దైవత్వం ఒక అనుభవం. దీనిని హృదయంలో ప్రతిబింబింప జేసుకోవాలి. అద్దం కదులుతూ ఉన్నా లేదా దానిని పొగ కప్పివేసినా లేదా వస్తువుల నుండి చాలా దూరంగా ఉన్నా... అద్దం దేనినీ సరిగా ప్రతిబింబింప చేయలేదు. మనస్సు (అద్దం) నిశ్చలంగా (కదలకుండా) ఉండడమే ఏకాగ్రత. అద్దాన్ని కప్పి ఉంచే పొగ (అహం)ను తొలగించాలి. అదే ‘దైవ సాక్షాత్కారం’.
జ్ఞానానికి రెండు స్థాయులు ఉన్నాయి. ఒకటి కిందిస్థాయి, మరొకటి పైస్థాయి. ఇంద్రియాలను ఉపయోగించుకొని, హేతుబద్ధంగా విచారించి తెలుసుకొనేది కిందిస్థాయి జ్ఞానం. చాలామంది కిందిస్థాయి జ్ఞానంతోనే జీవితాన్ని గడుపుతున్నారు. దైవానికి సంబంధించిన జ్ఞానమే పైస్థాయికి చెందింది. ఇది సాధారణమైన జ్ఞానాన్ని మించింది. అంటే సర్వోత్కృష్టమైన దన్నమాట. కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు. ఈ విధమైన జ్ఞానాన్ని సద్గురువు మాత్రమే అనుగ్రహిస్తారు.
మానవ జన్మ ఉన్నత లక్ష్యం భగవంతునిలో ఐక్యం చెందటమే. మనిషి తన జన్మకు కారణం ఏమిటో మరచిపోయి ‘కామ– కర్మ– అవిద్య’ అనే చక్రంలో చిక్కుకున్నాడు. స్వార్థబుద్ధిని పోనీయక, సొంతలాభం కోసం ఇతరులకు నష్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాంటివారికి ఎన్నటికీ విమోచన ఉండదు. కాబట్టి ఆత్మ వివేక మార్గంలో నడచి, భగవంతుడు వరప్రసాదంగా ఇచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇతరుల దోషాలనూ, తన చుట్టూ గల వాతావరణంలోని లోపాలను ఎంచుట మనిషికి గల సాధారణ లక్షణం. ఈ విధంగా తప్పులను ఎంచుటం వలన ఏ ప్రయోజనమూ లేదు. వాస్తవంగా ఈ లక్షణ ం మనిషి మానసిక ప్రశాంతతను భంగపరుస్తుంది. ఇందువలన సమతాస్థితిని పొందలేడు.
ఆధ్యాత్మిక మార్గం అనుసరించదలచిన భక్తుడు చిత్తశుద్ధిని పెంపొందించుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితం సాధ్యమవుతుంది. ఇతరుల దోషాలను ఎంచటం మానివేసి, ఎవరికి వారు తమను తాము సరిచేసుకొని అభివృద్ధి అవ్వడానికి ప్రయత్నించాలి. – శ్రీ గణపతి సచ్చిదానందస్వామి
Comments
Please login to add a commentAdd a comment