పదేళ్ల పిల్లలు ఏం చేస్తారు? ఆడుతూ పాడుతూ..స్కూల్లో చెప్పిన పాఠాలను వల్లేవేస్తూ ఉంటారు. ఇది ఒకప్పటి మాట. టెక్నాలజీతో ఆడుతూ పాడుతూ ఆన్‌లైన్ గేమ్‌లతో బిజీగా ఉంటున్నారు నేటితరం పిల్లలు. ఐదోతరగతి చదువుతున్న వోరుగంటి తన్వి మాత్రం కవితలు రాస్తూ ఏకంగా ఒక బుక్‌ను çప్రచురించింది. ఎంత చదివినా తన్వి తీరనంతగా అందరినీ ఔరా అనిపిస్తోంది.
లాక్‌డౌన్ కాలంలో ఎక్కడివారు అక్కడే ఇళ్లలో ఉండిపోవలసి రావడంతో తమకు దొరికిన సమయాన్ని చాలా మంది రకరకాలుగా సద్వినియోగం చేసుకున్నారు. పదేళ్ల చిన్నారి తన్వి కూడా ఎవరికీ తీసిపోలేదు. తనకొచ్చిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చింది. చక్కటి కవితలుగా మార్చింది. ఇలా రాసిన కవితలను ‘ఫ్రం ది ఇన్‌సైడ్–ద ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పొయెట్’ పేరిట పుస్తకం విడుదల చేసింది. దీంతో అమెరికాలో అతిపిన్న రచయితల జాబితాలో నిలిచింది. మార్చి15న విడుదలైన ఈ బుక్ ప్రస్తుతం ఆన్‌లైన్ వేదికపై ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో దూసుకుపోతోంది.
ప్రపంచమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో అందరూ అనుభవించిన, ఎదుర్కొంటున్న సమస్యలు, చేస్తున్న ఆలోచనలు, కష్టాలను కవితల రూపంలో వివరిస్తోంది. ముఖ్యంగా భావోద్వేగాలు, బాధ, కోపం, విచారం, ఒంటరితనం, ఇష్టమైన వారిని కోల్పోవడం, లాక్‌డౌన్‌తో స్వేచ్ఛను కోల్పోవడం వంటి అనేక అంశాలను పుస్తకంలో తన్వి ప్రస్తావించింది. అంతేకాకుండా ప్రకృతిపట్ల మనం చూపాల్సిన ప్రేమ బాధ్యత, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు, మర్చిపోలేని బంధాలు... వంటివాటన్నిటì నీ కవితల ద్వారా వివరించింది. హ్యారీపోటర్ సీరిస్‌లను ఇష్టపడే తన్విని కవితలు రాయాలనే అభిరుచే రచయితగా మార్చిందని చెబుతోంది.
పదేళ్ల వయసులో బుక్ రాసిన తన్వి భారత సంతతికి చెందిన అమ్మాయి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌కు చెందిన మహేందర్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతుల ఏకైక సంతానమే తన్వి వోరుగంటి. ఐదోతరగతి చదువుతోన్న తన్వి వయసులో మాత్రమే చిన్నది. ఆలోచనల్లో ఒక రచయిత అంత వయసు తనది. అందుకే అందరు పిల్లల్లా వేసవి సెలవల్లో ఆడుకోలేదు తన్వి. తనకి ఎంతో ఇష్టమైన కవితలు రాస్తూ కాలం గడిపేది. అలా తాను రాసుకున్న కవితలన్నింటికి ఒక పుస్తకరూపం ఇవ్వడంతో అమెరికా లో యంగెస్ట్ రచయితల సరసన పదేళ్ల తన్వి నిలవడం విశేషం.
తన్వి మాటల్లోనే విందాం...‘‘నాపేరు తన్వి వోరుగంటి. నేను అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలోని చాడ్లర్ నగరంలో అమ్మానాన్నలతో ఉంటున్నాను. మా స్వస్థలం కరీంనగర్ అయినప్పటికీ నాన్న మహేందర్ రెడ్డి ఇంటెల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా, అమ్మ దీపిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండడంతో నేను ఇక్కడే పుట్టాను. రెండేళ్లకోసారి మాత్రమే ఇండియా వచ్చి తాతయ్య దగ్గర ఒక నెలరోజులు గడుపుతాము. నా కవితల ప్రస్థానం గతేడాది వేసవికాలం సెలవుల్లో మొదలైంది. సమ్మర్ హాలిడేస్‌లో టైమ్‌పాస్ కోసం కవితలు రాయం మొదలు పెట్టాను. అలా రాస్తూ రాస్తుండగానే నేను కవితలు రాస్తున్న విషయం అమ్మానాన్నలకు తెలియడంతో వారు కూడా నన్ను బాగా ప్రోత్సహించారు.
అంతేగాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా స్కూల్ టీచర్ల ప్రోత్సాహం తో నేను మరిన్ని కవితలు రాయగలిగాను. వారి సహకారంతో ఆ కవితలకు పుస్తకరూపం తీసుకు రాగలిగాను. అయితే పుస్తక ప్రచురణ ఏమంత సులభం కాలేదు. చాలా సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చింది. నామీద నాకు పూర్తిస్థాయిలో విశ్వాసం లేకపోవడం వల్ల బుక్ ముద్రించడానికి అర్హురాలినేనా అనిపించేది. పుస్తకాన్ని ముద్రించడానికి నా రచన సరిపోతుందా అనిపించేది. ఇలా ఎన్నో ఆలోచనలు, సందిగ్ధతల నడుమ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ.. తల్లిదండ్రుల సహకారంతో బుక్ పబ్లిష్ చేసాను. అయితే అందరూ అర్థం చేసుకునేలా అర్థవంతమైన కవిత్వం రాశానని మాత్రం చెప్పగలను’’ అని చెప్పింది ఆరిందలా.
‘‘కొత్తగా కవితలు రాయాలనుకుంటున్నవారు ముందుగా మిమ్మల్ని మీరు బాగా నమ్మండి. ఎప్పటికప్పుడు మీకు మీరే నేను చేయగలను అని చెప్పుకుంటూ ఉండాలి. అనుకున్న లక్ష్యాన్నీ చేరేందుకు కష్టపడాలి’’అని చెప్పింది. పిల్లలు, పెద్దల కోసం భవిష్యత్ లో రియలిస్టిక్ ఫిక్షన్ నావెల్స్ రాయాలనుకుంటున్నట్లు తన్వి వివరించింది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.
‘‘నా మనవరాలు చిన్నవయసులో కవితలు రాసి బుక్ పబ్లిష్ చేసే స్థాయికి ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. తన్వి అమెరికాలో పుట్టినప్పటికీ ఏడాదికోసారి ఇండియా రావడాన్ని ఎంతో ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచి తను చాలా కామ్‌గా ఉండే తత్వం. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది. ఎప్పుడూ ఆలోచిస్తూ తనకు నచ్చిన వాటిని చిన్న నోట్‌బుక్‌లో రాసి పెట్టుకునేది. రీడింగ్, రైటింగ్ అంటే తనకు ఎంతో ఇష్టం. స్కూల్లో టీచర్ల ప్రోత్సాహంతో మంచి వకాబులరీ నేర్చుకుంది. మా ఫ్యామిలీలో రచయితలు ఎవరూ లేరు. ఈ లోటును తన్వి తీర్చింది. తను ఇలానే మంచి మంచి రచనలు చేస్తూ..మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నాను. తన స్టడీస్‌తోపాటు రచయితల ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’’
–తన్వి తాతయ్య వోరుగంటి హనుమంత రెడ్డి, (కరీంనగర్ డెయిరీ అడ్వైజర్)
Comments
Please login to add a commentAdd a comment