బుక్ రాసిన తర్వాత టెర్రీ, 1961 నాటి ఫొటో– ఆసుపత్రిలో టెర్రీ
కొన్ని విహారయాత్రలు అనుకోని ప్రమాదాలతో విషాదాలుగా మిగిలిపోతే.. మరి కొన్ని విహారయాత్రలు ఊహించని మలుపులతో మిస్టరీలుగా మారిపోతుంటాయి. ఎటువంటి ఆధారాల్లేక ఏళ్లకు ఏళ్లు కథలుగా నడుస్తుంటాయి. అలాంటి ఓ మిస్టరీ 49 ఏళ్ల తర్వాత వీడింది. అదే 1961 నాటి ‘టెర్రీ జో’ ట్రాజెడీ అండ్ క్రైమ్ స్టోరీ!
అదొక మహా సముద్రం.. చుట్టూ చిక్కని చీకటి.. నడుమ ఒక ఓడ.. ఓ వైపు పెనుగాలులు, మరోవైపు నాలుకలు చాస్తున్న అలలు.. హఠాత్తుగా ఆర్తనాదాలు.. కలతనిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది 11 ఏళ్ల టెర్రీ జో డ్యూపెరాల్ట్. అప్పటికే కన్నవారు, తోబుట్టువులు ఎవరూ ప్రాణాలతో లేరు. ఎదురుగా వాళ్లందరినీ చంపిన హంతకుడు. కళ్లు మూసి తెరిచేలోపే టెర్రీని ఎత్తి సముద్రంలోకి విసిరేశాడు.
టెర్రీ జో తండ్రి అర్థర్ డ్యూపెరాల్ట్ ఒక డాక్టర్ (ఆప్టోమెట్రిస్ట్). తన భార్య, ముగ్గురు పిల్లలతో కలసి సముద్ర విహారం చేయాలని నిర్ణయించు కున్నాడు. తన స్నేహితుడు, మాజీ నౌకాధికారి జూలియన్ హార్వే, అతని భార్య మేరీ డెనాలను కూడా ఆ యాత్రకు ఆహ్వానించాడు. నవంబర్ 8న బ్లూబెల్ బోట్‌ను అద్దెకు తీసుకుని.. ఫోర్ట్ లాడర్ డేల్ నుంచి బహామాలోని ఐల్యాండ్‌ను సందర్శించడానికి బయలుదేరారంతా. బోట్‌కి హార్వే కెప్టెన్‌గా ఉంటే.. అతడి భార్య మేరీ బోట్‌లో అందరికీ వండిపెట్టేది. రోజులు అద్భుతంగా గడుస్తున్నాయి. తిరుగు ప్రయాణమైన రాత్రి (నవంబర్ 12) బోట్.. శాండీ పాయింట్ దగ్గర ఆగింది. టెర్రీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన రాత్రి అది.
∙∙
తెల్లారే నడిసముద్రంలో టెర్రీ.. బిక్కుబిక్కుమంటూ ఓ చిన్న తెల్లటి తెప్పపై ప్రయాణం చేస్తోంది. సముద్రంలో పడినప్పుడు టెర్రీకి దొరికిన ఒకే ఒక్క ఆధారం బోట్ నుంచి విడిపోయిన ఆ రబ్బరు తెప్ప. నిర్మానుష్యమైన ఆ కడలిలో.. అనాథగా మిగిలిపోయింది టెర్రీ. సుమారు మూడున్నర రోజులు తిండి, నీరు లేక నీరసించి పోయింది. అదృష్టవశాత్తు అటుగా వచ్చిన ఓ వాణిజ్య నౌక కెప్టెన్.. టెర్రీని చూసి, కాపాడి ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పటికే ఊహించని షాక్‌తో, భయంతో స్పృహ లేకుండా పడుంది టెర్రీ.
ఆ రాత్రి ఏం జరిగింది? (టెర్రీ పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో అల్లిన కథనం)
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భార్యని సముద్రంలోకి విసిరేశాడు హార్వే. మేరీ అరుపులు వినిపించిన అర్థర్.. ‘మేరీ ఎక్కడా?’ అని హార్వేని నిలదీయడంతో అర్థర్‌నూ సముద్రంలోకి తోసేశాడు. అయితే ఆ హత్యను చూసిన అర్థర్ భార్య జీన్‌తో పాటు అర్థర్ కొడుకు బ్రయిన్(14)లను క్రూరంగా పొడిచి చంపేశాడు. అర్థర్ చిన్న కూతురు రెనే(7)ను కూడా ఎత్తి సముద్రంలో పారేశాడు హార్వే. అయితే ఆ అరుపులకు బోటు కింద నిద్రిస్తున్న టెర్రీజోకు మెలకువ రావడంతో పైకి వచ్చి చూసింది. అప్పటికే బోట్‌ని సముద్రంలో ముంచి, తప్పించుకునే ప్లాన్‌లో ఉన్న హార్వే.. టెర్రీనీ ఎత్తి సముద్రంలోకి విసిరేశాడు.
ఆ కథనం ఏదైనా.. బ్లూబెల్‌ని సముద్రంలో పూర్తిగా ముంచేసి హార్వే ఆ రాత్రి ఈతకొట్టుకుంటూ వెళ్లడాన్ని కళ్లరా చూసింది టెర్రీ. సేఫ్టీ బోటులో మయామీ బీచ్‌కు చేరుకున్న హార్వే.. ‘తాము ప్రయాణిస్తున్న బోటు సముద్రం మధ్యలో మునిగిపోయిందని, తాను మాత్రమే బతికి బయటపడ్డా’నని పోలీసులకు తెలిపాడు. వెంటనే రెస్క్యూ టీమ్ విమానాల్లో ఓడ కోసం గాలింపులు చేపట్టింది. ఓడకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దాంతో ఊపిరి పీల్చుకున్నాడు హార్వే. కానీ నాలుగు రోజులకు టెర్రీ బతికొచ్చిందని తెలుసుకున్న అతను.. నిజం బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే టెర్రీ మానసిక పరిస్థితి బాగోకపోవడంతో పూర్తి వివరాలు బయటికి రాలేదు. టెర్రీ తన 12 ఏళ్ల వయసులో టెరేగా పేరు మార్చుకుని.. తండ్రి తరపు బంధువుల దగ్గరే పెరిగింది.
1988లో తనని కాపాడిన కెప్టెన్‌ను కలిసిన టెరే.. అప్పుడు కూడా జరిగిందేంటో చెప్పలేదు. మీడియాకీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కానీ 2010లో తన అనుభవాలని.. సముద్రంలో ఒంటరిగా బతికిన ఆ రోజులని వివరిస్తూ.. ‘ఎలోన్–ఆర్ఫన్డ్ ఆన్ ది ఓషన్ (మహా సముద్రంలో అనాథ)’ అనే పుస్తకం రాసింది. అప్పటికే విస్కాన్సిన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్‌లో వాటర్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్‌గా చేసి రిటైర్ అయ్యింది. అయితే మానసికంగా బాగా కుంగిపోయిన టెరే.. ఆ సమస్యను అధిగమించడంలో మానసిక నిపుణుడు రిచర్డ్ డి.లోగాన్ సాయం తీసుకుంది.
టెరే బుక్ రిలీజ్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. అవేంటంటే.. ‘ఆ రోజు రాత్రి నేను బోట్‌పైకి వెళ్లి చూసేసరికి అమ్మా, అన్నయ్యా రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నారు.
నాన్న, చెల్లి కనిపించలేదు. కానీ.. కెప్టెన్ హార్వే ఎందుకలా చేశాడనేది నాకు అర్థం కాలేదు. నన్ను సముద్రం మింగేస్తుందని హార్వే భావించాడు కానీ.. ఆ నీరే నన్ను కాపాడింది. అందుకే ఆ నీటితో నాకు అనుబంధం పెరిగింది. ఆ ఘటన నుంచి నేను పూర్తిగా కోలుకోవడానికి 49 ఏళ్లు పట్టింది. బోట్ నుంచి విడిపోయిన తెల్ల తెప్ప సాయంతో నేను సముద్రంలో తేలాను. కానీ తెల్ల తెప్ప వల్ల రెస్క్యూ టీమ్‌కు నేను కనిపించలేదు. అందుకే 1962లో బోట్స్‌కి తెల్లటిరంగుకి బదులు ఆరెంజ్ కలర్ వేయడం మొదలుపెట్టారు. నా జీవితం ఎందరికో ప్రేరణ కావాలనే ఈ పుస్తకం రాశాను’ అంటూ తన జీవితాన్ని ప్రపంచం ముందు పెట్టింది.
అయితే ఈ ఘటనలో టెరే చూసింది మాత్రమే ప్రపంచానికి ఓ ఆధారం. హార్వే అందరినీ చంపడం నిజమే కానీ.. ఎవరి తర్వాత ఎవరిని చంపాడు? అనేది ఊహాత్మక కథనం. ఎందుకంటే టెర్రీ చూడలేదు, హార్వే ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే ఆ సంఘటన నేటికీ మిస్టరీనే.
హార్వే నేర చరిత్ర
హార్వేకి మేరీ నాలుగో భార్య. మొదటి ముగ్గురు భార్యలు ఏం అయ్యారు అనే సమాచారం లేకపోయినా.. బ్లూబెల్ విషాదఘటనకు 12 ఏళ్ల ముందు.. ప్రమాదవశాత్తు కారు చెక్క వంతెన మీద నుంచి నీటిలో పడిపోయిందని నమ్మించి రెండో భార్యను, ఆమె తల్లినీ పొట్టనపెట్టుకున్నాడనే అభియోగం బలపడింది.
- సంహిత నిమ్మన
చదవండి: Joshi Anumuthu: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..!
Comments
Please login to add a commentAdd a comment