అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌లతో శాంతెరీ నాయక్
కుమారుడు నరేశ్‌నాయక్‌తో శాంతెరీ నాయక్
నీర్ దోసె అంటే నూనె వేయకుండా పెనం మీద నీటిని చల్లి వేసే దోసె. మైసూర్ మసాలా దోసె, రసం ఇడ్లీ, టొమాటో ఉప్మా, ఆనియన్ ఊతప్పం... ఇవన్నీ మనకు తెలిసినవే, ఖోట్టో... ఇది ఇడ్లీ పిండిని పనస ఆకులతో అల్లిన బుట్టలో వేసి ఆవిరి మీద ఉడికించే వంటకం. ఈ దక్షిణాది రుచుల పేరు చెబితే ముంబయి వాసుల నోట్లో నీళ్లూరతాయి. క్రికెట్ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్‌లు ఈ రుచుల కోసం ముంబయి నగరం, మాతుంగలో ఉన్న మైసూర్ కేఫ్‌ను విజిట్ చేసేవాళ్లు.
స్వాతంత్య్రానికి ముందు 1936 నుంచి ముంబయిలో స్టవ్ వెలిగించిన ఈ కేఫ్‌కి గవాస్కర్, సచిన్‌ల కంటే ముందు ఏ ప్రముఖులు క్యూ కట్టారో తెలియదు. కొత్త పెళ్లికొడుకు అనంత్ అంబానీ ఆదివారాలు ఇక్కడే గడిచేవని ఇటీవల తెలిసింది. తన పెళ్లి వేడుకలో ఈ కేఫ్ స్టాల్ కూడా పెట్టించారు. వధువు రాధికా మర్చంట్‌కు ఈ కేఫ్ నిర్వహకురాలు శాంతెరీ నాయక్‌ను చూపిస్తూ ‘మీట్ మైసూర్ కేఫ్ ఓనర్’ అని పరిచయం చేశాడు. వధువు ఆ పెద్దావిడపాదాలను తాకి నమస్కరించింది. ఈ వీడియోతో శాంతెరీ ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.
టూర్‌లో ‘టేస్ట్’ చూస్తాను..
ముంబయి నగరం, మాతుంగ ఏరియాలో కింగ్స్ సర్కిల్ రైల్వేస్టేషన్ దగ్గర ఉంది మైసూర్ కేఫ్. శాంతెరీ నాయక్ మామగారు నాగేశ్ రామ నాయక్ ఈ కేఫ్‌ను స్థాపించాడు. కర్నాటక నుంచి ముంబయిలో అడుగు పెట్టి ఆహారమే తన కుటుంబానికి అన్నం పెడుతుందని నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టారు శాంతెరీ నాయక్. ఇప్పుడామె కుమారుడు నరేశ్ నాయక్ సహాయంతో కేఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్’ అనే ప్రజల ప్రశంసలే ఆమె అందుకున్న పురస్కారాలు. వివిధ ప్రదేశాలను పర్యటించడం ఆమె హాబీ. పర్యటనలో భాగంగా ఆయా ప్రదేశాల్లో ఏయే ఆహారాలు అందుబాటులో ఉంటున్నాయి, పర్యాటకులు ఏ రుచులను ఎక్కువ గా ఇష్టపడుతున్నారో గమనిస్తూ, వాటిని రుచి చూస్తానని చె΄్తారామె.
కస్టమర్ అభిప్రాయమే తుదితీర్పు..
‘‘వంటలను ఇష్టపడడమే నా సక్సెస్ ఫార్ములా. అమ్మకు సహాయం చేసే క్రమంలోనే రుచిగా వండడంలో మెళకువలు తెలిశాయి. అమ్మ వండిన పదార్థాలను ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించే బాధ్యత కూడా నాదే. వాళ్లకు ఏది నచ్చిందో అర్థమయ్యేది. అదే ఫార్ములాను కేఫ్ నిర్వహణలోనూ అనుసరించాను. మన ఉద్యోగులను నమ్మాలి, అంతకంటే ఎక్కువగా కస్టమర్లను నమ్మాలి. రుచి, అభిరుచుల విషయంలో కస్టమర్‌ల నోటి నుంచి వచ్చిన మాటే వేదవాక్కు. పదార్థాల రుచిని ఆస్వాదించిన నాలుక ఫీడ్ బ్యాక్ విషయంలో అబద్ధం చెప్పదు’’ అంటారు శాంతెరీ నాయక్. డెబ్బైఏళ్ల వయసులో కూడా చురుగ్గా, కేఫ్ నిర్వహణ పట్ల శ్రద్ధగా ఉన్నారామె. వార్థక్యం దేహానికి మాత్రమే, మనసుకు కాదు, పనిచేసే మనస్తత్వానికి కాదని నిరూపిస్తున్నారు శాంతెరీ నాయక్.
Comments
Please login to add a commentAdd a comment