తెలుగు పాఠకులకు హైకూలను పరిచయం చేసిన కవి, ఇస్మాయిల్ (1928–2003). ఆయన్ని తలచుకోగానే ఒక నిశ్శబ్దం ఆవరిస్తుంది. చిలుకలు వాలిన చెట్టు, చెట్టు నా ఆదర్శం, రాత్రి వచ్చిన రహస్యపు వాన, పల్లెలో మా పాత ఇల్లు ఆయన కవితా సంపుటాలు. కవిత్వంలో నిశ్శబ్దం, కరుణ ముఖ్యం ఆయన విమర్శా వ్యాసాలు. హైకూల పుస్తకం, కప్పల నిశ్శబ్దం.
కీచురాయి చప్పుడుతో
గదంతా నిండిపోయింది.
గదిలో నాకు చోటు లేదు.
కొండ మీది కర్రి మబ్బూ
దండెం మీది కాకీ
రెక్కలు తెగ దులుపుకుంటున్నాయి.
కోడిపుంజుల్ని
కోసుకు తినేశారు మా ఊరివాళ్లు.
ఇక తెల్లారకట్ట రైలు మిగిలింది.
తలకి మబ్బూ
కాళ్లకి సరస్సూ తొడుక్కోకపోతే
కొండ కొండే కాదు.
దారి పొడుగుతూ
రైలు చక్రాలు
నీ పేరే ఉచ్చరించాయి.
లాంతరు వెలుతుర్లో
పాప చదువుకుంటోంది
ఎవరు ఎవర్ని వెలిగిస్తున్నారు?
ఈ బాట మీద
ఎవ్వరూ నడవగా చూడలేదు.
ఇదిక్కడికి ఎలా వచ్చింది?
బోటుని
దాని నీడకి కట్టేసి
పడవ సరంగు ఎటో పోయాడు.
ఈ చెట్టు కింద రోజూ నిలబడతాను.
చెట్టుకి నా పేరు తెలుసా?
నేను దాని పేరడిగానా?
అర్ధరాత్రివేళ
కప్పల నిశ్శబ్దానికి
హఠాత్తుగా మెలకువొచ్చింది.
-ఇస్మాయిల్
Comments
Please login to add a commentAdd a comment