
కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో, కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ లిమిటెడ్ (సీసీహెచ్‌ఎల్) ‘గ్లోబల్ యూనిటీ అగైనెస్ట్ టెర్రరిజమ్’ పేరిట వినూత్న రీతిలో సందేశాత్మక కార్యక్రమాన్ని నిర్వహించింది. బేగంపేటలోని క్లబ్ ప్రాంగణంలో కొవ్వొత్తులు చేత పట్టుకొని మోడల్స్ మంగళవారం ప్రదర్శన చేశారు. శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించే నినాదాలు ముద్రించిన ప్రత్యేక వస్త్రధారణలో మౌనంగా ‘పీస్ వాక్’ చేశారు.
మృతి చెందిన పర్యాటకులకు నివాళిగా 26 కొవ్వొత్తుల ప్రదర్శనలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంట్రీ క్లబ్ సీఎండీ వై.రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ ‘గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాద దాడులను ఖండిస్తూ నటుడు సునీల్ దత్ తో కలిసి ‘గ్రౌండ్ జీరో’ నిర్వహించామన్నారు.
అలాగే శాంతి సామరస్యాల పట్ల తమ నిబద్ధతకు ప్రతీకగా లక్ష మంది సంతకం చేసిన చారిత్రాత్మక ‘ఫ్రెండ్‌షిప్ బ్యాండ్’ని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆమోదించారన్నారు. అదే క్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, తీవ్రవాదం ప్రపంచ ముప్పుగా మారిన నేపథ్యంలో దీనిని ఎదుర్కోడానికి అంతర్జాతీయ సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నామన్నారు.
(చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...)