జీవిత భాగస్వామి విషయంలో ఆ తప్పిదమే ఆ సైనికుడి జీవితాన్ని..! | The Family of Georgia Boy Unsolved Mystery Story | Sakshi
Sakshi News home page

జీవిత భాగస్వామి విషయంలో ఆ తప్పిదమే ఆ సైనికుడి జీవితాన్ని..!

Published Sun, Nov 26 2023 2:19 PM | Last Updated on Sun, Nov 26 2023 2:19 PM

The Family of Georgia Boy Unsolved Mystery Story - Sakshi

ఏ దేశంలోనైనా బంధాలకు విలువనిచ్చే జీవితాలు ఎప్పటికీ ఆదర్శంగానే నిలుస్తాయి. అయితే ఒక బంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ‘ఎవరి చేతిని పట్టుకుని నడవబోతున్నాం?’ అనేదాని పట్ల స్పష్టత అవసరం. లేదంటే జీవితం ఊహించని మలుపులు తిరిగి ఉక్కిరిబిక్కిరవుతుందని చెప్పే ఉదంతమే ఇది.

1978 డిసెంబర్‌ 19, డెరెల్డ్‌ టేసీ అనే సైనికుడి జీవితంలో అదో చీకటి రోజు. జార్జియా, రిచ్‌మండ్‌ కౌంటీలోని కార్నివాల్‌కి చెందిన అతను.. ప్రాణంగా ప్రేమించిన భార్యను పోగొట్టుకున్నాడు. అప్పటికే కొన్ని నెలలుగా ఎన్యూరిజం వ్యాధికి గురైన ఆమె (జార్జియా బోయిడ్‌) కోమాలోకి వెళ్లిపోయి.. చివరికి 22 ఏళ్ల వయసులో మరణించింది. కళ్లముందు చిన్న చిన్న పిల్లలు నలుగురు.. మెదడులో అంతుచిక్కని ప్రశ్నలు.. డెరెల్డ్‌ని కుదురుగా ఉండనివ్వడంలేదు. భార్య మరణం నాటి నుంచి మొదలైన అతడి అన్వేషణ.. చివరికి అసంపూర్తిగానే మిగిలిపోయింది.

అప్పటికి మూడేళ్ల క్రితం వరకూ డెరెల్డ్‌ జీవితం బిందాస్‌గానే సాగింది. 1975లో జార్జియా బోయిడ్‌ పరిచయమైన తర్వాత అతని జీవితమే ఆమె అయిపోయింది. బోయిడ్‌ అగస్టాలోని ఒక బార్‌లో గోగో డాన్సర్‌గా పని చేస్తుందని తెలుసుకున్నప్పటి నుంచి.. అతని ప్రతి ప్రయాణం ఆమె కోసమే సాగింది. ఆమెతో స్నేహం, ప్రేమ, పెళ్లి, పిల్లలు ఈ క్రమంలో చాలా ట్విస్ట్‌లనే చూశాడు డెరెల్డ్‌. ‘చిన్నప్పటి నుంచి నార్త్‌ కరోలినాలో పెరిగాను. మా నాన్న చెరోకీ ఇండియన్‌. నన్నంతా జెరీ అని ముద్దుగా పిలుస్తారు’ అంటూ పరిచయమైన రోజునే డెరెల్డ్‌కి చెప్పింది బోయిడ్‌.

స్నేహం బలపడిన తర్వాత తనకు అంతకుముందే పెళ్లి అయిందని చెప్పింది. తర్వాత ఒకరోజు ‘నాకిద్దరు ఆడపిల్లలు, భర్తతో విడిపోయాను’ అని చెబుతూనే.. డెరెల్డ్‌ని తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మొదటిసారి ఆమె కూతుర్లు సాలీ, ఏంజెల్‌లను కలుసుకున్నాడు డెరెల్డ్‌. ‘మాతో పాటు ఈ గ్రానీ (నాయనమ్మ) ఉంటుంది’ అంటూ ఒక పెద్దావిడను పరిచయం చేసింది. అయితే ఆమె రక్తసంబంధీకురాలు కాదని తెలిపింది. రోజులు, వారాలు గడిచాయి. డెరెల్డ్, బోయిడ్‌ల మధ్య స్నేహం.. ప్రేమగా మారింది.  తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని డెరెల్డ్‌తో లివిన్‌ రిలేషన్‌ మొదలుపెట్టింది బోయిడ్‌.

అయితే కలసి జీవించే క్రమంలో.. బోయిడ్‌ కొన్నిసార్లు మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించడం.. డెరాల్డ్‌ని కాస్త భయపెట్టింది. పగలు కూడా తలుపులు, కిటికీలు మూసుకుని ఇంట్లో ఉండటం, ఫోన్‌ రాగానే ముందుగా తను చెప్పిన కోడ్‌ని అవతల వ్యక్తి చెబితేనే మాట్లాడటం.. ఇదంతా డెరెల్డ్‌కి నెమ్మది నెమ్మదిగా అలవాటైపోయింది. ఒకరోజు బోయిడ్‌ని కూర్చోబెట్టి ‘ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్‌?’ అంటూ ఆరా తీశాడు డెరాల్డ్‌. ‘నా మాజీ భర్త చాలా దుర్మార్గుడు. అతను సాలీ, ఏంజెల్‌లను కిడ్నాప్‌ చేస్తాడని భయంగా ఉంది’ అంటూ ఏడ్చేసింది.

రెండు వారాల తర్వాత.. ఒకరోజు రాత్రి బోయిడ్‌ని ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన డెరెల్డ్‌కి.. ఆమె తను పనిచేసే బార్‌ ముందు భయపడుతూ కనిపించింది. కారణం అడిగితే.. ‘డెవిల్స్‌ గ్యాంగ్‌ అనే పేరున్న మోటర్‌ సైకిల్‌ ముఠాలోని ముగ్గురు సభ్యులు నన్ను బంధించి తీసుకెళ్లిపోవడానికి బార్‌కి వచ్చారు. గతంలో నేను వారి దగ్గర నుంచి తప్పించుకు వచ్చాను’ అని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే ఓ వ్యాన్‌.. వారి బండిని వెంబడించడం డెరెల్డ్‌ గుర్తించాడు. లక్కీగా దారిలో ఓ పోలీస్‌ అధికారి ఎదురుపడటంతో.. ఆ వ్యాన్‌ కాసేపటికి మాయం అయ్యింది. అయితే చాలాసార్లు తన మాజీ భర్త మంచివాడు కాదని.. తనను చాలా వేధింపులకు గురిచేశాడని చెప్పేది.

ఇక ఒకరాత్రి చీకట్లో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడటం చూసిన డెరెల్డ్‌.. ఆ ఆగంతకుడ్ని పట్టుకోవడానికి విఫలయత్నం చేశాడు. ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా బోయిడ్‌ని మాత్రం వదిలిపెట్టలేదు. కొన్ని రోజులకు ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగా రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి రావడాన్ని కూడా ఆమె తట్టుకోలేకపోయేది. భయంగా ఉంటోందని, ఎవరో.. తలుపులు వేసుకుని ఉన్నా ఇంటి చుట్టూ తిరుగుతూ వేధిస్తున్నారని చెప్పేది. కొన్ని రోజులకు ‘ఐ విల్‌ గెట్‌ యు డియర్‌’ అనే పెయింటింగ్‌ మెసేజ్‌ ఆమెని మరింత కుంగదీసింది.

కొన్నాళ్లకు బోయిడ్, డెరెల్డ్‌ జంటకు ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత బోయిడ్‌ తీవ్రమైన తలనొప్పితో సతమతమయింది. ఆరోగ్యం కుదుటపడేలా చెయ్యాలని డెరెల్డ్‌.. తన భార్య బోయిడ్‌ని మిషిగన్‌లోని స్వస్థలానికి తీసుకెళ్లాడు. ఆమె అక్కడ రెండో కొడుక్కి జన్మనిచ్చింది. అయితే రెండో బిడ్డ పసికందుగా ఉన్నప్పుడే బోయిడ్‌ మంచం పట్టింది. ఆ తర్వాత కోమాలోకి వెళ్లి.. చనిపోయింది. ఆమె మరణం తర్వాత డెరెల్డ్‌.. ఆమె బంధువుల కోసం విస్తృతంగా అన్వేషించాడు. అయితే ఎవ్వరూ ఆమె గురించి ఏ సమాచారమూ ఇవ్వలేదు. పైగా అగస్టా బార్‌కి వెళ్లి ఆరా తీస్తే.. ఆమె గురించి విచారించడం మానేస్తే మంచిదనే సలహా ఇచ్చేవారు ఎక్కువయ్యారు.

కొందరైతే ఆమె గురించి మాట్లాడటానికే ఇష్టపడలేదు. దాంతో స్థానిక టీవీ చానెల్‌లో ఆమె ఫొటోని 24 గంటలు ప్రసారంలో ఉంచమని.. తెలిసివారు తనని సంప్రదిస్తారని డీల్‌ మాట్లాడుకున్నాడు డెరెల్డ్‌. ముందు సరేనన్న ఆ చానెల్‌.. తర్వాత ప్రసారం చేయలేదు. ఏవో బెదిరింపుల వల్ల ఆ చానెల్‌ వెనక్కి తగ్గిందని డెరెల్డ్‌ కొన్నాళ్లకు తెలుసుకున్నాడు. అగస్టా పోలీసులు కూడా డెరెల్డ్‌కి సాయం చేయలేదు. ఎందుకంటే ‘విచారించడానికి ఇదేం మర్డర్‌ కేసు కాదుగా?’ అన్నారు. ఆ నలుగురు పిల్లల్ని.. బోయిడ్‌ కుటుంబంతో కలపాలనేది డెరెల్డ్‌ కోరిక. ఇక అతడి విచారణలో.. ఏంజెల్, సాలీల తండ్రి గ్యారీమూర్‌ను కలుసుకుని.. బోయిడ్‌ అసలు పేరు.. ‘ఎడిత్‌ గెరాల్డిన్‌ జాన్స్‌ మూర్‌’ అని తెలుసుకున్నాడు.

ఇక కొన్నాళ్లకు బోయిడ్‌ బంధువుల్లో ఇంకొందరిని కూడా కలిశాడు. అయితే డెరెల్డ్‌కి.. మరో నిజం తెలిసింది. ఏంజెల్, సాలీ కంటే ముందే బోయిడ్‌కి 11 ఏళ్ల వయసులో.. యూజీన్, రోండా అనే కొడుకు, కూతురు పుట్టారని తెలుసుకున్నాడు. అయితే బోయిడ్‌ గురించి పూర్తి వివరాలు చెప్పడానికి.. సొంతవాళ్లు కూడా వెనకాడటం డెరెల్డ్‌ని కాస్త ఆశ్చర్యపరిచింది. కానీ ఆమె ఎందుకు తన దగ్గర అన్ని నిజాలను గోప్యంగా ఉంచింది? ఎవరి కారణంగా ఆమె అంతగా భయపడింది? ఆమెని ఎవరు అంతగా వేధించారు? అనే సందేహాలకు అతను సమాధానాలు రాబట్టలేకపోయాడు. 

నిజానికి ఒక సైనికుడై ఉండి.. జీవితభాగస్వామి వ్యక్తిగత విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం సరికాదనే విమర్శలు చాలానే వచ్చాయి. అయినా అతను బంధాలకు ఇచ్చే విలువ, పిల్లల్ని చేరదీసి పెంచిన విధానం అంతా ఆదర్శనీయంగా నిలిచింది. ఏదేమైనా 22 ఏళ్లకే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన బోయిడ్‌ అలియాస్‌ ఎడిత్‌ జీవితంలో.. ఆమెకు మాత్రమే తెలిసిన నిజాలు, భయాలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.
∙సంహిత నిమ్మన 

(చదవండి: దెయ్యాలు కట్టిన గుడి కాకన్‌మఠ్‌ టెంపుల్‌ !..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement