కవిత్వం ఉద్దేశం మనుషులందరినీ ఏకం చేయడమే | The purpose of poetry is to unite all humans | Sakshi
Sakshi News home page

కవిత్వం ఉద్దేశం మనుషులందరినీ ఏకం చేయడమే

Published Sat, Mar 25 2017 2:03 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

The purpose of poetry is to unite all humans

► ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
► ఘనంగా ప్రారంభమైన జాతీయ సదస్సు
 
కడప: ప్రపంచంలోని మనుషులందరినీ ఏకం చేయడమే కవిత్వం ఉద్దేశమని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధనా కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం స్థానిక బ్రౌన్‌ గ్రంథాలయంలో 70 ఏళ్ల భారత స్వాతంత్య్రం–తెలుగు కవిత్వం అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. తొలిరోజు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రానికి ముందు జాతీయోద్యమ కవిత్వం సాగిందని, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రజలు చేస్తున్న పోరాటానికి ఊతం ఇచ్చిందన్నారు. సబాధ్యక్షుడు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిణామాలను కవిత్వం ప్రతిబింబించిందన్నారు. కవిత్వం కన్నా జీవితం ముఖ్యమైనదని, అణిచివేతకు గురైన వారి జీవితాలను ప్రతిబింబించే దిశగా కవిత్వం నిరంతరాయంగా సాగుతోందన్నారు.  సభలో కీలకోపన్యాసం చేసిన ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ సంచాలకులు ఆచార్య యలవర్తి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ సమస్యలున్నంత వరకు కవిత్వం ఉంటుందని, కాలానికి, అవసరానికి అనుగుణంగా రూపాలు, వాదాలు వేరుగా మారినా లక్ష్యం మాత్రం ప్రజాశ్రేయేస్సుగానే సాగిందన్నారు 
 
‘కవి సంధ్య’ ఆవిష్కరణ: 
విశిష్ట అతిథిగా హాజరైన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు, ప్రముఖ కవి శిఖామణి (కె.సంజీవరావు) సంపాదకత్వంలో వెలువడుతున్న ‘కవి సంధ్య’ ద్వైమాస పత్రికను అతిథులతో ఆవిష్కరింపజేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన వైవీయూ కుల సచివులు ఆచార్య వై.నజీర్‌ అహ్మద్‌ సదస్సు ధ్యేయాన్ని వివరించారు. సదస్సు సంచాలకులు, బ్రౌన్‌ గ్రంథాలయ బాధ్యులు డాక్టర్‌ ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి రెండు రోజుల సదస్సు గురించి వివరించారు.

సదస్సులో కవి కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కవి దుబ్బలదాస్, బుక్కసముద్రానికి చెందిన సమీవుల్లా, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.వెంకట కృష్ణారెడ్డి, డాక్టర్‌ పీసీ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ ఎం.హరికృష్ణ, ద్రవిడ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, వైవీయూకు ఆచార్యలు తప్పెట రాంప్రసాద్‌రెడ్డి, డాక్టర్‌ ఎంఎం వినోదిని, డాక్టర్‌ రమాదేవి, డాక్టర్‌ పార్వతి, కె.గంగయ్య, డాక్టర్‌ 
మూల మల్లికార్జునరెడ్డి, డాక్టర్‌ సంజీవమ్మ, డాక్టర్‌ టక్కోలు మాచిరెడ్డి, కవి లోసారి సుధాకర్‌ (డీఎస్పీ), జానమద్ది విజయభాస్కర్, పాలగిరి విశ్వప్రసాద్, కె.చెంచిరెడ్డి,  పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement