![mystery of nirmala Pant ends life story](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/10211.jpg.webp?itok=1uYNmmSZ)
2018 జూలై 26, ఉదయం 11 గంటలు– ‘అమ్మా! చదువుకోవడానికి రోషనీ ఇంటికి వెళుతున్నాను’ తల్లితో చెప్పింది నిర్మలా. ‘సరే, సాయంత్రంలోగా వచ్చేసేయ్’ అని చెప్పి, కూతురిని సాగనంపింది తల్లి దుర్గాదేవి.సైకిల్ మీద బయలుదేరింది నిర్మలా. నేపాల్‌లోని కాంచన్‌పూర్ గర్ల్స్ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోందామె. సాయంత్రం ఆమె తండ్రి యజ్ఞరాజ్ పంత్ ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడినా నిర్మలా ఇంటికి రాలేదు. ఆమె స్నేహితురాలు రోషనీ ఇంటికి వెళ్లి కనుక్కున్నాడు.‘నిర్మలా ఇక్కడకు వచ్చింది. ఇద్దరం చదువుకున్నాం.
మధ్యాహ్నం మూడు గంటలకే బయలుదేరింది’ అని చెప్పింది రోషనీ.రాత్రి పదిగంటలకు యజ్ఞరాజ్, దుర్గాదేవి దంపతులు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ‘రేప్పొద్దున్న రండి, ఫిర్యాదు తీసుకుంటాం’ అని పోలీసులు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. చేయగలిగిందేమీ లేక యజ్ఞరాజ్, దుర్గాదేవి ఇంటికి వెళ్లిపోయారు.మర్నాడు ఉదయం నిర్మలా మృతదేహం ఒక చెరుకుతోటలో నగ్నంగా పడి ఉంది. ఆ చెరుకుతోట రోషనీ ఇంటికి అరకిలోమీటరు దూరంలో నిర్మలా ఇంటికి వెళ్లే తోవలో ఉంది.
తోట బయట ఆమె సైకిలు పడేసినట్లుగా ఉంది. స్థానికులు సమాచారం తెలపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎవరో ఆమెపై అత్యాచారం చేసి, చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.ఈ సంఘటనపై నేపాల్‌లో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన తల్లిదండ్రులను పోలీసులు మర్నాడు రమ్మని నిర్లక్ష్యంగా చెప్పడంపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
స్థానిక పోలీసులు నిందితుల ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో సంఘటన జరిగిన నాలుగు రోజులకు నేపాల్ జాతీయ దర్యాప్తు సంస్థ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీఐబీ) రంగంలోకి దిగింది. అయినప్పటికీ నేపాల్‌లో ఈ సంఘటనపై ఆందోళనలు చల్లారలేదు. కాంచన్‌పూర్‌లో ఆగస్టు 24న జరిగిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు తూటా గాయానికి గురయ్యారు.పరిస్థితి నానాటికీ జటిలంగా మారుతుండటంతో సీఐబీ పోలీసులు దిలీప్‌సింగ్ బిస్తా అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
పంత్ కుటుంబం నివసించే వీథిలోనే బిస్తా నివాసం. నిర్మలా హత్యకు కొద్దిరోజుల ముందే అతడు హత్యకేసులో శిక్ష అనుభవించి, జైలు నుంచి విడుదలై వచ్చాడు. పలుమార్లు జరిపిన ఇంటరాగేషన్‌లో బిస్తా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే, ఫోరెన్సిక్ పరీక్షల్లో జరిగిన సంఘటనలో అతడి ప్రమేయం లేదని తేలింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యాన్ని నేపాల్ జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా అభిశంసించింది.
కొన్నాళ్లకు పోలీసులు పంత్ కుటుంబానికి పొరుగునే ఉండే ప్రదీప్ రావల్‌ను, అతడి స్నేహితుడు బిశాల్ చౌధరిని ఈ కేసులో అరెస్టు చేశారు. వాళ్లను సీఐబీ ఐజీ సర్బేంద్ర ఖనాల్, డీఐజీ నీరజ్ బహదూర్ షాహీ స్వయంగా విచారించారు. వారిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టక ముందే నేపాల్ రక్షణమంత్రి ఈశ్వర్ పొఖ్రేల్ ఆదరబాదరగా ప్రెస్‌మీట్ పెట్టి, నిర్మలా పంత్ కేసులో దోషులు పట్టుబడ్డారు అని ప్రకటించారు.
తర్వాత రావల్, చౌధరి రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో వారి నమూనాలు సరిపోలడం లేదని వైద్యులు తేల్చారు. కోర్టు వారిని విడుదల చేసింది. బయటకు వచ్చాక వారిద్దరూ పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేసినట్లు మీడియాకు చెప్పారు. పోలీసులు వారిద్దరి నమూనాలతో పాటు, భీమ్‌దత్తా మునిసిపాలిటీ మేయర్ సురేందర్ బిస్తా సోదరుడి కొడుకు ఆయుష్ బిస్తా, సురేందర్ బిస్తా సోదరుడు ఎస్పీ బిస్తా, ఆయన కొడుకు కిరణ్ బిస్తాల నుంచి కూడా నమూనాలు సేకరించారు.
వారి నమూనాలేవీ మృతురాలి నుంచి సేకరించిన నమూనాలతో సరిపోలేదు. ఈ కేసుపై దర్యాప్తును పోలీసులు ప్రహసనంగా మార్చడంతో కోపోద్రిక్తులైన జనాలు నేపాల్‌లో దేశవ్యాప్తంగా నెలల తరబడి ఆందోళనలు కొనసాగించారు. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిదిమంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసినా, ఆందోళనలు సద్దుమణిగాక కొద్దినెలల్లోనే వాళ్లందరికీ తిరిగి పోస్టింగులు ఇచ్చారు. సంఘటన జరిగి ఆరున్నరేళ్లయినా, నిర్మలా పంత్ హత్యాచారానికి కారకులైన అసలు నేరస్థులు ఎవరనేది పోలీసులు కనుక్కోలేక పోయారు. నేపాల్‌ను అట్టుడికించిన ఈ సంఘటన మిస్టరీగానే మిగిలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment