Family stories
-
బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు..
ఈర్ష్య, అసూయ, ద్వేషం – ఈ మూడు దుర్గుణాలు మూర్తీభవించినవాడు చలమ దీప్తుడు. తానే పెద్ద తత్వవేత్తననీ, తనకంటే గొప్ప ప్రబోధకుడు ఎవరూ లేరని, తాను గురువులకే గురువని భ్రమించేవాడు. ఇతరుల్ని ఎవ్వరినీ గౌరవించేవాడు కాదు. అతని శిష్యుడు అహితుడు అన్నింటా గురువుని మించిన శిష్యుడే! రాజగృహ నగరానికి ఉత్తర దిక్కులో ఉన్న ఒక పర్వతంపై అతని నివాసం. తనకంటే బుద్ధునికి ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కలగడం అతనిలో కోపాన్ని పెంచింది. కుటిలత్వాన్ని రేపింది. బుద్ధుణ్ణి ఇబ్బందుల పాలు చేయాలనీ, అపకీర్తి కలిగించాలనీ పథకం వేశాడు. అలా చేస్తే తనకు అధిక గౌరవ మర్యాదలు కలుగుతాయని నమ్మాడు. వెంటనే తన ప్రియ శిష్యుడు అహితుణ్ణి పిలిచి, తన మనస్సులోని పథకాన్ని చెప్పాడు. అహితుడు అందుకు అంగీకరించి, నగరంలోకి నడిచాడు. ఆరోజు ఒక రాజపురోహితుడు బుద్ధునికీ, బుద్ధ సంఘానికీ ఆతిథ్యం ఇచ్చాడు. బుద్ధుడు భిక్ష స్వీకరించాక ధర్మోపదేశంప్రారంభించాడు. ఆ సమయానికి అహితుడు అక్కడికి చేరాడు. ఉపదేశానంతరం బుద్ధునికి నమస్కరించి‘‘భగవాన్! నన్నూ మీ భిక్షుసంఘంలో చేర్చుకోండి’’ అని వేడుకున్నాడు. బుద్ధుడు అంగీకరించాడు. కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు బుద్ధుడు తన భిక్షుసంఘంతో కలసి నగరంలో భిక్షార్థం బయలు దేరాడు. తన భిక్షా పాత్రను తీసుకోవడానికి చేశాడు. అది కనిపించలేదు. ఆరామం బయట ద్వారం దగ్గర నిలబడిన అహితుడు అటూ ఇటూ చూస్తూ–‘‘భగవాన్! మీ భిక్షాపాత్ర కోసం నేను వెదకనా?’’ అని అడిగి ఆరామం నలుమూలలా చూశాడు. బుద్ధుడు అతని వంక చూసి, చిరునవ్వు నవ్వాడు.‘‘అహితా! వెదకనవసరం లేదు. పద’’ అంటూ బయటకు నడచాడు. బుద్ధుని వెనకే అహితుడు నడచాడు. భిక్షు సంఘం రాజగృహ నగరానికి వెళ్ళే దారిలో ఒక తటాకం ఉంది. బుద్ధుడు ఆ తటాకం వైపు నడచాడు. అది చూసి అహితుడు. ‘నేను ఆ భిక్షాపాత్రను, పగులగొట్టి, ఈ తటాకంలో పడవేసిన విషయం బుద్ధునికి తెలిసింది’ అని భయపడ్డాడు. బుద్ధుడు తటాకం లో దిగి విశాలమైన తామరాకుని తుంచి, దాన్ని, శుభ్రపరిచాడు. దాని అంచులు గిన్నెలా మలిచాడు. ఆరోజు బుద్ధుని భిక్షాపాత్ర అది! మరో రెండు రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి బుద్ధుడు పడుకోడానికి తన సంఘాటి (దుప్పటి) కోసం చూశాడు. అది కనిపించలేదు. బుద్ధుడు అలా వెదకడం గమనిస్తూనే, లోలోపల నవ్వుకుంటున్నాడు అహితుడు. అంతలో... ‘‘అహితా!’’ అనే బుద్ధుని పిలుపు విని ఉలిక్కిపడ్డాడు అహితుడు. ‘‘భగవాన్! సెలవియ్యండి’’ అన్నాడు అతివినయం గా ‘‘నీకు సంఘాటి ఉందిగా’’ అని అడిగాడు. ‘‘భగవాన్! ఉంది’’ ‘‘నీవు పక్క పరుచుకొని పడుకో’’ అని, నేలను శుభ్రం చేసుకుని, తన చీవరాన్ని పక్కగా పరచుకుని బుద్ధుడు పడుకున్నాడు. ఆ రాత్రి బుద్ధునితో సహా భిక్షువులందరూ హాయిగా నిద్ర΄ోయారు. అహితునికి కంటిమీద కునుకే రాలేదు. వేకువ కాకముందే లేచి, తన గురువు చలమదీప్తుని దగ్గరకు వెళ్లి చేరాడు. తెల్లారింది. ‘‘అహితుడు ఏమయ్యాడు?’’అని అందరూ ఆలోచించసాగారు. ఇంతలో... ‘‘అదిగో... అటు చూడండి. అహిత భిక్షు ఎవరినో తీసుకుని వస్తున్నాడు అన్నాడు ఒక భిక్షువు. అహితుడు తన గురువును వెంటబెట్టుకుని వచ్చాడు. ఇద్దరూ బుద్ధుని పాదాలకు నమస్కరించారు.‘‘భగవాన్! మీ మీద క్రోధంతో, అసూయ తో వచ్చాను. మీ భిక్షాపాత్ర నేనే పగులగొట్టాను. మీ సంఘాటిని తుప్పల్లో దాచాను. ఆ విషయం మీరు గ్రహించారు. అయినా నన్ను మందలించలేదు. అందరిముందు అవమానం చేయలేదు. ఈ పనులు చేసిన రెండుసార్లూ నేను నిద్రకు దూరమయ్యాను. మనశ్శాంతి కోల్పోయాను. తప్పు తెలుసుకున్నాను. ద్వేషం కంటే ప్రేమ గొప్పదని తెలుసుకున్నాను. వెళ్ళి మా గురువు గారికి విషయం చెప్పాను. మేమిద్దరం తప్పు తెలుసుకున్నాం. మీ శరణు వేడుకుంటున్నాం’’ అన్నాడు అహితుడు. బుద్ధుడు ప్రేమతో వారిని దగ్గరకు పిలిచి భిక్షు దీక్ష ఇచ్చాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: స్నాతక పాఠం అంటే..? -
వీడుతున్న వాహబంధం
వారిది పెద్దలు కుదిర్చిన సంబంధం. అందరి అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఏడాది తిరిగేసిరికి మగబిడ్డ జన్మించాడు. తొలుచూరు కాన్పులోనే తమ వంశానికి వారసుడు వచ్చాడని అందరూ వేడుకలు జరుపుకున్నారు. చూస్తుండగానే పిల్లాడికి మూడేళ్లు నిండాయి. బడికి పంపించే ముందు ఏ గుడిలోనో అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీ కదా! ఇంటివద్దనే అక్షరాభ్యాసం చేయిద్దామని ఇంట్లో నిర్ణయించగా, అమ్మమ్మ తాతయ్యలు బాసర సరస్వతీ దేవాలయంలో అక్షర శ్రీకారం చేయించాలని పట్టుబట్టారు. భర్త అలా కాదన్నందుకు ‘మా పుట్టింటివారు చెప్పినట్లు చేయకుండా ఎదురు మాట్లాడతావా’ అంటూ ఒకరికొకరు గొడవపడ్డారు. మా వాళ్లను గౌరవించని ఇంట్లో క్షణం కూడా ఉండనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమె ఏకంగా విడాకులు కావాలంటూ కోర్టులో కేసు వేసింది. ఇలా చిన్న చిన్న కారణాలకే వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతున్న తీరు ఇటీవల కాలంలో పెరిగిపోతోంది. కరీంనగర్లీగల్: ‘మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ అంటారు పెద్దలు. అంటే పెళ్లిల్లు స్వర్గంలోనే నిర్ణయించబడుతాయని పెద్దల నమ్మకం. కలిసి మెలిసి ఉండి మాంగళ్య బంధాన్ని ఆనందమయం చేసుకోవాల్సిన దంపతులు తృణప్రాయంగా వివాహ బంధాలను తెంచేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలు, అర్థంలేని పట్టుంపులు కుటుంబ తగాదాలతో పాటు వివిధ కారణాలతో విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరిలో ఎక్కువగా విడాకులు, భరణం ఇప్పించాలని కోర్టుకు వస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2013 నుంచి ఇప్పటివరకు 776 మంది విడాకులు, భరణం కావాలని కోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రస్తుతం 81 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సర్దుబాటు ధోరణి లేకనే... భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చినికి చినికి వానగాలిగా మారుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను పంతాలు, పట్టింపులకుపోయి పెద్దవి చేసుకొని విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తూ వీధులకు ఎక్కుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వాదులాడుకుంటున్న జంటలు భావోద్వేగాల వలలో చిక్కి విడిపోయేందుకు సిద్ధమవుతూ పచ్చని కాపురాలను ముక్కలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఏటేటా విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రేమించుకొని ఇరువురి కుటంబ పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్న వారు, పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటైన దంపతులైనా సర్దుబాటు ధోరణి లేక వివాహ బంధాన్ని వీడటానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. చిన్నపాటి గొడవలను పట్టింపులకు పోయి కాపురాలను కూల్చుకుంటున్నారు. దంపతులిద్దరు అవగాహన లోపంతో విడాకులు తీసుకొని జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు పిల్లలు ఏమైపోతారో అని వారికి జన్మించిన సంతానం గురించి ఏ కోశానా ఆలోచించడం లేదు. విడాకులు అనే మాట వింటేనే అదోలా చూసే సమాజంలో ఇపుడు ఆ పదం సాధారణమైపోయింది. 2013 నుంచి ఇప్పటివరకు భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడాకులు, భరణం వంటివి కోరుతూ ఫ్యామిలీ కోర్టులో 776 మంది కేసులు వేశారు. ఈ కేసులను ఎప్పటికపుడు కేసులు పరిష్కరించగా.. ప్రస్తుతం కోర్టులో 181 కేసులు నడుస్తున్నాయి. విడాకులకు దారితీస్తున్న కారణాలు తను చెప్పిన మాటను గౌరవించాలని ఇద్దరు పట్టింపులకు పోవడం. అత్యసవర వేళల్లో తల్లి దండ్రులకు డబ్బులు పంపడాన్ని అదేదో పెద్దనేరం అన్నట్లుగా భర్త, అత్తింటివారి నుంచి సూటిపోటి మాటలు తాను సంపాదించిన డబ్బును తానే పొదుపు చేసుకుంటానని చెప్పడం. అత్తమామలు, ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండననే భావన ఈతరం గృహిణిల్లో ఉండటం, ఈ కారణంగా ఇతర పట్టింపులు పండగలు, వేడుకల్లో తమ వారిని పట్టించుకోలేదని భార్యాభర్తలు గొడవలు పడటం. పండగల సమయాల్లో పుట్టింటికి వెళ్లవద్దని భార్యను అడ్డుకుంటూ పట్టుబట్టడం పుట్టిన పుల్లలకు పెట్టే పేరు నుంచి వారిని చేర్పించే స్కూలు ఎంపిక విషయంలోనూ తగాదాలు ఉద్యోగం చేసే భార్య బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం వంటివి తన వద్దనే ఉండాలని భర్త వేధించడం ఫలితమివ్వని కౌన్సెలింగ్ మనస్పర్థలతో విడాకులు కోరు తూ కేసులు వేస్తున్న వారికి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే కౌన్సెలింగ్కు హాజరైన వారు కలిసి ఉంటా మని చెప్పి వారం తిరగకముందే గొడవలు పడుతున్నారు. దీంతో ఇరువర్గాలకు రెండు మూడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం ఉండటం లేదు. కౌన్సెలింగ్ కేంద్రాల్లో మహిళల పక్షాన మాత్రమే ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపణలు ఉంటున్నాయి. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ కొంతకాలానికి కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. -
అత్త లేని కోడలు... ఉత్తమురాలే!
ఏడుగురు మగవాళ్లు ఉండే ఇల్లు అది. తాత... తండ్రి... ఐదుగురు కొడుకులు. పెద్ద కొడుకు భార్య వల్ల వచ్చిన సమస్యలతో మనసు వికలమైన తండ్రి... తన ఇంటి మీద ఎప్పటికీ ఆడనీడ పడకూడదనుకుంటాడు. ఇక ఎవ్వరినీ పెళ్లి గురించి ఆలోచించవద్దంటాడు. కానీ రెండో కొడుకైన హీరో హీరోయిన్తో ప్రేమలో పడతాడు. తండ్రికిష్టం లేక పోయినా ఎలాగో పెళ్లాడి భార్యను ఇంటికి తీసుకొస్తాడు. అత్త కూడా లేని ఆ ఇంటికి తను అమ్మ అవుతుంది హీరోయిన్. అందరికీ సేవలు చేస్తుంది. అందరి మనసుల్లోనూ స్థానం సంపాదిస్తుంది. కానీ ఆమెలా మరొకరు ఉండరు కాబట్టి ఇంకెవరికీ పెళ్లిళ్లు చేయనంటాడు తండ్రి. అయినా మిగతావాళ్లూ ప్రేమలో పడతారు. వాళ్లందరికీ ఆ కోడలు ఎలా పెళ్లిళ్లు చేసింది, బావగారి కాపురాన్ని ఎలా చక్కదిద్దింది, సమస్యలన్నీ ఎలా పరిష్కరించింది అనేది ‘సాస్ బినా ససురాల్’ సీరియల్లోని మిగతా కథ. ఈ సీరియల్ ఇటీవలే ‘అత్త లేని కోడలు ఉత్తమురాలు’గా తెలుగులో మొదలైంది. చక్కని కుటుంబ కథనాలను మనవాళ్లు ఎంతో ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా వాళ్ల మనసులను గెలుచుకునే అవకాశమూ ఉంది. మరీ ముఖ్యంగా ఆదర్శనీయంగా ఉండే హీరోయిన్ పాత్ర అందరికీ నచ్చి తీరుతుంది.