యువతలో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేరు.. ఆదిత్య శ్రీవాస్తవ. యూపీఎస్‌సీ పరీక్షలో టాప్ 1లో నిలిచిన ఆదిత్యకు తొలి ప్రయత్నంలో ‘ఫెయిల్యూర్’ ఎదురైంది. మరింత కష్టపడి రెండో ప్రయత్నంలో 236 ర్యాంకు సాధించాడు. ‘ఇది చాలదు’ అనుకొని తప్పులను సరిద్దుకొని మరో ప్రయత్నంలో నెంబర్ వన్‌గా నిలిచాడు లక్నోకు చెంది ఆదిత్య. ‘కష్టపడడం అవసరమేగానీ ఒక పద్ధతి ప్రకారం పడాలి’ అని స్మార్ట్ స్ట్రాటజీతో అపూర్వ విజయం సాధించాడు ఆదిత్య శ్రీవాస్తవ..
ప్రపంచంలోని లీడింగ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులలో ఒకటైన ‘గోల్డ్‌మాన్ శాక్స్’తో ప్రొఫెషనల్ జర్నీ ప్రారంభించాడు ఆదిత్య. ‘బెంగళూరులో పెద్ద బ్యాంకులో పని చేస్తాడు’ అని చుట్టాలు, మిత్రుల తన గురించి కొత్త వారికి పరిచయం చేసేవారు. తన గురించి గొప్పగా పరిచయం చేస్తున్న సంతోషంలో ఉండి, అక్కడికే పరిమితమై ఉంటే ఆదిత్య సివిల్ సర్వీసెస్‌లోకి అడుగు పెట్టేవాడు కాదేమో.
పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా సరే ఆదిత్య హృదయంలో సివిల్ సర్వీసులలోకి వెళ్లాలి అనే కోరిక బలంగా ఉండేది. సివిల్స్ విజేతల మాటలు తనకు ఇన్‌స్పైరింగ్‌గా అనిపించేవి. ఒక ప్రయత్నం చేసి చూడాలనిపించేది.
పదిహేను నెలల తరువాత..
ఉద్యోగాన్ని, బెంగళూరును వదిలి హోమ్ టౌన్ లక్నోకు వచ్చాడు. యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ కావడంప్రారంభించాడు. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అని కొద్దిమంది అన్నా ఆ మాటను పట్టించుకోలేదు.
2021.. పరీక్ష సమయం రానే వచ్చింది. అయితే ప్రిలిమినరీ స్టేజిలోనే ఫెయిల్యూర్ పలకరించింది. మామూలుగానైతే రథాన్ని వెనక్కి మళ్లించి వేరే కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అయితే ఆదిత్య నిరాశపడలేదు. వెనకడుగు వేయలేదు. ఎలాగైనా సరే తన కలను నిజం చేసుకోవాలి అని గట్టిగా అనుకున్నాడు. గత సంవత్సర ప్రశ్నపత్రాల ఆధారంగా ఇన్–డెప్త్ ఎనాలసిస్‌తో ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకున్నాడు. ప్రశ్నల సరళి, సెంటెన్స్ ఫార్మేషన్‌పై దృష్టి పెట్టాడు. మాక్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు. స్ట్రాటజిక్ ప్రిపరేషన్‌కుప్రాధాన్యత ఇచ్చాడు.
2022 యూపీఎస్‌సీ ఎగ్జామ్‌లో 236 ర్యాంకు సాధించాడు. ఇండియన్ పోలిస్ సర్వీస్(ఐపీఎస్)కు ఎంపికయ్యాడు. ట్రైనింగ్‌కు కూడా వెళ్లాడు. అయినా సరే, ఇంకా ఏదో సాధించాలనే తపన. టాపర్‌లతో పోల్చితే తాను ఎందుకు వెనకబడిపోయాననే కోణంలో లోతైన విశ్లేషణప్రారంభించాడు. చేసిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా సరిద్దుకోవాలి అనేదానిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు.
యూపీఎస్‌సీ తాజా ఫలితాల్లో అపూర్వమైన విజయాన్ని సాధించాడు. నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. రిజల్ట్ ప్రకటించడానికి ముందు మనసులో.. ‘టాప్ 70లో ఉండాలి’ అనుకున్నాడు ఆదిత్య. అయితే ఏకంగా మొదటి ర్యాంకు దక్కింది. అది అదృష్టం కాదు. కష్టానికి దొరికిన అసలు సిసలు ఫలితం. ‘సివిల్స్‌లో విజయం సాధించడానికి సెల్ఫ్–మోటివేషన్ అనేది ముఖ్యం’ అంటాడు ఆదిత్య శ్రీవాస్తవ.
పక్కా ప్రణాళిక..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవకు పరీక్షలలో బోలెడు మార్కులు సొంతం చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐఐటీ, కాన్పూర్‌లో బీటెక్, ఎంటెక్ చేశాడు. బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఐఐటీలో డెవలప్ చేసుకున్న ఎనాలటికల్ స్కిల్స్ యూపీఎస్‌సీ ప్రిపేరేషన్‌కు ఉపయోగపడ్డాయి. ‘కాన్సెప్టువల్ అండర్‌స్టాండింగ్’లాంటి వాటితో ప్రిపరేషన్ మెథడ్‌ను రూపొందించుకున్నాడు.
‘కష్టానికి పక్కా ప్రణాళిక తోడైతేనే విజయం సాధ్యం’ అనేది ఆదిత్య నమ్మే సిద్ధాంతం. పాఠ్యపుస్తకాలకు ఆవల ఆదిత్యకు నచ్చిన సబ్జెక్ట్...రాక్షస బల్లులు. వాటికి సంబంధించిన కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఆదిత్య శ్రీవాస్తవ నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మన దేశంలోనే ఉంటాను. దేశం కోసమే పనిచేస్తాను’
Comments
Please login to add a commentAdd a comment