కూరలను బాగా నూనె పోసి వేయించి ఉప్పూకారం మసాలా దట్టించినందువల్ల నోటికి రుచిగా ఉండచ్చేమోగాని ఆ కూరలలోని పోషక విలువలన్నీ చచ్చిపోయి నిస్సారమవుతాయి. త్వరగా జీర్ణం కావు. నూనె ఎక్కువైనందువల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, శరీరంలో కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం రావటం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతంగా ఉడకబెట్టినా అంతే... సారం లేని పదార్థాన్ని తిన్నట్టే. అది తినడం వల్ల ఆ ఆహారం మన ఒంటికి పట్టదు. అసలు మనం ఎలాంటి కూరలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
మనం తిన్న ఆహారం వంటబట్టాలంటే నూనెలో వేయించిన కూరలను తినే అలవాటును మానుకోవాలి. ఉడికించిన కూరలలో కొద్దిగా తాలింపు వేసుకుని తినే విధంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.
గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు అన్నింటిలోను అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. వాటి మోతాదుల్లో మాత్రమే తేడా ఉంటుంది. అందువల్ల మనకు అన్నీ అవసరమే. అయితే అన్నీ అందరికీ ఒకే రీతిలో అవసరం కావు. ఉదాహరణకు పాలు తాగే పసిపిల్లలకు ఒకరకమైన పోషకాలు కావాలి. చిన్న పిల్లలయితే మరొక రకమైన పోషకాలు కావాలి. యుక్తవయస్కులకు ఇంకొక రకం పోషకాలు కావాలి. అదేవిధంగా గర్భిణులకు ఒక రకమైన పోషకాలు, పెద్దవారికి, వృద్ధులకూ మరొక రకమైన పోషకాలూ కావాలి. అంటే అవసరాలనుబట్టి పోషకాలు మారతాయి. కాబట్టి తీసుకోవలసిన ఆహారం కూడా మారుతుంది. అదే విధంగా ఆహార చికిత్సా ప్రక్రియలో కూడా వ్యాధిని బట్టి, రోగిని బట్టి తీసుకోవలసిన ఆహారం మారుతుంది. ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం అంటే ఇదే.
నిజానికి ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం అనుకున్నంత తేలికకాదు. పోషకాలను బట్టి పరిశీలిస్తే గింజధాన్యాలలో అన్ని రకాల పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయని, ఆకు కూరలు, పండ్లు, దుంపలతో సహా బాదం, ఖర్జూర మొదలైన ఎండు ఫలాలలో ఏదో ఒక పోషక విలువ లోపించి ఉండటాన్ని మనం గమనించవచ్చు. కేవలం ఈ కారణం వల్ల గింజధాన్యాలను మాత్రమే తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి.
అవి త్వరగా జీర్ణంకావు. అందువల్ల, గింజధాన్యాలతోబాటు తప్పనిసరిగా త్వరగా జీర్ణం అయ్యే ఆకు కూరలు, పండ్లు కూడా అవసరం. ఇవి అన్నీ తెలిసినప్పుడే సమీకృత ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం సులభం అవుతుంది. ఈ విషయంలో మనలో చాలామందికి ఉన్న సాధారణ ఆహార విజ్ఞానం సరిపోదు. పోషకాహార నిపుణులతో లేదా ప్రకృతి వైద్యులతో సంప్రదించి, వారి సలహా తీసుకోవటం అవసరం.
సమీకృత ఆహారం.. కొన్ని సూచనలు..
ఎటువంటి ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలన్న విషయాన్ని అలా ఉంచితే సాధారణ ఆరోగ్యం దృష్ట్యా ఈ కింది సూచనలను పాటించటం మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతుంటారు.
రోజూ ఉదయం పచ్చికూర ముక్కలు (వెజిటబుల్ సలాడ్) తీసుకోవటం మంచి అలవాటు. దంతాల పటుత్వం లేని వారు కూర ముక్కలను మిక్సీలో వేసుకుని చిన్న చిన్న ముక్కల రూపంలోగాని, లేక జ్యూస్ రూపంలోగాని తీసుకోవచ్చు.
అన్నిరకాల, అన్ని రంగుల పండ్లను లేదా పళ్లరసాలను తీసుకోవాలి. ఆ క్రమంలో కాలానుగుణంగా వచ్చే సీజనల్ ఫలాలను తప్పనిసరిగా తీసుకోవాలి. మనం తినే ఆహారంలో కనీసం 30 లేక 40 శాతం పండ్లు ఉంటే మంచిది.
దంపుడు బియ్యం లేక మర పట్టని ముతకబియ్యం శ్రేష్ఠం. చిరుధాన్యాలు వాడటం మంచిది. మొలకెత్తిన గింజలు, కొబ్బరి, ఖర్జూర ప్రతిరోజూ తీసుకోవటం మంచిది.
ఇలా తీసుకోవాలి..
కనీసం వారానికి నాలుగు రోజులు ఆకుకూరలను ఇగురు లేదా పప్పు రూపంలో తీసుకోవాలి.
కాఫీ, టీ తాగే అలవాటును నెమ్మదిగా మానుకోవటం మంచిది, అలా మానుకోవడం సాధ్యం కాకపోతే, కనీసం మోతాదును తగ్గించాలి. రోజుకి ఒకటి లేక రెండుసార్లకు మించి తీసుకోరాదు.
పొగాకు, జర్దా, ధూమపానం, మత్తుపానీయాలను పూర్తిగా మానుకోవాలి.
కృత్రిమ రసాయనాలతో తయారు చేసిన, నిల్వ ఉన్న బేకరీ వస్తువులు, శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్), చాక్లెట్లు, ఫాస్ట్‌ఫుడ్స్, ఐస్ క్రీమ్ లాంటివి మన శరీరానికి హాని చేస్తాయి. అందువల్ల వీటిని సాధ్యమైనంత వరకు తగ్గించటం మంచిది.
ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఎందుకంటే, మన శరీరానికి అవసరమైనంత ఉప్పు మనం తీసుకునే పండ్లు, కూరగాయలలోనే ఉంటుంది.
ఆహారం ఎంపికలో మరొక ప్రధాన సమస్య అమ్లయుతమైన ఆహారం, క్షార యుతమైన ఆహారం, ఆమ్లాలు, క్షారాలు రెండూ మనకు అవసరమే అయినా, వాటి నిష్పత్తిలో తేడా ఉంది. ఆమ్లాల కన్నా క్షారాలు మనకు అధికంగా కావాలి. మనం తీసుకునే ఆహారం కూడా అదేవిధంగా ఉండాలి. అంటే ఆమ్లయుతమైన పదార్థాలు తక్కువగా, క్షారయుతమైన పదార్థాలు. ఎక్కువగా ఉండే విధంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.
అదేవిధంగా రోగగ్రస్థుల విషయంలో వ్యాధినిబట్టి ఆహార ఎంపిక ఉంటుంది. ఇది. అయితే ప్రధానంగా వైద్యుల పర్యవేక్షణలో జరగాలి.
ఇవి చదవండి: మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్..
Comments
Please login to add a commentAdd a comment