వారిది పెద్దలు కుదిర్చిన సంబంధం. అందరి అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఏడాది తిరిగేసిరికి మగబిడ్డ జన్మించాడు. తొలుచూరు కాన్పులోనే తమ వంశానికి వారసుడు వచ్చాడని అందరూ వేడుకలు జరుపుకున్నారు. చూస్తుండగానే పిల్లాడికి మూడేళ్లు నిండాయి. బడికి పంపించే ముందు ఏ గుడిలోనో అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీ కదా! ఇంటివద్దనే అక్షరాభ్యాసం చేయిద్దామని ఇంట్లో నిర్ణయించగా, అమ్మమ్మ తాతయ్యలు బాసర సరస్వతీ దేవాలయంలో అక్షర శ్రీకారం చేయించాలని పట్టుబట్టారు. భర్త అలా కాదన్నందుకు ‘మా పుట్టింటివారు చెప్పినట్లు చేయకుండా ఎదురు మాట్లాడతావా’ అంటూ ఒకరికొకరు గొడవపడ్డారు. మా వాళ్లను గౌరవించని ఇంట్లో క్షణం కూడా ఉండనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమె ఏకంగా విడాకులు కావాలంటూ కోర్టులో కేసు వేసింది. ఇలా చిన్న చిన్న కారణాలకే వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతున్న తీరు ఇటీవల కాలంలో పెరిగిపోతోంది.
కరీంనగర్‌లీగల్: ‘మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ అంటారు పెద్దలు. అంటే పెళ్లిల్లు స్వర్గంలోనే నిర్ణయించబడుతాయని పెద్దల నమ్మకం. కలిసి మెలిసి ఉండి మాంగళ్య బంధాన్ని ఆనందమయం చేసుకోవాల్సిన దంపతులు తృణప్రాయంగా వివాహ బంధాలను తెంచేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలు, అర్థంలేని పట్టుంపులు కుటుంబ తగాదాలతో పాటు వివిధ కారణాలతో విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరిలో ఎక్కువగా విడాకులు, భరణం ఇప్పించాలని కోర్టుకు వస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2013 నుంచి ఇప్పటివరకు 776 మంది విడాకులు, భరణం కావాలని కోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రస్తుతం 81 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
సర్దుబాటు ధోరణి లేకనే...
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చినికి చినికి వానగాలిగా మారుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను పంతాలు, పట్టింపులకుపోయి పెద్దవి చేసుకొని విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తూ వీధులకు ఎక్కుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వాదులాడుకుంటున్న జంటలు భావోద్వేగాల వలలో చిక్కి విడిపోయేందుకు సిద్ధమవుతూ పచ్చని కాపురాలను ముక్కలు చేసుకుంటున్నారు.
జిల్లాలో ఏటేటా విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రేమించుకొని ఇరువురి కుటంబ పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్న వారు, పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటైన దంపతులైనా సర్దుబాటు ధోరణి లేక వివాహ బంధాన్ని వీడటానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. చిన్నపాటి గొడవలను పట్టింపులకు పోయి కాపురాలను కూల్చుకుంటున్నారు. దంపతులిద్దరు అవగాహన లోపంతో విడాకులు తీసుకొని జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు పిల్లలు ఏమైపోతారో అని వారికి జన్మించిన సంతానం గురించి ఏ కోశానా ఆలోచించడం లేదు. విడాకులు అనే మాట వింటేనే అదోలా చూసే సమాజంలో ఇపుడు ఆ పదం సాధారణమైపోయింది. 2013 నుంచి ఇప్పటివరకు భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడాకులు, భరణం వంటివి కోరుతూ ఫ్యామిలీ కోర్టులో 776 మంది కేసులు వేశారు. ఈ కేసులను ఎప్పటికపుడు కేసులు పరిష్కరించగా.. ప్రస్తుతం కోర్టులో 181 కేసులు నడుస్తున్నాయి.
విడాకులకు దారితీస్తున్న కారణాలు
- తను చెప్పిన మాటను గౌరవించాలని ఇద్దరు పట్టింపులకు పోవడం.
- అత్యసవర వేళల్లో తల్లి దండ్రులకు డబ్బులు పంపడాన్ని అదేదో పెద్దనేరం అన్నట్లుగా భర్త, అత్తింటివారి నుంచి సూటిపోటి మాటలు
- తాను సంపాదించిన డబ్బును తానే పొదుపు చేసుకుంటానని చెప్పడం.
- అత్తమామలు, ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండననే భావన ఈతరం గృహిణిల్లో ఉండటం, ఈ కారణంగా ఇతర పట్టింపులు
- పండగలు, వేడుకల్లో తమ వారిని పట్టించుకోలేదని భార్యాభర్తలు గొడవలు పడటం.
- పండగల సమయాల్లో పుట్టింటికి వెళ్లవద్దని భార్యను అడ్డుకుంటూ పట్టుబట్టడం
- పుట్టిన పుల్లలకు పెట్టే పేరు నుంచి వారిని చేర్పించే స్కూలు ఎంపిక విషయంలోనూ తగాదాలు
- ఉద్యోగం చేసే భార్య బ్యాంక్ పాస్‌బుక్, ఏటీఎం వంటివి తన వద్దనే ఉండాలని భర్త వేధించడం
ఫలితమివ్వని కౌన్సెలింగ్
మనస్పర్థలతో విడాకులు కోరు తూ కేసులు వేస్తున్న వారికి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే కౌన్సెలింగ్‌కు హాజరైన వారు కలిసి ఉంటా మని చెప్పి వారం తిరగకముందే గొడవలు పడుతున్నారు. దీంతో ఇరువర్గాలకు రెండు మూడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం ఉండటం లేదు. కౌన్సెలింగ్ కేంద్రాల్లో మహిళల పక్షాన మాత్రమే ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపణలు ఉంటున్నాయి. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ కొంతకాలానికి కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment