‘జీవితంలో ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు. ఎన్ని నిజాలైనా దాచవచ్చు. ఏ తప్పయినా చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు కాలానికి సమాధానం చెప్పాల్సిందే!’ అన్నమాటకు ‘ఫాదర్ ఆఫ్ కాథలీన్ బెల్చర్’ గాథ అద్దం పడుతుంది. సాధారణంగా పుట్టుక తర్వాత కన్నవారి పరిచయంతోనే నమ్మకమనే జీవనప్రయాణం మొదలవుతుంది. కానీ, కాథలీన్ అనే అమ్మాయి జీవితంలో 30 ఏళ్ల తర్వాత ఆ నమ్మకం ముక్కలైపోయింది. నాన్న ఒక అబద్ధమయ్యాడు. అమ్మ ఆ నిజానికి సాక్ష్యమైంది. చివరికి, రక్తపాశం కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. కాథలీన్ ఆనాడే గెలిచి ఉంటే, ఈ కథను ఈనాడు మనం చెప్పుకునే వాళ్లమే కాదు. ఇరవయ్యో శతాబ్దంలో ఫ్లోరిడా ప్రజల మానవసంబంధాలపై ఆలోచింపజేసిన వాస్తవ గాథ ఇది.
కాథలీన్ బెల్చర్ డ్యూటీలో ఉండగా, ఒకరోజు తన తల్లి మిరియం టెర్రీ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ నాన్న, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆసుపత్రిలో చేర్పించాను. డాక్టర్స్ వెంటనే రక్తం ఎక్కించాలంటున్నారు. నువ్వూ, అక్క మియా కలిసి వస్తారా?’ అంది మిరియం.‘సరే అమ్మా! నాన్నది ఏ బ్లడ్ గ్రూప్?’ అడిగింది కాథలీన్ . ‘ఓ’ అని చెప్పింది మిరియం. ‘నాది ‘‘ఏ’’ బ్లడ్ గ్రూప్ కదా?’ అని మనసులో అనుకుంటూ, ‘అవును నీ బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా?’ అని తల్లిని అడిగింది అనుమానంగా. ‘బీ’ అంది మిరియం. నిజానికి ఓ, బీ బ్లడ్ గ్రూప్‌లు కలిగిన తల్లిదండ్రులకు, ఆ రెండు గ్రూప్స్‌లో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న పిల్లలు మాత్రమే పుడతారు.
కాథలీన్ వృత్తిపరంగా నర్స్ కావడంతో తన బ్లడ్ గ్రూప్ పేరెంట్స్‌తో కలవడం లేదంటే, తన పుట్టుక వెనుక ఏదో రహస్యం దాగి ఉందని వెంటనే గుర్తించింది. ఆ ఊహించని చేదు నిజం తెలుసుకోవడానికి తల్లిని నేరుగా కలిసింది. సూటిగా ఆమె కళ్లలోకి చూస్తూ ‘నేను ఎవరి బిడ్డని?’ అంటూ నిలదీసింది. ఇన్నేళ్లుగా ఏ నిజాన్ని అయితే దాచాలని మిరియం తపిస్తోందో అదే ప్రశ్న కూతురు కాథలీన్ నోటి నుంచి రావడంతో ఆమె నిర్ఘాంతపోయింది. తప్పించుకోలేని స్థితిలో నోరువిప్పింది. ‘35 ఏళ్లక్రితం ఆలివర్ బడ్‌తో నా జీవితం ముడిపడింది. అప్పట్లో బడ్ సిన్సియర్ సోల్జర్. రెండో ప్రపంచ యుద్ధంలో ఫ్లోరిడా తరపున పోరాడి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాతి నుంచి తాగుడికి బానిసై, ఆర్మీకి దూరమయ్యాడు. ఆర్మీలో ఉంటేనైనా దారిలో పడతాడని భావించిన బడ్ పేరెంట్స్, అతణ్ణి ఒప్పించి, తిరిగి ఆర్మీకి పంపించారు. కానీ అతడిలో పెద్దగా మార్పు రాలేదు.
నన్నూ, మీ అక్క మియాను కొన్నిరోజులు బాగా చూసుకునేవాడు, మరికొన్ని రోజులు పట్టించుకునేవాడే కాదు. మధ్యమధ్యలో వచ్చి తనకు నచ్చినంత కాలం ఉండి వెళ్లిపోయేవాడు. నా జీవితం గురించి ఆలోచించిన బడ్ పేరెంట్స్ నన్ను మరో జీవితం చూసుకోమని నచ్చజెప్పారు. అమెరికా, కోవింగ్‌టన్ లోని బార్టెండర్ చెట్ నోరిస్‌ని నాకు పరిచయం చేశారు. అతడు బాక్సర్. అతడితో స్నేహం తర్వాత బడ్‌తో విడిపోవాలనే ఆలోచన మొదలైంది. చెట్‌తో చనువు పెరిగింది. అతడి కారణంగా తల్లినయ్యాను. అప్పుడే నువ్వు నా కడుపులో పడ్డావు. నీ తండ్రి చెట్ అని నాకు తెలియగానే, ఆ శుభవార్తను అతడితో పంచుకున్నాను. అయితే విడాకుల కోసం బడ్‌ను కలవడానికి ప్రయత్నించినప్పుడు అతడు జైల్లో ఉన్నాడని తెలిసింది. సైన్యంలో ఉంటూ అక్రమ చర్యలకు పాల్పడటంతో అతణ్ణి జైల్లో పెట్టారు. మొత్తానికి జైల్లోనే అతణ్ణి కలసి విడాకులు కావాలని కోరాను.
బడ్ అందుకు మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకున్నాడు కాని, మియాను తనకే పూర్తిగా ఇచ్చెయ్యాలని రూల్ పెట్టాడు. అందుకు నేను సిద్ధంగా లేను. దాంతో మీ నాన్న చెట్‌ను దూరం పెట్టాను. అతడికి నేను గర్భవతిని కాదని, ఏదో పొరబడ్డానని అబద్ధం చెప్పాను. అయినా ఫర్వాలేదు మనం కలిసి జీవిద్దాం అన్నాడు. అతడితో జీవితం కంటే మియాతో అనుబంధమే ముఖ్యమనిపించింది. అందుకే చెట్‌కి నిర్దాక్షిణ్యంగా బ్రేకప్ చెప్పేశాను. ఆ తర్వాత చెట్ ఏమయ్యాడో ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు, బడ్ జైలు నుంచి విడుదలైన కొన్ని నెలలకు నువ్వు పుట్టావు. నిన్ను తన బిడ్డే అనుకున్నాడు బడ్’ అని జరిగిందంతా చెప్పుకొచ్చింది మిరియం. అంతా విని అక్కడే కూలబడింది కాథలీన్ . కన్నతండ్రి కోసం ఆమె ఏడవడం మిరియం మనసును మెలిపెట్టింది. నీ అసలు తండ్రిని వెతకడానికి నేను సాయం చేస్తానని మాటిచ్చింది.
కాథలీన్ పుట్టాక బడ్ కొన్నాళ్లు భార్యాపిల్లలతో ప్రేమగానే ఉన్నాడు. తాగుడు, చెడు వ్యసనాలు అతణ్ణి ఎక్కువ కాలం మంచివాడిగా ఉండనివ్వలేదు. దాంతో కాథలీన్‌కి 19 ఏళ్లు వచ్చేనాటికి మిరియం అతడికి విడాకులిచ్చింది. కానీ బడ్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆసుపత్రిలో చేర్పించి, ట్రీట్‌మెంట్ చేయించడంలో మిరియం బాధ్యతగా వ్యవహరించింది. ఏది ఏమైనా కాథలీన్ కన్నతండ్రి చెట్ అని చెప్పడంతో పాటు, గతంలో చెట్‌తో తాను దిగిన ఒక ఫొటోని కాథలీన్ చేతికి అందించింది మిరియం. పుట్టాక ఒక్కసారి కూడా కన్నతండ్రిని చూడలేకపోయానన్న అసంతృప్తి కాథలీన్ ని తీవ్రంగా వేధించింది. అతడి వివరాలతో ఎన్నో క్లాసిఫైడ్ ప్రకటనలు ఇప్పించింది. మీడియా సమక్షంలో పలు రివార్డులను ప్రకటించింది. తల్లి ఇచ్చిన ఏకైక ఫొటోను ఎన్నో ప్రింట్స్ వేయించి, విస్తృత ప్రచారం చేయించింది.
1988లో ఈ నిజం కాథలీన్ కి తెలిసినప్పటి నుంచి, నేటికీ ఆమె తన తండ్రి సమాచారం కోసం వెతుకుతూనే ఉంది. ‘నీ గుర్తుగా నేను ఈ లోకంలో పుట్టాను నాన్నా!’ అని చెప్పడానికి తపించింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, కాథలీన్ అనే కూతురుందన్న నిజం కూడా చెట్‌కి తెలియదు. ప్రస్తుతం చెట్‌కి 80 ఏళ్లు దాటి ఉంటాయని అంచనా. చెట్ 1940లో గోల్డెన్ గ్లోవ్స్ బాక్సర్ అనే సమాచారాన్ని కూడా కాథలీన్ వాడుకుంది. కానీ ఫలితం లేదు. మొత్తానికి ఒక తొందరపాటు, ఒక నిస్సహాయత, ఒక పేగుబంధం కలగలసి సృష్టించిన ఈ కథనంలో ఒక కూతురు తండ్రి కోసం పడిన రుణానుబంధం అంతవరకే కాబోలు. అందుకే చెట్ ఏమయ్యాడో నేటికీ మిస్టరీగానే మిగిలింది!
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment