ఈర్ష్య, అసూయ, ద్వేషం – ఈ మూడు దుర్గుణాలు మూర్తీభవించినవాడు చలమ దీప్తుడు. తానే పెద్ద తత్వవేత్తననీ, తనకంటే గొప్ప ప్రబోధకుడు ఎవరూ లేరని, తాను గురువులకే గురువని భ్రమించేవాడు. ఇతరుల్ని ఎవ్వరినీ గౌరవించేవాడు కాదు. అతని శిష్యుడు అహితుడు అన్నింటా గురువుని మించిన శిష్యుడే! రాజగృహ నగరానికి ఉత్తర దిక్కులో ఉన్న ఒక పర్వతంపై అతని నివాసం.
తనకంటే బుద్ధునికి ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కలగడం అతనిలో కోపాన్ని పెంచింది. కుటిలత్వాన్ని రేపింది. బుద్ధుణ్ణి ఇబ్బందుల పాలు చేయాలనీ, అపకీర్తి కలిగించాలనీ పథకం వేశాడు. అలా చేస్తే తనకు అధిక గౌరవ మర్యాదలు కలుగుతాయని నమ్మాడు. వెంటనే తన ప్రియ శిష్యుడు అహితుణ్ణి పిలిచి, తన మనస్సులోని పథకాన్ని చెప్పాడు. అహితుడు అందుకు అంగీకరించి, నగరంలోకి నడిచాడు.
ఆరోజు ఒక రాజపురోహితుడు బుద్ధునికీ, బుద్ధ సంఘానికీ ఆతిథ్యం ఇచ్చాడు. బుద్ధుడు భిక్ష స్వీకరించాక ధర్మోపదేశంప్రారంభించాడు. ఆ సమయానికి అహితుడు అక్కడికి చేరాడు. ఉపదేశానంతరం బుద్ధునికి నమస్కరించి‘‘భగవాన్! నన్నూ మీ భిక్షుసంఘంలో చేర్చుకోండి’’ అని వేడుకున్నాడు. బుద్ధుడు అంగీకరించాడు.
కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు బుద్ధుడు తన భిక్షుసంఘంతో కలసి నగరంలో భిక్షార్థం బయలు దేరాడు. తన భిక్షా పాత్రను తీసుకోవడానికి చేశాడు. అది కనిపించలేదు. ఆరామం బయట ద్వారం దగ్గర నిలబడిన అహితుడు అటూ ఇటూ చూస్తూ–‘‘భగవాన్! మీ భిక్షాపాత్ర కోసం నేను వెదకనా?’’ అని అడిగి ఆరామం నలుమూలలా చూశాడు. బుద్ధుడు అతని వంక చూసి, చిరునవ్వు నవ్వాడు.‘‘అహితా! వెదకనవసరం లేదు. పద’’ అంటూ బయటకు నడచాడు. బుద్ధుని వెనకే అహితుడు నడచాడు. భిక్షు సంఘం రాజగృహ నగరానికి వెళ్ళే దారిలో ఒక తటాకం ఉంది. బుద్ధుడు ఆ తటాకం వైపు నడచాడు. అది చూసి అహితుడు. ‘నేను ఆ భిక్షాపాత్రను, పగులగొట్టి, ఈ తటాకంలో పడవేసిన విషయం బుద్ధునికి తెలిసింది’ అని భయపడ్డాడు.
బుద్ధుడు తటాకం లో దిగి విశాలమైన తామరాకుని తుంచి, దాన్ని, శుభ్రపరిచాడు. దాని అంచులు గిన్నెలా మలిచాడు. ఆరోజు బుద్ధుని భిక్షాపాత్ర అది! మరో రెండు రోజులు గడిచాయి.
ఒకరోజు రాత్రి బుద్ధుడు పడుకోడానికి తన సంఘాటి (దుప్పటి) కోసం చూశాడు. అది కనిపించలేదు. బుద్ధుడు అలా వెదకడం గమనిస్తూనే, లోలోపల నవ్వుకుంటున్నాడు అహితుడు. అంతలో... ‘‘అహితా!’’ అనే బుద్ధుని పిలుపు విని ఉలిక్కిపడ్డాడు అహితుడు. ‘‘భగవాన్! సెలవియ్యండి’’ అన్నాడు అతివినయం గా ‘‘నీకు సంఘాటి ఉందిగా’’ అని అడిగాడు.
‘‘భగవాన్! ఉంది’’ ‘‘నీవు పక్క పరుచుకొని పడుకో’’ అని, నేలను శుభ్రం చేసుకుని, తన చీవరాన్ని పక్కగా పరచుకుని బుద్ధుడు పడుకున్నాడు. ఆ రాత్రి బుద్ధునితో సహా భిక్షువులందరూ హాయిగా నిద్ర΄ోయారు. అహితునికి కంటిమీద కునుకే రాలేదు. వేకువ కాకముందే లేచి, తన గురువు చలమదీప్తుని దగ్గరకు వెళ్లి చేరాడు. తెల్లారింది. ‘‘అహితుడు ఏమయ్యాడు?’’అని అందరూ ఆలోచించసాగారు. ఇంతలో... ‘‘అదిగో... అటు చూడండి. అహిత భిక్షు ఎవరినో తీసుకుని వస్తున్నాడు అన్నాడు ఒక భిక్షువు.
అహితుడు తన గురువును వెంటబెట్టుకుని వచ్చాడు. ఇద్దరూ బుద్ధుని పాదాలకు నమస్కరించారు.‘‘భగవాన్! మీ మీద క్రోధంతో, అసూయ తో వచ్చాను. మీ భిక్షాపాత్ర నేనే పగులగొట్టాను. మీ సంఘాటిని తుప్పల్లో దాచాను. ఆ విషయం మీరు గ్రహించారు. అయినా నన్ను మందలించలేదు. అందరిముందు అవమానం చేయలేదు. ఈ పనులు చేసిన రెండుసార్లూ నేను నిద్రకు దూరమయ్యాను. మనశ్శాంతి కోల్పోయాను. తప్పు తెలుసుకున్నాను. ద్వేషం కంటే ప్రేమ గొప్పదని తెలుసుకున్నాను. వెళ్ళి మా గురువు గారికి విషయం చెప్పాను. మేమిద్దరం తప్పు తెలుసుకున్నాం. మీ శరణు వేడుకుంటున్నాం’’ అన్నాడు అహితుడు. బుద్ధుడు ప్రేమతో వారిని దగ్గరకు పిలిచి భిక్షు దీక్ష ఇచ్చాడు. – డా. బొర్రా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment