గోరా శాస్త్రి సంపాదకీయాల సంకలనం ‘వినాయకుడి వీణ’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. చిత్రంలో వరదాచారి, శివారెడ్డి తదితరులు
హైదరాబాద్: సంపదను ప్రతిఒక్కరూ రూపాయల్లోనే లెక్కిస్తారని, కానీ దానిని నిండైన పదజాలంతో అక్షరాల్లో లెక్కించిన సాహితీమూర్తి గోవిందు రామశాస్త్రి(గోరా శాస్త్రి) అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. సంపదను అక్షరాలతో లెక్కించేవారిని ప్రపంచం గుర్తిస్తుందని, అదే మార్గంలో గోరా శాస్త్రిని నేటికీ స్మరించుకుంటున్నా మని అన్నారు. సాహిత్యఅకాడమీ, వయోధిక పాత్రికేయ సంఘం సంయుక్తంగా శనివారం ఇక్కడి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన గోరా శాస్త్రి శతజయంతి ఉత్సవాలకు వెంకయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘గోరా శాస్త్రి అంటే సంపాదకీయాలు, సంపాదకీయాలంటే గోరా శాస్త్రి’అన్నంతగా పేరు సంపాదించుకున్నారని, అలాంటివారిని గౌరవించుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం మీద మక్కువ చూపించే పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదిలి జర్నలిజం, సాహిత్యం మీద ఆయన ఆసక్తి కనబరిచారని, తెలుగు, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో సంపాదకీయాలు రాసి సాహితీ సవ్యసాచిగా పేరు సంపాదించుకున్నారని అన్నారు.
ఆయన సంపాదకీయాలను పాఠకులు జ్ఞానసంపాదనామార్గాలుగా భావించేవారని గుర్తుచేశారు. ఈ తరం జర్నలిస్టులకు ఇలాంటి ఆదర్శప్రాయుడి జీవితాన్ని, సంపాదకీయాలను పాఠాలుగా బోధించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో స్వతంత్ర పత్రికకు పనిచేసిన ఆయన ఆ తర్వాత ఆంధ్రభూమి సంపాదకుడిగా తెలుగు ప్రజలకు చేరువయ్యారని పేర్కొన్నారు. ఆయన సంపాదకీయాల కోసమే ఆ రోజుల్లో పత్రికలను కొనేవారన్నారు. నిజాన్ని నిష్కర్షగా రాయడం ఆయన ప్రత్యేకత అని, హాస్యాన్ని, వ్యంగాన్ని, విమర్శను సమపాళ్లలో కలుపుతూ రాయడం ఆయనకే సాధ్యమైందని అన్నారు. కలగూరగంప పార్టీలు ఓ విచిత్రమైన సమాఖ్య అని గోరా శాస్త్రి ఏనాడో చెప్పారని, అది నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు.
అమ్మమ్మ ఇంటికి వచ్చినట్టుగా ఉంది
తెలుగు పాత్రికేయులందరినీ ఇలా ఒకేచోట కలవడం ఆనందంగా ఉందని, అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లుగా అనుభూతి కలుగుతోందని వెంకయ్యనాయుడు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుగుభాషకు, పాత్రికేయవృత్తికి మరింత గౌరవం తెచ్చిపెడతాయని అభిప్రాయపడ్డారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సాహిత్యానికే ఉందని, ముఖ్యంగా మాతృభాషాసాహిత్యం మనగతాన్ని తెలియజేస్తుందని, ఇప్పుడు పత్రికల్లో సాహిత్యం కరువైందని అన్నారు. ఈ సందర్భంగా గోరా శాస్త్రి సంపాదకీయాల సంకలనం ‘వినాయకుడి వీణ’ పుస్తకం, మోనోగ్రాఫ్ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి కె. శివారెడ్డి, సాహిత్యఅకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు జి.ఎస్.వరదాచారి, కె.లక్ష్మణ్‌రావుసహా పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment