కొన్ని పుకార్లు ఎంతగా భయపడతాయంటే..తరాలు మారిన ఆ భయం వెన్నాడుతూనే ఉంటుంది. ఎందువల్ల అనేది అర్థంకానీ మిస్టరీలా ఉండిపోతుంది. తెలుసుకుందామంటే..కల్పిత భయం నీడలా తెలియకుండా భయాలను కలగజేస్తుంది. ఆ భయమే ఆ చేధనలో కనిపించి వామ్మో! ఎందుకులే అనిపించేలా ఉంటాయి. అలా నేటికీ అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయిన వాటర్ ఫాల్ గాథ ఇది!. ఇప్పటికీ ఆ వాటర్‌ఫాల్ వద్దకు రాత్రుళ్ల వెళ్లాలంటే హడలే..!
అది మేఘాలయలోని ‘రంగ్జిర్తెహ్’ గ్రామం. ఇది ‘లికాయి’ అనే స్త్రీ కథ. లికాయికి యుక్తవయసులో పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు. ఆ బంధానికి ప్రతీకగా ఆమెకు అందమైన ఆడపిల్ల పుట్టింది. అయితే కొన్నిరోజులకే.. అనుకోని విషాదం ఆమె జీవితాన్ని మోడుగా మార్చింది. విధి ఆడిన ఆటలో భర్తను కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పెంచటం ఆమెకు కష్టమైంది. దాంతో లికాయి.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలలకు.. తన జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తినే ఎన్నుకుని రెండో పెళ్లి చేసుకుంది.
రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. రెండో భర్త తనపై చూపించే ప్రేమకు.. ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేది లికాయి. ఒకరోజు అతడు ఆమెకు మాంసం కూర వండి పెట్టాడు. ఆనందంతో కడుపునిండా తినేసింది. తిన్న వెంటనే తమలపాకులు, వక్క వేసుకుని తృప్తిగా తేన్చాలి అనుకుంది. కానీ తమలపాకుల పక్కనే రక్తం ఓడుతున్న చిన్న వేలు ఆమెని భయపెట్టింది. అది తన కూతురుదని గుర్తించి నిర్ఘాంతపోయింది. కాసేపటికే మరో ఘోరం ఆమెకు అర్థమైంది. తాను తిన్నది మాంసం కూర కాదని, తన కూతురు శరీరాన్ని అని గ్రహించి.. పిచ్చిదానిలా కేకలుపెట్టింది. తన రెండవ భర్తే ఇంతటి ఘోరానికి ఒడికట్టాడని తెలిసి వాకిట్లో కూలబడి పొట్టను బాదుకుంటూ పెద్దపెద్దగా ఏడ్చింది. ఆ కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేక సమీపంలోని జలపాతం దగ్గరకు పరుగుపెట్టి అందులో దూకేసింది. ఈ విషాద గాథ.. మేఘాలయలోని ‘నోహ్‌కలికాయి వాటర్ ఫాల్స్’ ముందుండే పెద్ద బోర్డ్ మీద.. ఓ పురాణ గాథలా కనిపిస్తుంటుంది.
ఈ ఉదంతం తెలిసిన వాళ్లంతా.. ఆ జలపాతం ‘ఓ కన్నతల్లి గుండె కోత’ అని భావిస్తుంటారు. స్థానికుల్లో చాలామంది మాత్రం రాత్రి పూట ఇక్కడికి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు. లికాయి.. ఆత్మగా మారి ఆ సమీపంలోనే తిరుగుతోందని, తన బిడ్డను వెతుక్కుంటోందని నమ్మేవాళ్లంతా.. ఈ కథకు హారర్ టచ్‌ని ఇచ్చి.. మరింతమందిని వణికిస్తుంటారు. అయితే లికాయి నిజంగానే ఆత్మగా మారిందా? లికాయి వ్యథ సరిగ్గా ఏ కాలంలో జరిగింది? ఆమె రెండో భర్త ఏమయ్యాడు? లాంటి వివరాలేమీ తెలియవు. అందుకే ఈ వాటర్ ఫాల్స్ వెనుకున్న ఈ గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
-సంహిత నిమ్మన
(చదవండి: 'రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో..' కథ కాదు నిజం..)
Comments
Please login to add a commentAdd a comment