వానల్లో వరదల్లో స్కూటర్‌ ప్రయాణం | Jharkhand Couple Travel 1200 kms To Write Diploma Exam | Sakshi
Sakshi News home page

వానల్లో వరదల్లో స్కూటర్‌ ప్రయాణం

Published Mon, Sep 7 2020 5:01 AM | Last Updated on Mon, Sep 7 2020 5:01 AM

Jharkhand Couple Travel 1200 kms To Write Diploma Exam - Sakshi

ఆమె టీచర్‌ కావడానికి డిప్లమా పరీక్ష రాయాలి. కాని ఆరునెలల గర్భిణి. సెంటర్‌ ఏమో 1200 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సాధనాలు, డబ్బు రెండూ లేవు.  ఆ భర్త సంకల్పించాడు. తన స్కూటర్‌పై ఆమెను తీసుకొని అంత సుదీర్ఘ దూరానికి బయల్దేరాడు.

ఈ సంవత్సరం పరీక్షలు రాస్తే భార్య టీచర్‌ కావడానికి యోగ్యత సంపాదిస్తుంది. 2019లో ఆమె రెండేళ్ల డి.ఇడి (డిప్లమా ఇన్‌ ఎడ్యుకేషన్‌) కోర్సు మొదటి సంవత్సరం పరీక్షలు రాసేసింది. రెండో సంవత్సరం పరీక్షలు లెక్కప్రకారం జూలైలో జరగాలి. కాని కరోనా వల్ల ఎప్పుడు జరుపుతారో తెలియదు. ఆమె కరెస్పాండెన్స్‌ ద్వారా ఆ కోర్స్‌ చదువుతోంది. సొంత ప్రాంతం జార్ఖండ్‌. ఉండేది భర్తకు ఎక్కడ పని దొరికితే అక్కడ. ఇప్పుడు హటాత్తుగా సెప్టెంబర్‌ 1 నుంచి పరీక్షలు అని సమాచారం వచ్చింది. ఆ సమయానికి ఆమె జార్ఖండ్‌లో తన బంధువు ఇంట్లో భర్తతో పాటు ఉంటోంది. అక్కడి నుంచి ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు సరిగ్గా 1200 కిలోమీటర్ల దూరం ఉంది. ఏం చేయాలి? ఇది సమస్య.

ధనుంజయ్‌ (27) జార్ఖండ్‌ గిరిజనుడు. 2019 డిసెంబర్‌లో అతనికి సోని (22)తో పెళ్లయ్యింది. ప్రస్తుతం ఆమె ఆరునెలల గర్భవతి. ధునంజయ్‌ గుజరాత్‌లో కేటరింగ్‌ ఏజెన్సీకి వంటవాడిగా పని చేసేవాడు. అతనికి పది వేలు వచ్చేది. పెళ్లయ్యాక అక్కడే కాపురం పెట్టాడు. కాని లాక్‌డౌన్‌ తర్వాత పనిపోయింది. అక్కడ బతికే వీల్లేకపోయింది. భార్యను తీసుకుని జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. ధనుంజయ్‌కు ఎనిమిది వరకే చదివాడు. కాని టీచర్‌ కావాలనే కోరికతో డి.ఇడి చేస్తున్న భార్య కోరికను మన్నించాడు. ఆమె టీచరు కావడానికి సహకరిస్తానని చెప్పాడు. కాని రెండో సంవత్సరం పరీక్షల తేదీ హటాత్తుగా వచ్చింది. గ్వాలియర్‌లో పది రోజులు ఉండి పరీక్షలు రాస్తే. రాస్తే, సర్టిఫికెట్‌ వస్తే టీచర్‌ పోస్టులు పడినప్పుడు అప్లై చేయడానికి సోని యోగ్యురాలవుతుంది. 

పరీక్షల తేదీని చూసిన భార్యాభర్తలకు ఏం చేయాలో తోచలేదు. కరోనా వల్ల సరిగ్గా బస్సులు, రైళ్లు నడవడం లేదు. టాక్సీ మాట్లాడుకుని వెళ్లి వద్దామంటే వెళ్లడానికి 30 వేలు అడిగారు. ‘పరీక్షలు ముఖ్యం’ అని ఇద్దరూ అనుకున్నారు. వాళ్ల దగ్గర ఒక పాత స్కూటర్‌ ఉంది. దాని మీదే బయలుదేరడానికి సిద్ధమయ్యారు. నగ తాకట్టు పెడితే పది వేలు వచ్చాయి. వాటితో ఆగస్టు 28 తెల్లవారుజామున ప్రయాణం మొదలెట్టారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌ల మీదుగా వీరు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకున్నారు. కాని ఈ ప్రయాణం సులువు కాదు. ఆమె గర్భిణి. చేతిలో ఉన్నది చిన్న స్కూటర్‌. రోడ్లు బాగా లేవు. పైగా వాన. చాలా చోట్ల వరద నీరు. ఒక్కటే రెయిన్‌ కోట్‌ ఉంది. దానిని భర్త ధరిస్తే వెనుక వైపు కూచున భార్య దాని కొసను తలపై కప్పుకుంది. ఒక రాత్రి వాళ్లు ముజఫర్‌ నగర్‌ (ఉత్తర ప్రదేశ్‌) ఆగారు. మరో రాత్రి ఒక పార్క్‌లో పడుకున్నారు. చివరకు గ్వాలియర్‌ చేరుకున్నారు. గ్వాలియర్‌లో పది రోజుల బస కోసం వెతుకులాడుకుంటున్నారు.

ఈ విషయం మీడియా ద్వారా అందరికీ తెలిసింది. ఈ భార్యాభర్తల వీడియో వైరల్‌ అయ్యింది. వెంటనే గ్వాలియర్‌ కలెక్టర్‌ స్పందించాడు. తక్షణమే వారికి బస, ఆహారం అందించాడు. చేతి ఖర్చులకు డబ్బు కూడా ఇచ్చాడు. సోని గర్భవతి కనుక ఆల్ట్రాసౌండ్‌ పరీక్ష, ఇతర ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు.
‘నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?’ అని ధనుంజయ్‌ను అడిగితే ‘దశరథ్‌ మంజీ గురించి వినడం వల్ల వచ్చింది’ అన్నాడు. బిహార్‌కు చెందిన గిరిజనుడు దశరథ్‌ మంజీ తన భార్య చావుకు కారణమైన, ఊరికి దగ్గరి దారికి అడ్డంగా ఉన్న కొండను ఒక్కడే తొలిచి రోడ్డు వేయడం అందరికీ తెలిసిందే. అతన్నే ధనుంజయ్‌ ఆదర్శంగా తీసుకున్నాడు. ‘మరి నీకంత ధైర్యమో’ అని సోనిని అడిగితే ‘మా ఆయన్ను చూసే’ అని నవ్విందామె. ప్రస్తుతం వీరి సురక్షిత తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement