Unsolved Mysteries: Story Of US Man Who Could Make It Rain Wherever He Went In 1980s In Telugu - Sakshi
Sakshi News home page

Mysterious Story Of Rainman Don Decker: పోలీసులనే హడలెత్తించిన మిస్టరీ కేసు..అతడొస్తే.. వర్షం వచ్చేస్తుంది!

Published Sun, Jul 16 2023 12:48 PM | Last Updated on Mon, Jul 17 2023 8:09 AM

The US Man Who Could Make It Rain Wherever He Went In 1980s - Sakshi

అసంభవమైన ప్రతిదానికి పుకార్లు ఎక్కువ, సాక్ష్యాలు తక్కువ. అందుకే.. అస్పష్టత, సందిగ్ధతలే వాటిని తీర్మానిస్తాయి. నిర్ధారించలేని ఎన్నో ఘటనల్లో ఈ రెయిన్‌ మెన్‌ కథ ఒకటి. ఎవరీ రెయిన్‌ మెన్‌? ఏం జరిగింది?

అది 1983 ఫిబ్రవరి 24. అమెరికా పెన్సిల్వేనియాలోని స్ట్రౌడ్స్‌బర్గ్‌లో జేమ్స్‌ కిషోగ్‌ (63) అనే వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న రోజది. అతడి మరణంతో ఆ కుటుంబమంతా బాధలోనే ఉంది. కానీ జేమ్స్‌ మనవడు డాన్‌ డెకర్‌ (21) మనసుకు చాలా సంతోషంగా ఉంది. డెకర్‌.. స్పెషల్‌ పర్మిషన్‌తో జైలు నుంచి ఆ రోజే బయటకు వచ్చాడు. అంటే డెకర్‌ కానీ.. జేమ్స్‌ని చంపి జైలుకు వెళ్లాడా? అనుకునేరు, డెకర్‌ జైలుకు వెళ్లడానికి, జేమ్స్‌ చావుకు ఎటువంటి సంబంధం లేదు. జేమ్స్‌ లివర్‌ సిర్రోసిస్‌తో మరణించాడు. డెకర్‌.. మాదకద్రవ్యాల కేసులో శిక్షను అనుభవిస్తూ.. కుటుంబ అత్యవసర పరిస్థితుల్లో ఖైదీగానే బయటికి వచ్చాడు. మరి ఎందుకు తాత చావు మనవడికి సంతోషంగా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం తన స్నేహితురాలు జెన్నీ కైఫర్‌కి సీక్రేట్‌గా చెప్పాడు.

‘జేమ్స్‌ నన్ను ఏడేళ్ల వయసు నుంచి శారీరకంగా, చెప్పుకోలేని విధంగా హింసించేవాడు, ఈ విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియదు. అతడి మరణం నాకు చాలా ఆనందాన్నిస్తోంది. ఇక నా బ్యాడ్‌ టైమ్‌ పోయినట్లే’ అని మనసులో మాటల్ని జెన్నీకి చెప్పాడు. కానీ అతడి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆ రాత్రికే డెకర్‌కి జ్వరం వచ్చింది. ఆ రాత్రంతా చాలా వింతలు చూశాడు. బాత్‌రూమ్‌ కిటికిలో ఓ వృద్ధుడు వెకిలిగా నవ్వుతూ మీదకు దుమికినట్లు.. ఉన్నపళంగా ఎవరో బలవంతంగా తోస్తున్నట్లు.. వింత భ్రమలతో నిద్ర లేకుండా గడిపాడు. అంత్యక్రియల తర్వాత కుటుంబీకులు.. జేమ్స్‌ని ఎంతగానో పొగడటంతో మరింత కలత చెందిన డెకర్‌.. మరునాడు రాత్రికి జెన్నీ ఇంటికి వస్తున్నానని, మరో స్నేహితుడు బాబ్‌ని కూడా అక్కడికి రమ్మని, ఆ రాత్రికి అక్కడే ఉందామని రిక్వెస్ట్‌ చేశాడు. అనుకున్నట్లే ముగ్గురూ జెన్నీ ఇంట్లో కలిశారు. చాలాసేపు కబుర్లుతో సరదాగా గడిపారు. 

రాత్రి డిన్నర్‌ చేసి.. డెకర్, బాబ్‌ గదిలోకి వెళ్లగానే.. కిందనున్న జెన్నీని పెద్ద శబ్దం వణికించింది. బాబ్‌ పరుగున వచ్చి.. ‘జెన్నీ.. వెంటనే పైకిరా గదిలో వర్షం కురుస్తోంది. డెకర్‌ వింతగా ప్రవర్తిస్తున్నాడు’ అంటూ గాభరా పడ్డాడు. జెన్నీ.. బాబ్‌ వెనుకే ఆ గదికి పరుగుతీసింది. గది అంతా వర్షమే. ఏదో దుర్గంధం. డెకర్‌ ఓ మూలన పడున్నాడు. నిస్సహాయంగా.. ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఎంత పిలిచినా పలకలేదు. ఆ గదిలోకి వెళ్లాలంటే ఇద్దరికీ భయమేసింది. అసలా నీరు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు. వెంటనే ఇంటి పైనుండే హౌస్‌ ఓనర్‌ రాన్‌ వాన్‌ని పిలిచారు. అతడు ఆ గదిలోకి వచ్చి చూసి షాక్‌ అయ్యాడు. ప్లంబింగ్, బాత్‌రూమ్‌ లీక్‌ కాబోలని రెండూ చెక్‌ చేశాడు. వెంటనే భార్య రోమైన్‌ ని కిందకి పిలిచాడు రాన్‌. ఆమెకీ ఏం అర్థంకాలేదు.

దాంతో పోలీసు అధికారి జాన్‌ బౌజన్‌ కి సమాచారం ఇచ్చారు రాన్‌ దంపతులు. అతడు వచ్చేలోపు.. మరోసారి నీళ్లు ఎలా వస్తున్నాయో గమనించాలని మొత్తం పరికించారు. ఆ నీళ్లు పైకప్పు నుంచి కిందకు మాత్రమే రావడం లేదని.. గోడల్లోంచి, నేలలోంచి అన్నివైపుల నుంచి వస్తున్నాయని గుర్తించి వణికారు. పైగా ఆ నీళ్లను తాకితే.. జిగటగా అనిపించిందట. కాసేటికి బౌజన్‌ ఆ ఇంటికి వచ్చాడు. వర్షాన్ని చూసి భయమేసి తన స్నేహితుడు (ఆ రాత్రి పెట్రోలింగ్‌ డ్యూటీలో ఉన్న మరో అధికారి) రిచర్డ్‌ వోల్బర్ట్‌ను పిలిచాడు. అతడికీ భయమేసింది. వర్షం అయితే పడుతుంది కానీ.. నీళ్లు నిండి, పొంగడం లేదు. ఎలాగో ధైర్యం చేసి, అంతా కలసి గదిలోకి వెళ్లి డెకర్‌ను బయటికి తీసుకురాగలిగారు. అప్పుడు కూడా చాలాసార్లు డెకర్‌.. గిలగిలా కొట్టుకుని కాసేపటికి మామూలయ్యాడు. వర్షం మాత్రం ఆగలేదు.

చుట్టు పక్కలున్న కొందరు ఆ వింతను చూసి విస్తుపోయారు. బౌజన్, వోల్బర్ట్‌లు కలసి స్ట్రౌడ్స్‌బర్గ్‌ చీఫ్‌ ఆఫ్‌ పోలీస్‌ గ్యారీ రాబర్ట్స్‌కి నివేదించడానికి బయలుదేరారు. అప్పటికి వర్షం మొదలై సుమారు 23 గంటలైంది. ఎదురుగా ఉండే రెస్టారెంట్‌ యజమాని.. పామ్‌ స్క్రోఫానో ఆ ఇంటికి వెళ్లి గదిలోని ఆ వర్షాన్ని, డెకర్‌ పరిస్థితిని గమనించి.. ఇది కచ్చితంగా దెయ్యం పనే అని చర్చి అధికారులకు కాల్‌ చేయించింది. ఇంతలో డెకర్‌కి ఏదో ఒకటి తినిపించడానికి తన రెస్టారెంట్‌కే తీసుకుని రమ్మని సలహా ఇచ్చింది. మధ్యలో బాబ్‌ ఆ టెన్షన్‌ భరించలేక ఇంటికి పారిపోయాడు. జెన్నీ.. సాధారణ స్థితిలోకొచ్చిన డెకర్‌ని తీసుకుని ఎదురుగా ఉన్న రెస్టారెంట్‌కి బయలుదేరింది. వాళ్లు వెళ్లగానే ఆ గదిలో వర్షం ఆగిపోయిందని గుర్తించిన రాన్, రొమైన్‌లు.. దీనికి జెన్నీ, డెకర్‌లలో ఎవరో ఒకరు కారణమని నమ్మారు.

ఇక డెకర్‌ రెస్టారెంట్‌కి వెళ్లి కూర్చోగానే అక్కడా అదే వర్షం మొదలైంది. సీలింగ్‌ కింద నుంచి చినుకులు రావడం జెన్నీని, రెస్టారెంట్‌ యజమాని పామ్‌ని బాగా భయపెట్టాయి. వెంటనే పామ్‌ ధైర్యం చేసి.. శిలువను అందుకుని.. డెకర్‌ నుదుటిపై ఆనించింది. ఆ ఊహించని స్పందనకు డెకర్‌ విలవిల్లాడిపోయాడు. వర్షం ఆగిపోయింది. కాసేపటికి మామూలు మనిషి అయిపోయి.. జరిగింది తెలుసుకున్నాడు డెకర్‌. కొన్ని గంటలకు ఇద్దరూ.. జెన్నీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే రాత్రి అయిపోయింది. వాళ్లు రాగానే రాన్, రోమైన్‌లు వాళ్లతో గొడవకు దిగారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని వింతలు ఇప్పుడే చూస్తున్నామని.. వెంటనే ఇళ్లు ఖాళీ చెయ్యాలని పట్టుబట్టారు. అంతలో వంటగదిలోంచి కూరగాయలన్నీ పైకి లేచి విచిత్రమైన శబ్దాలు చేయసాగాయి. లైట్స్‌ వెలిగి ఆరుతున్నాయి. ఉన్నట్టుండి డెకర్‌ గాల్లోకి లేచాడు. డెకర్‌ను ఎవరో మెలిపెట్టినట్లుగా మెలికలు తిరిగాడు. కాసేపటికి ఐదు అడుగుల దూరానికి విసిరినట్లుగా పడ్డాడు. వెంటనే జెన్నీ దేవుడ్ని ప్రార్థించసాగింది. చినుకులు మొదలై, వర్షం ఆమెను కొట్టడం ప్రారంభించింది. అయినా జెన్నీ ప్రార్థించడం ఆపలేదు. 

కొన్ని గంటలకు అధికారులు బౌజన్, వోల్బర్ట్‌ తమ పైఅధికారి రాబర్ట్స్‌ని తీసుకుని వచ్చారు. వాళ్ల మీద కూడా చినుకులు రాళ్లలా విరుచుకుపడ్డాయి. ఆ రాత్రి అక్కడ పరిస్థితిని చూసిన రాబర్ట్స్‌.. బౌజన్, వోల్బర్ట్‌లను బలవంతంగా బయటికి పంపించేసి.. ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. ఎవరినీ రానివ్వలేదు. రాబర్ట్స్‌ కూడా ఏదో దుష్టశక్తి ప్రభావానికి లోనయ్యాడని భావించిన బౌజన్, వోల్బర్ట్‌లు.. మరునాడు ఉదయాన్నే రాబర్ట్స్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా ముగ్గురు అనుభవజ్ఞులైన అధికారులను లోపలికి పంపించారు. జెన్నీ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ రాత్రి ఏం జరిగిందో మాత్రం రాబర్ట్స్‌ నోరు విప్పలేదు. లోపలికి వెళ్లిన ఆ ముగ్గురు అధికారులు.. డెకర్‌ ఉమ్మితో వర్షాన్ని సృష్టిస్తున్నాడా? అనే అనుమానంతో రకరకాలుగా చెక్‌ చేశారు. అధికారులలో ఒకరైన బిల్‌ డేవిస్‌.. డెకర్‌ చేతిలో బంగారు శిలువను ఉంచాడు. వెంటనే వర్షం ఆగింది.

అయితే దాన్ని డెకర్‌ విసిరేశాడు. కింద పడిన శిలువను తీసుకున్నప్పుడు, అది చాలా వేడిగా ఉందని డేవిస్‌ గుర్తించాడు. కొద్ది క్షణాల తర్వాత మళ్లీ వర్షం మొదలైంది. మరో అధికారి జాన్‌ రండిల్‌.. అకస్మాత్తుగా డెకర్‌ని నేలపై నుంచి ఎత్తి గదికి అడ్డంగా విసిరినట్లు కళ్లారా చూశానని, ఆ సీన్‌ బస్సు ఢీ కొట్టినట్లే ఉందని చెప్పాడు. అప్పుడే డెకర్‌ మెడ మీద రక్తంతో మూడు పంజా గుర్తులను చూశాడు. అవి దెయ్యం గీరిన చారికలని అతడు నమ్మాడు. చివరగా, ఫిబ్రవరి 27, మూడవ రాత్రి, సువార్త బోధకుడైన ‘రెవరెండ్‌ జాన్సన్‌’ సమక్షంలో ప్రార్థనలు సాగాయి. తెల్లారేసరికి అంతా ప్రశాంతమైంది. వర్షం ఆగిపోయింది. డెకర్‌ మామూలు మనిషి అయ్యాడు. జాన్సన్‌ దెయ్యాన్ని తరిమేశాడని చూసినవారంతా నమ్మారు. ఆ దెయ్యం డెకర్‌ తాత జేమ్స్‌ ఆత్మేనని అతడి కథ తెలిసినవాళ్లంతా భావించారు. ఇక్కడితో కథ ఆగిపోలేదు. దీనికి కొనసాగింపుగా మరో ఎపిసోడ్‌ ఉంది.

జైలు గోడల మధ్య..
నిబంధనల ప్రకారం డెకర్‌ శిక్ష అనుభవించడానికి తిరిగి జైలుకు వెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు సాధారణంగానే సాగింది. ఉన్నట్టుండి ఒకరాత్రి అతడున్న సెల్‌లో వర్షం మొదలైంది. అది చూసిన డెకర్‌ సెల్‌మేట్‌ (మరో ఖైదీ) బెంబేలెత్తిపోయాడు. పెద్దపెద్ద కేకలతో ‘సెల్‌ ఓపెన్‌ చేయండి. నన్ను కాపాడండి’ అంటూ అరిచాడు. ఆ అరుపులకు పరుగున వచ్చిన గార్డులు వర్షం అడ్డంగా రావడం చూసి బిత్తరపోయారు. కాంక్రీట్‌ ఫ్లోర్‌ నుంచి వర్షం ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. డెకర్‌ మాత్రం నిశ్చేష్టుడై, ధైర్యంగా జైల్లో తన బెడ్‌ మీద కూర్చుని ఉండటం వాళ్లను మరింత భయపెట్టింది. కాసేపటికి డెకర్‌ని.. ‘ఏంటిదంతా? సెల్‌లో వర్షం ఎలా పడుతుంది?’ అని ఓ గార్డ్‌ నిలదీశాడు. ‘నేను వర్షాన్ని నియంత్రించగలను’ అని సమాధానమిచ్చాడు డెకర్‌ పొగరుగా. ఆ విషయాన్ని గార్డ్‌ మొదట నమ్మలేదు. అందుకే డెకర్‌ని ఆ గార్డ్‌ రెచ్చగొట్టాడు. ‘నీకు ఆ శక్తే ఉంటే కాస్త దూరంలో ఉన్న మా వార్డెన్‌ అధికారి కీన్‌ హోల్డ్‌ మీద వర్షం కురిపించు చూద్దాం’ అంటూ చాలెంజ్‌ చేసి.. వెంటనే డెకర్‌ మీద కంప్లైంట్‌ ఇవ్వడానికి కీన్‌హోల్డ్‌ దగ్గరకు వెళ్లాడు గార్డ్‌.

అప్పుడు సమయం రాత్రి ఎనిమిది దాటింది. గార్డ్‌ నడుచుకుంటూ.. కీన్‌హోల్డ్‌ క్యాబిన్‌ దగ్గరకు వెళ్లేసరికి కీన్‌హోల్డ్‌ ఛాతీ మీద షర్ట్‌ తడిసినట్లు స్పష్టంగా కనిపించసాగింది. ఏంటని గమనించేలోపే అటుగా నీటి చుక్కలు అడ్డంగా వచ్చి అతడి ఛాతీని తాకి, స్మాష్‌ అవుతున్నాయి. అది కళ్లారా చూసిన గార్డ్‌ ముఖం తెల్లబోయింది. జైలు గదిలో వర్షం గురించి, దానితో పాటు అతడి చొక్కా తడవడానికి తాను చేసిన చాలెంజ్‌ గురించి.. అన్నీ వరుసగా చెప్పుకొచ్చి.. కీన్‌హోల్డ్‌ని డెకర్‌ దగ్గరకు తీసుకుని వెళ్లాడు. ఈ లోపు ప్లంబర్‌ వచ్చి.. సెల్‌లోకి వెళ్లేందుకు భయపడి పారిపోయాడు. కాసేపటికి వర్షం ఆగింది. అయితే ఆ గది మొత్తం ఏదో దుర్వాసన. మార్చురీ నుంచి వచ్చే వాసనేనని చాలా మంది గుర్తించారు. డెకర్‌ మామూలు మనిషి అయ్యాక.. తనకు కూడా ఆ వాసన వస్తున్నట్లు చెప్పాడు. ఇక ఖైదీలు, అధికారులు అందరిలోనూ తెలియని గందరగోళం మొదలైంది. అప్పుడే డెకర్‌ని కూర్చోబెట్టి ఆరా తీస్తే.. ‘నాకు వర్షంపై అధికారం ఉంది.. దాన్ని నియంత్రించే శక్తి నాకు మాత్రమే ఉంది’ అంటూ నిరూపించడానికి చేతులు పైకెత్తి వేళ్లను నిమిరాడు.

క్షణాల్లో పొగమంచు వర్షం మొదలైంది. వెంటనే రెవరెండ్‌ బ్లాక్‌బర్న్‌ అనే అనుభవజ్ఞుడైన భూతవైద్యుడ్ని రంగంలోకి ప్రవేశపెట్టారు అధికారులు. డెకర్‌ని పరిశీలించిన బ్లాక్‌బర్న్‌.. నేను నీ కోసం ప్రార్థిస్తానని చెప్పిన్పప్పుడు.. ‘మీరు నా గురించి ఎలాంటి ప్రార్థనలు చెయ్యాల్సిన పనిలేదు వెళ్లండి ఇక్కడి నుంచి’ అని అరిచాడు డెకర్‌ ఆవేశంగా. వెంటనే బ్లాక్‌బర్న్‌ ధైర్యం చేసి ప్రార్థనలు మొదలుపెట్టాడు. కొన్ని గంటల పాటు ప్రార్థిస్తూనే ఉన్నాడు. వర్షం ఆగింది. మామూలు మనిషి అయిన తర్వాత డెకర్‌.. బ్లాక్‌బర్న్‌ని కౌగిలించుకుని మరీ కృతజ్ఞతలు చెబుతూ ఏడ్చేశాడు. ఆ రోజు నుంచి డెకర్‌ విచిత్ర ప్రవర్తనను, ఆ వర్షాన్ని ఎవరూ చూడలేదు. అయితే సాక్షులంతా అధికారులు,విద్యావంతులు కావడమే ఈ కథలోని అసలైన ట్విస్ట్‌. ‘ఆ రోజు రాత్రి డెకర్‌ని కాపాడటంతో పాటు నన్ను నేను కాపాడుకోవడం కష్టమైంది’ అని చెప్పకొచ్చాడు బ్లాక్‌బర్న్‌.

మొదట జెస్సీ ఇంట్లో నిస్సహాయంగా ఓ ఆటబొమ్మలా విలవిల్లాడిన డెకర్‌.. జైల్లో తానే సుప్రీమ్‌లా ప్రవర్తించాడు. ఇతడి కేసుని స్టడీ చేసిన కొందరు పారానార్మల్‌ ఇన్వెస్టిగేటర్స్‌.. డెకర్‌ జైలుకు  చేరేసరికి పూర్తిగా ఆ దుష్టశక్తి ఆధీనంలో ఉన్నాడని, అందుకే అలా ప్రవర్తించాడని చెప్పారు. అయితే ఆ దుష్టశక్తి అతడి తాత జేమ్స్‌ ఆత్మేనని వారంతా నమ్మారు. న్యూజిలాండ్‌ మెడికల్‌ సోషియాలజిస్ట్‌ బార్తోలోమ్యూ.. ఈ కేసును పరిశీలించి, అదంతా మంచు గడ్డ కట్టే ప్రాంతమని.. అలాంటి చోట్ల రాత్రి ఉష్ణోగ్రత మార్పులతో ఇంటి పైకప్పు మీద పేరుకున్న మంచు కరిగి.. అటక లోపల వర్షం పడి ఉంటుందని అంచనా వేశాడు. మరి వరుసగా జైల్లో, రెస్టారెంట్‌ల్లో అది ఎలా సాధ్యమైందో చెప్పలేదు. ఏది ఏమైనా ఈ ఘటన బూటకమని కొందరు.. అతీంద్రియ శక్తి ఫలితమని మరికొందరు నమ్ముతుంటారు. ఇదే కథను ఆధారం చేసుకుని.. ఈ రెయిన్‌ మెన్‌ గురించి కొన్ని సిరీసులు, డాక్యుమెంటరీలు కూడా రిలీజ్‌ అయ్యాయి. మొత్తానికి ఇది దెయ్యం పనేనా? లేక డెకర్‌ ఏదైనా మ్యాజిక్‌ ట్రిక్స్‌తో అలా గిమ్మిక్కులు చేశాడా? అనేది నేటికీ మిస్టరీనే.
-సంహిత నిమ్మన 

(చదవండి: పుట్టిన మూడు రోజులకే మిస్సింగ్‌..ఇప్పటికీ అంతు తేలని ఓ మిస్టరి గాథ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement