సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ధనవంతులకు, పెత్తందార్లకు మాత్రమే చోటు కల్పించారు తప్ప పేదవారిని, పేద కవులను కేసీఆర్ తీవ్రంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. పేదవారిని గౌరవించాల్సిన అవసరం ఏముందనే ధోరణితో కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. పేదవారి సొమ్మంతా పెద్దలకు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. ప్రపంచ తెలుగు మహాసభల తీరుపై గురువారం మోత్కుపల్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో తెలుగువారిని మద్రాసీలు అనేవారని... అలాంటిది తెలుగు వారి ప్రాముఖ్యత ఢిల్లీకి చెప్పింది ఎన్టీఆరేనని అలాంటి ఆయనను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. తనకు, కేసీఆర్‌కు రాజకీయ గురువు ఎన్టీఆరేనని, ఆయన నుంచే తామిద్దరికీ చైతన్యం వచ్చిందన్నారు. అలాంటి ఆయన గురించి నాలుగు మాటలు చెబితే కేసీఆర్ పదవి పోతుందా అని నిలదీశారు.
ప్రపంచ తెలుగు పండగ అయినప్పుడు సీఎం చంద్రబాబును కేసీఆర్ ఎందుకు పిలవలేదని, అమరావతి శంకుస్థాపన సమయంలో, కేసీఆర్ యాగం సమయంలో ఇచ్చిపుచ్చుకున్నట్లు జరగలేదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వరకు తెలుగు వారు (జస్టిస్ ఎన్వీ రమణ, చలమేశ్వరరావు, లావూరి నాగేశ్వరరావు) ఉన్నారని అలాంటి వారిని గౌరవిస్తే కేసీఆర్‌కే పేరొచ్చి ఉండేదని అన్నారు. కనీసం మీడియా పాత్ర కూడా ఈ సభల్లో లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన వారంతా కూడా కేసీఆర్‌కు భయపడి భజన చేసిర్రా, నిజంగానే చేసిర్రా అనేది అర్ధం కాలేదని అన్నారు. తెలంగాణ దళిత కవులు విమలక్క, గద్దర్, వందేమాతరం, శ్రీనివాస్, అందెశ్రీని ఎందుకు కేసీఆర్ గౌరవించలేదని మండిపడ్డారు. సినిమా యాక్టర్లు కూడా భయంతో వచ్చినవారేగానీ, ప్రేమతో రాలేదని, చిరంజీవి కూడా భయంతోనే వచ్చినట్లుందని అనుకుంటున్నానని అన్నారు. బాలకృష్ణ కూడా అందరు యాక్టర్ల మాదిరిగా వచ్చిపోయారన్నారు.
యాక్టర్లంతా గొర్రెల మాదిరిగానే దండలు వేయించుకున్నారని, వారు ఎన్టీఆర్ గురించి మాట్లాడాలని అనుకున్నా... కేసీఆర్ భయంతో మాట్లాడలేకపోయారని అన్నారు. కేసీఆర్‌ను పొగిడించుకునేందుకే రూ.కోట్లు ఖర్చుపెట్టారని, పేదవాడు సంతోషంగా లేని ఏ పండుగ పండుగ కాదన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్ తీరు నిరంకుశ, నియంతృత్వవాదానికి ప్రతీకగా ఉందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే జనాలు సంతోషంగా ఉండే చర్యలు చేయాలని, ఆయనలో ప్రాంతీయవాదం ఆలోచన ఇంకా పోలేదన్నారు. 'కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మాదిగ, మాల లేరు, బీసీలు ఉన్నా వారికి వాయిస్ లేదు. మిత్రుడిగా నాకు రాజకీయ కక్ష లేదు. ప్రజలు మెచ్చేలాగా కేసీఆర్ ఉండాలి. ఆయన తీరు మారాలి. ఎన్టీఆర్ శిష్యుడిగా చెప్తున్నా కేసీఆర్ చర్యలు దుర్మార్గం. బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే' అని మోత్కుపల్లి మండిపడ్డారు.
సభలో అంతా వణికారు.. కేసీఆర్‌పై మోత్కుపల్లి ఫైర్
Published Thu, Dec 21 2017 12:02 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment