‘మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది?’ సమాధానం దొరకని ప్రశ్న! అయితే ‘ఆత్మ అమరం’ అని నమ్మేవారు అశరీరవాణికి పెద్దపీట వేస్తారు. దెయ్యాలు, పిశాచాలు, సైతాన్లు.. ఇలా కంటికి కనిపించని అతీంద్రియ శక్తులను బలంగా నమ్ముతారు. అలాంటివారి నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ గ్రీన్ బ్రియర్ ఘోస్ట్ మిస్టరీ.
ఓ ఆత్మ తన కథను తనే తిరగరాసుకుంది. తన మర్డర్ కేసుని తనే రీ–ఓపెన్ చేయించుకుని.. తనని చంపినవాడికి శిక్షపడేలా చేసింది. నమ్మబుద్ధి కావట్లేదు కదూ! కానీ 18వ శతాబ్దం చివర్లో అమెరికాని వణికించిన ఉదంతం ఇది.
1897.. జనవరి 23.. మిట్ట మధ్యాహ్నం.. వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్రియర్ కౌంటీలో ఓ బాలుడు.. గావుకేకలు పెడుతూ తన తల్లి దగ్గరకు పరుగుతీశాడు. ‘ఎల్వా ఆంటీ.. ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉందమ్మా’ అని చెప్పాడు రొప్పుతూ. ‘ఏమైందీ’ అంటూ కంగారు పడింది ఆ బాలుడి తల్లి.
‘ఎల్వా ఆంటి భర్త ఎడ్వర్డ్ అంకుల్ లేడూ.. తను మార్కెట్‌కు పోతూ పోతూ.. ఎల్వా ఆంటీకి ఏమైనా కావాలేమో కనుక్కుని రా అంటూ నన్ను వాళ్ల ఇంటికి పంపించాడు. నేను వెళ్లేసరికి ఆమె మాట లేకుండా పడి ఉందమ్మా..’ అంటూ వణుకుతూ వివరించాడు తనకు తెలిసిందీ.. తను చూసిందీ! అది విన్న వెంటనే కొడుకును తీసుకుని డాక్టర్ నాప్ దగ్గరకు పరుగుపెట్టింది ఆ బాలుడి తల్లి.
1896 అక్టోబర్‌లో ఎల్వా జోనా హిస్టర్‌కీ, ఎరాస్మన్ (ఎడ్వర్డ్) షూతో పెళ్లైంది. ఎడ్వర్డ్ స్థానికంగా కమ్మరి పనిచేసేవాడు. ఇంటికి వెళ్లిన పిల్లాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఎడ్వర్డ్.. కంగారుగా ఇంటికి బయలుదేరాడు. తను ఇంటికి చేరేలోపే అక్కడ డాక్టర్‌తో పాటు చుట్టుపక్కలవాళ్లు గుమిగూడి ఉన్నారు. వారి మధ్యలో అచేతనంగా పడున్న ఎల్వాని చూసి.. నిశ్చేష్టుడైపోయాడు ఎడ్వర్డ్.
ఓ పక్క డాక్టర్ ఆమెని చెక్ చేస్తున్నాసరే.. భార్య ముఖాన్ని పట్టుకుని వదిలిపెట్టలేదు ఎడ్వర్డ్. ఏడుస్తూనే ఉన్నాడు. భార్యకు ఎంతో ఇష్టమైన స్కార్ఫ్ అంటూ ఓ స్కార్ఫ్ తెచ్చి ఎల్వా మెడకు చుట్టాడు. నా భార్య విశ్రాంతి తీసుకుంటుందని తల కింద దిళ్లు పెట్టి జోకొట్టాడు. అతని స్థితి చూసిన వాళ్లంతా ‘అయ్యో పాపం’ అంటూ కంటతడిపెట్టారు.
ఎల్వా తల దగ్గర భర్త ఎడ్వర్డ్ పడి ఏడుస్తుంటే, డాక్టర్ నాప్.. ఎల్వాను చెక్ చేసి.. ఆమె ప్రాణాలతో లేదని నిర్ధారించాడు. పైగా ఎల్వా గత కొన్ని రోజులుగా తన దగ్గర గైనిక్ సమస్యకు చికిత్స తీసుకుంటుండడంతో .. ఆ సమస్యే తీవ్రమై ఆమె చనిపోయుంటుందని భావించాడతను. అదే విషయాన్ని అందరికీ చెప్పాడు. ఎల్వా తల్లి మేరీ జేన్ హిస్టర్ కూడా అక్కడికి చేరుకుని, కూతురి శవాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చింది. రావాల్సిన వాళ్లు, చూడాల్సిన వాళ్లు ఎవ్వరూ లేరని తేలిన తర్వాత.. మరునాడు జనవరి 24న ఎల్వా మృతదేహానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించారు.
అప్పుడే మొదలైంది అసలు కథ..
నెల రోజులు గడవక ముందే ఎల్వా తల్లి మేరీకి వరుసగా నాలుగు రోజుల పాటు ఎల్వా కలలోకి వచ్చింది. తనది సహజమరణం కాదని.. తన భర్త ఎడ్వర్డే తనని బలవంతంగా చంపేశాడంటూ మొరపెట్టుకుంది. మేరీ ఆశ్చర్యపోయింది. ‘సాక్ష్యం లేనిదే కోర్టులో ఎలా నిరూపించగలను?’ అనుకుంటూనే స్థానిక ప్రాసిక్యూటర్ జాన్ ఆల్ఫ్రెడ్‌ని కలిసింది.
తన కూతురు కలలోకి వచ్చిందని, కేసును రీ–ఓపెన్ చెయ్యాలని ప్రాధేయపడింది. ఆమె వాదనని మొదట్లో కొట్టిపారేసిన జాన్ .. అనుమానం వచ్చి ఎడ్వర్డ్ ఎలాంటివాడని స్థానికంగా ఆరా తీశాడు. ఎల్వాను నిరంతరం ఎడ్వర్డ్ కొట్టేవాడని, అతడే చంపేసుంటాడనే అనుమానాలు వెలువడ్డాయి. వెంటనే డాక్టర్ నాప్‌ని ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్ జాన్ .
‘ఎడ్వర్డ్ ఏడుస్తూ ఉండటంతో.. ఎల్వా డెడ్ బాడీని సరిగా పరీక్షించలేకపోయాను’ అని నాప్ తెలిపాడు. దాంతో.. కేసు రీ–ఓపెన్ అయ్యింది. 1897 ఫిబ్రవరి 22న ఎల్వా బాడీని సమాధి నుంచి బయటికి తీసి.. ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. 1897 మార్చి 9కి రిపోర్టుల్లో ఎల్వాది హత్యేనని తేలింది. మెడ విరిచి చంపినట్లు ఎడ్వర్డ్ వేలిముద్రలు కూడా దొరికాయి.
విరిగిన మెడ వాలిపోకుండా ఉండటానికే ఆ రోజు శవం మెడకు స్కార్ఫ్ చుట్టాడని, తల కింద దిండ్లు పెట్టాడని అందరికీ అర్థమైంది. దాంతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణలో ఎడ్వర్డ్ గురించి మరిన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఎడ్వర్డ్‌కి ఎల్వా మొదటి భార్య కాదని.. మూడో భార్యని తెలిసింది.
మొదటి భార్య.. ‘ఇలాంటి క్రూరుడితో బతకడం నా వల్ల కాదు’ అని విడాకులు ఇచ్చి వెళ్లిపోగా.. రెండో భార్య అనుమానాస్పద రీతిలో చనిపోయింది. అంటే ఆమెని కూడా ఎడ్వర్డే చంపి ఉంటాడనే ఆరోపణలు బలపడ్డాయి. పైగా ఎడ్వర్డ్.. ఏడు పెళ్లిళ్లు చేసుకోవాలనేది తన కోరికని, అందుకే ఎల్వాను చంపానని, సరైన ఆధారాలు లేవు కాబట్టి.. త్వరలోనే విడుదల అవుతానని తోటి ఖైదీలతో గర్వంగా చెప్పుకునేవాడట.
1897 జూన్ 22న కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఎల్వా ఆత్మకి సంబంధించి చర్చ వచ్చినప్పుడు.. ‘కోర్టు ముందు ఆత్మల ప్రస్తావన వద్దని.. రిపోర్టులు, ఆధారాలతోనే ముందుకు వెళ్దామని’ జడ్జ్ అడ్డుపడటంతో కేసులో ఆత్మ ప్రస్తావన లేకుండాపోయింది. మొత్తానికీ ఎల్వాని ఉద్దేశపూర్వకంగానే ఎడ్వర్డ్ హత్య చేసినట్లు జూలై 11న తీర్పు రావడంతో ఎడ్వర్డ్‌కి జీవిత ఖైదు పడింది.
ఓ అమాయకురాల్ని పొట్టనపెట్టుకున్నాడని, అతడ్ని తామే చంపుతామని చాలామంది ఎల్వా సానుభూతిపరులు.. జైలుపై దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో ఆ ప్రమాదం నుంచి ఎడ్వర్డ్ తప్పించుకున్నాడు. కానీ తర్వాత మూడేళ్లకే అంటే 1900 మార్చి 13న వెస్ట్ వర్జీనియా, మౌండ్స్ విల్లేలోని స్టేట్ పెనిటెన్షియరీలో ఎడ్వర్డ్ చనిపోయాడు. అయితే అది సహజ మరణం కాదు.
తెలియని ఏదో వ్యాధి సోకి, చిత్రవధ అనుభవిస్తూ చనిపోయాడు. ఎల్వా ఆత్మే అతడిని చంపిందని అంతా అనుకున్నారు. ఆ వ్యాధి ఎవరికీ సోకే ప్రమాదం లేకుండా.. స్థానిక శ్మశాన వాటికలో అతనిని ఖననం చేశారు. ఎల్వా సమాధి దగ్గర.. వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ఓ చారిత్రక శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసింది. దానిపై ఇలా ఉంటుంది..
‘ఎల్వా ఆత్మ.. తన తల్లి కలలోకి వచ్చి.. తనది సహజ మరణం కాదని చెప్పింది. ఆమె భర్తే ఆమెని హత్య చేసినట్లు తేలింది. ఒక ఆత్మ సాయంతో ఓ హత్య కేసు పరిష్కరించడం ఇదే మొదటిసారి’ అని. మొత్తానికీ ఈ కథ చరిత్రలో ఓ ఊహించని మిస్టరీగా మిగిలిపోయింది.
-సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment