సుద్దాల అశోక్‌తేజ
‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను...’ (‘ఠాగూర్’ సినిమా) పాటతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న రచయిత సుద్దాల అశోక్‌తేజ. ఇటీవల ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకొచ్చాయి. వాటి గురించి అశో క్‌తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య మీడియాలో నేను పోయానని ఒకరు, విషమంగా ఉన్నానని మరొకరు మాట్లాడుతున్నారు. అవన్నీ పుకార్లే.
నాకు ఆపరేషన్ జరిగి దాదాపు 47 రోజులైంది. చక్కగా కోలుకుంటున్నాను. నేను బావుండాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి మామూలు మనిషి అవ్వాలని ఎంతోమంది స్నేహితులు, బంధువులు కోరుకున్నారు. అనారోగ్యం శరీరానికే కానీ, కవి మనసుకు కాదు. అది ఖాళీగా ఉండలేదు. అందుకే నేను ఈ అనారోగ్యం, కరోనా టైమ్‌లో కూడా రాస్తూనే ఉన్నాను. గతంలో నేను ‘శ్రమకావ్యం’ అని రాశాను. ఇప్పుడు ‘అరణ్య కావ్యం’ రాస్తున్నా. 70 నుండి 80 అధ్యాయాలు ఉండే పెద్ద కవిత ఇది.
దాని పేరు ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’. అడవి వల్ల ప్రపంచానికి ఎంత మేలు జరిగింది? అలాంటి అడవిని ఎన్ని రకాలుగా హింసించారు? అనే విషయాలను ప్రస్తావిస్తూ అడవి తన గోడు వెళ్లబోసుకుంటుంది. అడవి హింసించబడటం వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఆçస్పత్రిలో చేరకముందు, ఆపరేషన్ అయిన మూడో రోజు నుండే నేను ఈ కవితను రాస్తూ బిజీగా ఉన్నాను. ఇవికాకుండా నూతన నటీనటులతో వస్తున్న ‘సతి’ అనే సినిమాకి పాట రాశాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాపై ఏమైనా రూమర్స్ వస్తే నమ్మొద్దని అందరికీ తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment