
కెరీర్ రీ లాంచ్...!
తైవాన్ మహిళల అక్షరాస్యత శాతం 99.99. ప్రపంచంలో ఆ దేశానిదే తొలి స్థానం. మనదేశంలో మహిళల అక్షరాస్యత శాతం 70 దగ్గరే ఉంది. కానీ ఆశ్చర్యంగా ఉన్నత చదువులు చదువుకుని కూడా గృహిణులుగానే ఉండిపోతున్న మహిళలు మన దేశంలోనే ఎక్కువ. కారణం మాతృత్వం. వీరిలో ఎక్కువ మంది కొంతకాలం ఉద్యోగం చేసి బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ సంరక్షణ కోసం ఉద్యోగాన్ని వదిలేస్తున్న వాళ్లే. వీరంతా ఉద్యోగం అవసరం లేని వాళ్లు కాదు.
ఉద్యోగం అవసరం ఉండి కూడా తప్పని స్థితిలో ఉద్యోగం మానేస్తున్న వాళ్లే ఎక్కువ. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఉన్న అవకాశాలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉండడం లేదు. దాంతో ఉన్నత చదువులు చదివినప్పటికీ గృహిణులుగా మిగిలిపోతున్న మహిళలు ఏడాదికేడాదికీ పెరుగుతున్నారు.
చెన్నైకి చెందిన శంకరి సుధార్‌కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. ‘‘మా కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చి ఉంటే పాప నిద్ర పోయే సమయంలో ఆఫీస్ పని చేసుకునేదాన్ని. ఆ సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. నాలాంటి మహిళలను తిరిగి పని లోకి తీసుకురావడానికి నేనే ఒక వేదికను ఏర్పాటు చేశాను’’ అంటున్నారు శంకరి.
ప్రపంచం ముందుకెళుతోంది!
కంపెనీల ప్రతినిధుల సమావేశంలో శంకరి
‘‘నేను మద్రాస్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాను. ఎనిమిదేళ్లపాటు ఉద్యోగం చేసిన తర్వాత 2020లో మాతృత్వం కారణంగా ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. నాతోపాటు ఉద్యోగంలో చేరిన వాళ్లు ప్రమోషన్‌లతో పెద్ద పొజిషన్‌లకు వెళ్లారు. కొంతమంది విదేశాలకు వెళ్లారు.
ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే నేను మాత్రం నాలుగ్గోడల మధ్య చిక్కుకుపోయాననే భావన కలిగింది. నేను మాత్రమే కాదు ఇలా నాలాగ ఎందరో. మనదేశంలో 180 రోజులు ప్రసూతి సెలవులు, బిడ్డ సంరక్షణ కోసం మరో రెండేళ్ల సెలవులు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటి ఆచరణ మాత్రం కష్టసాధ్యమే. చాలా కంపెనీలు రాజీనామా ఇచ్చి మళ్లీ చేరమని సూచిస్తుంటాయి. ఒకసారి రాజీనామా ఇచ్చిన తర్వాత మళ్లీ చేరడం అనేది ఎందుకో కానీ చాలామంది విషయంలో సాధ్యం కావడం లేదు.
ఆయా కంపెనీల్లో సదరు పని నైపుణ్యానికి సంబంధించిన ఖాళీలు లేకపోవడం వంటి అనేకం ఇందుకు కారణాలు కావచ్చు. ఇలాంటి స్థితిలో చాలా మంది మహిళలు నిస్పృహలోకి జారిపోతున్నట్లు నా పరిశీలనలో అవగతమైంది. 73 శాతం మంది ప్రసవం సమయంలో, యాభై శాతం మంది బిడ్డ సంరక్షణ కోసం ఉద్యోగంలో విరామం తీసుకుంటున్నారు. వారిలో కొంతమంది బిడ్డ పెద్దయిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరినప్పటికీ చేరిన ఆరు నెలల్లోనే మళ్లీ మానేస్తున్నారు. మరికొంతమంది అదే సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటికీ తక్కువ వేతనానికి చేరాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.
కొత్త సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాలంటే వయసు అడ్డంకి అవుతోంది. మనదేశంలో మహిళల ఎదుగుదలకు కుటుంబం, పిల్లల బాధ్యతలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇలాంటి మహిళల్లో తమకంటూ ఉనికి కోల్పోయామనే ఆవేదన ఉంటోంది. మొత్తంగా నాకు తెలిసిందేమిటంటే... ఆర్థిక అవసరాల రీత్యా కావచ్చు, చదువుకుని ఖాళీగా ఉండడం ఇష్టం లేక కావచ్చు అనేక మంది మహిళలు కెరీర్‌ని పునరుద్ధరించుకోవాలని ఆశిస్తున్నారు. స్టార్టప్‌ల వైపు వెళ్తున్న వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు సరైన మద్దతు అందడం లేదు. మాతృత్వం అనేది నిజంగా వరమే. అది మహిళ పురోభివృద్ధికి నిరోధకంగా మారకూడదనిపించింది.
ఆ ఖాళీని నేనే ఎందుకు భర్తీ చేయకూడదు అని కూడా అనుకున్నాను. సమాజంలోని ఈ పరిస్థితికి అద్దం పట్టే విధంగా ‘ఓవర్ క్వాలిఫైడ్ హవుస్ వైఫ్’ అని నా స్టార్టప్‌కి పేరు పెట్టాను. పిక్ మై యాడ్, నౌ ఇన్ టెక్నాలజీస్ వంటి ఏడు వందల కంపెనీలతో మా కంపెనీని అనుసంధానం చేశాను. ఆ కంపెనీల్లో కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, వీడియో ఎడిటింగ్, డెవలపింగ్, టెస్టింగ్ వంటి ఉద్యోగాల అవసరం ఉంటుంది.
ఆయా కంపెనీలకు అవసరమైన స్కిల్స్ ఉన్న మహిళల రెజ్యూమ్‌ను వారి దృష్టికి తీసుకురావడం మా కర్తవ్యం. మా దగ్గర ఎన్‌రోల్ అయిన మూడు వేల ఐదు వందల మందిలో ఇప్పటికి ఆరువందలకు పైగా మహిళలు ఉద్యోగంలో చేరారు. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది 2022లో. ఈ సర్వీస్‌లో నేను కూడా గౌరవప్రదమైన రాబడిని అందుకోగలుగుతున్నాను’’ అని తన రీ లాంచ్ జర్నీని వివరిస్తూ మహిళలు పని చేయడం తమ కోసం మాత్రమే కాదు దేశాభివృద్ధికి కూడా చాలా అవసరం అన్నారు శంకరి సుధార్.