Caves
-
ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్'ను మించిన సినిమా.. క్షణక్షణం ఉత్కంఠ
యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొంది తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' దీనిని నిరూపించింది. అయితే, అలాంటి సంఘటనే 2018లో థాయ్‌లాండ్‌లో జరిగింది. 12మంది ఫుట్‌బాల్ టీమ్ పిల్లలతో 'థామ్ లువాంగ్' గుహలోకి కోచ్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనతో వారు ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన 'థర్టీన్ లైవ్స్' పేరుతో సినిమాగా వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రోన్ హోవార్డ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యథార్థ ఘటనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈచిత్రం కథ తెలుసుకుందాం.కథేంటంటేథాయ్లాండ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన 'థామ్ లువాంగ్' గుహలను చూసేందుకు 12 మంది ఫుట్‌బాల్ జూనియర్ టీమ్ సభ్యులతోపాటు కోచ్ కూడా వెళ్తాడు. వారు గుహ లోపలికి వెళ్లిన కొంత సమయం గడిచాక ఆ పర్వత ప్రాంతమంతా విపరీతమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురుస్తుంది. దీంతో గుహ ప్రారంభం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరటంతో పిల్లలందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుహ లోపలికి వెళ్లిపోతారు. తిరిగి బయటకొచ్చే దారి వారికి కనిపించదు. అలా వారందరూ అక్కడ చిక్కుకుపోతారు. భారీ వర్షం వల్ల గుహ లోపలికి వెళ్లే దారి నీటితో పూర్తిగా మూసుకుపోతుంది. ఇదే సమయంలో చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు అందరూ ఆందోళన చెందుతుంటారు. బయటి ప్రంపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేని ఆ ప్రాంతంలో చిన్నారులు చిక్కుకుపోయారని అందరికీ ఎలా తెలిసింది..? సుమారు 18 రోజుల పాటు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఛాలెంజింగ్‌గా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించిందా..? పది కిలోమీటర్ల పొడవైన గుహ మొత్తం నిళ్లతో నిండిపోతే ఆ రెస్క్యూ టీమ్ ఎలా వెళ్లింది..? చిన్నారులందరూ అన్నిరోజుల పాటు సజీవంగా ఎలా ఉండగలిగారు..? అన్నది తెలియాలంటే 'థర్టీన్ లైవ్స్' సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే..2018లో థాయ్ గుహల్లో చిన్నారులు చిక్కుకున్న సంఘటన ప్రపంచదేశాల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారులను కాపాడేందుకు దాదాపు పదిహేడు దేశాలకు చెందిన ఐదు వేల మంది రెస్క్యూ టీమ్ ఆ ఆపరేషన్ కోసం థాయ్‌లాండ్ చేరుకుంటారు. ఈ ఆపరేషన్‌లో బ్రిటీష్ రెస్క్యూ టీమ్ రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్ ప్రాణాలకు తెగించి ఆ పిల్లలను కాపాడటానికి ఎలా ప్రయత్నాలు చేశారనేది చాలా సాహసంతో కూడుకొని ఉంటుంది. సుమారు 18 రోజుల తర్వాత ఆ చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చాలా ఉద్వేగంతో ఫీల్ అయ్యారు. ఆ సమయంలో పిల్లలు క్షేమంగా తిరిగిరావాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించారు. అవన్నీ ఫలించాయి. ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ ఘటనను తెరకెక్కించడంలో దర్శకుడు రాన్ హోవర్డ్ విజయం సాధించారు.సినిమా ప్రారభంమే కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులు గుహ చూద్దామని అక్కడికి చేరుకోవడంతో స్టోరీ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే భారీ వర్షం.. చిన్నారుల్లో భయం.. అలా ఒక్కో సీన్ ప్రేక్షకులకు చూపుతూ దర్శకుడు ఆసక్తి పెంచుతాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ గుహ మొత్తం నీటితో నిండిపోతుంది. లోపల వారు ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే, వారిని ఎలా కనిపెడుతారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుమారు 9 రోజుల తర్వాత సీడైవింగ్లో నిష్ణాతులైన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు (రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్) ఎంతో శ్రమించి చిన్నారులను కనిపెట్టినప్పుడు వాళ్లు ఎంత సంతోష పడ్డారో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అంతే స్థాయిలో భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు బయట జోరు వాన.. పిల్లలను రక్షించుకొందామనుకుంటే ఆ నీరు అంతా మళ్లీ గుహలోకే వెళ్తుంది. దీంతో ఆ నీటిని పంట పొలాల్లోకి మళ్లిస్తారు. అక్కడి రైతులు కూడా అందుకు సహకరిస్తారు. ఆ సీన్ అందరి కంట కన్నీరు తెప్పిస్తుంది. ఇలాంటి సీన్లు అన్నీ చాలా ఉద్విగ్నంగా ఉంటాయి.పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టారు సరే.. సుమారు 10 కిలోమీటర్లు దూరం పాటు చాలా లోతుగా ఉన్న నీటిలో నుంచి వారిని ఎలా రక్షించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎదురుగా నీటి ప్రవాహం వస్తుంటే.. దానిని అదిగమించి చిన్నారులను బయటకు చేర్చాలి. అప్పటికే 18 రోజులు కావడంతో వారందరూ మరణించి ఉంటారని కనీసం తమ బిడ్డల శవాలు అయినా తీసుకొస్తే చాలు అని వారి తల్లిదండ్రులు గుహ బయటే కన్నీటితో ఎదురుచూస్తున్నారు. అలాంటి సీన్లు ప్రేక్షకుల చేత కన్నీరు తెప్పిస్తాయి. ఎంతో సాహసంతో కూడుకున్న ఈ కథ ఎలా ముగిసిందో తెలుసుకున్నాక ప్రతి ఒక్కరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటుంది. అలాంటి మజానే ఈ 'థర్టీన్ లైవ్స్' తప్పకుండా ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.ఎవరెలా చేశారంటేసినిమా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో తెలిసిన నటుడు ఒక్కరూ లేరు. అయినా ప్రతి పాత్ర మనకు కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక విభాగం ప్రధాన్ ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్ చాలా చక్కగా తీశారు. రియల్ ఇన్సిడెంట్ కళ్ల తెరపైన చూస్తున్నామనే ఫీలింగ్ కలిగేలా సినిమా సాగుతుంది. ఇందులో ఫైట్స్ వంటివి లేకున్నా చాలా సన్నివేశాల్లో విజిల్స్ వేసేలా ఉంటాయి. ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు రాన్ హోవర్డ్.. ఈ కథను ఉత్కంఠభరితంగా చెప్పడమే కాకుండా.. ఎంతో భావోద్వేగభరితంగా ప్రేక్షకులకు చూపించారు. -
16 మంది మాయం.. మంజుమ్మెల్ బాయ్స్ ‘గుణ గుహ’ గురించి తెలుసా?
మళయాలంలో చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి.. టోటల్ సౌత్‌నే ఊపేస్తోంది మంజుమ్మెల్ బాయ్స్. వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది ఈ సర్వైవల్ డ్రామా. అత్యంత ప్రమాదకరమైన గుహల్లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ చిత్రానికి స్ఫూర్తి. అయితే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.. గుణ గుహలు, ఆ గుహ చుట్టూ అల్లుకున్న మిస్టరీ నేపథ్యం. ఆ మిస్టరీ ఏంటి? ఆ గుహలోకి వెళ్లి అదృశ్యమైన 16 మంది ఏమైపోయారు?.. ఇంతకీ ఈ గుహలకు డెవిల్ కిచెన్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. తమిళనాడు కొడైకెనాల్లో గుణ గుహలు ఉన్నాయి. 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహల గురించి తొలిసారి వెలుగులోకి తెచ్చారు. ఆ గుహకు డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడాయన. లిఖితపూర్వక రికార్డులు కూడా లేకపోయేసరికి అసలు ఆయన వాటికి ఆ పేరు ఎందుకు పెట్టాడో అనేదానికి చాలా ఏండ్లు స్పష్టత లేకుండా పోయింది. ఈలోపు.. 1991లో కమల్ హాసన్ నటించిన గుణ చిత్రం విడుదలైంది. ఆ చిత్రం మేజర్ పోర్షన్ ఈ గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. గుణ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. ఈ గుహలకు ‘గుణ గుహలు’ అనే పేరొచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులు క్యూ కట్టడం ప్రారంభించారు. అయితే.. తర్వాతి కాలంలో ఆ గుహల పేరు చెబితేనే జనాలు వామ్మో అనుకోవడం ప్రారంభించారు. అందుకు కారణం.. ఆ గుహలోని అగాథం, ఆ అగాథాన్ని అన్వేషించేందుకు వెళ్లిన కొందరిని అది మింగేయడం. పైగా గుహ ఏకరీతిలో కాకుండా అసాధారణ రీతిలో ఉండడంతో.. అందులో పడిపోయినవాళ్ల మృతదేహాల్ని సైతం బయటకు తీయలేకపోయారు. దీంతో.. వార్డ్ అందుకే డెవిల్స్ కిచెన్ అని దానికి పేరు పెట్టి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. అలా.. గుణ గుహలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గుహల్లో ఒకటిగా పేరు వచ్చింది. పోలీసుల రికార్డుల ప్రకారం.. 2016 దాకా 16 మంది ఈ గుహలోకి వెళ్లిన వాళ్లు కనిపించకుండా పోయారు. అలా.. అదృశ్యమైన వాళ్లలో ఓ కేంద్రమంత్రి బంధువు కూడా ఉన్నారు. వీళ్లలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయి. అయితే.. ఓ వ్యక్తి మాత్రం సజీవంగా బయటకు రాగలిగాడు. అదే మంజుమ్మెల్ బాయ్స్ కథకు మూలమైంది. 2006లో కేరళ కొచ్చి మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహ సందర్శనకు వెళ్లారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాథంలోకి పడిపోయాడు. దీంతో అతని మీద ఆశలు వదిలేసుకున్న సమయంలో.. సిజూ డేవిడ్ అనే అతని స్నేహితుడు ధైర్యం చేశాడు. పోలీసులు, అధికారులు హెచ్చరించి వారించినా వినకుండా స్థానికుల సాయంతో అతికష్టం మీద తన స్నేహితుడ్ని రక్షించుకున్నాడు. అలా ఆ వాస్తవ గాథ ఆధారంగా తెరకెక్కిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం.. ఇప్పుడు సౌత్ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. 2000 సంవత్సరం చాలా ఏళ్లపాటు సందర్శకులను అనుమతించకుండా ఈ గుహను శాశ్వతంగా మూసేశారు. అయినా కూడా హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు ఆ గుహ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ప్రమాదంలో పడుతూ వచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం సూపర్ హిట్ కావడంతో గుణ గుహలకు సందర్శకులను అనుమతించడం ప్రారంభించింది తమిళనాడు టూరిజం శాఖ. కానీ, గుహ ప్రధాన ద్వారం మాత్రం ఇంకా మూసే ఉంచారు. గుహకి ఉన్న భయాకన నేపథ్యంతో మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం షూటింగ్ చాలావరకు సెట్స్‌లోనే నిర్వహించారు. కొంత భాగం మాత్రం గుహల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. అలాగే కమల్ హాసన్ గుణ చిత్రం.. తాజా మెంజుమ్మెల్ బాయ్స్ సినిమాలే కాకుండా.. ఈ మధ్యలో మోహన్‌లాల్ నటించిన షిక్కర్(2010) చిత్రం కొంత భాగం డెవిల్స్ కిచెన్ గుహల పరిసరాల్లోనే షూటింగ్ చేసుకుంది. Video Credits: Pyramid Glitz Music -
అత్యంత పురాతనమైనవి.. ఈ గుహ పెయింటింగ్స్ చూశారా?
మానవులు గుహలనే ఆవాసాలుగా చేసుకుని జీవించే కాలంలో గుహల గోడలపై రకరకాల చిత్రాలు చిత్రించిన ఆనవాళ్లు ప్రపంచంలో అక్కడక్కడా ఉన్నాయి. ఇవి రాతియుగం నాటి హోమోసేపియన్ మానవులు చిత్రించినవి. అయితే, వారి కంటే పూర్వీకులైన నియాండర్తల్ మానవులు చిత్రించిన గుహాచిత్రాలు ఇటీవల ఫ్రాన్స్‌లో బయటపడ్డాయి. ఫ్రాన్స్‌లోని సెంటర్ వాల్ డి లోరీ ప్రాంతంలోనున్న లా రోష్ కోటార్డ్ గుహ గోడలపై చెక్కిన ఈ చిత్రాలు కనిపించాయి. యూనివర్సిటీ ఆఫ్ టూర్స్‌కు చెందిన పరిశోధన బృందంలోని శాస్త్రవేత్తలు ఈ చిత్రాలను గుర్తించారు. పొడవాటి గీతలు, చుక్కలతో ఉబ్బెత్తుగా చెక్కిన ఈ చిత్రాలు దాదాపు 75 వేల ఏళ్ల కిందటివని పరిశోధకులు అంచనా వేశారు. ఈ గుహను వాడటం మానేసి 57 వేల ఏళ్లు కావచ్చని వారు చెబుతున్నారు. ఇవి నియాండర్తల్ మానవులు చెక్కినవేనని, ఇదివరకు దొరికిన నియాండర్తల్ మానవుల చిత్రాల కంటే ఇవి పురాతనమైనవని చెబుతున్నారు. జింక ఎముకలపై నియాండర్తల్ మానవులు చెక్కిన చిత్రాలు ఇదివరకు జిబ్రాల్టర్‌లో బయటపడ్డాయి. అవి దాదాపు 51 వేల ఏళ్ల నాటివని శాస్త్రవేతలు చెబుతున్నారు. -
1938 నుంచి తవ్వకాలు.. ఎట్టకేలకు బయటికి
పులుల అభయారణ్యంలో శాంతిబోధను చేసిన బుద్ధుని ఆనవాళ్లు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ పులుల అభయారణ్యంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇటీవల జరిపిన తవ్వకాల్లో అత్యంత పురాతనమైన బౌద్ధ ఆలయాలు, ఇతర బౌద్ధ చిహ్నాలు బయటపడ్డాయి. ఏఎస్ఐ ఈ ప్రాంతంలో 1938 నుంచి తవ్వకాలు సాగిస్తోంది. దాదాపు 170 చదరపు కిలోమీటర్ల పరిధిలో సాగిస్తున్న తవ్వకాల్లో ఇటీవల బౌద్ధ ఆలయాలు ఇవి. ఈ ప్రాంతంలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో ఇప్పటి వరకు 26 ఆలయాలు, 26 గుహలు, రెండు స్థూపాలు, రెండు బౌద్ధారామాలు, 46 శిల్పాలు, 24 శిలాశాసనాలు బయటపడ్డాయి. ఇవన్నీ క్రీస్తుశకం ఐదో శతాబ్దానికి చెందినవని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. చదవండి: ఏడు ఖండాలు కాదు ఏక ఖండమే..! -
Live Video: నెల క్రితమే నిర్మాణం.. ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి
గాంధీనగర్: నాణ్యత లేకుండా నిర్మిస్తున్న రోడ్లు కొద్ది పాటి వర్షానికే కొట్టుకుపోతున్న సంఘటనలు చాలానే చూశాం. అలాంటి సంఘటనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. రహదారి నిర్మించిన నెల రోజులకే డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మధ్యలో ఒక్కసారిగా పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆదివారం కురిసిన వర్షాలకు నగరంలోని సురభి పార్క్ సమీపంలో రోడ్డు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ గొయ్యిలో పూర్తిగా నీటితో నిండిపోయిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. Watch: A road constructed, just a month back caves in, after a few hours of #rains in #Gujarat's #Ahmedabad. #GujaratRains #अहमदाबाद #अमराई वाडी #HeavyRain #VideoViral pic.twitter.com/IBPzk29PVO — Shiv Kumar Maurya (@ShivKum60592848) July 17, 2022 మెట్రో రైలు మార్గంలో పిల్లర్ నంబర్ 123 వద్ద రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడినట్లు అధికారులు తెలిపారు. ఆ రోడ్డును కేవలం ఒక నెల ముందే నిర్మాణం చేపట్టటం గమనార్హం. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే.. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కుంగిపోయినప్పుడు అటుగా ఎలాంటి వాహనం వెళ్లకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వల్సాద్, నవ్సారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గురువారం ఒక్కరోజే 11 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 54 మందికి చేరింది. 14 వేల మంది ఇప్పటికీ తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. వర్షాల కారణంగా నాలుగు జాతీయ రహదారులను మూసివేసింది గుజరాత్ ప్రభుత్వం. ఇదీ చదవండి: భారీ మొసలిని బంధించిన అనకొండ.. వీడియో వైరల్ -
ఏడువారాల గుహలు.. తళుక్కుమంటున్న రాళ్లు
సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా సిరాలగ్రామం శివారులోని గుహలు తళుక్కుమంటున్నాయి. ఎవరో రంగులద్దినట్టు ఇంద్రధనస్సు తరహాలో వాటిల్లోని రాళ్లు మెరుస్తున్నాయి. దాదాపు అర కిలోమీటరు వెడల్పుతో నాలుగైదు కిలోమీటర్ల మేర ఈ గుహలు విస్తరించి ఉన్నాయి. లిమొనైట్, హెమటైట్ తదితరాలతో కూడిన ఈ శిలలు ఇనుప ఖనిజంతో ఉన్నందుననే ఇలా రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయని జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల రావు చెప్పారు. ఈ నిక్షేపాలు జీఎస్ఐ అధికారికంగా గుర్తించిన జాబితాలో లేవన్నారు. శిలల్లో ఇనుప ఖనిజ పరిమాణం ఎంత ఉందో శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. 25 కోట్ల నుంచి 17 కోట్ల సంవత్సరాల క్రితం శిలలు ఏర్పడి ఉంటాయని జీఎస్ఐ అంచనా. తాజాగా ఈ గుహలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బలగం రామ్మోహన్ పరిశీలించారు. ఈ ఖనిజం విషయాన్ని పక్కనపెడితే గుహలు సందర్శకులకు కొత్త వినోదాన్ని పంచుతున్నాయని చెప్పారు. వీటి గురించి స్థానికులకు తప్ప ఇతర ప్రాంతాల వారికి పెద్దగా అవగాహన లేదని, అందుకే పెద్దగా పర్యాటకులు రావట్లేదని అన్నారు. స్థానికులు వీటిని ఏడువారాల గుహలంటున్నారని చెప్పారు. రుషులు ఒక్కో రోజు ఒక్కో గుహలో తపస్సు చేసుకునేవారని ప్రచారంలో ఉందని అన్నారు. -
Elephanta Caves: ఎలిఫెంట్ లేదు! కేవ్స్ ఉన్నాయి!!
ఎలిఫెంటా కేవ్స్ దీవికి చేరాలంటే ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర టికెట్ తీసుకోవాలి. ఫెర్రీలో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ వెళ్తుంటే పది కిలోమీటర్లు చాలా త్వరగా వచ్చేసినట్లనిపిస్తుంది. ఫెర్రీ ప్రయాణంలో ఎలిఫెంటా కేవ్స్ను చేరేలోపు హార్బర్‌కు వచ్చిన పెద్ద పెద్ద షిప్పులను చూడవచ్చు. పోర్టులో బెర్త్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తూ తీరానికి రెండు కిలోమీటర్ల వరకు పెద్ద షిప్పులు లంగరు వేసుకుని ఉంటాయి. వాటిలో క్రూ డెక్ మీదకు వచ్చి సముద్రాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మామూలుగా అయితే అంతపెద్ద ఇంటర్నేషనల్ కార్గోలను అంత దగ్గరగా చూడడం కుదరని పని. సోమవారం సెలవు ఎలిఫెంటా కేవ్స్ పర్యటనకు సోమవారం సెలవు. ఫెర్రీలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే గుహల దగ్గరకు తీసుకెళ్తాయి. శీతాకాలం ఫెర్రీ పై అంతస్తులో ప్రయాణించడం బాగుంటుంది. అరబిక్ కడలి చిరు అలలతో నిశ్శబ్దంగా పలకరిస్తుంది. ఎలిఫెంటా కేవ్స్ ఉన్న దీవి ఎత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయితే అది పర్యాటకుల తప్పు కాదు. అమావాస్య, పౌర్ణముల్లో సముద్రం ఆటుపోట్లను బట్టి నీటి ఉపరితలం పైకి ఉబికినప్పుడు ఐలాండ్ ఎత్తు తక్కువగా కనిపిస్తుంది. ఫెర్రీ దిగిన తర్వాత దాదాపు కిలోమీటరు దూరం నడవాలి. ఆ దారిలో టాయ్‌ట్రైన్ ఎప్పుడో ఒక ట్రిప్పు తిరుగుతుంది. అంతదూరం నుంచి మనం వదిలి వచ్చిన తీరాన్ని చూడడం, సముద్రపు అలలు, మరోవైపు కొండలను చూస్తూ సాగే ఆ నడక కూడా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆ దారిలో ఉండే టూరిస్టు మార్కెట్లో చిరు వ్యాపారులను, వారు చెప్పే ధరలను చూస్తే దేశంలో వర్తకవాణిజ్య మేధావులంతా ఇక్కడే ఉన్నారా అని నోరెళ్లబెట్టాల్సిందే. పర్యాటక ప్రదేశాల్లో ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఐదు నుంచి పదిశాతం ధర ఎక్కువ ఉండడాన్ని ఆక్షేపించకూడదు. కానీ మన దగ్గర శిల్పారామంలో రెండు వందలకు అమ్మే హ్యాండ్‌బ్యాగ్‌కు అక్కడ పదిహేను వందలు చెప్పారు. గాయపడిన శిల్పాలు ఇంతటి వైవిధ్యతను ఆస్వాదిస్తూ గుహల్లోకి అడుగుపెట్టిన తర్వాత అది మరో ప్రపంచం. తప్పిపోయేటన్ని గుహల్లేవు, మొత్తం ఏడు గుహలే. రెండు బౌద్ధగుహలు, ఐదు హిందూ గుహలు. గైడ్ లేకపోతే మనం ఏం చూస్తున్నామో అర్థం కాదు. ఏ శిల్పమూ దాని పూర్తి స్వరూపంతో లేదు. విధ్వంసానికి గురి కాని శిల్పం ఒక్కటీ కనిపించదు. ప్రతి శిల్పానికి ఏదో ఒక చోట గాయం, ఆ గాయాల వెనుక అధికార దాహమూ ఉన్నాయి. ఈ గుహలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటివి. అప్పుడు హీనయాన బౌద్ధులు ఈ కొండలను తొలిచి ఆవాసాలుగా మలుచుకున్నారు. బౌద్ధ శిల్పాలను కూడా చెక్కారు. బౌద్ధం సన్నగిల్లిన తర్వాత ఈ ప్రదేశం హిందువుల అధీనంలోకి వచ్చింది. సమానత్వం కోసం ఓ ప్రయత్నం శైవం పతాకస్థాయిలో ఉన్న కాలంలో కాలచూరులు, రాష్ట్రకూటులు ఈ గుహల్లో శిల్పాలను చెక్కించారు. శివపురాణం ఆధారంగా చెక్కిన ఘట్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలోనే సమాజంలో స్త్రీపురుష సమానత్వం కోసం ఒక ప్రయత్నం జరిగిందిక్కడ. అర్ధనారీశ్వరుడిని రూపొందించడంలో ఉద్దేశం... సమాజంలో స్త్రీ పురుష సమానత్వ భావనను పాదుకొల్పడమే. అయితే ఆ ఉద్దేశాన్ని రూపుమాపడానికి అత్యంత లౌక్యంగా అది పార్వతికి మాత్రమే దక్కిన వరంగా మలిచేయడమూ అనతికాలంలోనే జరిగిపోయింది. ఏనుగు ఎక్కడ? గుహలన్నీ తిరిగి చూడడం పూర్తయినా సరే ఎక్కడా ఏనుగు ఆనవాలు కనిపించదు. ఈ గుహలకు ఆ పేరు ఎందుకు వచ్చిందని అడిగినప్పుడు గైడ్ చాలా సిన్సియర్‌గా గుహల వెలుపలకు తీసుకువచ్చి ఒక ఖాళీ ప్రదేశాన్ని చూపించి, ‘ఇక్కడ ఒక పెద్ద ఏనుగు శిల్పం ఉండేది. ఆ శిల్పం కారణంగానే పోర్చుగీసు, బ్రిటిష్ పాలనకాలంలో ఈ గుహలకు ఎలిఫెంటా కేవ్స్ అనే పేరు వచ్చిందని చెబుతూ ఆ ఏనుగును చూడాలంటే ముంబయి నగరంలోని జిజియామాత ఉద్యానవనానికి వెళ్లా’ లని చెప్పాడు. ఇక్కడ ఉండాల్సిన ఏనుగు అక్కడికి ఎందుకు వెళ్లిందటే... బ్రిటిషర్లు మన కోహినూర్ వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని తరలించుకుపోయినట్లే ఏనుగు శిల్పాన్ని కూడా పెకలించుకుపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో అది విరిగిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనవాళ్లు ఏనుగుకు మరమ్మతులు చేసి జిజియా మాత ఉద్యానవనంలో నిలబెట్టారు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ బయటకు వచ్చేటప్పటికి ఫెర్రీలు నడిపేవాళ్లు ఎదురు చూస్తుంటారు. తిరుగు ప్రయాణానికి టైమ్ అయింది, ఫెర్రీ కదలడానికి సిద్ధంగా ఉంది ఇది వెళ్లిపోతే ఇక ఇప్పట్లో మరొకటి ఉండదని పిల్లల్ని భయపెట్టినట్లు చెప్పి బయల్దేరదీస్తారు. – వాకా మంజులారెడ్డి -
అసనగిరి కొండల్లో.. ‘అల్లూరి’ గుహలు నిజమే
నాతవరం (నర్సీపట్నం): విశాఖ జిల్లా నాతవరం మండలం అసనగిరి ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నివాస గుహలు ఉన్నట్లు మైనింగ్ శాఖ అధికారులు ఎట్టకేలకు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ జనవరి నెలలో తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులో ఉన్న లేటరైట్ నిక్షేపాలు, అల్లూరి గుహలకు సంబంధించి అసెంబ్లీ కమిటీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఆ తర్వాత అసనగిరి ప్రాంతంలోని లేటరైట్ గుహలపై రాష్ట్ర ప్రభుత్వానికి, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కూడా ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా జరిపిన లేటరైట్ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని అందులో కోరారు. దీనిపై జనవరి 28న అనకాపల్లి మైనింగ్ ఏడీ వెంకట్రావు ఆధ్వర్యంలో నాతవరం మండలంలో సుందరకోట పంచాయతీ శివారు అసనగిరి గ్రామ సమీపంలోని అల్లూరి సీతారామరాజు నివాస గుహలను స్వయంగా పరిశీలించారు. జనవరి 28న అసనగిరిలో గిరిజనులతో మాట్లాడుతున్న మైనింగ్ ఏడీ వెంకట్రావు అక్కడి గిరిజనులతో సమావేశమయ్యారు. బ్రిటిష్ కాలంలో అల్లూరి సీతారామరాజు ఈ గుహలో ఉండి.. సైన్యాన్ని తయారుచేసుకుని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు పోలీసుస్టేషన్లపై దాడి చేశారని గ్రామస్తులు తెలిపారు. కాగా, ఈ గుహలను అభివృద్ధి చేయాలంటూ ఈ ప్రాంత గిరిజనులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. వీటిని పట్టించుకోకుండా గత ప్రభుత్వం.. ఈ ప్రాంతంలో లేటరైట్ నిక్షేపాల తవ్వకాలకు నిబంధనలు ఉల్లంఘించి సింగం భవాని పేరు మీద అనుమతులిచ్చింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షలాది టన్నుల లేటరైట్ మట్టిని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మీదుగా యథేచ్ఛగా తరలించుకుపోయారు. ఆ సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత కొందరు కోర్టును ఆశ్రయించడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. గుహలున్న ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ నేపథ్యంలో.. విశాఖ జిల్లాలో అసనగిరి గ్రామస్తులు చేస్తున్న పోరాటంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ స్పందించి అసెంబ్లీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ తాము పరిశీలించిన అంశాలతో పాటు అసనగిరి గ్రామస్తులు తెలిపిన విషయాలన్నింటినీ ప్రభుత్వానికి ఇటీవల మైనింగ్ ఏడీనివేదించారు. -
రాతి గుహల్లో రంగుల కాన్వాస్
సాక్షి, హైదరాబాద్: ఎద్దులు, ఉడుములు, పాములు, మనుషులు, మొక్కలు, పూలు, మధ్యమధ్యలో అంతుపట్టని ఆకృతులు... ఇలా ఆ గుహలోకి వెళితే అదో అందమైన కాన్వాస్. కళ్లకు కనిపించినవి, మదిలో మెదిలినవి ఆకృతులుగా ఎరుపు రంగులో పొందికగా ఆ రాతిపై చిత్రీకరించారు. అయితే ఇవన్నీ రూపుదిద్దుకున్నవి దాదాపు మూడున్నర వేల ఏళ్ల క్రితం. తెలంగాణలో మరో రాతి చిత్రాల జాడ వెలుగుచూసింది. చాలా ప్రాంతాల్లో ఆదిమానవులు గీసిన రాతి చిత్రాలు అడపాదడపా వెలుగు చూస్తున్నా... వాటి సంఖ్య ఎక్కువగా ఉన్న తావుల సంఖ్య అరుదు. ఇప్పుడు ఒకే చోట ఎక్కువ సంఖ్యలో చిత్రాలున్న గుహ వెలుగు చూసింది. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని నల్లముడి గ్రామ చేరువలోని అడవిలో ఒంటిగుండుగా పిలుచుకునే గుహలోపల ఇవి కనిపించాయి. దీన్ని స్థానికులు ఆరాధన ప్రాంతంగా వినియోగిస్తున్నారు. ‘పంచపాండవులు’గా పేర్కొనే ఐదు నిలువురాళ్లు, పెద్ద మీసాలతో ఓ తల రూపుతో ఉన్న రాయిని పూజిస్తున్నారు. ఆ గుహలో పైభాగంలో రకరకాల ఆకృతుల్లో ఈ చిత్రాలున్నాయి. పాతరాతియుగం–మధ్యరాతియుగంలో ఇవి చిత్రించారని భావిస్తున్నారు. పాములు, ఉడుములు, మానవాకృతులు, పూల డిజైన్లు, సూర్యుడు, దీర్ఘచతురస్రాకారపు ఘనాలతో బొమ్మలు అక్కడ కనిపిస్తున్నాయి. గతంలో నీలాద్రి (రామచంద్రాపురం), రాచకొండ ప్రాంతాలలో వెలుగు చూసిన చిత్రాల తరహాలో ఇవి ఉండటం విశేషం. ఈ చిత్రాలను తాజాగా ఖమ్మం, భద్రాచలంకు చెందిన ఔత్సాహిక పరిశోధకులు కొండవీటి గోపి, జగన్మోహనరావు, కట్టా శ్రీనివాస్, రాక్ ఆర్ట్ నిపుణులు బండి మురళీధర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి చరిత్ర విభాగానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్, రామన్ స్పెక్ట్రాస్పెషలిస్టు కట్టా జ్ఞానేశ్వర్, కనిగిరికి చెందిన కొండ్రేటి భాస్కర్లు రాక్‌ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యుల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆ చిత్రాల వయసు, వాటికి వాడిన ముడిపదార్థాలు, అంచులకు వినియోగించిన గీతలు పాతవా, తర్వాత చిత్రించినవా.. అన్న వివరాలను వారు ఆరా తీస్తున్నారు. ఇందుకు శాస్త్రీయ పరిశోధన జరుపుతున్నారు. ఇక్కడే ఆదిమానవులు వాడిన రాతి పనిముట్లు, కొన్ని వృక్ష శిలాజాలు కూడా లభించాయి. క్రమంగా శిథిలమవుతూ... ఎంతో విలువైన ఈ చిత్రాలు క్రమంగా దెబ్బతింటున్నాయి. స్థానికులు ఆరాధనలో భాగంగా గుహలో గండ దీపాలు వెలిగిస్తుండటంతో మసిపట్టి రంగు మారిపోతున్నాయి. మరికొందరు గుహ గోడలకు సున్నం పూస్తున్నారు. స్థానికులకు అవగాహన కలిగించటంతోపాటు వాటి సంరక్షణకు హెరిటేజ్ తెలంగాణ చర్యలు చేపట్టాలని పరిశోధన బృందం సభ్యులు కోరుతున్నారు. -
అబ్బురం.. సన్యాసి గుహల అందాలు
సాక్షి, బేతంచెర్ల(కర్నూలు) : బుగ్గానిపల్లె గ్రామ సమీపంలో పచ్చని అటవీ ప్రాంతంలో సన్యాసి గుహలు ప్రకృతి ప్రేమికులను అబ్బుర పరుస్తున్నాయి. ఇక్కడ పూర్వం ఓ సన్యాసి ఉండేవాడని, అందుచేత వాటికి సన్యాసి గుహలుగా పేరు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. బుగ్గానిపల్లె, సిమెంట్‌నగర్, పాణ్యం మండలం కందికాయపల్లె, బనగానపల్లె మండలం రామతీర్థం ప్రజలకు తప్ప.. గుహలు ఉన్నట్లు వేరెవరికీ తెలియదు. బుగ్గానిపల్లె గ్రామం నుంచి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ గుహలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. సరైన రహదారి లేకపోయినా స్థానికులు ఏడాదికోసారైనా గుహల అందాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురువుతున్నారు. గుహల్లో నాగశేషుని ఆకారం, రాజుల కట్టడాలు, నీరు పారుతున్నట్లుగా, జంతువుల ఆకారాలు, గాజుతో తయారైన చిత్రాలు అబ్బుర పరుస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, రోడ్డు సౌకర్యం కల్పించి, గుహలను అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మధ్య రాతియుగం ‘మోడ్రన్ ఆర్ట్’!
పాకుతున్న ఓ భారీ ఉడుము...ఆ పక్కనే తాబేలు డిప్పలో ఉండే ఆకృతుల సమ్మేళనం.. ఓ పక్కకు చూస్తే కుక్కలాంటి ఆకారం.. దానికి ఎదురుగా క్రమపద్ధతిలో పేర్చినట్టుగా అర్ధ చతురస్రాకారపు గీతల బొత్తి, అద్దంలో ప్రతిబింబంలా ఒకదానికొకటి విరుద్ధ దిశల్లో... మనిషిలాగా కనిపిస్తుంది, కాదు అది మృగమనే భావన ఆ వెంటనే కలిగే వింత ఆకృతి.. చుట్టూ మోహరించిన జలచరాలు, సరీసృపాలు, ఉభయచర జీవులను తలపించే మరిన్ని ఆకారాలు.. దాదాపు 28 అడుగుల పొడవున్న కాన్వాస్‌పై రూపొందించిన చిత్రాలివి. చూడగానే ఓ మోడ్రన్ ఆర్ట్‌ను తలపిస్తుందది. చిత్రాల ఆకారాలను సులభంగా పోల్చుకునేలా ఉండవు, కానీ మనసులో మెదిలే ఏవేవో భావాలకు ప్రతిరూపాలన్నట్టుగా తోస్తాయి. ఒకదాని కొకటి పొంతన ఉండవు, వేటికవే ప్రత్యేకం. ఇంతకూ ఆ చిత్ర విచిత్ర చిత్రాల సమాహారంగా ఉన్న కాన్వాస్ వయసెంతో తెలుసా? దాదాపు పది వేల నుంచి పదిహేను వేల ఏళ్లు - సాక్షి, హైదరాబాద్ ఆదిమానవుల చిత్రాలతో కూడిన గుహలు అడపాదడపా కనిపిస్తుంటాయి. దట్టమైన అడవులే కాదు, ఊరి పొలిమేరల్లో ఉండే గుట్ట రాళ్లపై ఎరుపురంగు చిత్రాలు అప్పుడప్పుడూ వెలుగు చూస్తూనే ఉంటాయి. నాటి మానవులు ఆవాసంగా మార్చుకున్న గుహ గోడలు, పైకప్పుపై రెండుమూడు చిత్రాలు, కొన్ని అంతుచిక్కని గీతలుంటాయి. కానీ, ఓ కాన్వాస్ తరహాలో ఎక్కువ సంఖ్యలో చిత్రాల సమూహం వెలుగు చూడటం మాత్రం అరుదు. అలాంటి అరుదైన రాక్ పెయింటింగ్స్ ఇప్పుడు భద్రాచలం అడవుల్లో బయటపడ్డాయి. పాల్వంచ సమీపంలోని ముల్కలపల్లి మండలం నల్లముడి గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో అడవిలో వెలుగుచూసింది. గతంలో సమీపంలోని అక్షరలొద్దిలో ఆదిమానవుల చిత్రాలు వెలుగు చూసిన నేపథ్యంలో స్థానిక ఉపాధ్యాయుడు కొండవీటి గోపివరప్రసాద్రావు వీటిని గుర్తించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కట్టా శ్రీనివాస్, శ్రీరామోజు హరగోపాల్, రాక్‌ఆర్ట్ సొసైటీ సభ్యులు డాక్టర్ మరళీధర్రెడ్డిలు వాటిని పరిశీలించి మధ్య రాతి యుగం నాటివి అయి ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొన్ని తరాల చిత్రాలు.. ఒంటి గుండుగా పేర్కొనే ఈ గుహలోని చిత్రాలు ఒకేసారి వేసినవి కావు. కొన్ని తరాలుగా వాటిని వేరువేరు మనుషులు గీస్తూ వచ్చారు. రంగు కొంత వెలిసిపోయి పాత చిత్రాలుగా కనిపిస్తుండగా, వాటిపై కొత్తగా వేసినట్టుగా మరికొన్ని చిత్రాలు ఎర్రటి రంగుతో మెరుస్తున్నాయి. ఈ గుహ కొన్ని తరాలపాటు మానవ ఆవాసంగా ఉందనటానికి ఇదో నిదర్శనం. చుట్టూ నీటి వనరులు ఉండటం, సమీపం అంతా మైదాన ప్రాంతంగా ఉండటం, గుండు ఎక్కితే దూరం నుంచే జంతువుల జాడ తెలుసుకునే వీలుండటంతో ఇది మానవ ఆవాసంగా చాలాకాలంపాటు వాడుకున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో వీలు చిక్కినప్పుడల్లా కొన్ని తరాల జనం ఆ గుహ గోడలను బొమ్మలతో నింపేశారు. సాధారణంగా ఆదిమానవుల చిత్రాల్లో మనుషులకు మచ్చికయ్యే పశువుల చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యవసాయాన్ని ప్రారంభించిన తర్వాత తరం వారు ఎక్కువగా ఎద్దుల చిత్రాలు గీసేవారు, కొన్ని చోట్ల శునకాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ పశువుల చిత్రాలు లేకపోవటం విశేషం. దీన్నిబట్టి వ్యవసాయ విధానం ప్రారంభించకపూర్వంనాటి మనుషులు ఈ చిత్రాలు గీసి ఉంటారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇక మన దగ్గర కనిపించే చిత్రాలు ఎరుపు రంగులోనే ఉంటాయి. కానీ ఇక్కడ దాదాపు అన్ని చిత్రాలు ఎరుపు రంగుతోనే వేసినా, కొన్నింటికి తెలుపు రంగుతో అంచులు అద్దారు. మధ్య మధ్య తెలుపు రంగు చుక్కలతో ముస్తాబు చేసినట్టు ఉండటం విశేషం. ఆఫ్రికాలోని సాన్ థామస్ రివర్ ప్రాంతంలో కనిపించిన చిత్రాలను పోలి ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో రాళ్లపై గీతలతో చెక్కిన పెట్రో గ్లివ్స్ చిత్రాలు కూడా కనిపించాయి. కొన్ని అసంపూర్తి శిల్పాలు కూడా కానవచ్చాయి. తరువాతి పాలకులు ఇక్కడ ఏదో నిర్మాణం చేపట్టాలనుకుని కొంత పనిచేసి వదిలేసినట్టు అనిపిస్తోంది. ఈ రాతి చిత్రాల గుహ ఆదిమానవులపై ఎన్నో పరిశోధనలకు వీలుగా ఉన్నందున అది ధ్వంసం కాకుండా ప్రభుత్వం కాపాడాల్సి ఉంది. -
అనగనగా ఏడు ఊర్ల గవి
ఏడు ఊర్ల గవి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఏడు ఊర్ల జనాలు పట్టే విశాలమైన చీకటి గుహ అది. లోనికి వెళ్లడానికి చిన్న మార్గం. లోపల శివుడు,బసవేశ్వరుడి విగ్రహాలు. శివుడికి అభిషేకం చేస్తున్నట్లుగా గుహ పైభాగం నుంచి చుక్క చుక్క నీరు పడుతుండటం.. ఎవరో పరిచినట్లుగా బండరాయి ఉండటం. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అంతుచిక్కని మరో గుహ.. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఆ గుహను సందర్శించాలంటే గడివేముల మండలం పైభోగుల గ్రామ సమీపంలోని కొండకు వెళ్లాల్సిందే. కర్నూలు , గడివేముల:జిల్లాలో ప్రపంచ ఖ్యాతి పొందిన బెలుం గుహలతో పాటు బేతంచెర్ల సమీపంలోని ఎర్రజాల గుహలు, ప్యాపిలి ప్రాంతంలో వాల్మీకి గుహలు సహజ సిద్ధంగా ఏర్పడి పర్యాటకులను ఎంతోగాను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇలాంటి గుహలు జిల్లాలో చాలా ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో వెలుగులోకి రావడం లేదు. ఆ కోవకు చెందినదే ఏడు ఊర్ల గుహ. గడివేముల మండలం కె. బొల్లవరం – పైబోగుల గ్రామాల మధ్యలో ఉన్న కొండల్లో ఉన్న విశాలమైన గుహకు ఎంతో చరిత్ర ఉంది. ఈ గుహను ఇప్పటికీ ఎంతో మంది సందర్శించారు. ఇక్కడ పూర్వం జనం నివసించారు అని చెప్పేందుకు స్థానికుల్లో ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ కొండ ప్రాం తంలో గని రాజ్యం ఉండేది. ఆ కాలంలో దివిటీ దొంగలు పట్టపగలే దాడులు చేసి సంపన్నులు, పేదలు అందరినీ లూటీ చేసేవారు. వారి బారి నుంచి కాపాడుకునేందుకు సమీపంలోని ఏడు గ్రామాల ప్రజలు ఈ గుహలోకి చేరుకుని కొన్నాళ్ల పాటు ఇక్కడే తలదాచుకున్నారు. దీంతో ఈ గుహకు ఏడు ఊర్ల గవిగా పేరొందింది. విభూదమ్మతో వెలుగులోకి.. గని గ్రామానికి చెందిన విభూదమ్మ అవ్వను ప్రజలు మహిమాన్వితురాలిగా కొలిచారు. ఈమె తరచూ ఏడు ఊర్ల గవికి వెళుతూ ఉండేది. ఆ గుహలోనే నెలల తరబడి ఏమీ తినకుండా ధ్యానం చేస్తూ గడిపేది. గ్రామస్తులను ఆహ్వానిస్తూ అక్కడ పూజలు నిర్వహించేది. ఈమె మృతి చెందిన తర్వాత గని గ్రామంలో సమాధి చేసి పూజలు చేస్తున్నారు. అలాగే గని గ్రామానికి చెందిన యోగీశ్వరులు కూడా ఇక్కడే ధ్యానం చేసేవారు. చుట్టు పక్కల కొండల్లో ఎక్కడ చూసిన చుక్క నీరు దొరకదు. అయితే గుహలోని శివుని విగ్రహంపై మాత్రం చుక్క చుక్క నీరు పడుతుండటం విశేషం. ఏడాది పొడవునా ఆ ధార అలానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఏడు ఊర్ల గవితో పాటు లోపల మరొక గుహ ఉందని స్థానికులు చెబుతున్నారు. పెద్దదైన శివుని విగ్రహం, నీరు కాలువ రూపంలో పారుతుందని, ఈ నీరే పక్కనే ఉన్న ప్రసిద్ధ క్షేత్రం భోగేశ్వరస్వామి దేవాలయం కోనేరులోని నందినోటి నుంచి బయటకు వస్తుందని, ఈ కాలువలో జారవిడిచిన పిల్లనగోవి భోగేశ్వరంలో తేలిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ గుహ దారికి ఇరువైపులా అక్కడక్కడా దీపపు చెమ్మలు కనిపించాయని, అంటే ఈ దారి గుండా తీరం ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎలా వెళ్లాలి ? కర్నూలు నుంచి 45 కిలో మీటర్ల దూరంలో మండల కేంద్రం గడివేముల పరిధిలోని కె.బొల్లవరం, పైభోగుల గ్రామాల సరిహద్దుల్లో కొండల మధ్య ఈ గుహ ఉంది. గడివేముల నుంచి కె.బొల్లవరానికి చేరుకుంటే అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే గుహల వద్దకు చేరుకోవచ్చు. కార్తీకాల్లో పూజలు గుహ లోపల శివుడు, నంది విగ్రహాలు ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కార్తీకాలలో ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడే వన భోజనాలు చేస్తారు. కనీస వసతులు, రహదారి లేకున్నా పదుల సంఖ్యలో కుటుంబాలు ఎడ్ల బండ్లపై వచ్చి పండుగ చేసుకుంటారు. అటు పర్యాటకానికి... ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధే చెందే అవకాశాలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గుహ అద్భుతం గుహ ఎంతో అద్భుతంగా ఉన్నా అధికారులు పట్టించు కోవడం లేదు. ఇక్కడికి రావడానికి సరైనదారి లేదు. ఏటా కార్తీకాలను ఘనంగా చేస్తాం. ఏడు ఊర్ల గవి తర్వాత ఉన్న ఇంకో గుహను చూడటానికి ప్రయత్నించాం కానీ సాధ్యపడ లేదు. లోపల చూసివచ్చినోడు మరుజన్మ ఎత్తినట్టేరా అని మా గ్రామ పెద్దలు అనేవారు. ప్రభుత్వం పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గుహలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – చాకలి పుల్లయ్య, కె. బొల్లవరం గ్రామం సందర్శన సాహసమే ఏడు ఊర్ల గుహ మా పొలాలకు దగ్గర్లోనే ఉంది. గుహ దగ్గరికి వెళ్లడానికి దారి మా పొలాల గుండా మేమే ఏర్పరచుకున్నాం. ఒక సాధువుతో పాటు చిన్నప్పుడు మా సావాసాగాళ్లతో కలసి లోపలి గుహదారి వెంట పాక్కుంటూ చాలా దూరం వెళ్లాం. కేవలం ఒక మనిషి పాకడానికి మాత్రమే దారి ఉంటుంది. లోపల పెద్ద పెద్ద గుండ్రాళ్ల సందు నుంచి వెళుతూ ఉండాలి. ఎంత దూరం వెళ్లినా ఏం అంతుచిక్కగా వెనుదిరిగాం. గుహలో ఏం ఉందో మా పెద్దోల్ల మాటల్లో తప్ప మేం చూడలేకపోయాం. కానీ ఆ ఆశ మాత్రం అలాగే ఉంది. ఇప్పటికీ నీళ్లకోసం బయటి గుహలోకి వెళ్తూ ఉంటాం. –సత్యాలు, పైబోగుల గ్రామం నీటి ధార విచిత్రం మేం గొర్రెలు కాసేటపుడు నీటి కోసం గుహలోపలికి వెళ్లి వచ్చే వాళ్లం. ఈ కొండ ప్రాంతంలో ఎక్కడా చుక్కనీరు దొరకక పోయినా ఈ గుహలో స్వచ్ఛమైన నీరు దొరకడం విచిత్రం. మేము వయసులో ఉన్నప్పుడు లోపలి గుహలో ఏం ఉందో చూడాలని అందరం ప్రయత్నించినోళ్లమే. విభూదమ్మ అవ్వ అక్కడే ఒంటరిగా నెలల తరబడి ఉండేది. –వెంకటయ్య, కె.బొల్లవరం అభివృద్ధికి కృషి చేస్తాం ఏడు ఊర్ల గవి ప్రాంతం మా దృష్టిలో ఉంది. జిల్లాలో ఇటువంటివి ఇంకా అనేకం వెలుగులోకి తేవాలి. ఇందుకు పలు ప్రభుత్వ శాఖల సహకారం అవసరం. దీంతో కొంత జాప్యమయ్యే అవకాశం ఉంది. స్థానికుల సహాయ సహకారాలు ఉంటేనే మేము ఏదైనా చేయగలం. త్వరలో ఆ ప్రాంతాన్ని సందర్శించి గృహ అభివృద్ధికి గ్రామస్తులతో చర్చిస్తాం. – బి.వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక అధికారి -
మూతపడ్డ గుంటుపల్లి బౌద్ధ గుహలు
పశ్చిమగోదావరి, కామవరపుకోట: ప్రఖ్యాతిగాంచిన గుంటపల్లి బౌద్ధ గుహలు మూతపడ్డాయి. గత నెల 24న శ్రీధరణి హత్య ఘటన అనంతరం గుంటుపల్లి బౌద్ధ గుహల సందర్శనను అధికారులు నిలిపివేశారు. హత్య ఘటన నేపథ్యంలో పోలీసులు ఆధారాల సేకరణ తదితర విషయాలతో సందర్శనను ఆపేశారు. క్లూస్ టీమ్‌తో పాటు మహిళా కమిషన్ సభ్యులు, ఇతర అధికారులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. సందర్శకులు ఈ ప్రాంతానికి వస్తే రద్దీ పెరగడంతో పాటు ఆధారాలు కనుమరుగయ్యే అవకాశం ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బౌద్ధ గుహలను మూసివేసినట్టు సిబ్బంది తెలిపారు. తిరిగి ఉత్తర్వులు ఇచ్చే వరకు సందర్శకులను అనుమతించమని వారు చెప్పారు. -
అరుదైన గుహాలయాలు
సాక్షి, హైదరాబాద్: పురావస్తు శాఖ నిర్లక్ష్యం, గ్రామస్తుల అవగాహనా రాహిత్యంతో దేశంలోనే చారిత్రక ప్రదేశంగా పేరొందాల్సిన అడవి సోమనపల్లి గుహాలయాలు వాటి సహజత్వం కోల్పోయాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే స్వచ్ఛందంగా అభివృద్ధికి పూనుకున్నారు. అవగాహనా లోపం తో వందల ఏళ్ల నాటి గుహలు అందంగా కనపడాలనే ఉద్దేశంతో సున్నం వేశారు. దాంతో వాటి సహజ అస్తిత్వం కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ఒకటిగా పేరొందాల్సిన ఆలయం ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో విస్తరించిన అడవుల్లో ఉన్న ప్రాచీన సంపదపై సాక్షి ప్రత్యేక కథనం.. కొండను తొలిచి..అందంగా మలిచి.. మంథనికి 22 కిలోమీటర్ల దూరంలోని అడవి సోమన పల్లి గుట్టపై శిలను తొలిచి నిర్మించిన నాలుగు గుహాలయాలు ప్రాచీన భారతీయ వాస్తు శిల్పానికి చిహ్నాలుగా నిలిచాయి. తాడిచెర్ల వద్ద బస్సు దిగి, దట్టమైన అర ణ్యం గుండా నాలుగు కిలోమీటర్లు కాలినడకన ప్రయా ణించి ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. కొండపై ఉన్న పెద్ద శిలను తొలచగా ఏర్పడిన ఈ నాలుగు గుహలు పడమటి ముఖాన్ని కలిగి మానేరు నదికి ఎదురుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే ప్రకృతి దృశ్యాలు రమణీయంగా కనిపిస్తాయి. స్థానికంగా నైనిగుళ్లు అని పిలువబడే ఈ శివాలయాల కొలతలు ఒక్కరీతిగా లేవు. నాణ్యమైన శిల కాకపోవడం, శతాబ్దాల తరబడి మానేరు నది నుంచి వీచే చల్లని గాలులకు తట్టుకోలేక ఈ గుహాలయాలు క్రమేణా శిథిలమవుతున్నాయి. విజయవాడకు సమీపంలోని మొగల్రాజపురంలో చెక్కబడిన విష్ణుకుండినుల కాలపు గుహాలయాల వలె ఇక్కడి గుహాలయాలు కూడా గర్భగృహం, దాని ముందు మంటపమున్నట్లు తొలచబడిఉన్నాయి. ఆకర్షించే వర్ణ చిత్రాలు ఈ మండపం గోడలు ఎలాంటి అలంకారాలు లేకుండా సాదాగా ఉన్నా, మంటపం పైకప్పు (సీలింగ్) సన్నని సున్నపు పొరతో చదును చేయబడి, దానిపై వర్ణచిత్రాలున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రాల పొరలు కాలక్రమేణా ఊడిపోయి ప్రస్తుతం నలుపు, ఎరుపు, నీలం, పసుపు పచ్చని రంగులలో కొన్ని అస్పష్టమైన గుర్తులు మిగిలాయి. అక్కడక్కడ మిగిలిన వర్ణచిత్రాలలో నర్తకి, యుద్ధ దృశ్యాలు, అశ్వ రథాలు విలుకాండ్రు, రాజభవనాలు చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ గుహలకు ముందున్న గోడపై పదవ, 11వ శతాబ్దపు తెలుగు లిపి లక్షణాలతో రెండు చిన్న శాసనాలున్నాయి. మొదటి అసంపూర్ణ శాసనంపై ఎక్కుటేవిమున అనే వ్యక్తి శివలింగానికి రామేశ్వరుడని నామకరణం చేసి దేవుని ప్రతిష్టించాడని, కెంపెన అనే వ్యక్తి రాతిని తొలచినట్లు తెలపబడింది. రామేశ్వరుని ఆల య ధూపదీప నైవేద్యాలకు పెనుకంటి ముచ్చిరెడ్డి అనే వ్యక్తి భూదాన మిచ్చినట్లు రెండో శాసనం తెలుపుతుంది. ఈ గుహాలయాలు విజయవాడకు సమీపాన ఉండవల్లి కొండలపై ఉన్న గుహాలయాలను పోలిఉన్నాయి. కానీ వీటిని ఉండవల్లిలోని 5 అంతస్తులు అనంతశయన గుడితో పోల్చలేమని, కళారీతులను బట్టి ఈ గుహలు క్రీ.శ ఏడో, 8వ శతాబ్దాలకు చెందినవని చారిత్రక పరిశోధకులు ఎన్.ఎస్ రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చారిత్రక కట్టడాలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య పేర్కొన్నారు. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ, రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ ఈ ప్రదేశం వివరాలు లేవని చెప్పారు. ఇప్పటికైనా పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని తన పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. చెదిరిపోతున్న శాసనాలు శివరాత్రి వేడుకల సందర్భంగా గ్రామస్తులు ఈ ఆలయ అభివృద్ధి కోసం పూనుకున్నారు. ఆలయానికి వెళ్ళేందుకు అనుగుణంగా నడక దారిని ఏర్పాటు చేసుకున్నారు. పురావస్తు శాఖ పట్టించుకోక పోవడం, చారిత్రక సంపదపై అవగాహన లేకపోవడంతో గుహలకు సున్నం వేశారు. దీనివల్ల గుహల పైభాగంలో ఉన్న రాతి చిత్రాలు పాడవ్వడమేకాక, దాని చారిత్రక ప్రాధాన్యం కోల్పోయింది. ఇంత ప్రాచీన చరిత్ర, ప్రాధాన్యత కలిగిన ఈ గుహల వివరాలు అటు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో కానీ, ఇటు రాష్ట్ర పురావస్తు శాఖలోకానీ లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు. అభివృద్ధి మాట అటుంచి కనీసం ఇలాంటి ప్రాంతం ఒకటుంది అన్న విషయం చుట్టు పక్కల గ్రామాల ప్రజలకి సైతం తెలియకపోవడం శోచనీయం. రాష్ట్ర పురావస్తు శాఖ ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, మరోసారి సున్నం, రంగులు వేయకుండా చర్యలు చేపట్టాలని పలువురు చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు . -
అట్టడుగు అద్భుతం.. బయటపడింది!
భూమిపైనేకాదు.. సముద్రంలోనూ గుహలుంటాయనే విషయం మీకు తెలుసా? మెక్సికోలో బయటపడ్డ ఓ గుహ గురించి తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఇది చదవండి! మెక్సికో: మనదేశంలో ఎన్నో దేవతా విగ్రహాలు గుహల్లో కొలువయ్యాయి. అయితే వాటి పొడవు కొన్ని మీటర్లు మాత్రమే. అప్పుడప్పుడూ విహారయాత్రకు వెళ్లినప్పుడు ఇంకాస్త పొడవుగా ఉండే బొర్రా గుహల్లాంటివి చూసుంటాం. ఇక ప్రపంచంలో ఇప్పటిదాకా డోస్ ఓజోస్ గుహలే పెద్దవనుకున్నారు. వీటి పొడవు 83 కిలో మీటర్లు. ఈ మధ్య మెక్సికోలో తులుమ్ దగ్గర బయటపడ్డ గుహే పెద్దదనుకున్నారు. దీని పొడవు 268 కిలోమీటర్లు. అయితే ఇవన్నీ భూమిపై ఉన్న గుహలు మాత్రమే. కానీ సముద్రంలోనూ ఓ పే..ద్ద గుహ బయట పడింది. ఈ అద్భుతమైన గుహను మెక్సికో శాస్త్రవేత్తలే ప్రపంచానికి పరిచయం చేశారు. అది ఎక్కడంటే మెక్సికో సముద్ర తీరంలో ఈ గుహను గుర్తించారు. సముద్రంలో నీళ్లలో ఉండే గుహల్లో ఇదే పొడవైనదట. దీని పొడవు ఏకంగా 347 కిలోమీటర్లుందని తెలిసిన తర్వాత శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. సరదాగా డైవర్లు సముద్రంలో చక్కర్లు కొడుతుంటూ ఈ గుహ బయటపడింది. దాని పై భాగం అంతా ఎంతో చిత్రంగా అనిపించింది. రాయి కరిగి కిందికి కారుతోందా అన్నట్లుంది. వెళ్లే కొద్దీ లోపలికి దారి కనిపిస్తూనే ఉంది. దీంతో పరిశోధనలు చేయడానికి సంసిద్ధమై.. ముఖానికి ఆక్సిజన్ సిలిండర్లు, చేతికి లైట్లున్న గ్లౌజులు వేసుకొని పరిశోధన కొనసాగించారు. ఇదే పెద్ద గుహ అని నిర్ధారించుకున్న తర్వాత దానికి డోస్ ఓజోస్ కేవర్న్ సిస్టమ్ అని పేరూ పెట్టారు. 20 ఏళ్ల పరిశోధన... యుకటన్ ద్వీపకల్పంలో మిస్టరీగా మారిన ఇలాంటి గుహలపై 20 ఏళ్లుగా రాబర్ట్ స్కిమిట్నర్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. చివరకు గామ్ బృందం(పురాతత్వ పరిశోధన సంస్థ) సహకారంతో.. కొందరు స్కూబా డైవర్లను లోపలికి పంపి ఆయన ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. 10 నెలల నిరంతరాయ పరిశోధన తర్వాత వేల సంవత్సరాల నాటి శిలాజాలు లభించగా.. వాటిని చరిత్రకారులు పరిశీలిస్తున్నారు. -
అందాల బాదామి గుహలు
బాదామి క్షేత్రం బీజాపూర్ నుంచి హుబ్లీ వెళ్లే దారిలో ఉంది. ఇక వీటి విశిష్టత గురించి చెప్పాలంటే... ఇవి మనదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే ప్రసిద్ధగుహలు. ఎర్రని రాతితో ఉండే ఈ గుహలు చూపరులను ఆకర్షిస్తాయి. ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా పేరు పొందిన ఈ ప్రదేశం ఒకప్పుడు తూర్పు చాళుక్యులకు నివాస స్థలం. చాళుక్యుల శిల్పకళాభిరుచికి ఈ గుహలు చక్కని ఉదాహరణ. నటరాజస్వామి, మహిషాసుర మర్దిని, గణపతి, నెమలి వాహనంపై కుమారస్వామి, విష్ణుమూర్తి శిల్పాలు మనోహరంగా ఉంటాయి. జైనమతానికి చెందిన ప్రసిద్ధ వ్యక్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. జైనతీర్థంకరులు ఇక్కడ నివసించారని ప్రతీతి. సుందర పర్యాటక క్షేత్రం ఇది. విశాలమైన గుహలు, ఆలయాలతోపాటు పెద్ద సరోవరం ఉన్న అందమైన గుహలు ఇవి. బాదామిలో రైల్వే స్టేషన్ ఉంది. రైల్వేస్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో బాదామి గుహలు ఉన్నాయి. ఇక్కడికి చేరడానికి బాగల్కోట్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. బాగల్కోట్ నుంచి బాదామికి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బాదామిలో వసతి సదుపాయాలు ఉండవు. కాబట్టి బాగల్కోట్లో బస చేసి రోడ్డు మార్గంలో బాదామి గుహలను చేరడం అనువుగా ఉంటుంది. -
గూడు సమాధుల గుట్టు వీడనుంది!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు వందల నిర్మాణాలు.. గుట్టలపై, దట్టమైన అడవిలో రాతి గుహల్లాంటి ఏర్పాట్లు.. చిన్న ద్వారం, తొంగి చూస్తే రాతి తొట్లు.. చుట్టూ భారీ రాతి గుండ్లతో కంచె.. కచ్చితమైన వృత్తా కారంలో ఏర్పాటు.. ప్రతి నిర్మాణం ముందు మానవాకృతిని సూచించే భారీ శిలలు.. వరం గల్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి తీరం వెంట కనిపించే ఆది మానవుల సమాధుల ప్రత్యేక తలివి. ఇప్పటికీ ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా సమాధి నిర్మాణాలను గుర్తించలేదు. తెలంగాణ చరిత్రకే పరిమితమైన అరుదైన ఈ నిర్మాణాల గుట్టు వీడనుంది. గతంలో అమెరికాకు చెందిన శాన్‌డియాగో విశ్వవిద్యాల యం ప్రొఫెసర్ థామస్ ఇ లెవీ ఆధ్వర్యంలోని బృందం ఈ సమాధులను పరిశీలించి.. ఇవి ఈ ప్రాంతానికే ప్రత్యేకమైనవిగా తేల్చారు. వీటి నిగ్గు తేల్చేందుకు లైడార్ సర్వే చేస్తామనీ ప్రకటించారు. తాజాగా భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ఈ సమాధుల నిగ్గు తేల్చేందుకు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఖమ్మం జిల్లా పినపాక మండలం జానంపేట వద్ద తవ్వకాలు మొదలు కాబోతున్నాయి. తెలంగాణలో చాలాకాలం తర్వాత ఏఎస్ఐ చేపట్టే భారీ అన్వేషణ ఇదే. రాతిని తొలిచిన తొలి కాలం అదేనా? రాతిని తొలిచి ఆకృతిగా మలచటం క్రీస్తుపూర్వం 2 వేల ఏళ్ల క్రితం సింధూ నాగరి కతలో కనిపించిందని చరిత్ర చెబుతోంది. స్థాని కంగా క్రీస్తుపూర్వం 300 ఏళ్లనాడు మౌర్యుల కాలంలో ఆ తరహా శిల్పకళా వైభవం కనిపిం చింది. మరి ఈ రెండింటి మధ్య కాలంలో ఏం జరిగిందన్న దానికి స్పష్టమైన సమాచారం లేద ని నిపుణులు చెబుతారు. కానీ వరంగల్, ఖమ్మం మధ్య గోదావరి తీరంలో విస్తరించిన అడవులు, గుట్టలపై విస్తారంగా ఉన్న ఆది మానవుల సమాధులను పరిశీలిస్తే.. రాళ్లను ఆకృతిలోకి మలిచిన దాఖలాలు కనిపిస్తాయి. ఇవీ క్రీస్తుపూర్వం 1000–600 ఏళ్ల మధ్యనాటి వని ప్రాథమిక అంచనా ఉంది. ఇదే నిజమైతే సింధూ నాగరికత అంతరించాక రాతిని తొలిచి ఆకృతులుగా చెక్కిన కాలం ఇక్కడ నుంచి మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలా చెక్కారు? ఇక్కడి గుట్టల్లో, దట్టమైన అడవుల్లో వేల సం ఖ్యలో ఆది మానవుల సమాధులు విస్తరించి ఉన్నాయి. నాలుగైదు అడుగుల విస్తీర్ణంలో ఉండే పెద్ద పెద్ద బండరాళ్లు నిలిపి ఉంటాయి. వాటి వెలుపలి భాగం అర్ధ చంద్రాకారంలో చెక్కి ఉంటుంది. అన్ని రాళ్ల ఆకృతిని కలిపితే సంపూర్ణ వృత్తాకారంగా కనిపిస్తుంది. ఈ రాళ్ల మధ్య పది పదిహేను అడుగుల వెడల్పున్న గూడు ఉంటుంది. దానికి చిన్న ద్వారంతో పాటు లోపల ఏడెనిమిది అడుగుల పొడవున్న రాతి తొట్టి ఉంటుంది. అందులో మానవ అవశే షాలను గుర్తించారు. ఇక సమాధి ముందు అది ఎవరి సమాధి అని తెలిపేలా స్త్రీ/పురుష ఆకృతి లో ఎత్తయిన రాతి శిల పాతి ఉంటుంది. ఇనుము వాడిన దాఖలాలు నిజాం హయాంలో 1940–41 సమయంలో నాటి పురావస్తు శాఖ ఉన్నతాధికారి ఖాసీ మహ్మద్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాల్లో తవ్వకాలు జరిగాయి. ఆ సమయంలో గుర్రాల ముక్కుకు బిగించే ఇనుప వస్తువులు, నాగలికి ఏర్పాటు చేసే పరికరాలను, కొన్ని మట్టిపాత్రలు, ఇతర ఆకృతులు, ఆయుధాలను గుర్తించారు. ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ ఈ సమాధుల గుట్టు విప్పేందుకు పినపాక మండలం జానంపేట ప్రాంతాన్ని కేంద్ర పురావస్తు శాఖ తన అధీనంలోకి తీసుకుంది. కొన్ని వందల ఎకరాల ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా నిర్ధారించింది. ఆధునిక పద్ధతుల్లో, డీఎన్ఏ పరీక్షలను ఉపయోగించి ఆ సమాధులు ఏ కాలానికి చెందినవి, నాటి మనుషుల జీవన శైలి ఏమిటి, వారు స్థానికులేనా, వేరే ప్రాంతం నుంచి వలస వచ్చారా, ఇప్పుడు ఆ జాతి కొనసాగుతోందా, ఉంటే ఎక్కడ మనుగడలో ఉందన్న వివరాలను తేల్చనుంది. ఇది విదేశీ పరిశోధకులు, పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందని ఏఎస్ఐ భావిస్తోంది. -
సుందర గుహాలయాలు
ఉండవల్లి గుహలు గుంటూరు నుంచి 30 కి.మీ. విజయవాడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి మొదట బౌద్ధానికి సంబంధించినవి. తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మలినిర్మాణం 6–7 శతాబ్దాల కాలంలో జరిగింది. గుహాలయాల మొదటి అంతస్తు సంపూర్ణంగా లేదు. రెండవ అంతస్తు త్రికూటాలమయం. మూడవ అంతస్తు అనంత శయన విష్ణుమూర్తి, పన్నిద్దరాళ్వార్లు, ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి. నాలుగవ అంతస్తులో పూర్తి కాని త్రికూటాలయం ఉంది. వీటిలోని శిల్పకళారీతుల ఆధారంగా చాళుక్యరాజుల కాలం నాటివిగా తెలుస్తోంది. శనిదోషాలను నివారించే విదురాశ్వత్థ వృక్షం విదురుడు నాటిన రావిచెట్టు కాబట్టి దీనికి విదురాశ్వత్థ వృక్షం అని పేరు వచ్చింది. ఈ చెట్టు ఉన్న ప్రదేశం కాబట్టి ఆ ఊరికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చింది. ఈ విశాలమైన వృక్షరాజాన్ని అత్యంత మహిమాన్వితమైనదిగా భావిస్తారు. కావేరి, ఆర్కావతి నదుల సంగమస్థానం ఇది. మహాశిల్పి జక్కన, టిప్పుసుల్తాన్‌లు ఈ క్షేత్రంలో పుట్టారని అంటారు. వృక్షం మూలభాగం బ్రహ్మరూపమని, మధ్యభాగం విష్ణురూపం అని, అగ్రభాగం శివరూపం అని భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా పేరు పొందిన వృక్షం ఇది. విష్ణు అంశ గల చెట్టు ఇది. శని దృష్టి సంబంధితమైనందు వల్ల శనివారం రోజు ఈ క్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకుంటారు. శనివారం తప్ప ఇతర రోజుల్లో ఈ వృక్షాన్ని తాకరు. భూత ప్రేతపిశాచ రోగాలు, సంతానహీనత తొలగించే వృక్షం. శనిదోషాలతో బాధపడేవారు దీని దర్శనం చేసుకుంటే శాంతి సుఖాలు పొందుతారని విశ్వాసం. సోమేశ్వరం, గణేశుడు, లక్ష్మీనారాయణుడు, ఆంజనేయ స్వామి ఆలయాలతోపాటు వేలకొలదీ నాగ ప్రతిమలు దర్శనమిస్తాయి. బెంగళూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూపురం నుంచి కూడా ఈ క్షేత్రానికి బస్సులు ఉన్నాయి. కానీ వసతి సౌకర్యాలు ఉండవు. -
మైలారం నల్లగుట్టలో ప్రకృతి వింత
3.5 కిలోమీటర్లు పొడవైన గుహలు ⇒ బొర్రా గుహలకు సరిజోడు ⇒ అడ్వంచర్ టూరిజానికి అడ్రస్ ⇒ అభివృద్ధికి కసరత్తు సాక్షి, భూపాలపల్లి: అమర్నాథ్ శివలింగాన్ని తలపించే విధంగా సున్నంతో వెలిసిన లింగం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూ సింది. ఇటీవల తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో గణపురం మండలం మైలారం సమీపంలో ఉన్న నల్లగుట్టలో ఉన్న సున్నపు గుహల్లో పరిశీలించిగా శివలింగాన్ని పోలిన ఆకారం బయటపడింది. అక్కడి వారికి ఈ గుహల గురించి ఎప్పటి నుంచో తెలిసిన స్థానికంగా ఉంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు సదానందం గతేడాది ఈ గుహల గురించి ప్రపంచానికి తెలియజేశారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, పర్యాటకశాఖ అధికారులు సందర్శించారు. ఇటీవల తెలంగాణ పర్యాటకశాఖ ప్రోత్సాహంతో నలభై మందితో కూడిన తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సభ్యులు ఈ గుహల్లో అనువణువు గాలించగా పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. శివుడి లింగం, ఆవు పొదుగు, నగిషీలు, ఎగిరే పక్షులు, నేల మీద వాలిన డేగ, సింహం, మానవ ముఖం వంటి పలు ఆకృతుల్లో సహజ సిద్ధంగా ఏర్పడ సున్న పు శిలలు వెలుగు చూశాయి. గుహల్లో అనేక దారులు మైలారం నల్లగుట్ట నుంచి గుహల్లోకి వెళ్లడానికి అనేక దారులు ఉన్నాయి. నల్లగుట్టలకు పడమ టి వైపున ఉన్న మార్గం సహజసిద్ధమైన కోట మార్గంలా ఉంది. మిగిలిన వైపులా మానవ ని ర్మిత కట్టడాలు ఉన్నాయి. లోనికి మార్గాలు చిన్నగా ఉన్నప్పటికీ వెళ్లిన తర్వాత గుహలు చాలా పెద్దగా ఉన్నాయి. నల్లగుట్టల్లో ఉన్న సున్నపు గుహలు దాదాపు 3.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. గుహల ఎత్తు 5 నుంచి 100 అడుగులు ఉండగా వెడల్పు 10 నుంచి 100 అడుగులుగా ఉంది. కొన్ని గుహ లు విశాలమైన గదుల మాదిరిగా ఉన్నాయి. కొన్ని గుహల్లోకి గాలి, వెలుతురు దారళంగా వస్తుండగా కొన్ని గుహలు చిమ్మ చీకట్లో గబ్బిలాల ఆవాసాలుగా ఉన్నాయి. లోపల సగటు ఉష్ణోగ్రత 25 సెల్సియస్ డిగ్రీలుగా ఉంది. తేమ ఎక్కువగా లేదు. గుహల్లో కొన్ని చోట్ల పాకుతూ వెళ్లాలి. ఆదిమానవుల ఆనవాళ్లు గుహల్లో నీటి వనరుల ఆనవాళ్లు ఉండటాన్ని బట్టి ఇది ప్రాచీన కాలంలో ఆదిమానవుల ఆవాసమై ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా బృందం జరిపిన పర్యటనలో సున్నపు గుహల్లో ఆదిమానవులు కాలం నాటి పలు ఉపకరణాలు, నాటి అవశేషాలు లభించాయి. వీటిలో రాతి గొడ్డళ్లు, రాతి సుత్తెలు, గీకుడు రాళ్లు, కుండ పెంకులు, మట్టి పాత్రలు ఉన్నాయి. కొన్ని రాళ్ల మీద చిత్రాలు కనిపించాయి. ఈ గుహల్లో కొన్ని ఎముకలు లభించాయి. వీటిని పరిశోధన నిమిత్తం సీసీఎంబీకి పంపారు. విస్తీర్ణంలో బొర్రా గుహల కంటే పెద్దగా ఉన్న మైలారం సున్నపు గుహలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. లింగాకృతి... ఏడాది కిందట సున్నపు గుహలు వెలుగులోకి వచ్చినా వీటిని పూర్తిగా ఎవరూ చూడలేదు. ఇటీవల తెలంగాణ సోషల్ మీడియా సభ్యులు ఈ సాహసానికి ఒడిగట్టారు. మొత్తం నలభై మంది సభ్యుల బృందంలో నలుగురు సభ్యులు టార్చిలైటు వెలుతురులో గుహల్లో ఉన్న సన్నని మార్గాల గుండా పాకుతూ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఇందులో ఓ గుహలో శివలింగం ఆకృతి వెలుగు చూసింది. ఈ లింగం అమర్నాథ్ లింగాన్ని పోలి ఉండటం విశేషం. మైలారం నల్లగుట్ట సున్న పు గుహల్లో ఆకట్టుకునే ఆకృతులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. నల్లగుట్ట ఆర్కియన్ శిలలతో ఏర్పడింది. వర్షపు నీటిలో ఉండే సహజమైన ఆమ్లతత్వం కొండ రాళ్లలో ఉండే సున్నాన్ని కరిగించడం వల్ల సున్నపు రాళ్ల కొండలో గుహలుగా ఏర్పడ్డాయి. పై నుంచి కారిన సున్నపు అవక్షేపాలు గట్టి పడి గుహల గోడల పై వివిధ ఆకృతులుగా మారాయి. ఇవి నేలదాక చేరితే స్తంభాలుగా మా రిపోతాయి. నేల మీదకు చేరిన అవక్షేపాలు ముద్దగా మారి పలు ఆకృతులు సంతరించుకుంటాయని చెబుతున్నారు. -
బెలుం గుహల్లో విదేశీయుల బృందం
కొలిమిగుండ్ల: ప్రఖ్యాత బెలుం గుహలను శనివారం విదేశీయులు తిలకించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమాల అమలు తీరును అధ్యయనం చేసేందుకు అల్జీరియా, సూడాన్, ఇథోఫియా, ఘనా, మారిషస్, నేపాల్, లిబియా, సిరియా,టాంజానియా తదితర.. 14 దేశాల నుంచి 28 మంది వచ్చారు. బెలుం గుహలో పలు ప్రదేశాలను తిలకించారు. వారి వెంట ఎన్ఐఆర్డీ అధికారి నరసింహులు, ఆర్‌డబ్లూఎస్ ఈఈ వెంకట రమణ, ఎస్ఈ వీరభద్రరావు, డీఈ ఉమామహేశ్వరరావు ఉన్నారు. -
తారల గుహలు.. సాహస దారులు
సాక్షి, స్కూల్ ఎడిషన్: ఆకాశంలో నక్షత్రాల్ని అందుకోవాలనే ఉబలాటం.. అరుదైన ప్రదేశాల్లో సాహస యాత్రలు చేయాలనే ఆరాటం.. ఈ రెండు ఆశలూ ఉన్నవారికి న్యూజిలాండ్‌లోని వైటొమొ గుహలు స్వాగతం పలుకుతాయి. ఆ గుహల లోపలికి వెళ్తే సందర్శకులు వింత అనుభూతికి లోనవడం ఖాయం. ప్రపంచంలోని అనేక చోట్ల గుహలున్నా అరుదైన సాహసాలకు ఇవి పేరెన్నికగన్నవి. ముఖ్యంగా అక్కడ రాతి గోడలపై దర్శనమిచ్చే తారలు (మిణుగురు పురుగులు) మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఇలాంటి అనేక వింతలు కలిగిన ‘వైటొమొ’ గుహలకు సంబంధించిన విశేషాలు ఈరోజు తెలుసుకుందాం... ఎక్కడున్నాయి.. న్యూజిలాండ్‌లోని ఉత్తర ద్వీపంలోని కింగ్కౌంటీకి సమీపంలో టెకుయిటి అనే పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలున్నాయి. కొన్ని గుహలోపల నదులు కూడా ప్రవహిస్తుంటాయి. అలాంటికోవకు చెందినదే ఈ ‘వైటొమొ’. స్థానిక మావోరి భాష నుంచి ‘వైటొమొ’ అనే పేరు వచ్చింది. ఆ భాషలో వైటో అంటే నీరు, మొ అంటే గుహ. నీళ్లు ఉండే గుహ అని ‘వైటొమొ’కి అర్థం. వీటిని అక్కడి ప్రభుత్వం పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసింది. ఇక్కడి వింతలను చూడడానికి, సాహసకృత్యాలు చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో ఇది న్యూజిలాండ్‌లో అత్యంత ఆదరణ పొందిన పర్యాటక ప్రదేశంగా పేరుపొందింది. పురాతన గుహలు.. ఇక్కడి అన్ని గుహలు అతి పురాతనమైనవి. దాదాపు 3 కోట్ల సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అంచనా. 19వ శతాబ్దం చివరలో వీటిని స్థానికులు గుర్తించారు. 1910వ సంవత్సరం నుంచి ఇది పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందడంతో అప్పటినుంచే సందర్శకుల రాక పెరిగింది. సముద్రంలోని సున్నపురాయి నిక్షేపాలు నీటి తాకిడికి గురవ్వడం వల్ల ఈ రాతి గుహలు ఏర్పడ్డాయి. మొత్తం 300 వరకు గుహలు ఇక్కడ ఉన్నాయి. మిణుగురులే ఆకర్షణ.. ఈ గుహ అనేక అద్భుతాలతో కూడుకుని ఉన్నప్పటికీ ప్రధానాకర్షణ మాత్రం ఇక్కడి రాతి గోడలపై కనిపించే మిణుగురు పురుగులే. అందరూ వాటిని ఎప్పుడో అప్పుడు చూసి ఉండొచ్చు. కానీ వేలు, లక్షల సంఖ్యలో ఒకేసారి, ఒకేచోట ఇలా దర్శనమివ్వడం మాత్రం చాలా అరుదు. గుహ లోపలికి వెళ్లినవారు వాటిని చూస్తూ ఆకాశంలో నక్షత్రాలకి దగ్గరగా ఉన్నామనే అనుభూతిని పొందుతారు. నీలి, ఆకుపచ్చ రంగులో మిణుగురులు మెరుస్తూ కనిపిస్తాయి. లోపల చాలాదూరం ప్రయాణించినా ఇవి కనిపిస్తూనే ఉంటాయి. చీకటిలోనే నివసించగలవు కాబట్టి మిణుగురులు ఈ గుహల్లో జీవిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఆవాసం ఏర్పర్చుకున్న మిణుగురు పురుగులను కాపాడేందుకు, గుహను సంరక్షించేందుకు సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. భూ గర్భంలోనూ... ఈ గుహలోపల ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి. లోపలికి వెళ్తే అనేక జలపాతాలు, సున్నపురాతి గోడల మధ్య ఏర్పాటు చేసిన బ్రిడ్జి, మ్యూజియమ్లు ఉన్నాయి. అన్నింటికీ మించి గుహ భూ గర్భంలో ప్రవహించే నీటిపై సాగే సాహసాలు మరో ఎత్తు. సముద్రంలో, నదుల్లో పడవలపై విహరించేవారికి భూ గర్భంలోపల ఉన్న ఈ నదిలో పడవ ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుంది. ఈ నీటిలో ఈతకొట్టే సదుపాయం కూడా ఉంది. గుహ బయట ట్రెక్కింగ్‌తోపాటు, దీని పైభాగంలో గుర్రపు స్వారీ చేసే సదుపాయం కూడా ఉంది. ఇటీవల విడుదలైన ఓ చిత్రంలో హీరో రెండు జలపాతాల మధ్య తాడు పట్టుకుని పైకి ఎగబాకుతుంటాడుగా.. అచ్చం అలాంటి సాహసాలు ఇక్కడ నిత్యం అనేక మంది చేస్తుంటారు. ధైర్యం ఉండాలే కానీ గుహ కింది భాగం నుంచి తాడు ద్వారా శిఖరం వరకు చేరుకోవచ్చు. గుహ పైకి దాదాపు 110 మీటర్ల ఎత్తు వరకు ఎగబాకాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో సూచనలివ్వడానికి నిపుణులు దగ్గరే ఉంటారు. మరిన్ని ప్రత్యేకతలు.. గుహ లోపల మాత్రమే కాక బయట కూడా అనేక ఆకర్షణలు ఈ ప్రాంతం సొంతం. గుర్రపుస్వారీ చేస్తూ అందమైన ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇక్కడ నిర్మించిన మేగ్నఫో నేచురల్ బ్రిడ్జి, అరాన్యు, రౌకురి గుహలు కూడా సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవే కావడంతో ప్రతియేటా భారీ సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. -
‘ఆదిమ’ గుహలను మింగిన క్వారీలు
కోకాపేట గుహల్లో అద్భుత వర్ణ చిత్రాలు మూడున్నర వేల ఏళ్ల క్రితం నాటి ఆధారాలు 35 ఏళ్ల క్రితమే గుర్తించిన నాటి పురావస్తు డెరైక్టర్ కృష్ణశాస్త్రి ఆ తర్వాత పట్టించుకోని ప్రభుత్వాలు క్వారీలతో ధ్వంసమైన గుట్టలు, కనుమరుగైన చిత్రాలు మూడొంతులు పోగా మిగిలినవి కొన్నే హైదరాబాద్ శివారులోనే మసకబారుతున్న ఆదిమ చరిత్ర సాక్షి, హైదరాబాద్: మానవ పరిణామక్రమాన్ని తెలుసుకునేందుకు ఆదిమ కాలం నాటి ఆధారాలే కీలకం. అందుకే అలాంటి ఆనవాళ్లున్న ప్రదేశాలను ప్రభుత్వాలు పదిలంగా కాపాడుతుంటాయి. అవి పరిశోధకులకు, పర్యాటకులకు కేంద్రంగా నిలుస్తాయి. అప్పటి గుహలు, సమాధుల్లో లభించే ఆధారాలే నేటి తరానికి గొప్ప వారసత్వ సంపద. హైదరాబాద్ శివారులోనే ఉన్న అలాంటి ప్రాం తం క్రమంగా కాలగర్భంలో కలి సిపోతోంది. అది నిర్దాక్షిణ్యంగా క్వా రీల పాలైంది. అక్కడి అతి అరుదైన, పురాతన సాక్ష్యాలన్నీ ధ్వంసమయ్యాయి. దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. దీంతో దాదాపు 3500 సంవత్సరాల క్రితం నాటి ఆదిమ మానవులు గీసిన ‘చిత్ర’ విన్యాసాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ధ్వంసమైందిలా... క్రమంగా నగరం విస్తరించడంతో గండి పేట చుట్టూ నివాసాలు వెలిశాయి. ఈ క్రమంలో ఆదిమానవుల చిత్రాలున్న గుట్టలు క్వారీలకు బలయ్యాయి. అయితే ఆదిమానవుల చిత్రాలున్న ఓ గుహను స్థానికులు పురాతన ఆలయంగా భావించేవారు. దాన్ని కూల్చితే అరిష్టం జరుగుతుందని భావించి ఆ ఒక్క దాన్ని మాత్రం వదిలి మిగతా గుట్టను పూర్తిగా ధ్వంసంచేశారు. కానీ పేలుళ్ల ధాటికి గుహలోని చిత్రాలు చాలావరకు దెబ్బతిన్నాయి. గుహ పైకప్పు పొర దెబ్బతిని అక్కడి చిత్రాలు పూర్తిగా పోయాయి. క్వారీ దుమ్ము, వ ర్షం నీటితో కొన్ని చిత్రాలు పూర్తిగా మసకబారిపోయాయి. ఎద్దుల సమూహం.. ఆ మొత్తాన్ని నియంత్రిస్తున్న ఓ వ్యక్తి.. అతని ముందు చేప ఆకారంతోపాటు మరోచోట కొందరు వ్యక్తులు నృత్యం చేస్తున్నట్టు ఉన్న చిత్రాలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థల యజమానులతో చర్చించి కోకాపేట గుహలను రక్షిత ప్రాంతంగా గుర్తించాలి. మిగిలిన చిత్రాలనైనా పదిలపరచాలి. కూతవేటు దూరంలోనే.. నగర దాహార్తిని తీర్చే గండిపేట చెరువుకు కూతవేటు దూరంలో కోకాపేట శివారులోని గుట్టపై పురాతన గుహలు ఉన్నాయి. వాటిలో ఆదిమ మానవుల కాలం నాటి చిత్రాలున్నాయి. అయితే ఈ స్థలం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండటంతో దాన్ని క్వారీలుగా మార్చేశారు. అక్కడి గుట్టలను పేల్చేశారు. దీంతో ఇక్కడి 2 గుహల్లో ఇప్పటికే ఒకటి పూర్తిగా ధ్వంసమైంది. చుట్టూ గుట్టను తొలిచేసి మరో గుహను మాత్రం మిగిల్చారు. 130 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గుహను చేరుకోవడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది. ప్రస్తుతం రాష్ర్టవ్యాప్తంగా ఇలాంటి గుహలు 16 మాత్రమే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చారిత్రక ప్రాంతాలను ప్రజలకు చేరువ చేసిన వేలూరి వెంకట కృష్ణశాస్త్రి ఈ కోకాపేట గుహలను కూడా 1980లోనే అధికారికంగా గుర్తించారు. అప్పట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ పురావస్తు విభాగం సంచాలకులుగా ఉన్నారు. వృద్ధాప్యంతో ఆయన పరిశోధనలకు దూరం కావడంతో ఈ గుహల సంగతి మరుగునపడింది. ఆ తర్వాత ప్రభుత్వాలకు అసలు అక్కడ గుహలున్న సంగతే తెలియలేదు. ‘ప్రోటో హిస్టారికల్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకంలో కృష్ణశాస్త్రి ఈ గుహల వివరాలను పదిలపరిచారు. కంటికి రెప్పలా కాపాడాలి ‘ఆదిమానవులు చిత్రించిన రాతి చిత్రాలు అత్యంత విలువైనవి, అంతకుమించి అరుదైనవి. భావి తరాలకు వాటి గొప్పతనం తెలియాలంటే వాటిని కంటికి రెప్పలా కాపాడాలి. అవి ధ్వంసమైతే మళ్లీ దొరకవు. హైదరాబాద్‌లాంటి నగరానికి అలాంటి గుహలు అతి చేరువలో ఉండటం ఓ రకంగా అదృష్టమే. త్వరలో దాన్ని పరిశీలిస్తాను’ - డాక్టర్ ఎన్ చంద్రమౌళి, రాక్ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి -
పోలెండ్
చరిత్ర: 10వ శతాబ్దం నుండి తన ఉనికిని చాటుకుంటూ వస్తున్న పోలెండ్ దేశం అనేక శతాబ్దాలపాటు వలసవాదుల అధిపత్యంలో మగ్గింది. దేశ సరిహద్దులు బలహీనంగా ఉండడం వల్ల ఇతర దేశాల వాళ్లు చాలా సులువుగా దేశంలోకి ప్రవేశించేవారు. 18వ శతాబ్దంలో ప్రపంచ పటం నుండి పోలెండ్ మాయమైపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పోలెండ్ తిరిగి తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. హిట్లర్ సేనలు పోలెండ్‌ను తన అధీనంలోకి తీసుకొని రెండో ప్రపంచ యుద్ధం దాకా అధిపత్యాన్ని కొనసాగించింది. ఈ రెండు యుద్ధాల సమయంలో వేలాదిమంది పౌరులు, అధికారులు ఊచకోతకు గురయ్యారు. అటు రష్యా, ఇటు జర్మనీ సేనల మధ్య పోలెండ్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పోలిష్ హోమ్ ఆర్మీ ప్రాణాలకు తెగించి దేశాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకుంది. 1. మాసూరియన్ సరస్సులు: పోలెండ్ దేశంలో దాదాపు 3000 సరస్సులు ఉన్నాయి. ముఖ్యంగా మాసూరియా సరస్సు యాత్రికులకు స్వర్గం లాంటిది. దట్టమైన అడవులు, సరస్సులను కలిసే చిన్న చిన్న నదులతో ప్రయాణికులకు ఎంతో అందంగా కనబడుతుంది. ఈ సరస్సు పోలెండ్ దేశానికి ఉత్తరంలో, లిథువేనియా, రష్యా దేశాల సరిహద్దులలో ఉంది. ఇక్కడ అందమైన గుహలు, అందమైన చర్చిలు, గతరాజుల నివాస భవనాలు ఎన్నో కనబడతాయి. ఈ ప్రదేశమే ఒకప్పుడు హిట్లర్ యుద్ధకేంద్రంగా వెలుగొందింది. 2. స్లోవిన్‌స్కీ ఇసుక తిన్నెలు: దేశానికి ఉత్తర భాగంలో స్లోవెన్‌స్కీ జాతీయ పార్కులో ఈ ఇసుక తిన్నెలు దర్శనమిస్తాయి. ఎవరో తీర్చిదిద్దినట్లుగా కనబడే ఈ ఇసుక తిన్నెలు చూపరులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పక్కనే బాల్టిక్ సముద్రం ప్రశాంతంగా కనబడుతుంది. ఈ ఇసుక తిన్నెలు గాలి వీచడం ద్వారా ఏర్పడతాయి. ఇవి ఒక్కొక్కసారి 30 మీటర్లు ఎత్తు వరకు ఏర్పడతాయి. 3. క్రాకోవ్ నగరం: పోలెండ్ దేశంలో ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి. ఇది విస్తులా నదీతీరంలో నిర్మింపబడింది. లెస్సర్ పోలెండ్ ప్రాంతంలో ఉంది. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఇది మొదటగా నిర్మింపబడిందని చరిత్ర చెబుతోంది. 9వ శతాబ్దంలో స్లావోనిక్ యూరప్ దేశాలతో గొప్ప వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడ ఎనిమిది మిలియన్లకు పైగా జనాభా ఉంది. 1978లో ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది. ఈ నగరంలో వావెల్ కెథడ్రాల్, రాయల్ కేజిల్, ఎప్పుడూ నిండుగా పారుతూ ఉండే విస్తులా నది, సెయింట్ మేరీస్ బాసిలికా, జగిలోనియన్ విశ్వవిద్యాలయం, క్లాత్‌హల్, ప్యాలస్ ఆర్ట్, కనోనిక్జా వీధి, పావిలాన్ విస్పియన్‌స్కీ... ఇంకా మరెన్నో చూడదగ్గ స్థలాలు ఉన్నాయి. 4. వార్సా: ఇది పోలెండ్ దేశానికి రాజధాని. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ నగరం అభివృద్ధిలో ఊపందుకుంది. ఐరోపా దేశాలలో గొప్ప టూరిస్ట్ నగరంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా లక్షలాది మంది ఈ నగర సందర్శనకు వస్తూ ఉంటారు. నగరం మధ్య నుండి విస్తులా నది పారుతూ ఉంటుంది. 13వ శతాబ్దంలో ఈ నగరం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. నగరంలో చాలావరకు భవనాలు నాలుగైదు అంతస్తుల్లో రంగుల్లో కనబడతాయి. నగరంలోని పురాతన మార్కెట్ స్థలం అత్యంత పురాతనమైంది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభ్యమవుతాయి. నగరంలో ఐరోపా సంస్కృతి బాగా కనబడుతుంది. నగరంలో ఓల్డ్‌టౌన్, రాయల్‌రూట్, చోపిన్ మ్యూజియం, జ్యుయిస్ ఘెట్టో మొదలైన ఎన్నోప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి. 5. వ్రోక్లా ద్వీపకల్పాల నగరం: వ్రోక్లా నగరం లోయర్ సిలేసియా ప్రాంతానికి రాజధాని. ఈ నగరం చిన్న చిన్న ద్వీపాల సముదాయం. ఒక్కొక్క ద్వీపాన్ని కలపడానికి ఒక బ్రిడ్జి చొప్పున నగరం మొత్తంలో 100కు పైగా బ్రిడ్జిలు కనబడతాయి. ఇది దేశానికి దక్షిణ-పశ్చిమ భాగంలో ఉంది. ఇదొక పురాతన నగరం. ఇక్కడే ఓద్రా నది ప్రవహిస్తుంది. దీని ఉపనదులే ఈ నగరాన్ని చిన్న చిన్న ద్వీపాలుగా మార్చేశాయి. ఈ నగరంలో మొత్తం 25 మ్యూజియంలు ఉన్నాయి. సెయింట్ జాన్ కెథడ్రాల్, నగరాన్ని ఆనుకొని సుడెటెన్ పర్వతాలు పరుచుకొని ఉండి చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. పరిపాలనా విభాగాలు: దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 16 ప్రాంతాలుగా విభజించారు. ప్రాంతాన్ని పోలెండ్ భాషలో ‘వైవోడేషిప్’ అంటారు. ఈ 16 ప్రాంతాలను తిరిగి 379 పోవియట్‌లుగా, వీటిని మళ్ళీ 2478 జిమినాస్‌లుగా విభజించారు. పోలిష్ భాష నోరు తిరగనంత కఠినంగా ఉంటుంది. ఆ పేర్లను ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి చెప్పుకుంటే బాగుంటుంది. 16 ప్రాంతాలు... గ్రేటర్ పోలెండ్, కువాయియణ్-పొమెరేనియన్, వెస్సర్ పోలెండ్, లోడ్జ్, లోయర్ సిలేసియన్, లుబ్లిన్, లుబుజ్, మాసోవియన్, ఒపోలే, పోడ్లాస్కీ, పోమరేనియన్, సిలేసియన్, సబ్‌కార్ఫాథియన్, స్వీటోక్రిజస్కీ. వార్మియన్-మాసూరియన్, వెస్ట్‌పోమరేనియన్. దేశంలో మొత్తం 20 పెద్ద నగరాలు, పట్టణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి... వార్సా, క్రాకో, లోడ్జ్, వరోక్లా, పోజ్నన్, జిడాన్సక్, సెజెసిన్, బిడ్‌గోసెజ్, లుబ్లిన్, కటోవైస్, బైలిస్టాక్, జిడినియా, జెస్లోకోవా, రాడోమ్, సోస్నావిక్, టోరున్, కీలెస్, గ్లివైస్, జెస్జోన్, జబ్రెజ్. ప్రజలు - సంస్కృతి: పోలెండ్ దేశానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ఎక్కువగా యూరోపియన్ సంస్కృతి కనబడుతుంది. ఇక్కడ మత సహనం అధికం. ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. స్త్రీ, పురుష సమానత్వాన్ని పాటిస్తారు. ఉంది. పోలెండ్ ప్రజలను పోల్స్ అంటారు. దాదాపు 98 శాతం ప్రజలు పోలిష్ భాషను మాట్లాడతారు. దేశంలో జర్మన్లు, ఉక్రేనియన్లు, బెలారూసియ+న్లు, జిప్సీలు, లిధువేనియన్‌లు, జ్యుయిష్‌లు కూడా ఉన్నారు. ఇలా దేశంలో విభిన్న దేశాలకు చెందిన వారు ఉండడం వల్ల దేశమంతటా విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు కనబడతాయి. నైసర్గిక స్వరూపం ఖండం - ఐరోపా వైశాల్యం - 3,12,679 చ.కి.మీ. జనాభా - 3,84,83,957 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని- వార్సా, కరెన్సీ - పోలిష్ జోలోటీ, ప్రభుత్వం - పార్లమెంటరీ రిపబ్లిక్, అధికారిక భాష- పోలిష్, మతం - 97 శాతం క్రైస్తవులు, సరిహద్దులు - బాల్టిక్ సముద్రం, రష్యా, తూర్పు జర్మనీ, చెకోస్లోవేకియా, స్వాతంత్య్ర దినాలు - కమ్యూనిస్ట్ పోలెండ్ - 8 ఏప్రిల్ 1945, రిపబ్లిక్ ఆఫ్ పోలెండ్ - 13 సెప్టెంబర్ 1989, పంటలు- తృణధాన్యాలు, చెరకు, నూనెగింజలు, బంగాళదుంపలు, ఖనిజాలు- బొగ్గు, సల్ఫర్, రాగి, జింకు, సీసం, ఇనుము, పరిశ్రమలు - యంత్రభాగాలు, బొగ్గు, రసాయనాలు, పెట్రోలియం శుద్ధి, ఆహార ఉత్పత్తులు, వాతావరణం - జనవరిలో -5 నుండి 0 (సున్న) డిగ్రీలు, 15 నుండి 25 డిగ్రీలు జూలైలో -
అంతుచిక్కని రహస్యాలలో...ఆనందాన్వేషణ
గుహలు... చారిత్రక కథనాలెన్నో వినిపిస్తాయి. గుహలు... ఆధ్యాత్మిక సౌరభాలతో మదిని తట్టి లేపుతాయి. గుహలు.. అంతుచిక్కని రహస్యాలను శోధించమంటాయి. గుహలు... ధ్యానమార్గానికి చేరువ చేస్తాయి. వేల అడుగుల ఎత్తులో కొన్ని... వేల మీటర్ల పొడవుతో ఇంకొన్ని... భూ అంతర్భాగంలో కొన్ని... దేవుళ్ల పోలికలతో కొన్ని... దేవతలకు ఆవాసాలుగా కొన్ని... మనిషి కట్టని నిర్మాణాలతో ప్రకృతి చెక్కిన అద్భుతాలతో అబ్బురపరిచే గుహల సౌందర్యాన్ని వీక్షిద్దాం రండి... బెలుం గుహలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని కొలిమిగండ్ల మండల కేంద్రానికి 5 కి.మీ దూరంలో ఉన్నాయి బెలుం గుహలు. పది లక్షల సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయనీ, భరతఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే రెండవ అతిపెద్ద గుహలనీ చరిత్ర చెబుతోంది. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్ఫటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలుం గుహల ప్రత్యేకత. 1884లో రాబర్ట్ బ్రూస్ ఫూటే తన పర్యటన నివేదికలో ప్రస్తావించడం ద్వారా తొలిసారి ఈ గుహల ఉనికి ప్రపంచానికి తెలిసింది. తరువాత ఓ శతాబ్దం పాటు ఎవరి దృష్టీ పడని ఈ గుహల గురించి 1982-83ల్లో జర్మన్ బృందం విస్తృతంగా వివరాలు అందించింది. ఈ గుహలు భూమికి 20 మీటర్ల అడుగున, భూగర్భంలో 10 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కి.మీ దూరం వరకు నడవటానికి అనుకూలంగా దారి నిర్మించింది. గుహ లోపల ఫౌంటెన్, కృత్రిమ కొలను, విద్యుద్దీపాలు, ఆక్సిజన్ బ్లోయర్లను ఏర్పాటు చేశారు. ఈ గుహల్లోకి వెళ్లే దారి బిలంలా ఉండటంతో వీటిని బిలం గుహలుగా, కాలక్రమంలో బెల్లం గుహలుగా, ఆ తర్వాత బెలుం గుహలుగా పేరు మారిందని చెబుతారు. బెలుం గుహల్లో క్రీ.పూ 4,500 నాటి పాత్రలు బయటపడ్డాయి. దాన్ని బట్టి ఈ గుహలు ఎంత పురాతనమైనవో తెలుసుకోవచ్చు. గుహల పైకప్పు నుంచి కిందికి, కింది నుంచి పైకి మొలుచుకొని వచ్చినట్టు కనపడే ‘స్టాలగ్మైట్’ ల ఆకృతులను బట్టి స్థానికులు వీటికి కోటిలింగాలు, సింహద్వారం, పాతాళగంగ వంటి పేర్లతో పిలుస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన ఇక్కడి శివలింగం పర్యాటకులలో భక్తిభావాన్ని పెంచుతోంది. ఇలా వెళ్లాలి: కర్నూలు, నంద్యాల మీదుగా/ అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా/ వైఎస్ఆర్ కడపజిల్లా మీదుగా రోడ్డుమార్గం ద్వారా వెళ్లవచ్చు తాడిపత్రిలో రైల్వేస్టేషన్ ఉంది కర్నూలు నుంచి 110 కి.మీ., హైదరాబాద్ నుంచి 320 కి.మీ., నంద్యాల నుంచి 70 కి.మీ. బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్‌లో అరకులోయ అందించిన అద్భుతమైన ప్రకృతి వరం బొర్రా గుహలు. ఒరియా భాషలో ‘బొర్ర’ అంటే రంధ్రమని అర్థం. విశాఖపట్టణానికి 114 కి.మీ దూరంలో సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్, సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బొనేట్‌తో రసాయనచర్యకు గురైనప్పుడు ఇది ఖనిజాలను కరిగిస్తుంది. దాంతో రాయి క్రమంగా కరిగిపోతుంది. కొన్నేళ్లపాటు ఈ విధంగా కొండలపై నుంచి గోస్తనీ నది వైపు ప్రవహించే చిన్నచిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. క్యాల్షియమ్ బై కార్బొనేట్, ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారే నీటి వల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడ్డాయి. వీటినే స్టాలగ్మైట్స్ అంటారు. ఇవి కాలక్రమంలో వింత వింత ఆకృతులను సంతరించుకున్నాయి. ఈ గుహల్లో తవ్వకాలు జరిపినప్పుడు 50 వేల ఏళ్లక్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. స్థానిక గిరిజనులు బొర్రాగుహలను ‘బోడో దేవుడి’ నివాసంగా విశ్వసిస్తారు. వివిధ రూపాల్లో ఉన్న స్టాలగ్మైట్లను శివ-పార్వతి, తల్లి-బిడ్డ, ఋషి గడ్డం, మానవ మెదడు, మొసలి, పులి, ఆవు వంటి పేర్లతో పిలుస్తూ పూజిస్తూంటారు. గుహ లోపల కిలోమీటర్ వరకూ వెళ్లి గోస్తనీ నదిని చేరవచ్చు. అయితే నది వరకు వెళ్లడానికి అనుమతి లేదు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను స్వాధీనం చేసుకొని, లోపల దీపాలంకరణ, బయట ఉద్యాన పెంపకం చేపట్టింది. యేటా మూడు లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా! ఇలా వెళ్లాలి: బొర్రా గుహలకు విశాఖపట్నం నుంచి బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేక వాహనాల్లోనూ ఇక్కడికి చేరుకోవచ్చు. ఉండవల్లి గుహలు విజయవాడ నుండి 6 కి.మీ దూరంలో నైరుతి దిశలో క్రీ .పూ 4, 5వ శతాబ్దంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి ఉండవల్లి గుహలు. గుహ నాలుగు అంతస్థులలో (శయనిస్తున్న భంగిమలో అనంతశయన పద్మనాభస్వామి విగ్రహం) భారీ నల్ల గ్రానైట్ రాతితో చెక్కబడిన ఏకశిలా విగ్రహం ఉంది. ఈ గుహల లోపల నిర్మాణాలను చేపట్టిన బౌద్ధ సన్యాసులు వానాకాలంలో తమ విశ్రాంతి గదులుగా ఉపయోగించేవారు. ఈ కొండ నుండి కృష్ణానది అద్భుతంగా కనిపిస్తుంది. ఇలా వెళ్లాలి: విజయవాడకు రైలులో కానీ, బస్సులో కానీ వెళితే, అక్కడ నుంచి ఉండవల్లి చాలా దగ్గర. మేఘాలయ గుహలు మేఘాలయ రాష్ట్రానికి పశ్చిమాన గారో పర్వత శ్రేణులు, తూర్పున ఖాసి, జైంతియా పర్వత శ్రేణులు ఉన్నాయి. ఈ పర్వతాలలో 19 గుహలు... వాటిలో సున్నపురాయి ఆకృతులు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పొడవైన, లోతైన గుహలు ఇవి. అతి పొడవైన గుహలు జైంతియా కొండలలో ఉన్నాయి. మౌస్మాయి, క్రెమ్ లింపుట్, క్రెమ్ కొత్సతతి, క్రెమ్ లాసింగ్, క్రెమ్ మావ్ లోహ్, క్రెమ్ స్వీప్, సైజు... అనే గుహలను పర్యాటకులు తేలికగా చూడవచ్చు. ఇలా వెళ్లాలి: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విమానాశ్రయం, రైలు, బస్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడి నుంచి ట్యాక్సీలు, బస్సుల ద్వారా చిరపుంజికి దగ్గరలో ఉండే ఈ గుహలకు చేరుకోవచ్చు. అమర్నాథ్ గుహ జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అమర్నాథ్ పర్వతంపై ఉంది అమరనాథ్ గుహ. ప్రపంచ ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు పొందింది అమర్నాథ్ గుహ. ఈ గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచులింగం పర్యాటకులను, భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తుతుంది. ఈ మంచులింగం మే నుంచి ఆగస్టు వరకు వృద్ధి చెంది ఆ తరువాత కరుగుతుంది. ఈ గుహ 5000 ఏళ్ల నాటిదని తెలుస్తోంది. భారత సైన్యం, పారా మిలటరీ దళాలు ఈ ప్రదేశానికి గస్తీ కాస్తూ ఉంటాయి. అందువల్ల అమర్నాథ్ గుహను సందర్శించాలంటే ఉన్నతాధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి. జమ్ముకాశ్మీర్‌లో చాలా గుహలు ఉన్నాయి. శ్వాసిక్ హిల్స్‌లో కిలోమీటర్ పరిధిలో ఉన్న సహజసిద్ధ్దమైన గుహలో శివలింగం ఉంది. జూలై, ఆగస్టు నెలలు సందర్శనకు అనువైన సమయం. ఇలా వెళ్లాలి: జమ్ము -పహల్గాం- చందన్వాలి-పిస్సుటాప్-సేషాంగ్ - పంచ్పర్ణిల మీదుగా అమర్నాథ్ యాత్ర చేయవచ్చు. జమ్ము వరకు విమాన, రైలు మార్గాలు ఉన్నాయి. జమ్ముకాశ్మీర్‌కు రహదారి మార్గంలో బయల్దేరవచ్చు. ఎలిఫెంటా... అజంతా... ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఘరాపురిలో ఉన్నాయి ఎలిఫెంటా గుహలు. వీటికి పోర్చుగీసు వారు ఆ పేరు పెట్టారు. క్రీ.పూ 450, క్రీ.పూ. 750లో ఈ గుహలు ఏర్పడినట్టు చెబుతారు. బౌద్ధ సన్యాసులు ఈ గుహల లోపల నిర్మాణాలను చేపట్టారు. ఇక్కడ శివాలయానికి, విశ్వకర్మ గృహాలయానికి ప్రత్యేకత ఉంది. అజంతా-ఎల్లోరా గుహలు శిల్పకళకు పెట్టింది పేరు. ఇవి క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందినవి. ఇలా వెళ్లాలి: ముంబైలో విమానాశ్రయం, రైలు, బస్ స్టేషన్లు ఉన్నాయి. ఎలిఫెంటా గుహలకు ముంబై నుంచి వెళ్లాలి అజంతా-ఎల్లోరా గుహలకు ఔరంగాబాద్ నుంచి ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ఔరంగాబాద్‌లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్లు ఉన్నాయి. మరికొన్ని గుహలు: కర్ణాటకలోని బాదామి గుహలు హంపికి దగ్గరలో ఉన్నాయి ఒరిస్సాలోని భువనేశ్వర్ శివార్లలో ఉదయగిరి, ఖందగిరి గుహలు ఉన్నాయి. ఇవి క్రీ.శ.2వ శతాబ్దం నాటివి. భువనేశ్వర్ నుంచి బస్సులు, ట్యాక్సీల ద్వారా ఈ గుహల ప్రాంతానికి చేరుకోవచ్చు ఛత్తీస్‌గడ్‌లోని జగదల్పూర్ నుండి సుమారు 40 కి.మీ దూరంలో కుతుమ్సర్ గుహలు ఉన్నాయి.