Sahitya Akademi
-
నిండైన పదజాలం గోరా శాస్త్రి సొంతం
హైదరాబాద్: సంపదను ప్రతిఒక్కరూ రూపాయల్లోనే లెక్కిస్తారని, కానీ దానిని నిండైన పదజాలంతో అక్షరాల్లో లెక్కించిన సాహితీమూర్తి గోవిందు రామశాస్త్రి(గోరా శాస్త్రి) అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. సంపదను అక్షరాలతో లెక్కించేవారిని ప్రపంచం గుర్తిస్తుందని, అదే మార్గంలో గోరా శాస్త్రిని నేటికీ స్మరించుకుంటున్నా మని అన్నారు. సాహిత్యఅకాడమీ, వయోధిక పాత్రికేయ సంఘం సంయుక్తంగా శనివారం ఇక్కడి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన గోరా శాస్త్రి శతజయంతి ఉత్సవాలకు వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘గోరా శాస్త్రి అంటే సంపాదకీయాలు, సంపాదకీయాలంటే గోరా శాస్త్రి’అన్నంతగా పేరు సంపాదించుకున్నారని, అలాంటివారిని గౌరవించుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం మీద మక్కువ చూపించే పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదిలి జర్నలిజం, సాహిత్యం మీద ఆయన ఆసక్తి కనబరిచారని, తెలుగు, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో సంపాదకీయాలు రాసి సాహితీ సవ్యసాచిగా పేరు సంపాదించుకున్నారని అన్నారు. ఆయన సంపాదకీయాలను పాఠకులు జ్ఞానసంపాదనామార్గాలుగా భావించేవారని గుర్తుచేశారు. ఈ తరం జర్నలిస్టులకు ఇలాంటి ఆదర్శప్రాయుడి జీవితాన్ని, సంపాదకీయాలను పాఠాలుగా బోధించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో స్వతంత్ర పత్రికకు పనిచేసిన ఆయన ఆ తర్వాత ఆంధ్రభూమి సంపాదకుడిగా తెలుగు ప్రజలకు చేరువయ్యారని పేర్కొన్నారు. ఆయన సంపాదకీయాల కోసమే ఆ రోజుల్లో పత్రికలను కొనేవారన్నారు. నిజాన్ని నిష్కర్షగా రాయడం ఆయన ప్రత్యేకత అని, హాస్యాన్ని, వ్యంగాన్ని, విమర్శను సమపాళ్లలో కలుపుతూ రాయడం ఆయనకే సాధ్యమైందని అన్నారు. కలగూరగంప పార్టీలు ఓ విచిత్రమైన సమాఖ్య అని గోరా శాస్త్రి ఏనాడో చెప్పారని, అది నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు. అమ్మమ్మ ఇంటికి వచ్చినట్టుగా ఉంది తెలుగు పాత్రికేయులందరినీ ఇలా ఒకేచోట కలవడం ఆనందంగా ఉందని, అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లుగా అనుభూతి కలుగుతోందని వెంకయ్యనాయుడు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుగుభాషకు, పాత్రికేయవృత్తికి మరింత గౌరవం తెచ్చిపెడతాయని అభిప్రాయపడ్డారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సాహిత్యానికే ఉందని, ముఖ్యంగా మాతృభాషాసాహిత్యం మనగతాన్ని తెలియజేస్తుందని, ఇప్పుడు పత్రికల్లో సాహిత్యం కరువైందని అన్నారు. ఈ సందర్భంగా గోరా శాస్త్రి సంపాదకీయాల సంకలనం ‘వినాయకుడి వీణ’ పుస్తకం, మోనోగ్రాఫ్ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి కె. శివారెడ్డి, సాహిత్యఅకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు జి.ఎస్.వరదాచారి, కె.లక్ష్మణ్రావుసహా పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. -
తెలుగు సాహితీ సుక్షేత్రం తెలంగాణ..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలతో తెలుగు భాషా వైదుష్యాన్ని, విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తామని.. తెలంగాణ సంస్కృతి కళావైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఈ మహాసభలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శుక్రవారం శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభల అంశంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఆ ప్రకటన పూర్తి పాఠమిదీ.. సాహిత్య వారసత్వానికి ప్రతీకలెందరో.. తేట తెనుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోన బుద్ధారెడ్డి వెలువరించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి ద్విపద కావ్యం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వాసి అయిన పొన్నగంటి తెలగన రచించిన యయాతి చరిత్రం తొలి అచ్చతెలుగు కావ్యం. సకల నీతి సమ్మతం అనే తొలి నీతి గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి. తొలి కథా సంకలన కావ్యం సింహాసన ద్వాత్రింశికను రచించిన కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీంగల్ నివాసి. చాటుపద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ భీమకవిది వేములవాడ. ‘వాణి నా రాణి’అని ప్రకటించిన ‘జైమినీ భారత’కర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్లగొండ జిల్లా వాసి. రాచకొండను ఏలిన సర్వజ్ఞ సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు కవిరాజు కూడా. తెలుగువారి పుణ్యపేటిగా భావించిన బమ్మెర పోతన రచించిన ‘శ్రీమద్భాగవతం’మధురభక్తికి, మంజుల పద విన్యాసానికి, మనోహరమైన అలంకారిక శైలికి ఆలవాలమై అజరామర కీర్తిని పొందింది. ఆ మహనీయుడు జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక. ద్వ్యర్థి, త్య్రర్థి, చతుర్థి కావ్యాలు చిత్రబంధ అవధాన పద్య విద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది. జానపద జీవధారలకు పుట్టినిల్లు.. శిష్ట సాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు. నిరక్షరాస్యులైన శ్రామిక జనుల నోటినుంచి ఆశువుగా వెలువడి అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న సజీవ నిధులు. నాటు పాటలు, రాటు పాటలు, మోట పాటలు, కల్లాల దగ్గర పాడుకునే పాటలు, దంపుడు పాటలు, ఇసుర్రాయి పాటల్లో పల్లె జనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది. వివిధ పండుగల సందర్భంగా సామూహికంగా ఆడిపాడే బతుకమ్మ పాటలు, కాముని పున్నమి పాటలు, అసోయ్ దూలా అని పాడే పీరీల పాటలు ప్రజల సంఘ జీవన సంస్కృతిని చాటుతున్నాయి. ఒకతరం నుంచి మరొక తరానికి సజీవమైన తెలుగు పద సంపదను, నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి. చిరుతల రామాయణం, హరికథ, యక్షగానాలు, ఒగ్గుకథలు, బుడిగ జంగాల శారద కథలు, బాలసంతుల పాటల ఇంకా ఎన్నో విశిష్ట విలక్షణ కళారూపాలలో నిండుగా పండిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది.. కొత్త తరానికి ప్రేరణగా.. ఈ సభల సందర్భంగా నిర్వహించే సదస్సులు తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిపైనా కూలంకషంగా చర్చిస్తాయి. గత వైభవాన్ని ఘనంగా తలుచుకుంటూనే వర్తమానాన్ని విశ్లేషిస్తాయి. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. కొత్త పరిశోధనలకు నాంది పలుకుతాయి. సభల్లో ఏర్పాటు చేసే కళా ప్రదర్శనలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దర్శింపజేస్తాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన సాహిత్యరస హృదయులందరూ ఒకే చోట చేరడంతో.. వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు, సుహృద్భావనలు నెలకొంటాయి. ఈ సభలు కొత్త తరానికి తెలంగాణ తెలుగు సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు నూతనోత్తేజాన్ని, ప్రేరణను కలుగజేస్తాయి. సభల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేసింది. సన్నాహక సమావేశాల కోసం ప్రతి జిల్లాకు రూ. 5 లక్షలు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు తెలంగాణ సాహిత్య విశేషాలపై వ్యాస రచన, వక్తృత్వం, పద్య పఠనం, కవితా రచన తదితర అంశాల్లో పోటీల నిర్వహణ ప్రారంభమైంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లోనూ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశాలు జరిగాయి. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు వారు నివాసముంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నాం. మీ ప్రాంత సాహిత్యాన్ని వెలుగులోకి తెండి గౌరవ శాసన సభ్యులకు నేను ప్రత్యేకంగా ఒక విషయం మనవి చేయదల్చుకున్నాను. మీ ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్యం మీద దృష్టి సారించండి. మీ ప్రాంత సాహిత్యానికి ఉన్న ప్రత్యేకతలను, అజ్ఞాతంగా ఉన్న విశేష రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి దృష్టికి తీసుకురావాలి. ఆయన ఆ సాహిత్య విశేషాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. శాసనసభ్యులతో పాటు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావించాలని కోరుతున్నా.. సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, భాషా ప్రేమికులు గుండెల నిండా జరుపుకొనే ఈ తెలుగు పండుగలో అందరూ ఉత్సాహంతో పాల్గొనాలి. ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలి..’’ రాష్ట్ర ప్రత్యేకత చాటేలా ఏర్పాట్లు.. తెలుగు మహాసభల ప్రారంభ, ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు జాతీయ ప్రముఖులు విచ్చేయబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చే వారికి నివాసం, భోజనం, స్థానిక రవాణా సదుపాయాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. అతిథి మర్యాదల్లో తెలంగాణ ప్రత్యేకత చాటే విధంగా చక్కని ఏర్పాట్లు చేస్తున్నాం. సభల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించేవారు. రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదా ప్రత్యేక వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. సమైక్య రాష్ట్రంలో మసకబారిన తెలంగాణ ప్రశస్తి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తి మసకబారింది. పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రనే చరిత్రగా చలామణి అయింది. మన సాహితీమూర్తుల కృతులు మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయాయి. వేములవాడ భీమకవి, బమ్మెర పోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల చరిత్ర వక్రీకరణకు గురైంది. ఒక దశలో తెలంగాణలో కవులే లేరన్న స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలూ చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంలోనే మహోన్నత చారిత్రక పరిశోధకుడు, తెలుగు సాహిత్య శిఖరంగా వెలుగొందిన కవి సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలన్న సంకల్పంతో శ్రమకోర్చి... తెలంగాణ నలుచెరగులా తిరిగి 354 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచికను వెలువరించారు. అది మన తెలంగాణ స్వాభిమాన ప్రతీక, సాహిత్య జయపతాక. జలపాత సదృశమైన ధారతో అద్భుతమైన ప్రౌఢిమతో అగ్నిధార, రుద్రవీణ వంటి పద్యకావ్యాలను సృజించిన మహాకవి దాశరథి ‘నా తెలంగాణ తల్లి కంజాతవల్లి’అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించారు. ‘భూగర్భమున గనులు, పొంగిపారే నదులు నా తల్లి తెలంగాణరా, వెలలేని నందనోద్యానమ్మురా’అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెళ్ల వెంకటరామారావు తెలంగాణ తల్లి యశస్సును అద్భుతంగా గానం చేశారు. ప్రజాకవి కాళోజీ తన కవితలలో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పదనాన్ని ప్రకటిస్తూనే తెలంగాణ ప్రజల తెలుగును వెక్కిరించిన వారికి దీటైన సమాధానమిచ్చారు. తెలుగు సాహితీ సుక్షేత్రం తెలంగాణ.. ‘‘తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలనే ఆశయంతో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. అజంత భాషగా, సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగు కీర్తి పొందింది. నికోలస్ కాంటే అనే పాశ్చాత్య పండితుడు తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’గా కొనియాడారు. తమిళ జాతీయకవి సుబ్రమణ్య భారతి తెలుగు భాషను ‘సుందర తెలుంగు’అని కీర్తించారు. మన తెలంగాణ ప్రాచీన కాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపద వెలుగొందిన సాహితీ సుక్షేత్రం. తెలంగాణలో రెండు వేల ఏళ్లకు పూర్వం నుంచే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్దానికి చెందిన హాలుని గాథాశప్తశతిలో తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కురిక్యాల దగ్గర బొమ్మలగుట్టపై ఉన్న జినవల్లభుడి శాసనం కంద పద్యాలతో ఉండటం విశేషం. దాన్నిబట్టి క్రీస్తుశకం 947 సంవత్సరం నాటికే తెలంగాణలో ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటిచెప్తోంది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీ ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. ‘ఉరుతర గద్యపద్యోక్తుల కన్న సరసమై పరగిన జానుతెనుగులో కావ్య సృష్టి చేస్తా’నని ప్రతిజ్ఞ చేసి అచ్చ తెలుగు పలుకుబడికి పట్టంకట్టిన పాల్కూరికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసే. తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది. తెలుగులో తొలి స్వతంత్ర రచన బసవ పురాణం, తొలి శతకం వృషాధిప శతకం, తొలి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం పాల్కురికి సోమన వెలువరించిన కావ్య రత్నాలు. సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తర్వాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి. దీన్ని బట్టి తెలుగు భాషా సాహిత్య ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదాంశం. తెలుగును విశ్వవ్యాప్తం చేద్దాం.. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు తమపై అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలియజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృత నిశ్చయంతో కృషి చేస్తోంది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరగాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ అధ్యక్షులుగా ప్రసిద్ధ తెలంగాణ కవి నందిని సిధారెడ్డిని నియమించి సారథ్య బాధ్యతలు వారికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే ప్రతీ విద్యార్థిం ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విధిగా తెలుగు భాషను అభ్యసించాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందరికీ ఇదే మా ఆహ్వానం తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాం. లాల్ బహదూర్ స్టేడియం ప్రధాన వేదికగా.. రవీంద్ర భారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, పలు ఇతర వేదికలుగా మహాసభలు వైభవంగా జరుగబోతున్నాయి. తెలంగాణ సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన మహాకవుల పేరున తోరణాలు, ద్వారాలు, హోర్డింగులను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాం. మహాసభల్లో పాల్గొనడం కోసం రాష్ట్రంలోని తెలుగు భాషాభిమానులతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడిన తెలుగు భాషా ప్రేమికులందరికీ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. -
కవిత్వం ఉద్దేశం మనుషులందరినీ ఏకం చేయడమే
► ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ► ఘనంగా ప్రారంభమైన జాతీయ సదస్సు కడప: ప్రపంచంలోని మనుషులందరినీ ఏకం చేయడమే కవిత్వం ఉద్దేశమని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అన్నారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం స్థానిక బ్రౌన్ గ్రంథాలయంలో 70 ఏళ్ల భారత స్వాతంత్య్రం–తెలుగు కవిత్వం అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. తొలిరోజు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రానికి ముందు జాతీయోద్యమ కవిత్వం సాగిందని, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ప్రజలు చేస్తున్న పోరాటానికి ఊతం ఇచ్చిందన్నారు. సబాధ్యక్షుడు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం జరిగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిణామాలను కవిత్వం ప్రతిబింబించిందన్నారు. కవిత్వం కన్నా జీవితం ముఖ్యమైనదని, అణిచివేతకు గురైన వారి జీవితాలను ప్రతిబింబించే దిశగా కవిత్వం నిరంతరాయంగా సాగుతోందన్నారు. సభలో కీలకోపన్యాసం చేసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీ సంచాలకులు ఆచార్య యలవర్తి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ సమస్యలున్నంత వరకు కవిత్వం ఉంటుందని, కాలానికి, అవసరానికి అనుగుణంగా రూపాలు, వాదాలు వేరుగా మారినా లక్ష్యం మాత్రం ప్రజాశ్రేయేస్సుగానే సాగిందన్నారు ‘కవి సంధ్య’ ఆవిష్కరణ: విశిష్ట అతిథిగా హాజరైన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు, ప్రముఖ కవి శిఖామణి (కె.సంజీవరావు) సంపాదకత్వంలో వెలువడుతున్న ‘కవి సంధ్య’ ద్వైమాస పత్రికను అతిథులతో ఆవిష్కరింపజేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన వైవీయూ కుల సచివులు ఆచార్య వై.నజీర్ అహ్మద్ సదస్సు ధ్యేయాన్ని వివరించారు. సదస్సు సంచాలకులు, బ్రౌన్ గ్రంథాలయ బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి రెండు రోజుల సదస్సు గురించి వివరించారు. సదస్సులో కవి కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కవి దుబ్బలదాస్, బుక్కసముద్రానికి చెందిన సమీవుల్లా, అంబేడ్కర్ విశ్వవిద్యాలయ సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్.వెంకట కృష్ణారెడ్డి, డాక్టర్ పీసీ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎం.హరికృష్ణ, ద్రవిడ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, వైవీయూకు ఆచార్యలు తప్పెట రాంప్రసాద్‌రెడ్డి, డాక్టర్ ఎంఎం వినోదిని, డాక్టర్ రమాదేవి, డాక్టర్ పార్వతి, కె.గంగయ్య, డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, డాక్టర్ సంజీవమ్మ, డాక్టర్ టక్కోలు మాచిరెడ్డి, కవి లోసారి సుధాకర్ (డీఎస్పీ), జానమద్ది విజయభాస్కర్, పాలగిరి విశ్వప్రసాద్, కె.చెంచిరెడ్డి, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
రచయిత్రి ఓల్గాకు సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఆమె రచించిన కథల సంపుటి ‘విముక్త’కు గాను గత డిసెంబరులో ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. సాహిత్య అకాడమీ 2015వ సంవత్సర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం స్థానిక ఫిక్కీ ఆడిటోరియంలో నిర్వహించారు. ప్రముఖ రచయిత, పద్మభూషణ్ గోపీచంద్ నారంగ్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. 24 భారతీయ భాషల్లో ఉత్తమ రచనలు చేసిన రచయితలకు ఈ అవార్డులు అందజేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ, కార్యదర్శి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అవార్డు స్వీకరించిన సందర్భంగా రచయిత్రి ఓల్గాను కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మంగళవారం ఇక్కడ కలిసి అభినందించారు. నాలుగు దశాబ్దాల కిందటే సహజ, స్వేచ్ఛ వంటి నవలల ద్వారా తెలుగు సాహిత్యంలో ఆమె తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ‘విముక్త’ రచించినందుకు ఓల్గాకు, అదే నవలను తమిళంలో ‘మిత్చీ’ పేరుతో అనువదించిన తమిళ రచయిత్రి గౌరీ కిరుబనందన్కు కూడా సాహిత్య అకాడమీ అనువాద అవార్డు లభించడం విశేషమని తెలిపారు. -
సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న పసునూరి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని రచయిత పసునూరి రవీందర్ అందుకున్నారు. బుధవారం జరిగిన సాహిత్య అకాడమీ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ చేతుల మీదుగా పురస్కారాన్ని, రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందుకున్నారు. తెలంగాణ దళిత కథల సంకలనం 'ఔట్ ఆఫ్ కవరేజి ఏరియా'కు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు స్వీకరించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న అసహన పరిస్థితుల నేపథ్యంలో కొందరు సాహిత్య అవార్డులు వెనక్కి ఇచ్చారని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించి లౌకిక ప్రజాస్వామిక విధానాలకు మద్దతివ్వాలన్నారు. -
పునరావిష్కరించుకోండి
♦ సాహిత్య అకాడమీకి రచయితల వినతి ♦ బీజేపీ తమ వారిని అదుపులో పెట్టుకోవాలని సూచన న్యూఢిల్లీ: భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిని ఖండిస్తూ.. ఇటీవల జరిగిన అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా.. సాహిత్య అకాడమీని పునరావిష్కరించుకోవాలని రచయితలతోపాటు.. అవార్డులను వెనక్కిన వారంతా కోరారు. అకాడమీ రాజ్యాంగంలో చేయాల్సిన మార్పులపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ.. రచయిత్రి నయనతార సెహెగల్ సహా 41 మంది రచయితలు, కళాకారులు అకాడమీకి లేఖ రాశారు. రచయితల నిర్ణయానికి మద్దతుగా అక్టోబర్ 23న అకాడమీ ప్రకటన చేయడం తెలిసిందే. అయితే అకాడమీ నిర్ణయం ఆలస్యంగా వచ్చిందన్న విమర్శలు వచ్చినప్పటికీ.. ఇకనైనా దేశంలోని రచయితల మనోభావాలకు అనుగుణంగా రాజ్యాంగం ఉందా అనే విషయంపై అకాడమీ పునరాలోచన చేయాలని కోరారు. ‘భారత్‌లో పరిస్థితులు చేజారుతున్నాయనే పరిస్థితి కలగొద్దనేదే మా అభిప్రాయం. దేశంలో ఎవరి హక్కులకు భంగం వాటిల్లకూడదు. రోజురోజుకూ దేశంలో కుల వ్యవస్థ మరింత లోతుగా చొచ్చుకు పోతోంది. దీని వల్లే సమస్యలు వస్తున్నాయి. తాజా పరిస్థితులతో.. దీనిపై చర్చించి పరిష్కరించే అవకాశమే ఉండటం లేదు’ అని ప్రజలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తన మందీ మార్బలాన్ని అదుపులో పెట్టకుండా.. ఈ ఘటనలను ‘కృత్రిమంగా సృష్టిస్తున్న వివాదం’గా పేర్కొనటం సరికాదని విమర్శించారు. కాగా, రచయితలు, మేధావులు అసహనంపై చేస్తున్న ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తేవడానికి కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ వారంఆయనను కలవనున్నారు. -
కల్బుర్గి హత్యను ఖండించిన అకాడమీ
♦ అలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టాలి ♦ అవార్డులు వెనక్కి తీసుకోవాలని రచయితలకు విజ్ఞప్తి న్యూఢిల్లీ: రచయిత కల్బుర్గి హత్యను కేంద్ర సాహిత్య అకాడమీ ఏకగ్రీవంగా ఖండించింది. అలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఓ తీర్మానం చేసింది. అవార్డులను వెనక్కిచ్చిన రచయితలు తిరిగి తీసుకోవాలని, అకాడమీ పదవులకు రాజీనామా చేసిన సభ్యులు వాటిని వెనక్కి తీసుకోవాలని కోరింది. కల్బుర్గి హత్య నేపథ్యంలో రచయితలు నిరసన తెలిపి,అవార్డులను వెనక్కి ఇస్తుండడంతో శుక్రవారం అకాడమీ అత్యవసరంగా సమావేశమైంది. భేటీ వివరాలను అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు కృష్ణస్వామి నచిముతు వెల్లడించారు. ఈ పరిస్థితిపై డిసెంబర్ 17న భేటీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అకాడమీ సమావేశం నేపథ్యంలో... దేశవ్యాప్తంగా వివిధ భాషా రచయితలు నలుపు వస్త్రాలను నోటికి కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. రచయితలపై అసహన వైఖరి మారాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అకాడమీకి ఒక మెమొరాండం ఇచ్చారు. మరోవైపు ఈ నిరసనకు పోటీగా కొందరు రచయితలు మరో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రచయితలు అవార్డులను వెనక్కి ఇచ్చేయడమనేది దురుద్దేశపూరిత చర్య అంటూ అకాడమీకి మెమొరాండం సమర్పించారు. రచయితల ఆందోళనకు అకాడెమీ మద్దతు తెలపటాన్ని స్వాగతిస్తున్నానని రచయిత విక్రమ్ సేథ్ తెలిపారు. -
వెయ్యి నవలల చెయ్యి
అరవై ఏళ్ళ క్రితం ఆయన రచనలంటే తెలుగు పాఠకులకు వేలంవెర్రి. నెల తిరిగే లోపలే పదే పదే ముద్రణకు వచ్చిన ఆయన నవలలు కొల్లలు. రచననే వృత్తిగా చేసుకొని, వెయ్యికి పైగా నవలలు రాసి, సామాన్యుల్లో పఠనాభిలాషను పెంచి, పుస్తకాలకు పాఠకలోకాన్ని అందించిన ఆ తెలుగు రచయిత - కొవ్వలి లక్ష్మీనరసింహారావు. పాపులర్‌గా... కొవ్వలి! ఏడాదికి వంద నవలల చొప్పున రాసి, 30వ ఏటకే 600 నవలలు పూర్తిచేసిన ఘనత కొవ్వలిది. ఆయన రచనలపై సాహిత్య అకాడెమీ, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ రేపు హైదరాబాద్‌లో ‘చర్చా సదస్సు’ నిర్వహిస్తున్నాయి. సందర్భంగా కొవ్వలి రెండో కుమారుడు, రిటైర్డ బ్యాంక్ అధికారి లక్ష్మీనారాయణ పంచుకున్న కొన్ని జ్ఞాపకాలు... కొవ్వలి లాంటి సుప్రసిద్ధుడికి సంతానమైనందుకు మా తోబుట్టువులం నలుగురం ఇవాళ్టికీ ఎంతో గర్విస్తుంటాం. వెనక్కి తిరిగి చూస్తే - నాన్న జీవితం, రచనా జీవితం గమ్మత్తుగా సాగాయనిపిస్తుంది. ఆయన పుట్టింది నూట రెండేళ్ళ క్రితం జూలై 1వ తేదీన తూర్పు గోదావరి జిల్లా తణుకులో! మా తాతయ్య ప్లీడరు గుమస్తా. రెండేళ్ళ వయసులోనే తల్లి పోవడంతో, అక్కల దగ్గరే నాన్న పెరిగారు. రాజమండ్రిలోని వీరేశలింగం హైస్కూల్లో మెట్రిక్ చదివే రోజుల్లో ప్రముఖులు జయంతి గంగన్న హెడ్మాస్టర్, ‘హాస్యబ్రహ్మ’ భమిడిపాటి కామేశ్వరరావు లెక్కల మాస్టారు.. నాన్నను తీర్చిదిద్దినవారు ఆ ఇద్దరూ! నాన్న రచనలు చేయడానికి స్ఫూర్తినిచ్చిన సంఘటన ఒకటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర పోడూరులో నాన్న, వాళ్ళ అక్కయ్య పోడూరి కామేశ్వరమ్మ దగ్గర ఉన్న రోజులవి. ఒకరోజున ఒక ఇల్లాలు ఇంట్లో చంటి పిల్లాడు మలవిసర్జన చేస్తే, ఒక కావ్యంలోని కాగితం చించి, దాంతో శుభ్రం చేసి, కిటికీలో నుంచి పారేయడం నాన్న కంట పడింది. అర్థం కాని ఆ గ్రాంథిక భాష, విషయం వల్ల ఆ పని చేసినట్లు ఆ ఇల్లాలు చెప్పడంతో నాన్నలో ఆలోచన మొదలైంది. వెంటనే ఆయన ఇల్లొదిలి, ఏడాది పాటు దేశాటన చేశారు. ఎలాంటి భాషతో, ఏ విషయాల మీద రాస్తే సాహిత్యం జనానికి చేరుతుందని అందరినీ అడిగి ఒక అభిప్రాయానికి వచ్చారు. తిరిగొచ్చాక 23వ ఏట 1935లో తొలి నవల ‘పల్లెపడుచులు’ రాశారు. వాడుక భాష, ఆకర్షణీయమైన శైలితో సాగిన ఆ సాంఘిక నవలకు మంచి స్పందన రావడంతో వరుసగా నవలలు రాసుకుంటూ వెళ్ళారు. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ, వితంతు పునర్వివాహాలను సమర్థిస్తూ, స్త్రీ స్వేచ్ఛను ప్రతిపాదిస్తూ, సంఘ సంస్కరణ దృష్టితో ఆయన రాసిన నవలలు కొద్ది రోజుల్లోనే ఆకట్టుకున్నాయి. మూడు పదుల వయసొచ్చేనాటికి 600 నవలలు రాశారాయన. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం, అపరాధ పరిశోధన - ఇలా అన్ని కోవల రచనలూ ఆయన చేశారు. అతి తక్కువ ధరకే పుస్తకాలివ్వాలని తపించారు. నాన్న అధిక శాతం నవలలు రాసింది ఏలూరు, రాజమండ్రిల్లో! సినిమా వాళ్ళ పిలుపు మేరకు మద్రాసుకు వెళ్ళాక, ‘భయంకర్’ అనే కలం పేరుతో డిటెక్టివ్ రచనలు చేశారు. నిజానికి, నాన్నకు సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. సినిమావాళ్ళు బలవంతపెట్టడంతో మద్రాసుకు వెళ్ళారు. నటి కన్నాంబ సొంత చిత్రాలు నిర్మించ తలపెట్టినప్పుడు మొదటి సినిమా ‘తల్లిప్రేమ’ (1941)కు నాన్నతోనే రాయించారు. అది ఆయన తొలి సినీ రచన. తరువాత డి.ఎల్. నారాయణ ‘వినోదా’ సంస్థను స్థాపించి, సినిమాలు తీస్తూ, నాన్న గారి ‘మెత్తని దొంగ’ నవల ఆధారంగా ‘శాంతి’ చిత్రం నిర్మించారు. ఆ చిత్రం పేకేటి శివరామ్ తొలి సినిమా. అలా 1950ల నుంచి మద్రాసులో నాన్న స్థిరపడ్డారు. కైకాల సత్యనారాయణ తొలి చిత్రం ‘సిపాయి కూతురు’ నాన్న నవలే. నాన్న రచనలంటే నటి సూర్యకాంతం గారికి మహా ఇష్టం. ఆయన తన వెయ్యో నవల ‘మంత్రాలయ’ను ఆమెకే అంకితమిచ్చారు. ఆ సభలో నేపథ్య గాయకుడు పి.బి. శ్రీనివాస్ వచ్చి, ఉచితంగా పాట కచ్చేరీ చేశారు. అలాగే, నాన్నకి మద్రాసులో షష్టిపూర్తి జరుగుతుంటే, ఆ విషయం వార్తాపత్రికల ద్వారా తెలుసుకొని, గాయకులు ఘంటసాల స్వయంగా వచ్చారు. ‘‘కొవ్వలి గారి షష్టి పూర్తి అంటే దేవుడి పెళ్ళి లాంటిది. దానికి ఎవరూ రమ్మని ప్రత్యేకించి, ఆహ్వానించనక్కర లేదు’’ అంటూ శాలువా కప్పివెళ్ళారు. నటులు సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, చిత్తూరు నాగయ్య గార్లు మేమంటే అభిమానం చూపేవారు. నాన్న గారు పోయాక ఆ మధ్య తిరుమలలో వెంకన్న కల్యాణం చేయించుకొని, మద్రాసుకు కుటుంబ సమేతంగా వెళుతున్నాను. ఆ రోజున మా సీట్ల వెనకాలే బాపు - రమణలు కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి ‘కొవ్వలి గారి అబ్బాయి’నంటూ పరిచయం చేసుకున్నా. బాపు ఎంతో సంతోషించారు. ముళ్ళపూడి వారైతే లేచి నిల్చొని, ‘తెలుగు రచయితలకు పాఠకుల భిక్ష పెట్టింది మీ నాన్న గారే!’ అంటూ నమస్కరించారు. నాన్న రచనా వారసత్వం పిల్లలెవరికీ రాకపోయినా, ఆ రోజుల్లో ఆయన మీద ప్రముఖులకున్న గౌరవం ఇవాళ్టికీ మాకు మిగిలిన అపురూప వారసత్వం. ఆత్మాభిమానంతో, ఎవరినీ ఏ సాయం అడగని తత్త్వం వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందుల పాలైనా మమ్మల్ని మంచి పౌరులుగా నాన్న పెంచారు. నాన్న నవలల జాబితా మొత్తం మా దగ్గర ఉంది. మొత్తం వెయ్యిన్నొక్క నవలలు. అయితే, మొదటి నుంచి రచనల్ని భద్రపరుచుకొనే అలవాటు నాన్నకు లేదు. దాంతో, తొలి రోజుల్లో రాసిన నవలలు కొన్ని వందలు మా దగ్గర లేవు. పెళ్ళయిన తరువాత నుంచి మా అమ్మ ప్రతి నవల కాపీ భద్రంగా దాచేది. అలా మా దగ్గర ఇప్పటికి అయిదారొందల నవలలే ఉన్నాయి. మిగిలినవి సేకరిస్తున్నాం. తాజాగా ‘విశాలాంధ్ర’ వారు 18, ‘ఎమెస్కో’ వారు 43 పుస్తకాలు ప్రచురించారు. పాతిక భాగాల జానపద నవల ‘జగజ్జాణ’ను వెయ్యి పేజీలతో ఒకే సంపుటిగా ఇటీవల విడుదల చేస్తే, చక్కటి స్పందన వచ్చింది. త్వరలో ‘విషకన్య’ రానుంది. వెయ్యిన్నొక్క నవలలు రాసిన ఆధునిక తెలుగు రచయితగా నాన్న గారు కొవ్వలిది ఇవాళ్టికీ ఒక రికార్డే. ఇప్పటికి నూట రెండేళ్ళ క్రితం పుట్టిన ఆ మనిషిని ఇవాళ్టికీ సజీవంగా నిలిపింది ఆ రచనలే. అవన్నీ మళ్ళీ అందుబాటులోకి రావాలి. కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ర్పచారం, ‘చౌకబారు నవలలు’ అంటూ వచ్చిన అపప్రథ తొలగిపోవాలి. అదే మేము కోరుకొనేది. సాహిత్య అకాడెమీ ‘చర్చా సదస్సు’ ఆ కృషిలో మొదటిమెట్టు! స్త్రీ స్వేచ్ఛ, సంఘసంస్కరణ లాంటి భావాలతో రచనలు చేసినందు వల్లే నాన్న గారి నవలలపై అప్పట్లో ఛాందసులు, సంప్రదాయవాదులు లేనిపోని ప్రచారం చేశారు. ఆ నవలల్ని గమనిస్తే, వాటిలో ఒక్క శాతమైనా అసభ్యత, అశ్లీలం ఉండవు. పెపైచ్చు, ప్రతి నవలకూ ముందే ‘సూచన’ అంటూ నాన్న ఆ రచన ద్వారా సమాజానికి తానివ్వదలుచుకున్న సందేశం ఏమిటో రాశారు. ఆ సూచనలన్నీ ఒక పుస్తకంగా తేవాలనుకుంటున్నాం. - రెంటాల జయదేవ -
14న కొవ్వలి శతజయంతి వేడుకలు
కిన్నెర ఆర్ట్స్ థియేటర్‌తో కలసి సాహిత్య అకాడమీ సుప్రసిద్ధ నవలా రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు శతజయంతి వేడుకలను నిర్వహిస్తోంది. రవీంద్రభారతి మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ నెల 14న ఉదయం 10.00 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకుడు ఎన్.గోపి సభాధ్యక్షత వహిస్తారు. ‘నవ్య’ వారపత్రిక సంపాదకుడు ఎ.ఎన్.జగన్నాథ శర్మ గౌరవ అతిథిగా, కొవ్వలి లక్ష్మీనరసింహారావు కుమారుడు కొవ్వలి లక్ష్మీనారాయణ ఆత్మీయ అతిథిగా హాజరవుతారు. సాహితీవేత్త ద్వా.నా.శాస్త్రి కీలకోపన్యాసం చేస్తారు. ఈ సందర్భంగా కొవ్వలి రచనలపై మూడు సదస్సులను కూడా నిర్వహించనున్నారు. ఇదేరోజు సాయంత్రం 6.00 గంటలకు ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌తో ‘కథాసంధి’ కార్యక్రమం జరుగుతుంది. -
‘దొంగ బతుకుల’ ఉచల్యా
‘భారతదేశం నాది... భారతీయులందరూ నా సోదరులు.... నాకు భారతీయ సంస్కృతి మీద ఎంతో గౌరవం ఉంది... ఈ మాటలు, శబ్దాలు అన్నీ అబద్ధం. మేం ఏమీ చేయకపోయినా దొంగతనం మోపి కారణం లేకుండా మమ్మల్ని ఎందుకు కొడతారు? నన్ను కొడతారు. మా అమ్మని కొట్టి ఆమె చీర పట్టుకొని ఇది దొంగతనం చేసిన చీర... విప్పి ఇచ్చేయి అంటూ పోలీసులు ఆమె చేయి పట్టుకుంటారు. మరి భారతదేశం నాది అయినప్పుడు మమ్మల్ని వేరుగా ఎందుకు చూస్తారు? మాకు పని ఎవరూ ఎందుకు ఇవ్వరు? మాకు సూది మోపేటంత భూమి కూడా ఎందుకు దొరకదు? మనం సోదరులం అయితే మాకు దొంగతనాలు చేయాల్సిన గతి ఎందుకు పట్టింది?’... మరాఠి నవల ‘ఉచల్యా’ రచయిత లక్ష్మణ్ గైక్వాడ్ ఆవేదన ఇది. ఈ నవల రచయిత సొంత కథ. సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈ పుస్తకాన్ని వసంత తెలుగులోనికి తెచ్చారు. మరాఠీలో ‘ఉచల్యాలు’ అంటే చిల్లర దొంగతనాలు చేసే వాళ్లని అర్థం. సంచార జాతులకు చెందిన వీళ్లు అనేక కులాలు, ఉపకులాలుగా ఉన్నారు. వీళ్లని తెలుగులో ‘సంత ముచ్చులు’ అంటారు. ‘ముచ్చులు’ అంటే దొంగలు. ఈ కులాలకి ఒక పేరంటూ లేదు. ఒక ఊరంటూ లేదు. మొత్తం భారతదేశంలో ఈ జాతి వాళ్లకి జాథవ్, గైక్వాడ్ అనే రెండే రెండు ఇంటి పేర్లు ఉన్నాయి. లక్ష్మణ్ ఎప్పుడు పుట్టాడో ఎక్కడ పుట్టాడో తెలియదు. తెల్సిందల్లా దరిద్రం, ఆకలి, పోలీసులు, తన్నులు. లక్ష్మణ్ వాళ్ల నాన్న దొంగతనాలకు దూరంగా చిల్లర నౌకరీ చేసుకుంటూ కొడుకుని చదివించాలని తపన పడతాడు. కాని తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేని దరిద్రం, చుట్టుపక్కల పరిస్థితులు లక్ష్మణ్‌ని అంతంత మాత్రం చదువులకే పరిమితం చేశాయి. దొంగతనాలు చేయడం ఇష్టం లేక లాటూర్‌లో వెట్టిచాకిరీలు చేయించే సూత్‌గిర్నీ మిల్లులో చేరతాడు. అక్కడ యూనియన్ వాళ్లతో పరిచయాలు, రాజకీయాలు... వీటన్నింటి మధ్య తన జాతి వాళ్ల విముక్తి కోసం ఒక సంఘాన్ని స్థాపించి వాళ్ల గొంతులు నలుగురికీ వినిపించడానికి కృషి చేస్తున్నాడు. ఇదంతా సమకాలీన కథ. లక్ష్మణ్ తన కథ ద్వారా మొత్తం ఈ జాతుల వ్యథను మనముందుంచుతాడు. ఊరి చివర విసర్జన స్థలాలలో ఉండే చిన్న చిన్న గుడిసెలే వీళ్ల నివాసం. ఒక్కొక్క గుడిసెలో బోలెడుమంది మనుషులు, వాళ్ల మేకలు, కుక్కలు, వాటి మూత్రం, బయట పంది పిల్లలు.. స్నానాలు చేయడం బట్టలు ఉతుక్కోవడం కల్లో మాటలు. మగపిల్లలకి, ఆడపిల్లలకి తొమ్మిది సంవత్సరాలు రాగానే పోలీసుల దెబ్బలు తట్టుకోవడానికి తల్లిదండ్రులే చావచితకదన్ని తర్ఫీదు ఇస్తారు. అనేకసార్లు సంబంధం లేని దొంగతనాలు కూడా ఒప్పుకోవాలి. జాతర్లు, సంతలు లేనప్పుడు చేల మీద పడతారు. జొన్నలు దొరక్కపోతే ఆకలికి తట్టుకోలేక ఎలుకల్ని, పిల్లుల్ని తింటారు. వీళ్లు ఎంత చీకటిలో ఉంటారంటే కులంలో ఎవరైనా బడికి వెళితే మిగతా వాళ్లందరికీ ‘కలరా’ వస్తుందని నమ్ముతారు. ఈ పుస్తకం మన మధ్యలోనే ఉన్న కొన్ని జాతుల హీనాతిహీనమైన జీవితాలకీ నాగరీకుల ఊహకి కూడా అందని నిజాలకీ నిలుటద్దం. పుస్తకం ముగించిన వెంటనే మన వ్యవస్థ మీద మనకే జుగుప్స కలిగినా వీళ్ల గొంతులు విన్పించే లక్ష్మణ్‌లాంటి కొద్దిమందైనా ఉండటం భవిష్యత్తు మీద మనకి ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. - కృష్ణ్ణమోహన్‌బాబు 9848023384