తెలుగు సాహితీ సుక్షేత్రం తెలంగాణ.. | KCR comments in the Assembly about the World Telugu Conference | Sakshi
Sakshi News home page

తెలంగాణ సాహితీ ప్రశస్తిని.. నలుచెరగులా చాటుదాం

Published Sat, Nov 18 2017 3:38 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

KCR comments in the Assembly about the World Telugu Conference - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలతో తెలుగు భాషా వైదుష్యాన్ని, విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తామని.. తెలంగాణ సంస్కృతి కళావైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఈ మహాసభలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శుక్రవారం శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభల అంశంపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఆ ప్రకటన పూర్తి పాఠమిదీ.. 

సాహిత్య వారసత్వానికి ప్రతీకలెందరో.. 
తేట తెనుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోన బుద్ధారెడ్డి వెలువరించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి ద్విపద కావ్యం. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వాసి అయిన పొన్నగంటి తెలగన రచించిన యయాతి చరిత్రం తొలి అచ్చతెలుగు కావ్యం. సకల నీతి సమ్మతం అనే తొలి నీతి గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి. తొలి కథా సంకలన కావ్యం సింహాసన ద్వాత్రింశికను రచించిన కొరవి గోపరాజు నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ నివాసి. చాటుపద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ భీమకవిది వేములవాడ. ‘వాణి నా రాణి’అని ప్రకటించిన ‘జైమినీ భారత’కర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్లగొండ జిల్లా వాసి. రాచకొండను ఏలిన సర్వజ్ఞ సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు కవిరాజు కూడా. తెలుగువారి పుణ్యపేటిగా భావించిన బమ్మెర పోతన రచించిన ‘శ్రీమద్భాగవతం’మధురభక్తికి, మంజుల పద విన్యాసానికి, మనోహరమైన అలంకారిక శైలికి ఆలవాలమై అజరామర కీర్తిని పొందింది. ఆ మహనీయుడు జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక. ద్వ్యర్థి, త్య్రర్థి, చతుర్థి కావ్యాలు చిత్రబంధ అవధాన పద్య విద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది. 

జానపద జీవధారలకు పుట్టినిల్లు.. 
శిష్ట సాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు. నిరక్షరాస్యులైన శ్రామిక జనుల నోటినుంచి ఆశువుగా వెలువడి అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న సజీవ నిధులు. నాటు పాటలు, రాటు పాటలు, మోట పాటలు, కల్లాల దగ్గర పాడుకునే పాటలు, దంపుడు పాటలు, ఇసుర్రాయి పాటల్లో పల్లె జనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది. వివిధ పండుగల సందర్భంగా సామూహికంగా ఆడిపాడే బతుకమ్మ పాటలు, కాముని పున్నమి పాటలు, అసోయ్‌ దూలా అని పాడే పీరీల పాటలు ప్రజల సంఘ జీవన సంస్కృతిని చాటుతున్నాయి. ఒకతరం నుంచి మరొక తరానికి సజీవమైన తెలుగు పద సంపదను, నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి. చిరుతల రామాయణం, హరికథ, యక్షగానాలు, ఒగ్గుకథలు, బుడిగ జంగాల శారద కథలు, బాలసంతుల పాటల ఇంకా ఎన్నో విశిష్ట విలక్షణ కళారూపాలలో నిండుగా పండిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది.. 

కొత్త తరానికి ప్రేరణగా.. 
ఈ సభల సందర్భంగా నిర్వహించే సదస్సులు తెలంగాణ నుంచి వెలువడిన తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిపైనా కూలంకషంగా చర్చిస్తాయి. గత వైభవాన్ని ఘనంగా తలుచుకుంటూనే వర్తమానాన్ని విశ్లేషిస్తాయి. భవిష్యత్‌ కర్తవ్యాలను నిర్దేశిస్తాయి. కొత్త పరిశోధనలకు నాంది పలుకుతాయి. సభల్లో ఏర్పాటు చేసే కళా ప్రదర్శనలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దర్శింపజేస్తాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన సాహిత్యరస హృదయులందరూ ఒకే చోట చేరడంతో.. వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు, సుహృద్భావనలు నెలకొంటాయి. ఈ సభలు కొత్త తరానికి తెలంగాణ తెలుగు సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు నూతనోత్తేజాన్ని, ప్రేరణను కలుగజేస్తాయి. సభల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు చేసింది. సన్నాహక సమావేశాల కోసం ప్రతి జిల్లాకు రూ. 5 లక్షలు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు తెలంగాణ సాహిత్య విశేషాలపై వ్యాస రచన, వక్తృత్వం, పద్య పఠనం, కవితా రచన తదితర అంశాల్లో పోటీల నిర్వహణ ప్రారంభమైంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లోనూ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశాలు జరిగాయి. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు వారు నివాసముంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నాం. 

మీ ప్రాంత సాహిత్యాన్ని వెలుగులోకి తెండి 
గౌరవ శాసన సభ్యులకు నేను ప్రత్యేకంగా ఒక విషయం మనవి చేయదల్చుకున్నాను. మీ ప్రాంతం నుంచి వచ్చిన సాహిత్యం మీద దృష్టి సారించండి. మీ ప్రాంత సాహిత్యానికి ఉన్న ప్రత్యేకతలను, అజ్ఞాతంగా ఉన్న విశేష రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి దృష్టికి తీసుకురావాలి. ఆయన ఆ సాహిత్య విశేషాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. శాసనసభ్యులతో పాటు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగమంతా ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా భావించాలని కోరుతున్నా.. సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, భాషా ప్రేమికులు గుండెల నిండా జరుపుకొనే ఈ తెలుగు పండుగలో అందరూ ఉత్సాహంతో పాల్గొనాలి. ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలి..’’  

రాష్ట్ర ప్రత్యేకత చాటేలా ఏర్పాట్లు.. 
తెలుగు మహాసభల ప్రారంభ, ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు జాతీయ ప్రముఖులు విచ్చేయబోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చే వారికి నివాసం, భోజనం, స్థానిక రవాణా సదుపాయాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది. అతిథి మర్యాదల్లో తెలంగాణ ప్రత్యేకత చాటే విధంగా చక్కని ఏర్పాట్లు చేస్తున్నాం. సభల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించేవారు. రవీంద్రభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదా ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. 

సమైక్య రాష్ట్రంలో మసకబారిన తెలంగాణ ప్రశస్తి 
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తి మసకబారింది. పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రనే చరిత్రగా చలామణి అయింది. మన సాహితీమూర్తుల కృతులు మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయాయి. వేములవాడ భీమకవి, బమ్మెర పోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల చరిత్ర వక్రీకరణకు గురైంది. ఒక దశలో తెలంగాణలో కవులే లేరన్న స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలూ చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంలోనే మహోన్నత చారిత్రక పరిశోధకుడు, తెలుగు సాహిత్య శిఖరంగా వెలుగొందిన కవి సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలన్న సంకల్పంతో శ్రమకోర్చి... తెలంగాణ నలుచెరగులా తిరిగి 354 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచికను వెలువరించారు. అది మన తెలంగాణ స్వాభిమాన ప్రతీక, సాహిత్య జయపతాక. జలపాత సదృశమైన ధారతో అద్భుతమైన ప్రౌఢిమతో అగ్నిధార, రుద్రవీణ వంటి పద్యకావ్యాలను సృజించిన మహాకవి దాశరథి ‘నా తెలంగాణ తల్లి కంజాతవల్లి’అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించారు. ‘భూగర్భమున గనులు, పొంగిపారే నదులు నా తల్లి తెలంగాణరా, వెలలేని నందనోద్యానమ్మురా’అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెళ్ల వెంకటరామారావు తెలంగాణ తల్లి యశస్సును అద్భుతంగా గానం చేశారు. ప్రజాకవి కాళోజీ తన కవితలలో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పదనాన్ని ప్రకటిస్తూనే తెలంగాణ ప్రజల తెలుగును వెక్కిరించిన వారికి దీటైన సమాధానమిచ్చారు. 

తెలుగు సాహితీ సుక్షేత్రం తెలంగాణ.. 
‘‘తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలనే ఆశయంతో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. అజంత భాషగా, సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగు కీర్తి పొందింది. నికోలస్‌ కాంటే అనే పాశ్చాత్య పండితుడు తెలుగును ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’గా కొనియాడారు. తమిళ జాతీయకవి సుబ్రమణ్య భారతి తెలుగు భాషను ‘సుందర తెలుంగు’అని కీర్తించారు. మన తెలంగాణ ప్రాచీన కాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపద వెలుగొందిన సాహితీ సుక్షేత్రం. తెలంగాణలో రెండు వేల ఏళ్లకు పూర్వం నుంచే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి.

క్రీస్తుశకం ఒకటో శతాబ్దానికి చెందిన హాలుని గాథాశప్తశతిలో తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా కురిక్యాల దగ్గర బొమ్మలగుట్టపై ఉన్న జినవల్లభుడి శాసనం కంద పద్యాలతో ఉండటం విశేషం. దాన్నిబట్టి క్రీస్తుశకం 947 సంవత్సరం నాటికే తెలంగాణలో ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటిచెప్తోంది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీ ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. ‘ఉరుతర గద్యపద్యోక్తుల కన్న సరసమై పరగిన జానుతెనుగులో కావ్య సృష్టి చేస్తా’నని ప్రతిజ్ఞ చేసి అచ్చ తెలుగు పలుకుబడికి పట్టంకట్టిన పాల్కూరికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసే. తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది. తెలుగులో తొలి స్వతంత్ర రచన బసవ పురాణం, తొలి శతకం వృషాధిప శతకం, తొలి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం పాల్కురికి సోమన వెలువరించిన కావ్య రత్నాలు. సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తర్వాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి. దీన్ని బట్టి తెలుగు భాషా సాహిత్య ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదాంశం. 

తెలుగును విశ్వవ్యాప్తం చేద్దాం.. 
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు తమపై అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణను సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలియజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృత నిశ్చయంతో కృషి చేస్తోంది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరగాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ అధ్యక్షులుగా ప్రసిద్ధ తెలంగాణ కవి నందిని సిధారెడ్డిని నియమించి సారథ్య బాధ్యతలు వారికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే ప్రతీ విద్యార్థిం ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు విధిగా తెలుగు భాషను అభ్యసించాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అందరికీ ఇదే మా ఆహ్వానం 
తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాం. లాల్‌ బహదూర్‌ స్టేడియం ప్రధాన వేదికగా.. రవీంద్ర భారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, పలు ఇతర వేదికలుగా మహాసభలు వైభవంగా జరుగబోతున్నాయి. తెలంగాణ సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన మహాకవుల పేరున తోరణాలు, ద్వారాలు, హోర్డింగులను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాం. మహాసభల్లో పాల్గొనడం కోసం రాష్ట్రంలోని తెలుగు భాషాభిమానులతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడిన తెలుగు భాషా ప్రేమికులందరికీ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement