క్రైమ్‌ స్టోరీ: ది స్పై కెమెరా | Srisudhamayi Telugu Crime Story The Spy Camera In Funday Magazine | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ స్టోరీ: ది స్పై కెమెరా

Published Sun, Oct 24 2021 2:35 PM | Last Updated on Sun, Oct 24 2021 3:29 PM

Srisudhamayi Telugu Crime Story The Spy Camera In Funday Magazine - Sakshi

అర్ధరాత్రి 11.45  ..
డీజీపీ కార్యాలయం.
ఎదురుగా ఇద్దరు పోలీస్‌ అధికారులు.


డీజీపీ వాళ్ళవైపు అసహనంగా చూసి అన్నాడు..‘మరో ఇన్ఫార్మర్‌ మన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు’ అని. 
‘సారీ సర్‌! మన డిపార్ట్‌మెంట్‌ నుంచి ప్రతీ కదలిక ఆ స్వామీజీకి చేరుతోంది’ ఆ ఇద్దరిలో ఒక పోలీస్‌ అధికారి అన్నాడు.
‘సో అనవసరంగా మన ఇన్ఫార్మర్స్‌ ప్రాణాలు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు.  కొన్నాళ్ళు మనం కామ్‌గా ఉందాం’  చెప్పాడు డీజీపీ.
ఆ ఇద్దరు పోలీస్‌ అధికారులు పోలీస్‌ బాస్‌ మాటలకు ఎదురుచెప్పలేక సెల్యూట్‌  చేసి వెనుతిరిగారు.
ఈ సంఘటన జరగడానికి కొన్నిగంటల ముందు...
∙∙ 
ఆశ్రమంలో స్వామిజీ ప్రవచనాలు పూర్తయ్యాయి. స్వామిజీ శిష్యులు.. చుట్టూ కవచంలా ఏర్పడి స్వామిజీని ఆశ్రమం లోపలికి తీసుకెళ్లారు.
భక్తులకు ప్రసాదించే గంగాజలాన్ని నీళ్లసీసాల్లో నింపి భక్తులకు ప్రసాదిస్తుంటాడు స్వామిజీ. ఆ నీటిని స్వామిజీ హిమాలయాల నుంచి ప్రత్యేకంగా భక్తుల కోసం తీసుకొస్తారని స్వామిజీ శిష్యులు ప్రచారం చేస్తుంటారు.
ఆ నీళ్లసీసాలను శిష్యులు తమకు అందుబాటులో ఉంచుకుని వాటిని స్వామిజీకి అందిస్తుంటారు. ఆ గంగాజలం పరమ పవిత్రమైనదని ఆ గంగాజలం తమ దోసిట పడగానే తమ కష్టాలన్నీ తీరిపోయి తమకు సుఖశాంతులు లభిస్తాయని నమ్మే భక్తులు స్వామిజీకి వేలాదిమంది ఉన్నారు. అందుకే ఆ గంగాజలం కోసం పోటీలు పడుతూ స్వీకరిస్తుంటారు.
∙∙ 
స్వామీజీ అనే ముసుగులో తన చీకటి వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు.
తన శిష్యులు అతి రహస్యంగా సేకరించుకు వచ్చే ఏనుగుదంతాలను, పులిచర్మాలనే కాక అనేక వస్తువులను ‘‘స్మగ్లింగ్‌ ’’ ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లాది ఆస్తులను తన ఆశ్రమ నేలమాళిగల్లో భద్రపరచుకునేవాడు. ఆరోజు ఏనుగుదంతాలు, పులిచర్మాలు చేతులు మారుతున్నాయి. అదే సమయంలో.. స్వామిజీ మిగిలిన శిష్యులు తిరిగి ఆశ్రమం వైపు వెళ్లబోయేంతలో..
దూరం నుంచి ఏదో వెలుగు స్వామిజీ కంటపడింది. అది చూడగానే స్వామిజీ తన దుస్తులలో దాచుకున్న గన్‌ బయటకు తీశాడు.
శిష్యులు ఆ వెలుగు వచ్చిన వైపు శరవేగంగా పరుగు తీశారు.
‘వాడిని చంపేయండి.. వాడు ప్రాణాలతో ఈ ప్రాంతం దాటి వెళ్ళకూడదు’ స్వామిజీ సెక్యూరిటీని హెచ్చరించాడు.
స్వామిజీ అనుచరులు అతడిని వెంబడించారు. చీకటిలో ఎంతో దూరం పరిగెత్తలేని ఆ వ్యక్తి ఒకచోట పడిపోయాడు. స్వామిజీ అనుచరులు అతడిని షూట్‌ చేశారు. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

అతని చేతిలోని ఫోన్‌ దూరంగా పడిపోయింది.
అదేసమయంలో అటువైపు దూసుకొచ్చిన ఒక వాహనం ఆ సెల్‌ ఫోన్‌ను ముక్కలుగా చేసి అంతే వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అది చూసిన స్వామిజీ, శిష్యులు తమ రహస్యం బట్టబయలు కాలేదని సంతోషించి స్వామిజీ చేతిలో బలైన ఆ వ్యక్తిని రోడ్డు మీదకు లాగి ఏమీ ఎరగనట్టు ఆశ్రమానికి వెళ్లిపోయారు.
ఆ వ్యక్తి పోలీస్‌ ఇన్ఫార్మర్‌. తప్పించుకోవడానికి పరుగిడుతున్నపుడు ఒక వీడియోను మరోవ్యక్తికి పంపించాడు. ప్రాణాలు కోల్పోతూ కూడా తన బాధ్యతను నెరవేర్చాడు.
∙∙∙    
అర్ధరాత్రి వేళ స్వామిజీ ఆశ్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒకవ్యక్తిని సీసీటీవీ ద్వారా చూసి భక్తుల రూపంలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్‌ స్వామిజీ దగ్గరికి తీసుకువెళ్లారు. అతని వేషధారణ చూడగానే వజ్రాల వర్తకుడిగా గుర్తించారు. ఆధార్‌ కార్డులో భన్సీలాల్‌ అని వుంది. రాజస్థాన్‌ వాసి అని అతని చిరునామా చూశారు.
 ‘స్వామిజీ  నా పేరు భన్సీలాల్‌.. నాకు వజ్రాలవ్యాపారం ఉంది ’ అంటూ తన దగ్గరున్న వజ్రాలను తీసి చూపించాడు.
ఆ వజ్రాలను చూసి కళ్లు బైర్లు కమ్మిన స్వామిజీకి ఆ వజ్రాలను ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఆశ కలిగింది.

అంతలో భన్సీలాల్‌ స్వామిజీని ‘మీ దగ్గర పులిచర్మం, పులిగోళ్ళు, ఏనుగుదంతాలు దొరుకుతాయి. అని మాకు తెల్సు.. ఎప్పటి నుంచో వాటిని సేకరించాలని మాది కోరిక. మా దగ్గర వజ్రాలు మూలుగుతూ ఉన్నాయి. నాకు  పులిచర్మం.. పులిగోళ్ళు..ఏనుగుదంతాలు.. అందచేస్తే ఈ వజ్రాలన్నీ మీకే సాబ్‌! ఇది చాలా సీక్రెట్‌గా జరిగిపోవాలి. మాకీ పోలీసులు అంటే మా చెడ్డ చికాకు’ అతి వినయంగా, కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.

ముందు అతను కోరినవి ఇచ్చి ఆ తరువాత భన్సీలాల్‌ని పైకి పంపించాలని నిర్ణయించుకున్నాడు స్వామిజీ.
ఆ రాత్రి భన్సీలాల్‌ ఆశ్రమానికి కొద్ది దూరంలో వేచి ఉన్నాడు. కొద్ది సేపటి తర్వాత స్వామిజీ తన శిష్యులతో అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి ఒక లారీ వచ్చి ఆగి ఉంది. ఆ లారీ ఎక్కిన స్వామిజీ.. ఒకటి దొంతరలుగా పేర్చి ఉన్న పులిచర్మాలను స్వయంగా బయటకు తీయసాగాడు. భన్సీలాల్‌ కోరినవన్నీ ఇచ్చి అతని చేతిలోని వజ్రాలు తీసుకున్నాడు. 

భన్సీలాల్‌ ఆశ్రమం దాటగానే అతని వెహికిల్‌ని లారీతో ఢీకొట్టించి యాక్సిడెంట్‌గా చిత్రించాలన్నది స్వామిజీ ప్లాన్‌. అతను ఎప్పుడూ అనుసరించే ప్లాన్‌ ఇదే.
సరిగ్గా పావుగంట తరువాత స్వామిజీ.. లారీ డ్రైవర్‌కు ఫోన్‌ చేశాడు ఆశ్రమంలోకి అడుగుపెడుతూ. 
అతని చేతిలో భన్సీలాల్‌ ఇచ్చిన వజ్రాలు ఉన్నాయి.

లారీ డ్రైవర్‌ నుంచి రెస్పాన్స్‌ రాలేదు. కంగారుగా మళ్ళీ ఫోన్‌ చేశాడు. ఆశ్రమంలోనే ఫోన్‌ రింగ్‌ అయింది. తన వెనుక నుంచే ఆ శబ్దం. తలవెనక్కి తిప్పి చూసి షాకయ్యాడు. భన్సీలాల్‌ చేతిలో లారీ డ్రైవర్‌ ఫోన్‌.
‘ఈరోజుతో నీ చాప్టర్‌ క్లోజ్‌ మిస్టర్‌ ధనంజయ్‌ అలియాస్‌ స్వామిజీ..! ఆశ్రమం చుట్టూ కమాండోస్‌ ఉన్నారు. లారీ డ్రైవర్‌ మా కస్టడీలో ఉన్నాడు.
స్వామీజీ చేతులకు సంకెళ్లు తగిలిస్తూ చెప్పాడు భన్సీలాల్‌ అలియాస్‌ సిద్ధార్థ.. డిటెక్టివ్‌ సిద్ధార్థ.
∙∙ 
స్వామిజీని అరెస్టు చేయడంతోనే మిగిలిన శిష్యులందరూ లొంగిపోయారు. స్వామిజీ ఆశ్రమాన్ని పోలీసు బలగం చుట్టుముట్టారు.
డిటెక్టివ్‌ సిద్ధార్థను చూసిన మీడియా ప్రశ్నలవర్షం కురిపించసాగింది.
స్వామిజీ స్మగ్లింగ్‌ చేస్తాడని మీకెలా తెలుసు?
స్వామిజీ ఆశ్రమంలోకి అనుమతి లేకుండా చీమ కూడా వెళ్లలేదని చెప్పుకుంటారు. మరి మీరెలా ఆశ్రమంలోకి ప్రవేశించారు?
స్వామిజీని రెడ్‌ హ్యాండెడ్‌గా ఎలా పట్టించారు?
మీరొక్కరే ఈ టాస్క్‌ పూర్తి చేశారా?

అంటూ మీడియా అడుగుతున్న ఈ ప్రశ్నలను వింటున్న సిద్ధార్థ అందరినీ ఆగమని సైగ చేసి.. తాను గొంతు విప్పాడు. 
వెంటనే నిశ్శబ్దం ఆవరించుకున్న ఆ ప్రదేశంలో ఖంగుమంటూ మోగిన సిద్ధార్థ కంఠం ఇలా చెప్పడం మొదలుపెట్టింది.
‘పోలీస్‌ ఇన్ఫార్మర్‌ చనిపోవడంతో డీజీపీ నాకు ఫోన్‌  చేశారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో అక్కడక్కడా కలుపుమొక్కలు ఉంటాయి. అందుకే కొన్నాళ్ళు స్వామిజీ కేసు క్లోజ్‌ చేస్తున్నట్టు స్వామీజీకి సమాచారం చేరేలా చేశాను. ఇన్ఫార్మర్‌ ఆ వీడియోను నాకు పంపించాడు. వీడియోలో ఉన్నది స్వామిజీ అనే నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియో మాత్రమే ఉపయోగపడదని అర్థమైంది. అందుకే భన్సీలాల్‌ వేషంలో స్వామిజీ ఆశ్రమంలోకి ఆంతరంగిక మందిరంలోకి అడుగుపెట్టాను. గంగాజలం పేరుతో అక్కడున్న నీళ్లసీసాల మధ్య నేను తీసుకెళ్లిన ఒక నీళ్లసీసాను అమర్చాను.

ఆ నీటిసీసా మూతలో ఒక ‘‘స్పై కెమెరా’’ అమర్చబడి ఉంది. అది తెలియని స్వామిజీ యథాప్రకారం తన స్మగ్లింగ్‌ కార్యకలాపాలను నిర్వర్తించేవాడు. ఆ కెమెరాలో రికార్డయిన దృశ్యాలన్నీ మీకు అందజేస్తాను. ఆ దృశ్యాలను ప్రజలకోసం విడుదల చేయండి. లేదంటే స్వామిజీని అరెస్టు చేశారని ప్రజలు తిరగబడే ప్రమాదం వుంది’  చెప్పాడు డిటెక్టివ్‌ సిద్ధార్థ.
అతను అమర్చిన స్పై కెమెరాలో దృశ్యాలు లైవ్‌లో ప్రసారం అవుతున్నాయి. ప్రజల అమాయకత్వంతో ఆటలాడుకున్న స్వామిజీ ఆ ప్రజల తిరుగుబాటుతో రాళ్ల దెబ్బలు  తిన్నాడు.
జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు.

- శ్రీసుధామయి
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement