాడు శ్రావణ్.‘‘దిసీజ్ మై వరల్డ్. నేను అమెరికాలో ఉండగా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద వ్యాసాలు రాశాను’’ అని చెప్పుకొని పోతున్నాడు శ్రావణ్.
గోడకు ఉన్న శ్రావణ్ చిత్రాలను చూస్తూ, ఆ తన్మయంలో...‘‘రంగుల కవితల్లాగా ఉన్నాయి’’ అన్నాడు కాశీ.‘‘మీకు పోయెట్రీ అంటే ఇష్టమా?’’ కాశీ మాటల ధోరణిని గమనిస్తూ అడిగాడు శ్రావణ్.‘‘ఇష్టమా? ప్రాణం! ఇవి చూడండి’’ అంటూ కాశీ చేతులోని కాగితాలను శ్రావణ్‌కు ఇచ్చింది కీర్తన.‘వానవేణి తోటినీలవీణ మీటినీలినింగి పాటే ఈ చేలట!కాళిదాసులాంటిఈ తోట రాసుకున్నకమ్మని కవితలే ఈ పూలట!’‘‘ఫెంటాస్టిక్...కవి జీవితాన్ని రెండు ముక్కల్లో చెప్పారు. యస్, కళాకారుడికి కావల్సింది ఇన్‌స్పిరేషన్ ప్లస్ అభినందన’’ అని పులకరించిపోయాడు శ్రావణ్.‘‘కాశీ ప్రతి పలుకులో కవిత్వం ఉంటుంది.కానీ అది తానొక్కడికే పరిమితం’’ అన్నది కీర్తన.‘‘ఇట్స్ ఏ క్రైమ్. ప్రపంచం కవిని గుర్తించకపోవడం ఎంత నేరమో... కవి ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం అంతే నేరం’’ హితబోధలాంటిది చేశాడు శ్రావణ్.‘‘ఏదో ఆవేశం వచ్చినప్పుడు గుండె గొంతుకలో పుట్టిన మాటే పాటైపోతుంది. దానికి ప్రేరణ ఇస్తుంది కీర్తన’’ అని తనను తాను తగ్గించుకున్నాడు కాశీ.‘‘ఈజ్ ఇట్. డిఫెనిట్‌గా అలాంటి ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. నాకు అలాంటి తోడు లేకపోవడం వల్లే ఇన్నాళ్లు నా ఘోషను కన్నీటిరంగుల్లో కలిపి కాన్వాస్ ఎక్కించాను’’ మనసులో మాట చెప్పాడు శ్రావణ్.
సముద్రపు ఒడ్డున ఆశ్రమంలాంటి ఇల్లు అది.‘‘అమ్మా’’ అంటూ ఇంట్లోకి వచ్చాడు కాశీ.అమ్మ పలక లేదు. అలిగింది!‘‘ఇప్పుడు సముద్రం కూడా నీలాగే గంభీరంగా ఉంటే నవ్వు గుర్తొచ్చి వచ్చేశాను.కొంతసేపటికి నీలాగే తాడంత పైకి లేచి వెంటనే తగ్గిపోయింది. గంగమ్మ తల్లికి కోపం వస్తే దండం పెడితే తగ్గిపోతుంది. మరి మా అమ్మకో!’’ అని అమ్మను ఐసు చేసే ప్రయత్నం చేశాడు కాశీ.‘‘అన్నం పెడతావా! నువ్వు తిన్నావా?’’ అని అడిగాడు.‘‘ఆ...కడుపు నిండిపోయింది’’ అంటూ అలకను కంటిన్యూ చేసింది ఆ తల్లి.‘‘నువ్వు తినలేదని నాకు తెలుసులే. నేనొక్కడినే తినేస్తా. అయినా నీ కోపం ఎంతసేపు’’ అంటూ అటు వెళ్లి తినడం మొదలుపెట్టాడు.రాగం తీస్తున్నప్పుడు గొంతుకేదో అడ్డం పడి దగ్గాడు.అంతే...ఆ తల్లి కొడుకు దగ్గరికి పరుగెత్తుకు వచ్చింది.‘‘గొంతుకు అడ్డం పడితే ప్రమాదం రా. ఇదిగో నీళ్లు తాగు’’ అని గ్లాసు చేతికి ఇచ్చింది.‘‘తల్లివి నువ్వుండగా ఆ యముడు కూడా అడ్డం పడలేడు’’ అని నవ్వాడు కాశీ.
యముడు అమ్మను తీసుకెళ్లాడు.‘‘అమ్మనే కాదు నా జీవితాన్నే తీసుకెళ్లాడు’’ అని దుఃఖంలో మునిగిపోయాడు కాశీ.పక్కన కూర్చొని ధైర్యం చెబుతున్నాడు శ్రావణ్...‘‘చూడు కాశీ... జీవితం అశాశ్వతం.అంతా ఒకప్పుడు పోవాల్సిందే అనే చెత్త ఫిలాసఫీని నేను మాట్లాడను. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. నువ్వు ఒక కళాకారుడివి. నీ బాధనంతా ఆర్ట్‌లో ట్రాన్స్‌ఫార్మ్ చేసి ప్రజలకు వినిపించు.వాళ్లనిస్పందింపజెయ్. నీ రాతలు తమకు అర్థం కాకపోయినా ఆ రాతలన్నీ గొప్పవని, నవ్వు గొప్పవాడివవుతావని నీ తల్లి కలలు కన్నది. ఆ కలను నిజం చెయ్’’కాశీలో ఎలాంటి చలనం లేదు.మౌనం, నిర్లిప్తత, కొండంత నిరాశ.... అతడి పక్కన పీఠ వేసుకొని కూర్చున్నాయి.దూరంగా పిల్లలు సముద్రమంత సంతోషాన్ని కళ్లలో నింపుకొని ఇసుకలో ఆడుకుంటున్నారు.‘‘వాళ్లను చూస్తే నాకు ఆనందంగా ఉంది. ఎప్పుడూ సముద్రంలా సంతోషంగా ఉండాలి’’ కాశీలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు శ్రావణ్.అప్పుడు కాశీ ఇలా అన్నాడు:‘‘సముద్రం ఎప్పుడూ ఉప్పొంగుతుంది. కానీ అది సంతోషమో, విషాదమో తెలుసుకోవడం కష్టం’’
Comments
Please login to add a commentAdd a comment