క్రైమ్‌ స్టోరీ: షాక్‌ నుంచి తేరుకోవటానికి ఇరవై నిమిషాలు పట్టిందా..? | Yamuna Chintapalli Time Up Telugu Crime Story In Funday | Sakshi
Sakshi News home page

షాక్‌ నుంచి తేరుకోవటానికి ఇరవై నిమిషాలు పట్టిందా..? టైమ్‌ అప్‌..

Published Sun, Oct 10 2021 1:32 PM | Last Updated on Sun, Oct 10 2021 4:29 PM

Yamuna Chintapalli Time Up Telugu Crime Story In Funday - Sakshi

జన సంచారం లేని రాత్రి వేళ, ఆ కాలనీలో గాలి కూడా బిగదీసుకుపోయింది.. ఎవరో డబ్బాలో వేసి మూత పెట్టినట్లు. అంతలో ‘హెల్ప్‌ హెల్ప్‌’ అన్న పెనుకేకతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. 

ఒక్కసారిగా ఇళ్ల తలుపులు తెరచుకుని, రోడ్డు మీదకు పరుగెత్తుకొచ్చారు కొంత మంది. రక్తపు మడుగులో రమేష్‌ పడి ఉన్నాడు. పక్కనే కంగారుగా అరుస్తూ, ఏడుస్తూ కుమార్‌. ఒకరు హడావిడిగా కారు తీసుకొచ్చి, కొందరి సాయంతో రమేష్‌ని కారులోకి చేర్చారు. హాస్పిటల్‌కి చేరకముందే రమేష్‌ ఆయువు గాలిలో కలసిపోయింది.
‘బలమైన రాడ్‌తో కొట్టటం వలన మరణించినట్లు’ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌. బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. అతని శరీరం మీద ఉన్న వస్తువులు కూడా వారికి హాండోవర్‌ చేశారు.

రమేశ్‌ హత్య సంచలనం రేకెత్తించింది. మామగారి షష్టిపూర్తి వేడుక కోసం రమేష్‌ అమెరికా నుంచి భార్య, పిల్లలతో వారం కిందటే ఇండియాకి వచ్చాడు. ఎన్నో ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి సెటిలైపోయిన వ్యక్తికి ప్రాణంతీసే శత్రువులు ఎవరు ఉంటారు ఇక్కడ? పోనీ ఏదన్నా దొంగతనం అనుకుందామంటే, మెడలో గొలుసు, పర్సు, ఖరీదైన వాచ్‌ ఏవీ మిస్‌ కాలేదు. 

‘రమేష్‌కి, కుమార్‌కి ఏమిటి సంబంధం?’ రమేష్‌ భార్య శాంతిని ప్రశ్నించాడు ఆ ఏరియా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌.
‘వాళ్ళు స్నేహితులు’ 
‘మీ వారు దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళి పోయారు కదా’
‘వాళ్ళు బాల్యస్నేహితులు. ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతోంది. ఏ చిన్న విషయమైనా ఈయన ముందుగా కుమార్‌గారికే తెలియ చేస్తారు. అలాగే ఆయన కూడా. మాకు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్‌ కూడా ఆయనే చూసుకుంటున్నారు’ 

‘అంటే?’

‘మా వారు రెండు ఫ్లాట్స్, ఒక విల్లా ఇండియాలో కొన్నారు. వాటిని కొనటంలోనే  కాక, అద్దెకి ఇవ్వటం లాంటి విషయాల్లో కూడా కుమార్‌గారు హెల్ప్‌ చేశారు’
‘ఆ సాయానికి మీ వారేమన్నా ఆయనకి పేమెంట్‌ చేశారా?’ 
‘అలాంటిది ఏమీ లేదు. అది కేవలం స్నేహానికి కుమార్‌గారు ఇచ్చే విలువ’
‘ఓకే. ఇంతకూ చివరిసారిగా మీ వారిని ఎప్పుడు చూశారు?’ 

‘ఆ రోజు సాయంత్రం, మా వారు కుమార్‌గారితో కలసి ఊరవతల ఉన్న పొలంకొనే విషయం గురించి మాట్లాడటానికి వెళ్లారు. ఆ దోవలోనే కుమార్‌గారి ఇల్లు. చీకటి పడుతుండగా ఫోన్‌చేసి ‘ఆ పొలం ఓనర్‌ రాలేదు. చీకటి పడుతోందని వచ్చేశాం. కుమార్‌ డిన్నర్‌చేసి వెళ్ల మంటున్నాడు. చేసేసి వస్తాను’ అని చెప్పారు. ఆ తరువాత హాస్పిటల్‌లో చూడటమే’ దుఃఖం అడ్డు పడుతుంటే ఆగిపోయింది శాంతి. 
‘మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా?’ 
‘ఊహూ, లేదు’ భారంగా చెప్పింది శాంతి.  
∙∙ 
‘కుమార్‌ గారు.. ఆ రోజు అసలు ఏమి జరిగిందో చెప్పగలరా ?’ గోడ మీద కుమార్, రమేష్‌ భుజాల మీద చేతులు వేసుకుని తీయించుకున్న ఫోటోని చూస్తూ అడిగాడు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌. 
 ‘పొలం దగ్గరికి వెళ్ళి వస్తూ, దోవలోనే కదా అని మా ఇంటికి డిన్నర్‌కి పిలిచాను’
‘ఆ వీధిలో ఏమి జరిగిందో చెప్పండి’ అసహనంగా అన్నాడు సందీప్‌.  

‘డిన్నర్‌ తరువాత , వాకింగ్‌కి వెళ్లాం. ‘దాహంగా ఉంది. ఏదన్నా తాగాలనిపిస్తోంది’ అన్నాడు. ‘నువ్వు ఈ  బెంచీ మీద కూర్చో, జ్యూస్‌ కొని తీసుకు వస్తాను’ అని నేను వీధి చివర పాన్‌షాప్‌కి వెళ్ళి జ్యూస్‌ బాటిల్‌ తీసుకుని తిరిగి వస్తున్నాను. నన్ను చూసి నవ్వుతూ, రమేష్‌ లేచి నుంచున్నాడు. ఇంతలో ఎవరో వెనుక నుంచి ఇనపరాడ్‌తో తన తలపై కొట్టారు. చిన్నగా కేక పెడుతూ చేతులు అడ్డం పెట్టుకున్నాడు’ ఇహ మాట్లాడలేనట్లు ఆగి పోయాడు కుమార్‌.  
‘ఆ కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టగలరా’ 
‘లేదు సర్‌’ నిస్సహాయంగా అన్నాడు కుమార్‌. 

‘మీ కళ్ల ముందే కొట్టిన వ్యక్తిని గుర్తు పట్ట లేరా?’
‘కొట్టిన వ్యక్తికి నెత్తి మీద టోపీ, మొహానికి కర్చీఫ్‌ ఉంది. అందుకే సరిగా చూడలేకపోయాను’ 
‘అప్పుడు మీరు ఏమి చేశారు?’ 
‘నాకు భయంతో నోట మాట రాలేదు. వెంటనే తేరుకుని, సహాయానికి కేకలు పెడుతూ తనకేసి పరుగెత్తాను. అప్పటికే దాడి చేసిన వ్యక్తి పారిపోయాడు. తను నేలమీద పడిపోయాడు’ అంటూ దుఃఖం అడ్డుపడగా ఆగిపోయాడు కుమార్‌. 
‘సరే.. మళ్ళీ కలుస్తాను’ అంటూ నిష్క్రమించాడు సందీప్‌. 
∙∙ 
‘అతను ఎన్నిగంటలకు మీ షాప్‌కి వచ్చాడు? ఏం కొన్నాడు?’ తన ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అడిగాడు సందీప్‌ పాన్‌షాప్‌ ఓనర్‌ని.
‘జ్యూస్‌ బాటిల్‌ తీసుకున్నాడు. అప్పుడు టైమ్‌ రాత్రి 9.15 అయ్యింది’ 
‘టైమ్‌ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలగుతున్నావ్‌?’ 
‘రోజూ లాగానే  ‘మలుపు’ డైలీ సీరియల్‌ చూస్తున్నాను సర్‌. 9.15కి యాడ్స్‌ వస్తాయి. అప్పుడే ఆయన జ్యూస్‌ బాటిల్‌ కొనుక్కుని వెళ్లారు’ 
‘ఎంతసేపు ఉన్నాడు?’
‘మొత్తం ఐదునిమిషాలు ఉన్నారేమో!’ 

‘హత్య గురించి ఎప్పుడు తెలిసింది నీకు?’
‘ఓ పావుగంట, ఇరవై నిమిషాల తరువాత అనుకుంటాను, కొట్టు కట్టెయ్య బోతున్నాను. ఇంతలో జనం హడావిడి కనిపించింది. గబాగబా షాప్‌ మూసేసి అక్కడకు వెళ్ళాను. అప్పటికి ఒకతన్ని కారులో ఎక్కిస్తున్నారు. ఆ పక్కనే నా షాప్‌కు వచ్చినతను ఏడుస్తూ కనపడ్డాడు. దడగా అనిపించి వెంటనే అక్కడ నుంచి వెళ్ళి పోయాను’
అతనికి థాంక్స్‌ చెప్పి, తన ఎంక్వైరీలో భాగంగా కాలనీలో ఆ చుట్టుపక్కల ఇళ్ల వారిని ప్రశ్నించాడు. 
చివరకు ఆ రోజు కారులో రమేష్‌ని హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళిన వ్యక్తి ఇంటికేసి నడిచాడు.
తనను పరిచయం చేసుకుని, జరిగిన విషయం గురించి ప్రశ్నించాడు సందీప్‌. 

 ‘నేను టీవీలో ఏవో డిస్కషన్స్‌ చూస్తున్నాను. మా ఆవిడ యూఎస్సేలో ఉన్న మా అమ్మాయితో ఫోన్‌  మాట్లాడుతోంది. ఇంతలో కేకలు వినపడి, గబుక్కునలేచి బయటకు పరుగెత్తాను. వెనకే మా ఆవిడ కూడా వచ్చింది. ఎదురుగా రక్తం మడుగులో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. భయంతో వణికిపోతూ ఒకతను నిలుచుని ఉన్నాడు. ‘ఏమయ్యింది?’ అని అడిగితే ఎవరో తన ఫ్రెండ్‌ను తల మీద రాడ్‌తో కొట్టారని చెప్పాడు. ఇంతలో ఇంకొంతమంది బయటకు వచ్చారు. వెంటనే నా కారులో హాస్పిటల్‌ తీసుకెళ్లాం. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్స్‌’
‘అప్పుడు టైమ్‌ ఎంత అయ్యుంటుంది?’ 

 ‘9.45 అయ్యింది సార్‌ ’ ఆయన నుంచి కాక, ఆయన భార్య నుంచి వచ్చింది జవాబు.  
‘ఎలా చెప్పగలరు అంత ష్యూర్‌గా’ అనుమానంగా అడిగాడు సందీప్‌. 
‘ఫోన్‌లో ‘‘బ్రేక్‌ ఫాస్ట్‌ చేశావా’’ అని మా అమ్మాయిని అడిగాను. ‘‘ఇప్పుడు పావుతక్కువ పది అయ్యింది. ఇప్పటి దాకా టిఫిన్‌ తినకుండా ఉంటారా మీ అల్లుడు గారు. ఎప్పుడో అయిపోయింది’’ అంది. అప్పుడే ఈ కేకలు వినపడ్డాయి. అమెరికాలో ఉన్న వాళ్ళకి , మనకు ఈ సీజన్‌లో ఖచ్చితంగా పన్నెండుగంటల తేడా. వాళ్ళకి పగలు 9.45 అంటే మనకు రాత్రి 9.45 అన్నమాట. అందుకే చెప్ప గలిగాను’ వివరించింది ఆవిడ. 

‘కారులో మీతో పాటు ఎవరు వచ్చారు?’
‘మా మేడ పైన అద్దెకుండే ఇద్దరు కుర్రాళ్ళు  సాయంగా వచ్చారు’ 
 ‘మీరు హాస్పిటల్లో ఎప్పటిదాకా ఉన్నారు ?’ 
‘వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేదాకా ఉండి వచ్చేశాం. ఆ తరువాత న్యూస్‌ ద్వారా వాళ్ళ వివరాలు తెలిశాయి’   
థాంక్స్‌ చెప్పి, గేటు దగ్గరకు నడిచాడు సందీప్‌. వెనుకనే ఆ ఇంటాయన మర్యాద పూర్వకంగా సాగనంపటానికి వచ్చాడు. 
‘ఎగ్జాక్ట్‌గా రమేష్‌ ఎక్కడ పడి ఉండగా చూశారు?’ ప్రశ్నించాడు సందీప్‌. 
‘మా ఇంటి ఎదురుగా, ఇక్కడే సార్‌’ రోడ్డు మీదకు వచ్చి చూపించాడు ఆయన సిన్సియర్‌గా. 
చుట్టూతా పరిశీలనగా చూశాడు. అక్కడ పక్కనే ఓ బెంచీ ఉంది.

 ‘ఓకే ..సార్‌ , బై’ అంటూ తన బైక్‌ ఎక్కి, తిరిగి పాన్‌షాప్‌ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ బైక్‌ని పార్క్‌ చేసి రెండు మూడు సార్లు, అక్కడ నుంచి రమేష్‌ పడిపోయిన స్పాట్‌కి నడచి వెళ్లొచ్చాడు. 
‘ఏంటి సార్, ఎక్కడికి వెళ్లొస్తున్నారు?’ కొంచెం భయపడుతూ ఆరాగా అడిగాడు పాన్‌షాప్‌ ఓనర్‌. 
‘ఏమీ లేదు, తిన్నది అరగనట్లు ఉంటే కాస్త నడచి వస్తున్నాను’ అంటూ బైక్‌ స్టార్ట్‌ చేశాడు. 
∙∙ 
‘మీ ఫ్రెండ్‌ హత్యకు అరగంట ముందు, ఎవరికి కాల్‌ చేశారో చెపుతారా?’ ఆ గదిలోని వస్తువులను పరిశీలిస్తూ ప్రశ్నించాడు సందీప్‌. 
‘ఊహూ, ఎవరికీ కాల్‌ చేసిన గుర్తులేదు’ ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు కుమార్‌. 
‘పోనీ అతనిని కొట్టిన వెంటనే ఎందుకు అరవలేదో గుర్తుందా?’ వ్యంగ్యంగా అన్నాడు సందీప్‌. 
‘మీరు ఏమంటున్నారో అర్థం కావటంలేదు’ అయోమయంగా అన్నాడు కుమార్‌. 
 ‘తనని కొట్టిన దాదాపు ఇరవై నిమిషాలదాకా మీరు కేకలు పెట్టకపోవటానికి కారణం, రమేష్‌ను చంపటానికి సుపారి ఇచ్చి మీరు ఏర్పాటు చేసిన మనిషి తప్పించుకోవటానికే కదా!’

‘అర్థం లేకుండా మాట్లాడకండి ఇన్‌స్పెక్టర్‌..  నేను షాక్‌ అయ్యాను. కొన్ని నిమిషాల్లో తేరుకుని అరిచాను, అంతే’ 
‘షాక్‌ నుంచి తేరుకోవటానికి మీకు ఇరవై నిమిషాలు పట్టిందా?’ 
‘అవును.. నా మైండ్‌ అంతా బ్లాంక్‌ అయిపోయింది’ 
‘ఇహ చాలు.. ఆపండి మీ కల్లబొల్లి కబుర్లు. ఆ పాన్‌షాప్‌ అతను, కారులో ఎక్కించుకుని హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళినాయన చెప్పిన సాక్ష్యం.. నేను మూడు రకాల వేగాలతో పాన్‌షాప్‌ నుంచి ఆ స్పాట్‌కు నడచి చూసి, చెక్‌ చేసుకున్న టైమ్‌.. అన్నీ కలిపి మీరు అబద్ధమాడుతున్నారని రుజువయ్యింది’ 
‘మీరు అందరూ ఏదో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు’
‘మనం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా , టైమ్‌ ఎప్పటిలాగానే నడుస్తుంది సార్‌’ అంటూ ఆ పక్కనే టేబుల్‌ మీద ఉన్న ఓ వస్తువుని పైకి తీశాడు ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌. 
అర్థంకానట్లు చూశాడు కుమార్‌.

‘తన తల మీద కొడుతున్నప్పుడు, రమేష్‌ రెండు చేతులు అడ్డం పెట్టుకున్నారని మీరు చెప్పారు. దానికి రుజువుగా పోస్ట్‌మార్టంలో అతని కుడి చేతి రెండు వేళ్ళు ఫ్రాక్చర్‌ అయినట్లు రిపోర్ట్‌ కూడా వచ్చింది. అతని చేతికి ఉన్న వాచ్‌ కూడా బ్రేక్‌ అయ్యి, టైమ్‌ ఆగిపోయింది. రమేష్‌ పడిపోయిన దానికి, మీరు కేకలు పెట్టటానికి మధ్య తీసుకున్న టైమ్‌గాప్‌ నాకు అనుమానం కలిగించింది. ఇదిగో మీ ఫ్రెండ్‌ తీపి గుర్తుగా మీరు ఎంతో ప్రేమగా ఉంచుకున్న ఈ వాచ్‌లో 9.20 PMకి ఆగిపోయిన టైమ్‌ కూడా మరో సాక్ష్యం. యువర్‌ టైమ్‌ ఈజ్‌ అప్‌’ అంటూ ఊపిరి పీల్చుకోడానికన్నట్లు ఒక్క క్షణం ఆగాడు సందీప్‌. ‘ఇంత ఘాతుకానికి ఒడికట్టిన, ఆ హంతకుడిని మీ కాల్‌ డేటా హెల్ప్‌తో, మా కస్టడీలోకి తీసుకున్నాం. మీరు నిజం ఒప్పుకుంటే మంచిది లేదా మా పద్ధతిలో చెప్పించాల్సి వస్తుంది’  చేతిలో లాఠీ ఊపుతూ తీవ్రంగా చెప్పాడు సందీప్‌. 

ప్రాపర్టీస్‌ డీలింగ్స్‌లో వాటిని అమ్మిన వారితో కుమ్మక్కైన కుమార్‌.. తన కల్లబొల్లి మాటలతో రమేష్‌ని నమ్మించి చాలా ఎక్కువ రేట్లకు కొనిపించాడు. తరువాత ఆ ఎక్స్‌ట్రా సొమ్మును తన అకౌంట్‌లో వేసుకునే వాడు. పొలంకొనే విషయంలో ఎందుకో రమేష్‌కి అనుమానం వచ్చి ప్రశ్నించగా  ‘పాతవి కూడా తవ్వి తీస్తాడేమో’ అని కుమార్‌కి భయం పట్టుకుంది. ఆ భయం రమేష్‌ని అడ్డు తొలగించుకునేందుకు పురి గొల్పింది. స్నేహానికి  ద్రోహం తల పెట్టిన తన తప్పును ఒప్పుకుంటూ తలదించుకున్నాడు కుమార్‌. 
- యమున చింతపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement