'బుల్లెట్ అలా ఎలా బయటికి వస్తుంది బ్రో'.. ఆ సీన్‌పై సైంధవ్‌ డైరెక్టర్ క్లారిటీ! | Saindhav Movie Director Funny Reply to A Scene In The Movie Goes Viral | Sakshi
Sakshi News home page

Saindhav Movie: 'అలా కాల్చితే వస్తుంది'.. ఆ సీన్‌పై డైరెక్టర్‌ అదిరిపోయే రిప్లై!

Published Thu, Jan 4 2024 7:21 PM | Last Updated on Thu, Jan 4 2024 9:33 PM

Saindhav Movie Director Funny Reply to A Scene In The Movie Goes Viral - Sakshi

టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైంధవ్‌. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేశ్ నటిస్తోన్న 75వ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదలవుతోంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెంచేసింది. 

ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్‌ చిత్రంగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్‌లో ప్రతి సీన్‌లో బుల్లెట్ల వర్షం కురిపించారు వెంకీమామ. ఇందులో ఓ సీన్ అయితే ఏకంగా పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. 
 
బుధవారం మేకర్స్ రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ ఆద్యంతం యాక్షన్‌ సీన్స్‌ను తలపించింది. అయితే ఒక్క సెకన్‌ కూడా చూపించని ఆ సీన్‌ పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ట్రైలర్‌లో ఓ రౌడీ నోట్లో తుపాకీ పెట్టిన వెంకటేశ్‌ అతన్ని కాల్చగా.. ఆ బుల్లెట్‌ ఏకంగా అతని మలద్వారం నుంచి బయటకు వచ్చినట్లు చూపించారు. తల వెనుక భాగం నుంచి రావాల్సిన బుల్లెట్ అలా ఎలా వెళ్లిందటూ నెటిజన్స్‌ షాకింగ్‌కు గురయ్యారు.

అంతే కాకుండా ఆ సీన్‌పై మీమ్స్‌ ఇక చెప్పాల్సిన పనిలేదు. గ్రాఫిక్స్ చేసి మరీ సీన్స్‌ వైరల్ చేస్తున్నారు. అయితే తాజాగా నెట్టింట వస్తున్న డైరెక్టర్‌ శైలేశ్ కొలను స్పందించారు. ఆ వీడియోను చూసిన ఆయన చాలా ఫన్నీగా ఉందంటూ ట్వీట్ చేశారు. బుల్లెట్‌ మలద్వారం నుంచి బయటకు వచ్చే విషయమై పూర్తి వివరణ ఇచ్చారు.

శైలేశ్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'హాహ్హా.. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఏ విషయమైనా చెప్పడానికి నేను ఇష్టపడతా. మామూలుగా నోట్లో తుపాకీ పెట్టి కాలిస్తే బుల్లెట్‌ తల వెనుక వైపు నుంచి బయటకు వస్తుంది. కానీ ఒక వ్యక్తిని ఒక కచ్చితమైన దిశలో కూర్చోబెట్టి.. గన్‌ బ్యారెల్‌ను వీలైనంతగా అతడి నోటి లోపలికి పెట్టి.. సుమారు 80 డిగ్రీల కోణంలో కాలిస్తే.. అతని అవయవాలను చీల్చుకుంటూ బుల్లెట్‌ బయటకు వస్తుంది.' అని రాసుకొచ్చారు.

అంతే కాకుండా.. 'మీరు ఆ బొమ్మలో చూపించినట్లు బుల్లెట్‌ శ్వాస కోశం, అన్నవాహిక, కాలేయం, పాంక్రియాస్‌, కొన్నిసార్లు గుండెను గాయం చేస్తుంది. ఆ తర్వాత పెద్ద, చిన్న ప్రేగులను చీల్చుకుంటూ మలద్వారం నుంచి బయటకు వస్తుంది. ఇలా షూట్‌ చేయడానికి చాలా నేర్పు కావాలి. సైకో స్పెషల్‌ స్కిల్‌ ఇది. థియేటర్‌లో ప్రేక్షకులను అలరించేందుకు మాత్రమే ఈ మాస్‌ మూమెంట్‌ క్రియేట్‌ చేశాం. కానీ మీరు షేర్ చేసిన వీడియో చాలా ఫన్నీగా ఉంది బ్రదర్..' అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. మరోవైపు డైరెక్టర్‌ శైలేశ్ వివరణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement