విమానంలో వెళుతూ పైనుంచి చూస్తే, ఈ దీవి యుద్ధనౌకలా కనిపిస్తుంది. అలాగని, ఇదేమీ పర్యాటకులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన దీవి కాదు. దీని వెనుకనున్న చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ప్రస్తుతం జపాన్‌లోని నాగసాకి నగరం పరిధిలోనున్న ‘హషిమా’ అనే ఈ దీవిని ఒకప్పుడు యుద్ధఖైదీల బందిఖానాగా ఉపయోగించేవారు. వేలాదిమంది చైనీస్, కొరియన్ ఖైదీలను ఈ దీవిలో నిర్బంధించేవారు.
ఇక్కడ బొగ్గు నిల్వలు బయటపడటంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన కొన్నేళ్ల వరకు ఖైదీలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ, బొగ్గు నిల్వలను వెలికితీసేవారు. బొగ్గు గనులు మొదలయ్యాక ఇక్కడ ఇళ్లు, స్కూళ్లు వెలిశాయి. వాటితో పాటే ఒక ఆలయం, షాపింగ్ సెంటర్ ఏర్పడ్డాయి. ఈ దీవిలో తొలిసారిగా 1887లో బొగ్గు నిల్వలను గుర్తించారు. వాహనాల తయారీ సంస్థ ‘మిత్సుబిషి’ ఈ దీవిని 1890లో కొనుగోలు చేసింది. జపాన్ ప్రభుత్వం ఇక్కడకు తరలించే యుద్ధఖైదీలనే కార్మికులుగా ఉపయోగించుకుని, వారితో వెట్టిచారికి చేయించుకుని, భారీగా లాభాలు గడించింది.
మిత్సుబిషి సంస్థ 480 అడుగుల మీటర్ల పొడవు, 160 మీటర్ల వెడల్పు గల స్థావరంలో గని కార్మికులుగా పనిచేసే 5,300 మంది ఖైదీలను నిర్బంధంలో ఉంచేది. గని తవ్వకాల్లో జరిగే ప్రమాదాల వల్ల, పోషకాహార లోపం వల్ల, జపాన్ సైనికులు అమలు జరిపే మరణ శిక్షల వల్ల దాదాపు 1,700 మంది ఖైదీలు అర్ధాంతరంగా ఇక్కడే మరణించారు. ఇక్కడి బొగ్గు నిల్వలు 1974 నాటికి అంతరించిపోవడంతో, వెట్టిచాకిరి చేసే కార్మికులకు విముక్తి దొరికింది. వారు ఈ దీవిని ‘జైలు దీవి’ అని, ‘యుద్ధనౌక దీవి’ అని పేర్లు పెట్టారు.
గడచిన ఐదు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఈ దీవిలోని కట్టడాలన్నీ ఇప్పుడు శిథిలమైపోయాయి. మిత్సుబిషి సంస్థ నుంచి నాగసాకి నగరపాలక సంస్థ 2005లో ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. ఈ దీవిలోనే 2012లో జేమ్స్‌బాండ్ సినిమా ‘స్కై ఫాల్’ షూటింగ్ జరిగింది. యునెస్కో 2015లో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. నాగసాకి నగరపాలక సంస్థ ఈ దీవి అభివృద్ధికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అయినా, కుతూహలం ఉన్న కొద్దిమంది పర్యాటకులు అరుదుగా ఇక్కడకు వచ్చి, ఫొటోలు దిగి వెళుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment