‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’ | Sneha Philip: The mystery of the woman who disappeared | Sakshi
Sakshi News home page

mystery : ‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’

Published Sun, Dec 1 2024 8:42 AM | Last Updated on Sun, Dec 1 2024 9:45 AM

Sneha Philip: The mystery of the woman who disappeared

చరిత్ర మిగిల్చిన చీకటి రోజుల్లో అమెరికా వణికిన రోజు 2001 సెప్టెంబర్‌ 11. నాడు ఉగ్రవాదులు ట్విన్‌ టవర్స్‌పై చేసిన దాడి యావత్‌ ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది. అయితే నిజానికి ఆ విధే పనికట్టుకుని, స్నేహా ఫిలిప్‌ అనే భారతీయ డాక్టరమ్మ కథను, నాటి అమెరికావాసుల వ్యథలతో ముడిపడేలా ముందే లిఖించింది కాబోలు!అది సెప్టెంబర్‌ 11, సాయంత్రం 5 అవుతోంది, రోడ్లపై లక్షల్లో జనాలు, వేలల్లో పోలీసులు. ఇంకా అమెరికా షాక్‌ నుంచి తేరుకోలేదు. ఒకవైపు బాధిత కుటుంబాల రోదనలు, మరోవైపు ఆగకుండా మోగుతున్న అంబులెన్స్‌ సైరన్లు. ఆ సమయంలో ఎటు చూసినా విలాపమే, ఏం విన్నా విషాదమే! చాలామంది అధికారులు కనిపించకుండా పోయిన వారి వివరాలను నమోదు చేసుకునే పనిలో పడ్డారు. 

అప్పుడే అన్సు, ఫిలిప్‌ అనే కేరళ దంపతులు తమ అమెరికన్‌ అల్లుడు రాన్‌ లైబర్‌మాన్‌ని వెంటబెట్టుకుని కన్నీళ్లతో పోలీస్‌ స్టేషన్‌కి వచ్చారు. ‘పేరు స్నేహా ఫిలిప్, భారత మహిళ, ఆమె డాక్టర్, బ్లాక్‌ హెయిర్, బ్రౌన్‌ ఐస్, హైట్‌ 5.6, వయసు 31, గత ఏడాదే పెళ్లైంది, నిన్నటి (సెప్టెంబర్‌ 10) నుంచి కనిపించడం లేదు’ అంటూ వారు.. ఒక్కొక్కటిగా వివరాలిచ్చారు. స్నేహా కేరళలో పుట్టింది. తన చిన్నప్పుడే, ఆ కుటుంబం న్యూయార్క్‌లో సెటిల్‌ అయ్యింది. స్నేహా మెడిసిన్‌ చదువుతున్నప్పుడు రాన్‌ ఆమెకు జూనియర్‌గా పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారిన తర్వాత, అతడి కోసం స్నేహా ఏడాది చదువు ఆపుకుని, రాన్‌తో కలసి పట్టభద్రురాలైంది. 

మెడిసిన్‌ ఇంటర్న్‌షిప్‌కి ఆహ్వానం అందుకోగానే, 2000 సంవత్సరంలో పెళ్లితో ఒక్కటయ్యారు. అదే ఏడాది ట్విన్‌ టవర్స్‌కి 5 నిమిషాల దూరంలో ఉన్న బ్యాటరీ పార్క్‌లో అపార్ట్‌మెంట్‌ కొనుక్కుని అక్కడికి షిఫ్ట్‌ అయిపోయారు. ఇద్దరూ డాక్టర్స్, కావాల్సినంత డబ్బు, రోజుకో పార్టీ, వారానికో ట్రీట్‌. ఆనందకరమైన జీవితానికి తామే ఉదాహరణ అన్నట్లుండేది ఆ జంట. డ్యూటీకి వెళ్లాలంటే అరగంటలోపు.. బంధువులు, స్నేహితులతో పాటు ఫిలిప్‌ ఇంటికి వెళ్లాలన్నా గంటలోపు ప్రయాణం చేస్తే సరిపోయేది. షాపింగ్స్‌కి, పార్టీస్‌కి వెళ్లడాన్ని బట్టి ఎవరిల్లు దగ్గర్లో ఉంటే వాళ్లింట్లో రాత్రుళ్లు ఉండిపోవడం, మరునాడు డ్యూటీస్‌కి అటునుంచే వెళ్లడం స్నేహా, రాన్‌లకు అలవాటైపోయింది.

సెప్టెంబర్‌ 10న స్నేహా డ్యూటీకి లీవ్‌ పెట్టింది. ‘ఎల్లుండి మనింట్లో ఫ్యామిలీ పార్టీ ఉంది కాబట్టి ఇల్లంతా క్లీన్‌ చేస్తా. షాపింగ్‌ చేస్తా, అందుకే సెలవు పెట్టా’ అని భర్తతో చెప్పింది స్నేహా. ఆ రోజు ఉదయం భర్తతో కలసి బయటికి వెళ్లి, 11 అయ్యేసరికి అతడితో బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, తిరిగి ఇంటికి బయలుదేరింది. రాన్‌ అటు నుంచి అటే డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే అదే రాత్రి రాన్‌ డ్యూటీ నుంచి ఇంటికొచ్చేసరికి స్నేహా ఇంట్లో లేదు. అత్తింటికో, స్నేహితుల ఇంటికో వెళ్లుంటుందిలే అనుకున్న రాన్‌.. ఆ రాత్రి ప్రశాంతంగానే నిద్రపోయాడు. మరునాడు (సెప్టెబర్‌ 11) ఉదయం ఆరు గంటలకే లేచి, రెడీ అయ్యి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు 8.40 దాటేసరికి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లోని నార్త్‌ టవర్‌ (ట్విన్‌ టవర్స్‌లో ఒక బిల్డింగ్‌)లో ఉగ్రవాదులు విమానాన్ని కూల్చారన్న వార్త అతడ్ని వణికించింది.

 వెంటనే స్నేహాకు కాల్‌ ట్రై చేస్తే, కలవలేదు. మరో పావుగంటలో పక్కనే సౌత్‌టవర్‌లో మరో విమానం కూలిందని తెలియగానే రాన్‌కు స్నేహా గురించి భయం మొదలైంది. అప్పుడు కూడా స్నేహా ఫోన్‌ కలవకపోయేసరికి ఆమె కోసం తెలిసినవారికి, అత్తింటివారికి వరసగా కాల్స్‌ చేశాడు. ముందురాత్రి స్నేహా మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదన్నారంతా. దాంతో రాన్‌ కంగారుగా తమ అపార్ట్‌మెంట్‌కి వెళ్లాడు. అప్పటికే కుప్పకూలిన ట్విన్‌టవర్స్‌ నుంచి దట్టమైన పొగ కమ్మేయడంతో అక్కడ ఎక్కువసేపు ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దాంతో వారిని రిక్వస్ట్‌ చేసి, అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ సాయంతో బిల్డింగ్‌ సీసీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. ముందురోజు ఫుటేజ్‌లో సాయంత్రం 5:30కి స్నేహా ఇంటి నుంచి బయటికి వెళ్లడం కనిపించింది. 

మరో 2 గంటలకు ట్విన్‌ టవర్స్‌ సమీపంలోని డిజైనర్‌ స్టోర్‌లో స్నేహా తనకోసం షూస్, ఇన్నర్‌ వేర్స్‌ కొనుక్కొన్నట్లు పరిచయమున్న సేల్స్‌మన్‌ ఒకరు రాన్‌తో చెప్పాడు. ‘నిన్న రాత్రి ఏడున్నరకు స్నేహా మేడమ్‌ మరో భారతీయురాలితో కలసి మా స్టోర్‌కి వచ్చింది. ఇద్దరూ మంచి స్నేహితుల్లా కనిపించారు. ఆ మహిళను అంతకు ముందెప్పుడూ నేను చూడలేదు’ అని వివరించాడు. వెంటనే రాన్‌.. ఫిలిప్స్‌ ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. రాన్‌ మాటలకు స్నేహా తల్లి అన్సు షాక్‌ అయ్యింది. ‘అదేంటి నిన్న మధ్యాహ్నం ట్విన్‌ టవర్స్, హోటల్‌లో తింటూనే నాతో చాలా సేపు చాటింగ్‌ చేసిందిగా?’ అంది అయోమయంగా. 

‘నిన్న రాత్రి వేరే ఇండియన్‌ మహిళతో కలిసి షాపింగ్‌ కూడా చేసిందట ఆంటీ, పోనీ రాత్రి ఆమెతో పాటు ఉందనుకుంటే, మరునాడైనా ఇంటికి రావాలి కదా? ఒకవేళ ట్విన్‌ టవర్స్‌ దాడిలో ఇరుక్కుని..?’ మాట పూర్తి చేయలేకపోయాడు రాన్‌. ఆ అనుమానమే స్నేహా కుటుంబాన్ని పోలీస్‌ స్టేషన్‌ దాకా రప్పించింది.స్నేహా డాక్టర్‌ కాబట్టి.. 11న జరిగిన మొదటి దాడిలో గాయపడిన వారికి సేవలు చేయడానికి వెళ్లినప్పుడు ఇతర దాడుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటుందని చాలామంది నమ్మారు. అయితే ఈ కేసు కోర్టుకెక్కినప్పుడు ఎన్నో అభిప్రాయాలు వినిపించాయి. రాన్‌తో స్నేహాకున్న పర్సనల్‌ తగాదాల దగ్గర నుంచి ఆల్కహాల్, డ్రగ్స్‌ వంటి చెడు అలవాట్లు ఉన్నాయా? అనేంత వరకూ ప్రతిదీ ఆరా తీసిన అధికారులు.. స్నేహా లెస్బియన్‌ అయ్యుండొచ్చని అనుమానించారు.

డిజైనర్‌ స్టోర్‌లో స్నేహాతో ఉన్న అజ్ఞాత భారతీయ మహిళతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, పేరు మార్చుకుని, మిస్సింగ్‌ డ్రామా ఆడుంటుందని భావించిన న్యాయస్థానం 2004లో.. 9/11 మిస్సింగ్‌ జాబితా నుంచి స్నేహా పేరును తొలగించేసింది. అయితే ఫిలిప్‌ దంపతులతో పాటు రాన్‌ కూడా ఆ తీర్పును ఖండించాడు. ‘స్నేహాను వెతికిపెట్టండి’ అనే పోరాటాన్ని పక్కన పెట్టి.. ‘స్నేహాపై ఇలాంటి అపవాదులను ఆపండి’ అనే పోరాటం మొదలుపెట్టాల్సి వచ్చింది ఆ కుటుంబానికి. నిజానికి ట్విన్‌ టవర్స్‌ దాడిలో కొన్ని వందల మంది క్షణాల్లో కాలి బూడిదైపోయారు. వారిలో చాలామంది వివరాలు నేటికీ తేలలేదు.

చివరికి 2008లో న్యూయార్క్‌ కోర్టు స్నేహాపై వచ్చిన వదంతులను కొట్టి పారేస్తూ, 9/11 దాడుల బాధితురాలిగా స్నేహా పేరును ఆ జాబితాలో చేర్చింది. అయితే నేటికీ ఆమె అవశేషాలు దొరక్కపోవడంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది.
∙సంహిత నిమ్మన 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement