దేశంలోనే అత్యంత ధనిక ఆలయం.. కానీ సరిగ్గా మూడేళ్ల క్రితం.. | Unknown Facts: Puri Jagannath Swamy Temple Treasure Mystery | Sakshi
Sakshi News home page

దేశంలోనే అత్యంత ధనిక ఆలయం.. కానీ సరిగ్గా మూడేళ్ల క్రితం..

Published Sun, Nov 21 2021 1:58 PM | Last Updated on Sun, Nov 21 2021 2:11 PM

Unknown Facts: Puri Jagannath Swamy Temple Treasure Mystery - Sakshi

భువనేశ్వర్‌: దేశంలోనే అత్యంత ధనిక ఆలయంగా పేరొందిన పూరీ జగన్నాథుని మందిరం సొత్తు భద్రతపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్నాథునికి ఉన్న వజ్ర, వైఢూర్య, బంగారు, వెండి, నవరత్నాల ఆభరణాలు, నగల సొత్తు అపారమైనది. ఈ సంపదని శ్రీమందిరం అంతరాలయంలోని ప్రత్యేక భాండాగారంలో భద్రపరిచారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఈ భాండాగారం తాళం చెవి గల్లంతైనట్లు వార్త బయటకు పొక్కింది. దీంతో స్వామి నిధి భద్రతపై భక్తుల్లో అభద్రతాభావం బలంగా నాటుకుపోయింది.

ఈ క్రమంలో ఉలికిపాటుకు గురైన దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం, పూరీ జిల్లా అధికార యంత్రాంగం స్వామి సంపద భద్రతపై భక్తుల్లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాయి. రత్నభాండాగారం సంపద సందర్శన నిమిత్తం 17 మంది ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. అప్పట్లో అట్టహాసంగా ఈ కమిటీ రత్నభాండాగారం తెరిచి, పరిశీలించినట్లు.. సొత్తు అంతా భద్రమేనని ఓ ప్రకటన వెలువరించింది. రెండంతస్తుల రత్నభాండాగారంలో బాహ్య అంతస్తు నుంచి లోపలి అంతస్తుని స్పష్టంగా చూసినట్లు కమిటీ స్పష్టం చేసింది. ఈ సమాచారం స్వామి భక్తులకు కాస్త ఊరటని కలిగించింది.

 

ఈ నెల 18న అసలు విషయం.. 
అయితే తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా లభ్యమైన కొత్త సమాచారంతో మళ్లీ స్వామి సొత్తుపై భక్తుల్లో విశ్వాసం నీరుగారింది. 1970 నుంచే జగన్నాథుని రత్నభాండాగారం తాళం చెవి కనబడడం లేదని సమాచార హక్కు చట్టం కింద లభించిన సమాచారం బహిర్గతం చేసింది. కొమాకొంతియా గ్రామానికి చెందిన దిలీప్‌కుమార్‌ బొరాల్‌ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచారం సేకరించారు. రత్నభాండాగారం అసలు తాళం చెవి, నకిలీ తాళం చెవి వాస్తవ సమాచారం తెలియజేయాలని ఆయన జిల్లా ట్రెజరీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడంతో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ నెల 18వ తేదీన పూరీ కలెక్టరేట్‌ ద్వారా ఆయనకు అందినట్లు సమాచారం.

ఇదే విషయాన్ని జగన్నాథ ఆలయం ప్రధాన పాలన అధికారికి 2018 ఏప్రిల్‌ 4వ తేదీన లేఖ ద్వారా తెలియజేసినట్లు సమాచారం ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో తాళం చెవి గల్లంతు ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన సమాచారం పట్ల సర్వత్రా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్వామి నిధిపై రహస్యం పాటించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన కమిటీలో శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి(సీఏఓ), జిల్లా కలెక్టరు, పోలీస్‌ సూపరింటెండెంట్, భారతీయ పురావస్తు శాఖ కోర్‌ కమిటీ సభ్యులు, శ్రీమందిరం పాలక మండలి సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం సమాచార హక్కు చట్టం ద్వారా లభించిన సమాచారం.. అప్పుడు కమిటీ సభ్యుల ప్రకటనకు పొంతన లేకుండా పోవడం పలు అనుమానాలకు తావునిస్తోంది.  

తాళం మాయంపై కలెక్టర్‌కు లేఖ.. 
సమాచారం చట్టం ప్రకారం రత్నభాండాగారం తాళం చెవి వివరాలపై 2018 ఏప్రిల్‌ 3వ తేదీన పూరీ జిల్లా అప్పటి కలెక్టరు(అరవింద అగర్వాల్‌) జిల్లా కోశాధికారికి లేఖ రాశారు. రత్నభాండాగారం తాళం చెవి కనబడడం లేదని శ్రీమందిరం అప్పటి ప్రధాన పాలన అధికారి(సీఏఓ) (ప్రదీప్‌ కుమార్‌ జెనా)కు 2018 ఏప్రిల్‌ 4న జిల్లా కలెక్టరు లేఖ ద్వారా తెలియజేశారు. 1970 నుంచి రత్నభాండాగారం తాళం చెవి వివరాలు కానరానట్లు ఆ లేఖలో వివరించారు.

ఇప్పుడు భాండాగారం తాళం చెవి వివరాల కోసం అర్జీ పెట్టుకున్న దిలీప్‌కుమార్‌ బొరాల్‌కు ఇదే సమాచారం జారీ చేశారు. ఈ క్రమంలో అప్పట్లో హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమాచారంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా జగన్నాథుని రత్నభాండాగారం తాళం చెవి కానరాకుంటే ప్రముఖుల కమిటీ పరిశీలన ఎలా సాధ్యమైందనే దిశగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఈ తాళం చెవి గల్లంతు విషయం ఎటువైపు ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

చదవండి: సోషల్‌ మీడియాలో మాజీ సీఎం భార్య రచ్చ.. ‘ఆ డ్రెస్‌ ఏంటి’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement