క్రైమ్‌ స్టోరీ: బంగారు గొలుసు | Chokkara Tatarao Bangaru Golusu Telugu Short Story In Funday Magazine | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ స్టోరీ: బంగారు గొలుసు

Published Sun, Oct 17 2021 11:40 AM | Last Updated on Sun, Oct 17 2021 12:04 PM

Chokkara Tatarao Bangaru Golusu Telugu Short Story In Funday Magazine - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఇంటిముందు కారు ఆగేసరికి రాజేష్‌ అటువైపు చూశాడు. కారులోంచి వస్తున్న చైతన్యని చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడోగాని రాని చైతన్య ఇలా సడెన్‌గా వచ్చేసరికి ఏదో విశేషం ఉందనుకున్నాడు.

‘వచ్చే ఆదివారం నాపెళ్ళి’ శుభలేఖ ఇస్తూ రాజేష్‌తో చెప్పాడు చైతన్య. ‘వసంతా’ అంటూ కేకేశాడు రాజేష్‌.
‘మీరా అన్నయ్యగారు!’ లోపల నుంచి వస్తూ అంది వసంత. ‘పెళ్ళికి మీరిద్దరూ రావాలి’ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు చైతన్య.
రాజేష్, చైతన్య ఒకే స్కూలులో చదువుకున్నారు. చైతన్య పెద్ద కంపెనీలో మేనేజర్‌. రాజేష్‌ ఓ ప్రైవేటు కంపెనీలో అటెండర్‌.
‘ఈపెళ్ళికి మీరే వెళ్ళండి, నేను రాలేను. వద్దామన్నా మెడలోకి సరైన నగలేదు. బోసి మెడతో ఎలారాను!’ తన పేదరికాన్ని గుర్తు చేసుకుంది వసంత.
‘ఇంటిదాక వచ్చి ఇద్దర్నీ పెళ్లికి పిలిచాడు. నువ్వు రాకుండా నేను మాత్రం పెళ్ళికి ఎలా వెళ్తాను? ఓ పని చెయ్‌! నీ ఫ్రెండ్‌ సువర్ణని అడిగి నగ తీసుకో’ సలహా ఇచ్చాడు రాజేష్‌.        

‘బాగోదేమోనండి’ ఆత్మాభిమానం అడ్డుపడింది వసంతకి. ‘పర్లేదు, ఫంక్షన్‌ అయిపోగానే మళ్ళీ ఇచ్చేద్దువుగాని..’ భర్త అలా చెప్పేసరికి కాదనలేకపోయింది.
వసంత, సువర్ణ విజయనగరంలో కలసి చదువుకున్నారు. పెళ్ళిళ్ళయ్యాక ఇద్దరూ వైజాగ్‌లో ఉంటున్నారు. తను పేదరికంలో ఉన్నప్పటికీ సువర్ణని ఎప్పుడు ఏ సాయం అడగలేదు వసంత. మొదటిసారి సువర్ణని గొలుసు అడగటం వసంతకి ఇష్టం లేదు. అయినా తప్పడం లేదు. గుమ్మంలో నుంచున్న వసంతని చూసి ఇంట్లోకి ఆహ్వానించింది సువర్ణ. కలసి చాలా రోజులయిందేమో ఇద్దరూ మనసుతీరా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తను ఎందుకు వచ్చిందో సువర్ణతో చెప్పింది వసంత ఆపసోపాలు పడుతూ.

‘దానికేం భాగ్యం అలాగే  తీసుకెళ్ళు. ఈ విషయం అడగడానికి అంత మొహమాటం దేనికి?’ అంటూ మెడలోని గొలుసు తీసి వసంత చేతికిచ్చింది సువర్ణ. గొలుసు తీసుకుని అక్కడ నుంచి ఇంటికి బయలుదేరింది వసంత.
∙∙ 
ధవళకాంతులతో కళ్యాణమండపం ధగధగ వెలిగిపోతోంది. ఓ మూలన కూర్చున్నారు రాజేష్, వసంత. పెళ్ళి అయిపోగానే ఒక్కొక్కరు వధూవరుల్ని విష్‌ చేస్తున్నారు. వధూవరులకు శుభాకాంక్షలు చెప్పేసి– భోజనాలు చేసి ఇంటికి బయలుదేరారు రాజేష్, వసంత. ఇంటికొచ్చి చూసేసరికి వసంత మెడలో గొలుసు కనిపించలేదు. ఒకరి మొహం ఒకరు చూసుకుని తెల్లబోయారు ఆ దంపతులు. బదులు తెచ్చిన గొలుసు ఇలా దొంగల పాలవుతుందని రాజేష్‌ అనుకోలేదు. 

‘అప్పటికీ నేను చెబుతూనే ఉన్నాను పెళ్ళికి రానని! మీరు వింటే కదా’ గొలుసు పోయిందనే బాధతో వసంత. సువర్ణకి ఎలా చెప్పాలో, ఏంచేయాలో ఆమెకు అర్థం కాలేదు. 
‘పోలీస్‌ కంప్లయింట్‌ ఇద్దాం. గొలుసు దొరికితే సరే.. లేదంటే కొత్త గొలుసు కొనిద్దాం తప్పదు’ వసంతతో అన్నాడు రాజేష్‌. ఆరాత్రి వాళ్ళు నిద్రపోలేదు. ఉదయానే ఇద్దరూ కలసి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళారు. పెళ్ళిలో పోయిన గొలుసు గురించి కంప్లయింట్‌ ఇచ్చాడు రాజేష్‌. 

 ‘వారం తర్వాత కనిపించండి. గొలుసు దొరుకుతుందేమో చూద్దాం’ ఎస్సై చెప్పగానే ‘అలాగే’ అంటూ అక్కడ నుంచి వచ్చేశారు వసంత, రాజేష్‌.
‘ఇది పాత నేరస్తుల పనే అయ్యుంటుంది సార్‌!’ కానిస్టేబుల్‌ చెప్పాడు. ‘వాళ్ళందర్నీ ఒకసారి స్టేషనుకి పిలిపించ’మని కానిస్టేబుల్‌కి ఆర్డర్‌ వేశాడు ఎస్సై. టవున్లో అప్పటికే పాత నేరస్తులుగా ముద్రపడ్డ ఓ అయిదుగుర్ని స్టేషనుకి తీసుకొచ్చాడు కానిస్టేబుల్‌. ఎంత అడిగినా ఆ గొలుసును తీయలేదనే చెప్పారు వాళ్లు. డీలా పడిపోయిన కానిస్టేబుల్‌ ‘నిజంగా వీళ్ళు తీయలేదేమో సార్‌!’ అన్నాడు ఎస్సైతో. 

‘వాళ్ళని పంపించెయ్‌’ అంటూ సెల్‌ నుంచి బయటకు వచ్చేశాడు ఎస్సై.
 వారం తర్వాత పోలీసుస్టేషన్‌కి వెళ్ళి ఎస్సైని కలిశాడు రాజేష్‌.
 ‘మా ప్రయత్నం మేం చేశాం. అయినా మీ గొలుసు దొరకలేదు’ చెప్పాడు ఎస్సై. ఆ మాట విని నిరాశతో ఇంటికి చేరుకున్నాడు రాజేష్‌.
‘గొలుసు దొరికిందా?’ ఇంటికి వచ్చిన రాజేష్‌ని ఆత్రంగా అడిగింది వసంత. ‘దొరకలేదు వసంతా! మీఫ్రెండ్‌కి కొత్త గొలుసు కొనివ్వాల్సిందే!’  నిర్ణయించుకున్నాడు రాజేష్‌. బాధగా నిట్టూర్చింది వసంత. రెండు రోజుల తర్వాత భార్యతో కలసి నగలషాప్‌కి వెళ్ళి పోయిన గొలుసులాంటిదే కొత్త బంగారుగొలుసు కొన్నాడు రాజేష్‌. డబ్బు సమకూర్చడం కోసం ఎన్నితిప్పలు పడ్డాడో అతనికే తెలుసు. ఆ సాయంకాలమే ఆ గొలుసు తీసుకొని తన స్నేహితురాలు సువర్ణ వాళ్లింటికి వెళ్లి గొలుసు ఇచ్చేసొచ్చింది వసంత. 
∙∙∙ 
నగ అమ్ముదామని ఒకతను చమన్‌ లాల్‌ షాప్‌కొచ్చి– చమన్‌ లాల్‌ చేతికి గొలుసు ఇచ్చాడు. బంగారం మీద అప్పులివ్వడం, పాత బంగారం కొనడం చేస్తుంటాడు చమన్‌ లాల్‌. కొత్తవాళ్ళు ఎవరైనా గొలుసు అమ్మకానికి తెస్తే తెలియజేయమన్న ఎస్సైగారి హెచ్చరిక గుర్తొచ్చింది అతనికి. పక్కకి వచ్చి ఎస్సైకి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు చమన్‌ లాల్‌. ఈలోగా ఆ గొలుసు నాణ్యతను పరీక్షించగా అది గిల్టు నగ అని తేలింది.

నిమిషాలమీద పోలీసు జీపు అక్కడకు రానేవచ్చింది. అది చూసి గొలుసు అమ్మకానికి తెచ్చిన వ్యక్తి కంగారుపడడం చమన్‌ లాల్‌ గమనించాడు. ఇంతలో ఎస్సై షాప్‌లోకి రానే వచ్చాడు. 
‘ఇతనే సర్‌ అమ్మకానికి గొలుసు తెచ్చింది’ అంటూ ఆ వ్యక్తిని ఎస్సైకి చూపించాడు చమన్‌ లాల్‌.
బెదిరిపోయాడు ఆ వ్యక్తి. ‘ఇది గిల్టు నగ సార్‌’  గొలుసు ఎస్సై చేతికిస్తూ చెప్పాడు చమన్‌ లాల్‌. 
‘ఇంత కష్టపడి కొట్టుకొచ్చింది గిల్టు నగా?’ ఆశ్చర్యపోయాడు దొంగ.  కోపంగా చూస్తూ అతన్ని వెంటబెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిపోయాడు  ఎస్సై.
‘వీడిని సెల్‌లోపెట్టి ఆ  వసంతని స్టేషన్‌కి రమ్మని ఫోన్‌ చెయ్‌’ కానిస్టేబుల్‌కి పురమాయించాడు ఎస్సై. 
∙∙∙                                           
వసంత, రాజేష్‌ ఇద్దరు కలసే స్టేషన్‌కు వచ్చారు. వాళ్లను చూడగానే కోపంతో  ఎస్సై మొహంలో రంగులు మారాయి. 
‘ఈ గొలుసు మీదేనా?’ టేబులు సొరుగులోంచి గొలుసుతీసి వసంత చేతిలో పెట్టాడు ఎస్సై. 
‘నాదే సార్‌!’ అంటున్న వసంత కళ్లు మెరిశాయి.

‘ఆరోజు పెళ్ళిలో ఈమె మెడలోంచేనా గొలుసు కొట్టేసింది?’ సెల్‌లో ఉన్న దొంగ వైపు తిరిగి  అడిగాడు ఎస్సై. 
ఒకసారి ఆరోజు దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుని వసంతను తేరిపార చూసి ‘ఈవిడే సార్‌’ చేతులు కట్టుకుని చెప్పాడు దొంగ.
‘గిల్టు నగ పోతే కూడా పోలీస్‌ స్టేషన్లో కంప్లయింట్‌ ఇస్తారా? అసలు పోలీసులంటే ఏమనుకుంటున్నారు!’ అరిచేశాడు ఎస్సై.  
ఆయన మాటలకు కంగుతిన్న ఆ జంట ‘ఇది గిల్టునగా?’ అంటూ  ఆశ్చర్యపోయారు. ‘అది గిల్టు నగన్న సంగతి నాకు తెలీదు సార్‌!’ బేలగా చెప్పింది వసంత. 
‘చాల్లేమ్మా ఊరుకో.. మీ  ఒంటిమీద నగ–  ఒరిజినలో గిల్టో తెలీదంటే మేం నమ్మాలి మరి!’ ఎస్సైకి కోపం నసాళానికంటింది. 

‘నన్ను నమ్మండి సార్‌. ఆ నగ నాది కాదు’  వసంత.
‘ఏంటి.. ఆ గొలుసు మీది కాదా? మాట మారుస్తున్నారా? నగ మీది కాదంటే వదిలేస్తానని అనుకుంటున్నారేమో?’  
 ‘నిజమే సర్‌.. ఆ గొలుసు నా భార్య ఫ్రెండ్‌ సువర్ణ గారిది’ చెప్పాడు రాజేశ్‌.  
‘ఆమె నగ మీ దగ్గర ఎందుకుంది?’ 
‘పెళ్ళిలో వేసుకుందామని ఆ గొలుసు సువర్ణని అడిగి తీసుకున్నాను’ వసంత.
‘ఆమె చెప్పలేదా అది గిల్టునగ అని?’

‘చెబితే కంప్లయింట్‌ ఎందుకు ఇస్తాం సార్‌?’
‘గొలుసు పోయిందని ఆమెతో చెప్పారా?’
‘చెప్పలేదు సార్‌.. అలాంటిదే కొత్త బంగారు గొలుసు కొనిచ్చాం’ 
‘ఏంటీ కొత్త గొలుసు కొనిచ్చారా?‘ ఆశ్చర్యపోయాడు ఎస్సై. అవునన్నట్టు తలూపారు ఇద్దరూ. 
నిట్టూరుస్తూ వాళ్ల దగ్గర్నుంచి సువర్ణ వాళ్ల ఇంటి అడ్రస్‌ తీసుకొని ఆమెను స్టేషన్‌కు తీసుకురమ్మని  కానిస్టేబుల్‌కు చెప్పాడు ఎస్సై. ఈలోపు వసంత రాజేష్‌లను పక్కగదిలో కూర్చోబెట్టారు.  
∙∙∙
తమ గుమ్మం ముందు కానిస్టేబుల్‌ను చూడగానే గతుక్కుమంది సువర్ణ. వెంటనే ఆఫీస్‌లో ఉన్న భర్తకు ఫోన్‌ చేసింది. కానీ అతని ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది. 
‘సువర్ణ గారంటే మీరేనా?’ అడిగాడు కానిస్టేబుల్‌. తనే అన్నట్టుగా తలాడించింది. ‘మీరు స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది.. ’ చెప్పాడు.  ‘ఎందుకు?’  అడిగింది సువర్ణ. ‘ఆ విషయాలేవీ నాకు తెలియవు. ఉన్నపళంగా మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు మా ఎస్సై’ అన్నాడు కానిస్టేబుల్‌. మళ్లీ ఒకసారి భర్తకు ఫోన్‌ ట్రై చేసింది సువర్ణ. ఇంకా స్విచ్చాఫ్‌లోనే ఉంది. చేసేదేమీలేక  కానిస్టేబుల్‌ వెంట పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లింది సువర్ణ.                   

‘సువర్ణ అంటే మీరేనా?’ అడిగాడు ఎస్సై. అవునన్నట్టు తలూపింది సువర్ణ. ‘ఈగొలుసు మీదేనా?’ తన చేతిలో ఉన్న గొలుసు చూపిస్తూ అడిగాడు ఎస్సై. 
‘అరే..అచ్చం నాగొలుసులాగే ఉంది’ అంటూ తన మెడలో ఉన్న గొలుసుకేసీ ఓసారి చూసుకొని  ‘కానీ అది నా గొలుసు కాదు’ చెప్పింది సువర్ణ.
‘మీ ఫ్రెండ్‌ వసంతకి మీరు గొలుసు ఇచ్చారా?’ ఎస్సై. ‘ఇచ్చాను, ఆమె మళ్ళీ తిరిగి ఇచ్చేసింది! ఆ గొలుసే ఇది’ అంటూ తన మెడలో ఉన్న గొలుసును  ఎస్సైకి చూపించింది. 

‘మరి ఇదెవరిది?’ తన దగ్గరున్న గొలుసును  పైకెత్తి చూపిస్తూ  ఎస్సై.
గిల్టునగకి బదులు వసంత బంగారు గొలుసు తెచ్చిచ్చిందని భర్తతో చెబితే  ‘రేపు వసంత వచ్చి మళ్ళీ అడిగినా నువ్వు ఇచ్చింది బంగారు గొలుసనే చెప్పు’ అన్న భర్త మాటలు ఇంకా చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి సువర్ణకి. స్వార్థం ఆమెను కట్టిపడేసింది.
‘మాట్లాడరే?’ గద్దించాడు ఎస్సై.
‘ఆ గొలుసు నాది కాదు’  మళ్ళీ చెప్పింది సువర్ణ.

‘అబద్ధం సార్‌. ఆమె చెప్పేది అబద్ధం. నన్ను మోసం చేసింది. స్నేహితురాలని నమ్మితే నన్ను నిండా ముంచేసింది. గిలు ్టనగ నాకిచ్చి నా బంగారు గొలుసు తను తీసుకుంది’ పక్క గదిలోంచి వచ్చి సువర్ణ వైపు  చురచుర చూస్తూ చెప్పింది వసంత. అక్కడ వసంతను చూసేసరికి బిక్కచచ్చిపోయింది సువర్ణ. 
‘నా భార్య చెప్పింది నిజం సార్‌. ఆ గొలుసు కొనడానికి నేను అష్టకష్టాలు పడ్డాను’ అన్నాడు రాజేష్‌.
‘ఇప్పటికైనా నిజం చెబుతారా?’ ఎస్సై మాటలకు సిగ్గుతో తలవంచుకొని నిజం చెప్పేసింది సువర్ణ..  ‘నాదే సార్‌. ఆ గొలుసు ఇచ్చినప్పుడు అది గిల్టు నగ అని వసంతకి చెప్పకపోవడం నాదే తప్పు’ అంటూ.  

‘గొలుసు తిరిగి ఇస్తున్నప్పుడైనా మీరు నిజం చెప్పాలి కదా?’ అని ఎస్సై అడిగేసరికి ‘వసంత నాకు గొలుసు ఇచ్చినప్పుడు అచ్చంగా అది నా గొలుసే  అనుకున్నాను. తర్వాత తెలిసింది అది బంగారు గొలుసని’  చెప్పింది సువర్ణ.
‘అది బంగారు గొలుసని తెలిసింతర్వాతైనా  ఆ విషయం మీ ఫ్రెండ్‌తో చెప్పాలని అనిపించలేదా?’  ‘చెప్పి నగ ఇచ్చేద్దామనుకున్నాను సర్‌.. మా ఆయనే వద్దని ఆపేసి ఇంతదాకా తీసుకొచ్చాడు’ నిష్టూరపోయింది సువర్ణ. 

సరిగ్గా అప్పుడే గాబరాపడుతూ అక్కడికి వచ్చాడు సువర్ణ భర్త. చేసిన తప్పు ఒప్పుకున్నాడు. 
‘చెడు సలహాలిచ్చి.. వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని దూరం చేశారు కదా’ అంటూ సువర్ణ భర్తను మందలించాడు ఎస్సై. 
‘సారీ వసంతా’ అంటూ బంగారు గొలుసు వసంత చేతిలో పెట్టి క్షమాపణ కోరింది సువర్ణ. 

- చొక్కర తాతారావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement