మిస్టరీ.. రసెల్‌ ఎవాన్స్‌ | Mystery Of Russell Evans | Sakshi
Sakshi News home page

మిస్టరీ.. రసెల్‌ ఎవాన్స్‌

Published Sun, Oct 20 2024 11:16 AM | Last Updated on Sun, Oct 20 2024 11:16 AM

Mystery Of Russell Evans

అర్ధరాత్రి పన్నెండున్నర దాటేసరికి జాన్‌  ఎవాన్స్‌ ఇంట్లో ల్యాండ్‌ ఫోన్‌  మోగింది. లిఫ్ట్‌ చేసి హలో అనగానే, ‘డాడ్‌! ఫ్రెండ్‌ ఇంట్లో ఉన్నా, బయలుదేరుతున్నా. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తా’ అన్నాడు రసెల్‌. ‘సరే నాన్నా జాగ్రత్త!’ అని ఫోన్‌  పెట్టేశాడు జాన్‌. గంట దాటేసరికి, మళ్లీ ఫోన్‌  మోగింది. ఈసారి కాల్‌ చేసింది సేక్రడ్‌ హాస్పిటల్‌ రిసెప్షనిస్ట్‌. తమ ఆసుపత్రి వివరాలన్నీ చెప్పి, ‘మీ అబ్బాయి రసెల్‌ పరిస్థితి సీరియస్‌గా ఉంది. త్వరగా రండి’ అంది. 

జాన్‌ కి కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. ‘ఏమంటున్నావ్‌?’ అని గట్టిగా అరిచాడు. వెంటనే రిసెప్షనిస్ట్‌ చేతిలోంచి ఫోన్‌ అందుకున్న రసెల్‌ స్నేహితురాలు శాండీ.. ‘అంకుల్‌! మన రసెల్‌ కోమాలోకెళ్లాడంటున్నారు త్వరగా రా అంకుల్‌’ అంటూ ఏడ్చేసింది. దాంతో జాన్‌ వెంటనే భార్య స్యూ ఎవాన్స్‌ని తీసుకుని ఆ ఆసుపత్రికి పరుగు తీశాడు.

ఆసుపత్రిలో ఓ పక్క పోలీసుల ఫార్మాలిటీస్, మరో పక్క ఆసుపత్రి సిబ్బంది పరుగులు జాన్‌ దంపతుల్ని వణికించేశాయి. ఏం జరిగిందో చెప్పడానికి రసెల్‌ స్పృహలో లేడు. ఏమైందో తెలుసుకోవడానికి గుండెధైర్యం చాలట్లేదు. అయినా ఏడుస్తూనే పోలీసుల్ని ఆరా తీస్తే, హిట్‌ అండ్‌ రసెల్‌  కేసన్నారు. శాండీ మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పింది. ‘అంకుల్‌! నేను ఇందాకే వ¯Œ  అయ్యేసరికి పార్ట్‌టైమ్‌ జాబ్‌ ముగించుకుని నడుస్తూ ఇంటికొస్తుంటే, మన అపార్ట్‌మెంట్‌కి సమీపంలో రోడ్డు మీద రసెల్‌ కదల్లేని స్థితిలో పడున్నాడు. ‘బ్రియాన్‌! బ్రియాన్‌!’ అని గట్టిగా అరుస్తున్నాడు. 

దగ్గరకెళ్లి చూస్తే ఒళ్లంతా రక్తం, భయమేసి అంబులెన్స్ కి కాల్‌ చేసి, ఆసుపత్రికి తీసుకొచ్చాం. రాగానే కోమాలోకి వెళ్లిపోయాడు. కానీ నేను రసెల్‌ని గుర్తించిన సమయంలో అక్కడ పొదల్లో ఎవరో ఉన్నట్లనిపించింది. ఎవరా? అని నేను వంగి చూసేసరికి, తెల్ల చొక్కా వేసుకున్న ఒక అబ్బాయి మన అపార్ట్‌మెంట్స్‌ వెనకున్న కొండలవైపు పారిపోయాడు. కానీ మన రసెల్‌కి బ్రియాన్‌  అనే స్నేహితుడున్నాడు కదా. తను అప్పటిదాకా రసెల్‌తోనే ఉన్నాడేమోనని నా అనుమానం. ఇదంతా పోలీసులకు చెప్పినా, హిట్‌ అండ్‌ రసెల్‌  అనే రాసుకున్నారు’ చెప్పింది శాండీ.

జాన్‌ కుటుంబానికి శాండీ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్సే. అంతా ఒకే బ్లాక్‌లో ఉండేవారు. రసెల్, శాండీలు మంచి స్నేహితులు. ఎనిమిదో తరగతి చదువుతున్న రసెల్‌కి 13 ఏళ్లు. శాండీ అతడికంటే రెండేళ్లు పెద్దది. రసెల్‌కి డయానా అనే ఐదేళ్ల చెల్లెలు కూడా ఉంది. చదువులో ముందుండే రసెల్‌ బెస్ట్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టీన్స్‌లోకి వచ్చేసరికి స్నేహితులు పెరగడంతో ఇంట్లో కంటే బయటే ఎక్కువ గడిపేవాడు.
 
గతంలో స్యూ ఎవాన్స్‌ నర్స్‌గా, జాన్‌  కార్డియో పల్మనరీ టెక్నాలజిస్ట్‌గా పనిచేయడంతో వైద్యరంగంపై వారికి బాగానే అనుభవముంది. శాండీ మాటలు విన్న వెంటనే, తమ గత అనుభవాన్ని ఆ ఆసుపత్రి వైద్యులకు వివరించి, రసెల్‌ పరిస్థితిని గమనించడానికి చికిత్స జరుగుతున్న గదికెళ్లారు. రసెల్‌ని ఒక పెద్ద వాహనం ఢీ కొట్టినమాట నిజమే కాని, దానికంటే ముందు అతన్ని ఎవరో బ్యాట్‌లాంటి బలమైన వస్తువుతో కొట్టినట్లు అతడి ఒంటిపై ఆనవాళ్లున్నాయి. అదే విషయం పోలీసులకు చెప్పి వాపోయారు. అయినా అధికారుల్లో చలనం లేదు. దురదృష్టవశాత్తు ఉదయం తొమ్మిదయ్యేసరికి రసెల్‌ చనిపోయాడు. కొడుకు మరణంతో అల్లాడిపోతున్న ఆ దంపతులకు అప్పుడే ఆ ఆసుపత్రి రిసెప్షనిస్ట్‌ మరో క్లూ ఇచ్చింది. రసెల్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయిన ఒక గంటకే బ్రియాన్‌ అనే వ్యక్తి కాల్‌ చేసి, రసెల్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడని చెప్పింది. వెంటనే రసెల్‌ స్నేహితుడు బ్రియాన్‌ని పిలిపించాడు జాన్‌. మొదటి నుంచి ‘నాకేం తెలియదు’ అన్నట్లే మాట్లాడాడు బ్రియాన్‌. జాన్‌ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలిస్తూ, రసెల్‌పై దాడి జరిగిన రాత్రి వైట్‌ కలర్‌ షర్ట్‌ వేసుకున్నానని అసంకల్పితంగా చెప్పేశాడు. అదే విషయాన్ని జాన్‌ పోలీసులకు చెప్పాడంతో బ్రియాన్‌ని అదుపులోకి తీసుకుని నిలదీశారు. అయితే బ్రియాన్‌ తనకసలు వైట్‌ షర్టే లేదని మాట మార్చేశాడు. దాంతో రసెల్‌ కుటుంబం ఈ విషాదంలో ప్రత్యక్ష సాక్షి బ్రియాన్‌ అని నమ్మడం మొదలుపెట్టింది.
ఈలోపు పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌ వచ్చింది. దానిలో రసెల్‌ని ఏదో వాహనం  గుద్దేయడంతోనే మరణం సంభవించిందని అందులో ఉంది. ఇంతలో రసెల్‌ చనిపోయాడని తెలియగానే, ఆరోన్‌  అనే స్నేహితుడు ముందుకొచ్చాడు. ‘ఆ రాత్రి తొమ్మిది అయ్యేసరికి మేమిద్దరం దగ్గర్లోని పార్క్‌కి వెళ్లాం. అక్కడ నాకు గతంలో నా గర్ల్‌ఫ్రెండ్‌ని ఏడిపించిన ఒక అబ్బాయి కనిపించాడు. వాడికి వార్నింగ్‌ ఇచ్చేక్రమంలో నా పక్కనే ఉన్న రసెల్‌ వాడ్ని కొట్టాడు. 

అయితే ఆ అబ్బాయి కోపంగా తన వాళ్లని తీసుకొస్తానని పరుగెత్తాడు. పార్క్‌లో మా గొడవ చూసిన కొందరు పెద్దవాళ్లు ‘ఆ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్‌ మాకు తెలుసు. వాళ్లతో గొడవ మంచిది కాదు, ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోండి’ అని సలహా ఇచ్చారు. దాంతో మేము అక్కడి నుంచి వచ్చేశాం. రసెల్‌ తన బాస్కెట్‌బాల్‌ ఫ్రెండ్‌ ఇంటికి వెళ్తాననడంతో నేను మా ఇంటికి వెళ్లిపోయా. బహుశా ఆ పార్క్‌లో అబ్బాయిగానీ రసెల్‌పై పగ తీర్చుకున్నాడేమో?’ అని తన మనసులో అనుమానాన్ని పోలీసుల ముందు బయటపెట్టాడు.దాంతో దేశంలోనే ప్రముఖ డాక్టర్‌ విలియం ఎకెర్ట్‌ని నియమించి, మరణానికి అసలు కారణం తేల్చమన్నారు జాన్‌ దంపతులు. విలియం మళ్లీ శవపరీక్ష చేసి, యాక్సిడెంట్‌కి ముందే రసెల్‌పై తీవ్రమైన దాడి జరిగిందని, అంటే ఎవరో కావాలనే ఆ యాక్సిడెంట్‌ చేశారని క్లారిటీ ఇచ్చాడు. రెసెల్‌ పడి ఉన్న ప్రదేశానికి 86 అడుగుల ముందే అతని షూస్, సాక్స్‌ రక్తం మరకలతో దొరికాయి. బహుశా మనిషిని కింద పడేసి, బండితో ఈడ్చి పారేసి ఉంటారని విలియం అంచనా వేశాడు.

1996 జూన్‌ 3న అర్ధరాత్రి ఒంటిగంటకు వాషింగ్టన్, స్పోకాన్‌లో ర సెల్‌ అపార్ట్‌మెంట్‌కి చేరువలో రోడ్డుపై.. చావు బతుకుల మధ్య శాండీ అనే స్నేహితురాలికి కనిపించాడు. సుమారు 8 గంటలు కోమాలో ఉన్న రసెల్, జూన్‌ 4న ఉదయం 9 గంటలకు చనిపోయాడు.
ఆ రాత్రి పార్క్‌లో గొడవపడిన కుర్రాడితో పాటు అతడి గ్యాంగ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ నిజాలు బయటికి రాలేదు. కొడుకు చనిపోయాడన్న బెంగతోనే జాన్‌ 1998లో మరణించాడు. మరో పదమూడేళ్ల న్యాయపోరాటం తర్వాత రసెల్‌ తల్లి స్యూ చనిపోయింది. ఇప్పటికీ అతని సోదరి డయానా తన అన్నను చంపిందెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఏది ఏమైనా, కొన ఊపిరితో ఉన్న రసెల్‌ తన స్నేహితుడు బ్రియాన్‌ పేరెందుకు పిలిచాడు? ఆసుపత్రికి కాల్‌ చేసింది ఎవరు? నిజంగానే పార్క్‌లో కుర్రాడికి, అతని గ్యాంగ్‌కి ఆ రాత్రి రసెల్‌ ఒంటరిగా దొరికేశాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే!
∙సంహిత నిమ్మన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement