Hashima
-
‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది!
విమానంలో వెళుతూ పైనుంచి చూస్తే, ఈ దీవి యుద్ధనౌకలా కనిపిస్తుంది. అలాగని, ఇదేమీ పర్యాటకులను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన దీవి కాదు. దీని వెనుకనున్న చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ప్రస్తుతం జపాన్‌లోని నాగసాకి నగరం పరిధిలోనున్న ‘హషిమా’ అనే ఈ దీవిని ఒకప్పుడు యుద్ధఖైదీల బందిఖానాగా ఉపయోగించేవారు. వేలాదిమంది చైనీస్, కొరియన్ ఖైదీలను ఈ దీవిలో నిర్బంధించేవారు. ఇక్కడ బొగ్గు నిల్వలు బయటపడటంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన కొన్నేళ్ల వరకు ఖైదీలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ, బొగ్గు నిల్వలను వెలికితీసేవారు. బొగ్గు గనులు మొదలయ్యాక ఇక్కడ ఇళ్లు, స్కూళ్లు వెలిశాయి. వాటితో పాటే ఒక ఆలయం, షాపింగ్ సెంటర్ ఏర్పడ్డాయి. ఈ దీవిలో తొలిసారిగా 1887లో బొగ్గు నిల్వలను గుర్తించారు. వాహనాల తయారీ సంస్థ ‘మిత్సుబిషి’ ఈ దీవిని 1890లో కొనుగోలు చేసింది. జపాన్ ప్రభుత్వం ఇక్కడకు తరలించే యుద్ధఖైదీలనే కార్మికులుగా ఉపయోగించుకుని, వారితో వెట్టిచారికి చేయించుకుని, భారీగా లాభాలు గడించింది. మిత్సుబిషి సంస్థ 480 అడుగుల మీటర్ల పొడవు, 160 మీటర్ల వెడల్పు గల స్థావరంలో గని కార్మికులుగా పనిచేసే 5,300 మంది ఖైదీలను నిర్బంధంలో ఉంచేది. గని తవ్వకాల్లో జరిగే ప్రమాదాల వల్ల, పోషకాహార లోపం వల్ల, జపాన్ సైనికులు అమలు జరిపే మరణ శిక్షల వల్ల దాదాపు 1,700 మంది ఖైదీలు అర్ధాంతరంగా ఇక్కడే మరణించారు. ఇక్కడి బొగ్గు నిల్వలు 1974 నాటికి అంతరించిపోవడంతో, వెట్టిచాకిరి చేసే కార్మికులకు విముక్తి దొరికింది. వారు ఈ దీవిని ‘జైలు దీవి’ అని, ‘యుద్ధనౌక దీవి’ అని పేర్లు పెట్టారు. గడచిన ఐదు దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఈ దీవిలోని కట్టడాలన్నీ ఇప్పుడు శిథిలమైపోయాయి. మిత్సుబిషి సంస్థ నుంచి నాగసాకి నగరపాలక సంస్థ 2005లో ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. ఈ దీవిలోనే 2012లో జేమ్స్‌బాండ్ సినిమా ‘స్కై ఫాల్’ షూటింగ్ జరిగింది. యునెస్కో 2015లో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. నాగసాకి నగరపాలక సంస్థ ఈ దీవి అభివృద్ధికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అయినా, కుతూహలం ఉన్న కొద్దిమంది పర్యాటకులు అరుదుగా ఇక్కడకు వచ్చి, ఫొటోలు దిగి వెళుతుంటారు. ఇవి చదవండి: పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!' -
అన్నీ ఉన్నాయ్.. మనుషులు తప్ప!
'ఊరి చివర ఉన్న పెద్ద బంగ్లా అది. మధ్యాహ్నం వేళ పొరుగూరికి వెళ్తున్న ఓ వ్యక్తి ప్రయాణ బడలిక తీర్చుకునేందుకు అక్కడ ఆగాడు. కాపలా లేని ఆ బంగ్లాలోకి ప్రవేశించాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ బంగ్లాలో మంచినీరు అందించేందుకైనా ఎవరో ఒకరు కనిపించకపోతారా అనే ఆశతో చుట్టూ చూశాడు. అంతే.. కొద్దిసేపటికే అక్కడ మానవమాత్రులెవరూ నివసించడం లేదని అతనికి అర్థమైంది. అతని గుండెలు అదిరిపోయాయి. వెనుదిరిగేందుకు సిద్ధపడ్డాడు. అంతలో ఈశాన్య భాగంలో ఏదో పెద్ద చప్పుడు...'లాంటి కథలు చదవగానే ఓ రకమైన భయం ఆవహిస్తుంది. పట్టపగలైనా, నడిరాత్రైనా మానవ సంచారం లేని ప్రదేశాల్లోకి ప్రవేశం భయాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. జపాన్‌లోని 'హషిమా దీవి' కూడా మానవ సంచారం లేనిదే..! పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లు, ప్రతి లివింగ్ రూమ్‌లోనూ బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఓ హాస్పిటల్, సినిమా థియేటర్, జిమ్నాజియం, డాన్స్ హాల్.. వీటన్నిటితో పాటు ఓ స్కూల్, అందులో చిందరవందరగా పడేసి ఉన్న పుస్తకాలు.. ఈ హంగామా అంతా చూస్తుంటే ఇదేదో చిన్నపాటి పట్టణంలా అనిపించకమానదు. నిజానికి జపాన్‌లోని నాగసాకి సమీపంలో ఉన్న 16 ఎకరాల 'హషిమా దీవి'లో ఇవన్నీ ఉన్నాయి. అయితే, ఈ సదుపాయాలను వినియోగించుకోవడానికి ప్రస్తుతం అక్కడ మనుషులే లేరు. బొగ్గు గనులు.. ఇక్కడి ప్రజలు ఏమయ్యారో తెలుసుకోవాలంటే ముందు ఆ దీవి నేపథ్యం తెలుసుకోవాలి. జపాన్ పారిశ్రామికీకరణలో భాగంగా హషిమా దీవిని ప్రభుత్వం 1890లో 'మిత్సుబిషి' సంస్థకు అమ్మేసింది. ఇక్కడి సముద్ర జలాల అడుగున భారీస్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికితీసే పని మిత్సుబిషి చేపట్టింది. దీని కోసం వందల సంఖ్యలో కార్మికులను హషిమాకు రప్పించింది. వీరికోసం అప్పట్లోనే కాంక్రీటు నిర్మాణాలు చేపట్టింది ఆ కంపెనీ. నాటికి జపాన్‌లోనే అతిపెద్దదైన 9 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను సైతం నిర్మించారు. దీంతో కార్మికుల సంఖ్య రోజురోజుకీ పెరగసాగింది. అలా ఒకనాటికి 5,259 మందితో ఈ దీవి కళకళలాడింది. ఏమయ్యారు..? ఇలా 1960 వరకూ దాదాపు 15.7 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీశారు. అయితే.. ఈ సమయంలో బొగ్గు నిక్షేపాలు తవ్వకం కఠినమవడం, వ్యయం పెరగడం, జపాన్‌లో ఇంధన అవసరాలకోసం బొగ్గు స్థానంలో పెట్రోలియంను ప్రవేశపెట్టడం లాంటివి ఈ దీవిని మూతపడేలా చేశాయి. చివరకు 1974లో మిత్సుబిషి సంస్థ ఈ దీవిలో తవ్వకాలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసి కార్మికులు, వారి కుటుంబాలతో సహా నాగసాకి పట్టణానికి పయనమయ్యారు. మళ్లీ ఎప్పుడూ వారు ఆ దీవికేసి కన్నెత్తి చూడలేదు. కారణం.. అత్యంత కష్టమైన బొగ్గు వెలికితీతకు జపాన్ తన పౌరులను ఉపయోగించలేదు. ప్రపంచయుద్ధ కాలంలో బంధీలుగా పట్టుబడ్డ కొరియా, చైనాలకు చెందిన యుద్ధఖైదీలను ఈ పనికి వాడుకుంది. వారిని బానిసలుగా భావించి, చిత్రహింసలకు గురిచేసి బొగ్గుగనుల్లోకి పంపేవారు అధికారులు. దీంతో కార్మికులు ఎన్నడూ ఆ దీవిలో ఆనందంగా ఉండేవారు కాదు. దాదాపు 200 మందికి పైగా తవ్వకాల్లోనే చనిపోయారని అంచనా. అయితే, ఈ విషయాలేవీ బయటకు పొక్కలేదు. కొరియన్ కార్మికులు ఈ దీవిని జైలుగా భావించేవారు. అందుకే ఒక్కసారి ఉపశమనం లభించాక వారు మళ్లీ ఆ దీవివైపు చూసేందుకే ఇష్టపడలేదు. దెయ్యాల దీవిగా.. ఏళ్లుగా దీవిలో మానవ సంచారం లేనప్పటికీ నాటి కాంక్రీటు కట్టడాలు మాత్రం చెక్కుచెదరలేదు. దీంతో హషిమాకు దెయ్యాల దీవిగా పేరొచ్చింది. కథలు కథలుగా ఇక్కడి పరిస్థితుల గురించి చెప్పుకొనేవారు. దీంతో హషిమాను సందర్శించాలనే కోరిక పాశ్చాత్యుల్లో పెరగసాగింది. ఇది గమనించిన జపాన్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి దిశగా 2009లో ఈ దీవిలోకి ప్రవేశాన్ని కల్పించింది. అయితే రాత్రి పూట ఇక్కడ నివసించడం మాత్రం నిషేధం.