మైక్‌ ఎమర్ట్‌ | mystery of Mike Emmert | Sakshi
Sakshi News home page

మైక్‌ ఎమర్ట్‌

Published Sun, Oct 6 2024 7:45 AM | Last Updated on Sun, Oct 6 2024 10:03 AM

mystery of Mike Emmert

వాషింగ్టన్‌ , రెడ్‌మండ్‌లో నివసించే రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ మైక్‌ ఎమర్ట్‌ 2001లో స్టీవెన్‌ అనే కస్టమర్‌కి వుడిన్‌విల్‌ శివార్లలో ఉన్న గెయిల్‌ ఇంటిని చూపించడానికి వెళ్లి, అక్కడే హత్యకు గురయ్యాడు. స్టీవెన్‌ ఇల్లు చూడటానికి వచ్చినప్పుడు ఉత్తర కాలిఫోర్నియా నుంచి మకాం మారుతున్నట్లు చెప్పాడట! 2011లో కీలక ఆధారాలు దొరికినా, ఫలితం లేకుండా పోయింది. న్యాయపోరాటం చేసీ చేసీ చివరికి మేరీ 2024 జనవరిలో ఈ కే సును క్లోజ్‌ చేయాలని అధికారులను కోరారు. 

‘మైక్‌! మైక్‌! ఎక్కడున్నావ్‌? చాలాసేపటి నుంచి నీ ఫోన్‌  మోగుతోంది, ఏదో అన్‌నోన్‌ నంబర్‌’ అంటూనే అతడి ఫోన్‌ పట్టుకుని బెడ్‌రూమ్‌లోకి వచ్చింది మేరీ. ‘హా వస్తున్నా మేరీ! టూ మినిట్స్‌. స్నానం అయిపోయింది’ అని బాత్‌రూమ్‌లోంచి బదులిచ్చాడు మైక్‌. ‘సరే అయితే ఫోన్‌ బెడ్‌ మీద పెడుతున్నా. బ్రేక్‌ఫాస్ట్‌ చేసే వెళ్లు, రెడీ అయిపోయింది’ అని చెప్పి మళ్లీ కిచెన్‌లోకి వెళ్లిపోయింది మేరీ. వారిది ప్రేమ వివాహం. ఇరువురూ సంపన్నులే కావడంతో పెళ్లికి ముందే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలుపెట్టారు. పిల్లలు మేరీ తల్లి దగ్గర పెరగడంతో చాలా డీల్స్‌ ఇద్దరూ కలిసే చేస్తుండేవారు.
 
మైక్‌ రెడీ అయ్యి ఫోన్‌ను మెడకు, భుజానికి మధ్య నొక్కిపెట్టి మాట్లాడుకుంటూ, చేతి షర్ట్‌ బటన్‌  పెట్టుకుంటూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇంతలో మేరీ తింటూనే అతడికీ బ్రేక్‌ఫాస్ట్‌ అందించింది. ‘అయ్యో, స్టీవెన్‌  గారు! మీకు నచ్చడమే మాకు కావాలి. మీరు కోరుకున్నట్లే అదే ఇల్లు, మళ్లీ ఒకసారి మొత్తం చూపిస్తా. నచ్చితే బయానా మాట్లాడుకుందాం. ఓనర్‌ ఎలాగో ఆఫీస్‌కి వెళ్లుంటారు, సెకండ్‌ కీ నా దగ్గరే ఉంది, సో మనం వెళ్లొచ్చు. ఇబ్బందేమీలేదు. మీరు కొనుక్కునేవాళ్లు, మేము అమ్ముకునేవాళ్లం. ఒకటికి పదిసార్లు చూసుకోవడం మీ హక్కు. ఓకే సార్‌! మీరు చెప్పిన∙టైమ్‌కి కిర్క్‌లాండ్‌ షాపింగ్‌ మాల్‌కి వచ్చేస్తా’ అనేసి ఫోన్‌ పెట్టేశాడు మైక్‌.

అంతా విన్న మేరీ తింటూనే, ‘ఎవరు మైక్‌? స్టీవెనేనా? అంటే, ఆరోజు కుంటుకుంటూ వచ్చాడే అతనేనా?’ అంది ఆత్రంగా. ‘అవును మేరీ! అతనే, మళ్లీ వచ్చాడు. మనం చూపించిన అన్ని ఇళ్లల్లోనూ గెయిల్‌ ఇల్లు అతనికి బాగా నచ్చిందట. నన్ను కిర్క్‌లాండ్‌ మాల్‌కి రమ్మన్నాడు. ఇద్దరం కలసి ఆ ఇంటికి వెళ్తాం. ఈ బేరం కుదిరేలానే ఉంది’ అన్నాడు మైక్‌. మరి నేనూ రానా అంది మేరీ. ‘వద్దు. చూపించడమే కదా! బేరం ఓకే అయితే అప్పుడొద్దువుగానిలే’ అన్నాడు మైక్‌.

అదే రోజు మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యేసరికి గెయిల్‌ ఆఫీస్‌ నుంచి భోజనానికి తన ఇంటికి వచ్చింది. పైన బాత్‌రూమ్‌లో ఏకధారగా నీళ్లుపోతున్న శబ్దం విని, ఇంట్లో ఎవరో ఉన్నారనిపించింది. ధైర్యం చేసి మెట్లు ఎక్కి బెడ్‌రూమ్‌ నుంచి బాత్‌రూమ్‌కి నడుస్తుంటే, దారిపొడవునా రక్తం చారలు ఆమెను వణికించాయి. బాత్‌ టబ్‌లో మనిషి శవం నీళ్లల్లో మునిగి ఉంది, పైన షవర్‌ నుంచి నీరు ధారగా పడి, బాత్‌ టబ్‌ పొంగుతోంది. టబ్‌లో నిండిన నీళ్లు రక్తంతో కలసి పారుతున్నాయి. అది చూసి అప్రయత్నంగా కెవ్వుమంది గెయిల్‌. కాస్త తేరుకుని, గజగజ వణుకుతూ మరోసారి ఆ శవం ఎవరిదా? అని పరికించి చూసింది. తన ఇల్లు అమ్మకానికి తీసుకున్న రియల్‌ఎస్టేట్‌ వ్యాపారీ మైక్‌దని గుర్తించి నిర్ఘాంతపోయింది.

రంగంలోకి దిగిన పోలీసులు బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి, మేరీకి సమాచారం అందించారు. మైక్‌ ఒంటి మీద 19 కత్తిపోట్లు ఉన్నాయని రిపోర్ట్‌లో తేలింది. అతడి ఖరీదైన వాచ్, డైమండ్‌ రింగ్, పర్స్‌ కనిపించడం లేదని దర్యాప్తులో తెలిసింది. వాటిని కిల్లర్‌ దోచుకెళ్లాడని నమ్మారు. వేలిముద్రల వంటి ఆధారాలను నాశనం చేయడానికే మైక్‌ని బెడ్‌రూమ్‌లో చంపి, బాత్‌టబ్‌లో ముంచాడని స్పష్టత వచ్చింది.

‘ఉదయం స్టీవెన్‌ అనే పెద్దాయన మైక్‌కి కాల్‌ చేసి, కిర్క్‌లాండ్‌ మాల్‌కి రమ్మన్నాడు. అక్కడి నుంచే గెయిల్‌ ఇంటికి వెళ్లాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. స్టీవెన్‌ మొదటిసారి గెయిల్‌ ఇంటిని చూడటానికి వచ్చినప్పుడు మైక్‌తో పాటు నేను కూడా అతణ్ణి చూశాను. అతడికి 50 ఏళ్లుపైనే ఉంటాయి. అతను కుంటివాడు, కర్ర సాయంతో నడవడం చూశాను’ అని చెప్పింది మేరీ. వెంటనే మేరీ చెప్పిన మాల్‌కి వెళ్లారు అధికారులు. అక్కడ పార్కింగ్‌లో మైక్‌ కారు దొరకడంతో స్టీవెనే కిల్లర్‌ అనే క్లారిటీ వచ్చేసింది.

అయితే స్టీవెన్‌ అనే పేరు అబద్ధం కావచ్చని, స్టిక్‌ పట్టుకుని నడవడమనేది నాటకం కావచ్చని, ఆ స్టిక్‌లోనే పదునైన కత్తి దాచి ఉంటాడని, కేవలం దొంగతనమే అతడి టార్గెట్‌ కాకపోవచ్చని అంచనాలు మొదలయ్యాయి. స్టీవెన్‌ ప్రొఫెషనల్‌ హిట్‌మెన్‌ అయ్యి ఉంటాడని, మైక్‌ని చంపడానికి ఎవరితోనో సుపారీ మాట్లాడుకుని వచ్చి ఉంటాడని అధికారులు నమ్మసాగారు. అందుకే మైక్‌ను హత్య చేయడానికి జనసంచారానికి దూరంగా ఉండే గెయిల్‌ ఇంటినే కిల్లర్‌ ఎంచుకుని ఉంటాడని భావించారు. అయితే మైక్‌ని చంపాలనుకునేంత శత్రువులు ఎవరూ లేరని మేరీ చెప్పింది. బంధుమిత్రులూ అదే మాటన్నారు.

సరిగ్గా పదేళ్లకి టెక్నాలజీ సాయంతో నేరం జరిగిన ప్రదేశంలో ఒక డీఎన్‌ఏని గుర్తించారు. అది గ్యారీ క్రూగేర్‌ అనే మాజీ పోలీస్‌ అధికారిదని రుజువైంది. అతడు అప్పటికే చనిపోయాడు. అతడికి మైక్‌ మర్డర్‌ కేసులోనే కాదు, మరో మూడునాలుగు మర్డర్‌ కేసులతో సంబంధం ఉందని తేలింది. పైగా రిటైర్మెంట్‌ తర్వాత గ్యారీ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా కూడా పని చేశాడు. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు జిమ్‌ బారీ హత్య కేసులోనూ, బ్రాడ్‌షా మిస్సింగ్‌లోనూ గ్యారీకి సంబంధం ఉంది.

ఏది ఏమైనా గ్యారీ, స్టీవెన్‌ ఇద్దరూ ఒక్కరేనా? మైక్‌ని చంపింది ఒక వ్యక్తేనా? అతడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? గ్యారీ రియల్‌ఎస్టేట్‌ రంగంలో తనకు పోటీ లేకుండా చేసుకోవడానికి మైక్‌తో పాటు మిగిలిన హత్యలు చేశాడా? లేదంటే ఎవరైనా మైక్‌ శత్రువులు గ్యారీతో బేరం కుదుర్చుకున్నారా? అనే ప్రశ్నలు నేటికీ మిస్టరీనే! 
∙సంహిత నిమ్మన

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement