నమ్మశక్యం కాని సంఘటనలు, ఊహకు అందని సందర్భాలు ఈ ప్రపంచంలో చాలానే ఉంటాయి. అవన్నీ కొందరికి అద్భుతాలుగా తోస్తే.. మరికొందరికి అబద్ధాలుగా అనిపిస్తుంటాయి. తర్కాన్ని నమ్మేవారికి, నమ్మనివారికి మధ్య వాగ్వాదాల చిచ్చు రాజేస్తాయి. వేలవేల మీమాంసలతో, సవాలక్ష అనుమానాలతో నిశబ్దంగా కాలాన్ని వెళ్లదీసి, అంతుచిక్కని కథలుగా మిగిలిపోతుంటాయి. అమెరికాకు చెందిన మేరీ క్లామ్సర్ జీవితం కూడా అలాంటిదే!
మేరీ.. ఓక్లహోమా నివాసి. తన పందొమ్మిదేళ్ల వయసులో మల్టిపుల్ స్లె్కరోసిస్‌కి గురైంది. ఆ వ్యాధి ముదిరే కొద్దీ కాళ్లు చచ్చుబడి, నడవలేని స్థితి ఏర్పడుతుందని, పిల్లలు పుట్టడం కూడా కష్టమేనని వైద్యులు తేల్చేశారు. అది తెలియగానే.. మేరీ ప్రపంచం బద్దలైనట్లుగా కుమిలికుమిలి ఏడ్చింది. అప్పటికే కొన్ని నెలల క్రితం.. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాన్ క్లామ్సర్‌తో నిశ్చితార్థం జరగడం ఆమెను మరింత బాధించింది. తన కారణంగా రాన్ జీవితం నాశనం కావడం ఇష్టం లేని మేరీ.. ‘నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందాం.. నీ జీవితం నువ్వు చూసుకోమ’ని రాన్‌కి చెప్పేసింది. అయితే అతడు అందుకు ఒప్పుకోలేదు. ‘నువ్వు ఎలా ఉన్నా నాకు కావాలి. ఏదేమైనా కలసే బతుకుదాం’ అని పట్టుబట్టాడు. దాంతో మేరీ.. ప్రేమ మీదున్న గౌరవంతో రాన్ చేయి అందుకుంది.
ఇద్దరూ పెళ్లితో ఏకమయ్యారు. అప్పటి నుంచి వీలైనంత ఓపిక తెచ్చుకుని.. భర్తతో జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తూండేది. పెళ్లైన పదేళ్ల వ్యవధిలో మూడు కష్టతరమైన కాన్పులొచ్చాయి. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు పూర్తి ఆరోగ్యంతో పుట్టారు. ఏళ్లు గడిచే కొద్దీ ఆమె వ్యాధి బాగా ముదురుతోంది. ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. నడక కష్టమైంది. మేరీకి 42 ఏళ్ల వయసు వచ్చేసరికి కుడి కాలు కూడా బలహీనమైపోయింది. పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. వీల్‌చైర్‌కే పరిమితమయ్యే పరిస్థితి వచ్చేసింది.
మరో రెండేళ్లు అలానే గడిచాయి. అప్పుడే జరిగింది ఓ అద్భుతం. అది 1994 ఆగష్టు 17.. ఆ రోజంతా భీకరమైన ఉరుములు, మెరుపులతో వర్షానికి తెరిపన్నదే లేదు. తనకు చేతనైన చిన్నచిన్న పనులన్నీ పూర్తి చేసిన మేరీ.. స్నానం చేయడానికి ఇంటి బయటున్న బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. స్నానం చేస్తుండగా ఓ పిడుగు మీద పడింది. 10,000 వోల్టుల విద్యుత్.. మేరీని నేలకు విసిరికొట్టింది. కాసేపటికి గమనించిన కుటుంబసభ్యులు మేరీని ఆసుపత్రిలో ఎమర్జెన్సీ రూమ్‌కి తరలించారు. రెండు రోజులకు ఆమె కళ్లు తెరిచింది. రౌండ్స్‌కి వచ్చిన డాక్టర్ గాయాలకు డ్రెసింగ్ చేస్తుంటే.. ఆమె ఎడమకాలిని తాకినట్లు స్పర్శ తెలిసింది. ఎన్నో ఏళ్లుగా చచ్చుబడిన ఆ కాళ్లల్లో కదలికలు మొదలయ్యాయి. వైద్యులు ఆశ్చర్యపోయారు.
సరిగ్గా నెలరోజులు గడిచేసరికి వీల్ చైర్ పక్కన పెట్టి నడవడం మొదలుపెట్టింది. కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే ఎవరి ఆసరా లేకుండా.. కాళ్లకు ఎలాంటి సపోర్ట్ బ్యాండ్స్ లేకుండా ఆమె చాలా దూరం నడవడం ఆ కుటుంబాన్ని నివ్వెరపరచింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకుంటూ సాధారణ జీవితాన్ని ప్రారంభించింది మేరీ. అది ఓ అద్భుతమని ఆమె నమ్మింది. 1995 ఏప్రిల్ 19న ప్రపంచానికి తన జీవిత కథ చెప్పడానికి సిద్ధపడి.. సమీపంలోని ఆల్ఫ్రెడ్ పి. ముర్రా ఫెడరల్ బిల్డింగ్‌లో రిపోర్టర్స్‌కి అపాయింట్‌మెంట్ ఇచ్చింది. అయితే అదే రోజు ఆ బిల్డింగ్‌పై ఉగ్రవాదులు బాంబు దాడి చేసి 168 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ ఘటన ఆమెను నోరు మెదపనివ్వలేదు. తనకు జరిగిన మిరాకిల్ దైవరహస్యమని, దాన్ని చెబితే తనకే ప్రమాదమని భావించిందో ఏమో.. ఇక ఏ ఇంటర్వ్యూకీ ఒప్పుకోలేదు.
అయితే 2003 నాటికి మేరీలో మళ్లీ ఆ వ్యాధి లక్షణాలు మొదలయ్యాయట. మరోసారి కాళ్లు నిర్జీవంగా మారిపోవడంతో నడవడం కష్టమైందట. సరిగ్గా రెండేళ్లకి ఇంటి ఆరుబయట ఆమె మళ్లీ పిడుగుపాటుకు గురై.. తిరిగి కోలుకుని నడవడం మొదలుపెట్టిందని, ఇక ఆమె పిడుగుపాటుకు గురికాకుండా ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిని ఏర్పరచారనే సమాచారం వచ్చింది. ఆమె మాత్రం ప్రపంచం ముందుకు రాలేదు. జరిగిందేమిటో వివరంగా చెప్పలేదు. ఇక రాన్.. 2016లో తన 68వ ఏట అనారోగ్యంతో కన్నుమూశాడు. తర్వాత కొడుకు క్రిస్టోఫర్ కూడా మరణించడంతో మేరీ వివరాలు బయటికి పొక్కలేదు. అసలు మేరీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఎక్కడుంది? ఏం చేస్తోంది? లాంటి వివరాలేవీ తెలియవు. ప్రాణాలతో ఉంటే ఇప్పటికి ఆమెకు 70 ఏళ్లు నిండి ఉంటాయి. ఈ కథలో.. పిడుగుపాటుకు ప్రాణాలు పోకపోగా, కొత్త ఎనర్జీ రావడం, ఉన్న వ్యాధులు మాయం కావడం ఓ మిరాకిల్ అయితే.. ఆ నిజాన్ని మేరీ తనంతట తాను ప్రపంచానికి వెల్లడించాలనుకున్న రోజే బాంబు దాడి జరగడం మరో పెద్ద మిస్టరీ!
పిడుగులాంటి ఘటనలు
► అమెరికాలోని అలబామాకు చెందిన ఫెయిత్ మోబ్లీ కథ కూడా ఇలాంటిదే! ఆమె మెక్ డొనాల్డ్స్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురైంది. ఆ విద్యుత్ ఎనర్జీ.. ఆమె హెడ్‌సెట్ నుంచి షూ గుండా భూమిలోకి ప్రవహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అయితే ఆమె ప్రాణాలతో బయటపడటంతో పాటు.. బలహీనంగా ఉన్న ఆమె కంటి చూపు పూర్తిగా మెరుగుపడిందట!
► రూబెన్ స్టీఫెన్సన్ అనే రైతు పొలంలో పని చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యాడు. అతడి పక్కనే ఉన్న రెండు గుర్రాలు చనిపోయాయి. కానీ అతడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే పెదవిపై ప్రాణాంతక మెలనోమాతో బాధపడుతున్న స్టీఫెన్ సన్.. పిడుగుపాటు తర్వాత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడట!
► అమెరికాలోని జెర్సీలో ఒక పోలీసు అధికారి కూడా పిడుగుపాటుకు గురయ్యాడు. ఆ సమయంలో అతని కోటు కాలిపోయింది. ఇత్తడి బటన్లు కరిగిపోయాయి. కానీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి అప్పటిదాకా ఉన్న వాతం, అజీర్తి మాయమయ్యాయట!
Comments
Please login to add a commentAdd a comment