టైమ్ ట్రావెల్ అంటేనే ఒక రకమైన ఆసక్తి. తిరిగిరాని గతానికి తిరిగి వెళ్లడం, తెలియని భవిష్యత్‌ను ముందుగానే చూడటం.. టైమ్ ట్రావెల్ అద్భుతం. అయితే కొన్ని సరైన ఆధారాలు లేక ఆశ్చర్యకరమైన ఉదంతాలుగా, జవాబులు లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయి. అలాంటిదే శాంటియాగో ఫ్లైట్ నం. 513 రిటర్న్స్ స్టోరీ.
అది 1989, నవంబర్ 15. బ్రెజిల్‌లోని పార్టో అలెగ్రే విమానాశ్రయం ముందు ఉద్రిక్తత నెలకొంది. కొందరు నిరసనకారులు.. ‘గత నెల 12న ఇక్కడేం జరిగింది? ఎందుకు ఈ ప్రభుత్వం 513 ఫ్లైట్ వివరాలు చెప్పడం లేదు?’ అంటూ గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. 1954 నాటి శాంటియాగో ఫ్లైట్‌లోని ప్రయాణికుల వివరాలను తక్షణమే బయటపెట్టాలనేది వారి పోరాటం. ‘నిరాధారమైన ప్రశ్నలకు మేమెలా సమాధానం ఇవ్వగలం?’ అనేది విమానాశ్రయ అధికారుల వాదన.
అసలేం జరిగింది?
35 ఏళ్ల కిందట జర్మనీలో మిస్సైన ‘శాంటియాగో ఫ్లైట్ నం. 513’ విమానం (1989,అక్టోబర్ 12) బ్రెజిల్‌లోని పార్టో అలెగ్రే విమానాశ్రయంలో ల్యాండయ్యింది. ఫ్లైట్ 513 రికార్డులను పరిశీలించగా.. ఆ విమానం 1954, సెప్టెంబరు 4న పశ్చిమ జర్మనీలోని ఆచెన్ విమానాశ్రయం నుంచి బయల్దేరినట్లు ఆధారాలు ఉన్నాయి. నిజానికి అది 18 గంటల తర్వాత గమ్యస్థానానికి చేరాల్సి ఉంది.
కానీ అలా జరగలేదు. కొన్ని రోజుల పాటు వెతికిన తర్వాత ఆ ఫ్లైట్ అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని అక్కడి అధికారులు తేల్చేశారు. అందులోని కెప్టెన్ మిగ్యూల్ విక్టర్ క్యూతో సహా అంతా చనిపోయినట్లు ప్రకటించారు. అయితే నాడు మిస్ అయ్యిందనుకున్న విమానం.. 1989లో అలెగ్రే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యింది. దీనిపై పారానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్సో అటెల్లో స్పందిస్తూ.. ‘ఆ విమానం 35 ఏళ్ల క్రితం టైమ్ ట్రావెల్‌లోకి ప్రవేశించి.. 1989లో బయటపడింది’ అని తెలిపారు.
ఈ ఘటనపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ జరిపించింది. కానీ వివరాలను తెలిపేందుకు నిరాకరించింది. బ్రెజిల్ విమానాశ్రయవర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన విమానం చాలా పురాతనమైనదని, దానికి శక్తిమంతమైన టర్బోప్రాప్ ఇంజిన్లు ఉన్నాయని బ్రెజిల్ అధికారులు నిర్ధారించారు.
విచిత్రం ఏమిటంటే.. ఆ విమానంలో 88 మంది ప్రయాణికులతో పాటు, ముగ్గురు విమాన సిబ్బంది, విమానం నడిపిన పైలట్ కూడా అస్థిపంజరాల్లా మారిపోయారు. మొత్తం కలిపి 92 మంది అస్థిపంజరాలుగా మిగిలారు. దీనిపై విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీయగా.. ‘ఈ విమాన పైలట్.. కెప్టెన్ విక్టర్ క్యూ.. కాక్‌పీట్‌లో విమానం నడుపుతున్న పొజిషన్ లో మాకు కనిపించారు.
ల్యాండింగ్‌కు ముందు ఆ ఫ్లైట్.. ఈ విమానాశ్రయం చుట్టూ చాలా సేపు చక్కర్లు కొట్టింది. దాని గురించి మాకు ముందుగానే ఎలాంటి సమాచారం లేకపోవడంతో మేము కాస్త అయోమయంలో పడ్డాం. ఆ తర్వాత విమానం దానంతట అదే ల్యాండయ్యింది. పైలట్ చనిపోయి ఉన్నా ఆ విమానం ఎలా ల్యాండ్ అయ్యిందనేది మాకు ఇప్పటికీ ఆశ్చర్యమే’ అని చెప్పుకొచ్చారు. ఇది 1989, నవంబర్ 14.. ఉదయాన్నే ‘వీక్లి వరల్డ్ న్యూస్’ పత్రిక చదివిన వారిని విస్మయపరచిన వార్త. ఆ నోట ఈ నోట విస్తృతంగా ప్రచారమై.. ప్రపంచమూ విస్తుపోయేలా చేసింది.
35వ ఏళ్ల క్రితం మిస్ అయిన విమానం తిరిగి రావడమేంటీ? పైగా ఒక అస్థిపంజరం పైలెట్ స్థానంలో కూర్చుని, విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడమేంటీ? అనే ప్రశ్నలు.. బ్రెజిల్, జర్మనీ దేశాలతో పాటు యావత్ ప్రపంచాన్నీ అనుమానంలోకి నెట్టాయి.
ఈ ఘటనపై ‘విమానాశ్రయ అధికారుల అలసత్వం సరికాదు’ అంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం నేర మని, ఆ విమానంలోని ప్రయాణికుల వివరాలు తెలుసుకుని.. ఆ సమాచారం వారి బంధువులకు పంపించండని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రజలు భయాందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వార్తను గోప్యంగా ఉంచుతోందనీ అనుకున్నారు.
ఓ కట్టుకథ
కొంతమంది మాత్రం.. ‘ఇదంతా ఓ కట్టుకథ, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు’ అని కొట్టిపారేశారు. ఐర్విన్ ఫిషర్ అనే విలేకరి రాసిన ఈ వార్త చుట్టూ భిన్నవాదనలు వెల్లువెత్తాయి. ప్రపంచ చరిత్రలో ఎయిర్‌క్రాఫ్ట్ లిస్ట్‌ను పరిశీలిస్తే.. 1856లో మొదటిసారి మిస్ అయిన హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర నుంచి.. 2019లో గల్లంతయిన ఎమ్‌బీబీ బీవో 105 హెలికాప్టర్ వరకూ చూసుకుంటే ‘శాంటియాగో నం. 513’ అనే ఫ్లైట్ మిస్ అయినట్లు కాదు కదా కనీసం రికార్డ్‌ల్లో కూడా ఆ పేరుతో ఒక్క ఫ్లైట్ కనిపించలేదు.
దీంతో ఇదొక ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు అధికారులు. మరో విషయం ఏమిటంటే.. ‘వీక్లి వరల్డ్’ పత్రిక ఇలాంటి ఫిక్షన్ స్టోరీస్‌ని సృష్టించడంలో దిట్టని చాలా మంది నిరూపించారు. అయినా సరే కొందరు శాంటియాగో 513 టైమ్ ట్రావెల్‌లో చిక్కుకుందని.. ప్రభుత్వాలే నిజాన్ని దాచిపెడుతున్నాయని.. బలంగా నమ్మారు. దాంతో ఈ ఫ్లైట్ రిటర్న్స్ స్టోరీ మిస్టరీల సరసన చేరి కథలు కథలుగా ప్రచారమవుతోందిప్పటికీ!
-సంహిత నిమ్మన
చదవండి: USA Boy In The Box Mystery: నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టు.. పాపం చిన్నారి.. ఇంతకీ ఆ బాబు ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment