దేవుడు విడిచిపెట్టిన ప్రదేశాలలో మాత్రమే దయ్యాలు కనిపిస్తాయనేది నానుడి. అలాగే, ‘నిర్మానుషమైన ప్రదేశాల్లో చీకటి వేళల్లో మాత్రమే దయ్యాలు కనిపిస్తాయనుకుంటే పొరబాటే’ అంటారు చాలామంది. అందుకే కాబోలు.. మహారాష్ట్ర రాజధాని ముంబై పరిసర ప్రాంతాలు ఎంత రద్దీగా ఉన్నా.. ఎంత జన సందోహంతో నిండి ఉన్నా.. అక్కడ వెంటాడే భయానక కథలు కోకొల్లలుగా వినిపిస్తుంటాయి. అలాంటి కథల్లో బృందావన్ సొసైటీ హారర్ స్టోరీ ఒకటి.
ముంబై, థానే ప్రాంతంలో ‘బృందావన్ సొసైటీ’ హడలెత్తించే కథలకు బాగా ఫేమస్. అందులో పదుల సంఖ్యలో బిల్డింగ్స్, వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్స్ ఉంటాయి. అయితే అక్కడ నివసించే వారితో పాటు.. కాపలాకి వచ్చే వాచ్‌మన్, ఇంటి పని, వంట పని చేయడానికి వచ్చే పనివాళ్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇలా ప్రతి ఒక్కరూ ‘అపార్ట్‌మెంట్ 66బి’ గురించి కనీసం మాట్లాడాలన్నా భయపడతారు. అటు వైపు తేరిపార చూడాలన్నా వణికిపోతారు. అందులో దయ్యం ఉందని అక్కడివారి నమ్మకం. అందుకే ఆ దరిదాపుల్లోకి కూడా చాలామంది అడుగుపెట్టరు.
ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న దయ్యం తనకు ఎవరి వల్లనైనా ఇబ్బంది కలిగితే, వారిని లాగిపెట్టి కొడుతుందట! ఆ దయ్యం కొట్టిన చెంపదెబ్బకు గూబ గుయ్యిమంటుందట! అంతేకాదు, ఆ భవనం కారిడార్లలో ఏవేవో వింతస్వరాలు ప్రతిధ్వనిస్తుంటాయట! బెడ్ రూముల్లో ఏవో గుసగుసలు చెవిన పడతుంటాయట!
ఆ చుట్టుపక్కల నివసించేవారిలో కొందరు మాత్రం ఆ 66బిలో కచ్చితంగా ఏదో ప్రేతాత్మ ఉందని, అటుగా వెళ్లినా, ఆ వైపు పరిశీలనగా చూసినా ఎవరో వేగంగా తమవైపు వస్తున్నట్లుగా అనిపిస్తుంటుందని చెబుతారు.
అయితే అపార్టమెంట్ 66బి చరిత్రను తవ్వితే ఒక విషాదగాథ వినిపిస్తుంది. చాలా ఏళ్ల కిందట ఆ ఇంట్లో ఒంటరిగా ఉండే ఓ పెద్దాయన జీవితం మీద విరక్తితో, మానసిక ఒత్తిడితో బాల్కనీలోంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి బలవన్మరణం పోలీసు రికార్డుల్లో కూడా నమోదైంది. అయితే అప్పటి నుంచి అతని ఆత్మ ఆ పరిసరాల్లోనే తిరుగాడుతుందని, తనకు చిరాకు తెప్పించేవారిని కొట్టి భయభ్రాంతులను చేస్తుందని స్థానికుల్లో చాలామంది నమ్ముతారు.
స్థానికుల నమ్మకానికి తగినట్లుగానే ఆ 66బి ఫ్లా్లట్ ఇప్పటికీ ఖాళీగా ఉంది. కొంతమంది నివాసితులు భవనంలో దయ్యం ఉండే అవకాశమే లేదని కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం స్వయంగా తాము దయ్యం నీడను చూశామని, దాని గొంతును విన్నామని, దయ్యం చేతిలో దెబ్బలు కూడా తిన్నామని చెబుతుంటారు. ఇంకొందరైతే ఆ అపార్ట్‌మెంట్‌లో ఆ చుట్టు ప్రక్కల కేవలం ఒక్క దయ్యమే లేదని, చాలా దయ్యాలు ఉన్నాయని హడలెత్తిస్తారు. ఆ మాట విన్న కొందరు మాత్రం.. ‘ఇక్కడ చాలా దయ్యాలేమీ లేవు.. కొట్టే దయ్యం ఒక్కటే ఉంది. దానితో జాగ్రత్తగా ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని చెబుతారు.
ఏది ఏమైనా, ఆ సొసైటీకి వెళ్లిన కొత్తవారు ఈ వింత అనుభవాన్ని చవిచూడక మానరట! ఎందుకంటే కొత్తవారిని అక్కడి దెయ్యం ఈజీగా గుర్తుపడతుందట! తన దెబ్బను రుచి చూపిస్తుందట! పాతవారైనా సరే ఆ దయ్యానికి ఇబ్బంది కలిగిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చి పోతుందట. మరి నిజంగానే అక్కడ ఆ పెద్దాయన ఆత్మ ఉందా? అసలు అది ఆ అపార్ట్‌మెంట్ యజమాని ఆత్మేనా? అసలు అక్కడుండేవారిని, అక్కడికి కొత్తగా వచ్చేవారిని కొడుతున్న అదృశ్య శక్తి ఏమిటి? ఆ ఆత్మతో పాటు మరికొన్ని అతీంద్రియశక్తులు అక్కడ గుమిగూడాయా? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన
ఇవి చదవండి: దేవుళ్ల పండగ అంటే తెలుసు..! మరి దెయ్యాల పండగ?
Comments
Please login to add a commentAdd a comment