అన్నీ ఉన్నాయ్.. మనుషులు తప్ప! | Inside Japan's abandoned ghost island of Hashima | Sakshi
Sakshi News home page

అన్నీ ఉన్నాయ్.. మనుషులు తప్ప!

Published Thu, Sep 17 2015 9:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:34 AM

అన్నీ ఉన్నాయ్.. మనుషులు తప్ప!

అన్నీ ఉన్నాయ్.. మనుషులు తప్ప!

'ఊరి చివర ఉన్న పెద్ద బంగ్లా అది. మధ్యాహ్నం వేళ పొరుగూరికి వెళ్తున్న ఓ వ్యక్తి ప్రయాణ బడలిక తీర్చుకునేందుకు అక్కడ ఆగాడు. కాపలా లేని ఆ బంగ్లాలోకి ప్రవేశించాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ బంగ్లాలో మంచినీరు అందించేందుకైనా ఎవరో ఒకరు కనిపించకపోతారా అనే ఆశతో చుట్టూ చూశాడు. అంతే.. కొద్దిసేపటికే అక్కడ మానవమాత్రులెవరూ నివసించడం లేదని అతనికి అర్థమైంది. అతని గుండెలు అదిరిపోయాయి. వెనుదిరిగేందుకు సిద్ధపడ్డాడు. అంతలో ఈశాన్య భాగంలో ఏదో పెద్ద చప్పుడు...'లాంటి కథలు చదవగానే ఓ రకమైన భయం ఆవహిస్తుంది. పట్టపగలైనా, నడిరాత్రైనా మానవ సంచారం లేని ప్రదేశాల్లోకి ప్రవేశం భయాన్ని కలిగిస్తుందనడంలో
 సందేహం లేదు. జపాన్‌లోని 'హషిమా దీవి' కూడా మానవ సంచారం లేనిదే..!
 
 పదుల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు, ప్రతి లివింగ్ రూమ్‌లోనూ బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఓ హాస్పిటల్, సినిమా థియేటర్, జిమ్నాజియం, డాన్స్ హాల్.. వీటన్నిటితో పాటు ఓ స్కూల్, అందులో చిందరవందరగా పడేసి ఉన్న పుస్తకాలు.. ఈ హంగామా అంతా చూస్తుంటే ఇదేదో చిన్నపాటి పట్టణంలా అనిపించకమానదు. నిజానికి జపాన్‌లోని నాగసాకి సమీపంలో ఉన్న 16 ఎకరాల 'హషిమా దీవి'లో ఇవన్నీ ఉన్నాయి. అయితే, ఈ సదుపాయాలను వినియోగించుకోవడానికి ప్రస్తుతం అక్కడ మనుషులే లేరు.

 బొగ్గు గనులు..
 ఇక్కడి ప్రజలు ఏమయ్యారో తెలుసుకోవాలంటే ముందు ఆ దీవి నేపథ్యం తెలుసుకోవాలి. జపాన్ పారిశ్రామికీకరణలో భాగంగా హషిమా దీవిని ప్రభుత్వం 1890లో 'మిత్సుబిషి' సంస్థకు అమ్మేసింది. ఇక్కడి సముద్ర జలాల అడుగున భారీస్థాయిలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికితీసే పని మిత్సుబిషి చేపట్టింది. దీని కోసం వందల సంఖ్యలో కార్మికులను హషిమాకు రప్పించింది. వీరికోసం అప్పట్లోనే కాంక్రీటు నిర్మాణాలు చేపట్టింది ఆ కంపెనీ. నాటికి జపాన్‌లోనే అతిపెద్దదైన 9 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను సైతం నిర్మించారు. దీంతో కార్మికుల సంఖ్య రోజురోజుకీ పెరగసాగింది. అలా ఒకనాటికి 5,259 మందితో ఈ దీవి కళకళలాడింది.

 ఏమయ్యారు..?
 ఇలా 1960 వరకూ దాదాపు 15.7 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీశారు. అయితే.. ఈ సమయంలో బొగ్గు నిక్షేపాలు తవ్వకం కఠినమవడం, వ్యయం పెరగడం, జపాన్‌లో ఇంధన అవసరాలకోసం బొగ్గు స్థానంలో పెట్రోలియంను ప్రవేశపెట్టడం లాంటివి ఈ దీవిని మూతపడేలా చేశాయి. చివరకు 1974లో మిత్సుబిషి సంస్థ ఈ దీవిలో తవ్వకాలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసి కార్మికులు, వారి కుటుంబాలతో సహా నాగసాకి పట్టణానికి పయనమయ్యారు. మళ్లీ ఎప్పుడూ వారు ఆ దీవికేసి కన్నెత్తి చూడలేదు.

 కారణం..
 అత్యంత కష్టమైన బొగ్గు వెలికితీతకు జపాన్ తన పౌరులను ఉపయోగించలేదు. ప్రపంచయుద్ధ కాలంలో బంధీలుగా పట్టుబడ్డ కొరియా, చైనాలకు చెందిన యుద్ధఖైదీలను ఈ పనికి వాడుకుంది. వారిని బానిసలుగా భావించి, చిత్రహింసలకు గురిచేసి బొగ్గుగనుల్లోకి పంపేవారు అధికారులు. దీంతో కార్మికులు ఎన్నడూ ఆ దీవిలో ఆనందంగా ఉండేవారు కాదు. దాదాపు 200 మందికి పైగా తవ్వకాల్లోనే చనిపోయారని అంచనా. అయితే, ఈ విషయాలేవీ బయటకు పొక్కలేదు. కొరియన్ కార్మికులు ఈ దీవిని జైలుగా భావించేవారు. అందుకే ఒక్కసారి ఉపశమనం లభించాక వారు మళ్లీ ఆ దీవివైపు చూసేందుకే ఇష్టపడలేదు.

 దెయ్యాల దీవిగా..
 ఏళ్లుగా దీవిలో మానవ సంచారం లేనప్పటికీ నాటి కాంక్రీటు కట్టడాలు మాత్రం చెక్కుచెదరలేదు. దీంతో హషిమాకు దెయ్యాల దీవిగా పేరొచ్చింది. కథలు కథలుగా ఇక్కడి పరిస్థితుల గురించి చెప్పుకొనేవారు. దీంతో హషిమాను సందర్శించాలనే కోరిక పాశ్చాత్యుల్లో పెరగసాగింది. ఇది గమనించిన జపాన్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి దిశగా 2009లో ఈ దీవిలోకి ప్రవేశాన్ని కల్పించింది. అయితే రాత్రి పూట ఇక్కడ నివసించడం మాత్రం నిషేధం.

http://img.sakshi.net/images/cms/2015-09/41442463347_Unknown.jpg

http://img.sakshi.net/images/cms/2015-09/41442463363_Unknown.jpg

http://img.sakshi.net/images/cms/2015-09/81442463385_Unknown.jpg

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement