మళయాలంలో చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి.. టోటల్ సౌత్‌నే ఊపేస్తోంది మంజుమ్మెల్ బాయ్స్. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది ఈ సర్వైవల్ డ్రామా. అత్యంత ప్రమాదకరమైన గుహల్లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ చిత్రానికి స్ఫూర్తి. అయితే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.. గుణ గుహలు, ఆ గుహ చుట్టూ అల్లుకున్న మిస్టరీ నేపథ్యం. ఆ మిస్టరీ ఏంటి? ఆ గుహలోకి వెళ్లి అదృశ్యమైన 16 మంది ఏమైపోయారు?.. ఇంతకీ ఈ గుహలకు డెవిల్ కిచెన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం.
తమిళనాడు కొడైకెనాల్‌లో గుణ గుహలు ఉన్నాయి. 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహల గురించి తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఆ గుహకు డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడాయన. లిఖితపూర్వక రికార్డులు కూడా లేకపోయేసరికి అసలు ఆయన వాటికి ఆ పేరు ఎందుకు పెట్టాడో అనేదానికి చాలా ఏండ్లు స్పష్టత లేకుండా పోయింది. ఈలోపు.. 1991లో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రం విడుదలైంది. ఆ చిత్రం మేజర్ పోర్షన్ ఈ గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. గుణ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. ఈ గుహలకు ‘గుణ గుహలు’ అనే పేరొచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులు క్యూ కట్టడం ప్రారంభించారు. అయితే..
తర్వాతి కాలంలో ఆ గుహల పేరు చెబితేనే జనాలు వామ్మో అనుకోవడం ప్రారంభించారు. అందుకు కారణం.. ఆ గుహలోని అగాథం, ఆ అగాథాన్ని అన్వేషించేందుకు వెళ్లిన కొందరిని అది మింగేయడం. పైగా గుహ ఏకరీతిలో కాకుండా అసాధారణ రీతిలో ఉండడంతో.. అందులో పడిపోయినవాళ్ల మృతదేహాల్ని సైతం బయటకు తీయలేకపోయారు. దీంతో.. వార్డ్ అందుకే డెవిల్స్ కిచెన్ అని దానికి పేరు పెట్టి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. అలా.. గుణ గుహలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఒకటిగా పేరు వచ్చింది.
పోలీసుల రికార్డుల ప్రకారం.. 2016 దాకా 16 మంది ఈ గుహలోకి వెళ్లిన వాళ్లు కనిపించకుండా పోయారు. అలా.. అదృశ్యమైన వాళ్లలో ఓ కేంద్రమంత్రి బంధువు కూడా ఉన్నారు. వీళ్లలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయి. అయితే.. ఓ వ్యక్తి మాత్రం సజీవంగా బయటకు రాగలిగాడు. అదే మంజుమ్మెల్ బాయ్స్ కథకు మూలమైంది.
2006లో కేరళ కొచ్చి మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహ సందర్శనకు వెళ్లారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాథంలోకి పడిపోయాడు. దీంతో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో.. సిజూ డేవిడ్ అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు, అధికారులు హెచ్చరించి వారించినా వినకుండా స్థానికుల సాయంతో అతికష్టం మీద తన స్నేహితుడ్ని రక్షించుకున్నాడు. అలా ఆ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం.. ఇప్పుడు సౌత్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది.
2000 సంవత్సరం చాలా ఏళ్లపాటు సందర్శకులను అనుమతించకుండా ఈ గుహను శాశ్వతంగా మూసేశారు. అయినా కూడా హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు ఆ గుహ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రమాదంలో పడుతూ వచ్చారు.
మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం సూపర్ హిట్ కావడంతో గుణ గుహలకు సందర్శకులను అనుమతించడం ప్రారంభించింది తమిళనాడు టూరిజం శాఖ. కానీ, గుహ ప్రధాన ద్వారం మాత్రం ఇంకా మూసే ఉంచారు.
గుహకి ఉన్న భయాకన నేపథ్యంతో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం షూటింగ్ చాలావరకు సెట్స్‌లోనే నిర్వహించారు. కొంత భాగం మాత్రం గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అలాగే కమల్ హాసన్ గుణ చిత్రం.. తాజా మెంజుమ్మెల్ బాయ్స్ సినిమాలే కాకుండా.. ఈ మధ్యలో మోహన్‌లాల్ నటించిన షిక్కర్(2010) చిత్రం కొంత భాగం డెవిల్స్ కిచెన్ గుహల పరిసరాల్లోనే షూటింగ్ చేసుకుంది.
Video Credits: Pyramid Glitz Music
Comments
Please login to add a commentAdd a comment